Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మెప్పు, ముప్పుల తలపోత ‘విమర్శ’

[డా. జి.వి. పూర్ణచందు గారు రచించిన ‘మెప్పు, ముప్పుల తలపోత ‘విమర్శ’’ అనే వ్యాసాన్ని అందిస్తున్నాము.]

ఒక వ్రాత లోని మంచీచెడులను ఎన్నిక చేసే చక్కని తలపోతనే ‘సాహిత్య విమర్శ’ అంటారు.

వ్రాయిత వ్రాసిన దానిలోని మెచ్చుకోదగిన దానినీ, ముప్పుచేసే దానినీ ఎంచి దాని వంకర్లను గాని దొడ్డతనాన్ని, సోయగాన్ని, సొంపును గానీ ఎత్తిచూపుతూ, ఎందుకది మిన్నగా ఉన్నదో, ఎందుకు లేదో విడమరచేది విమర్శ.

ఇలాంటి విమర్శని ఇఫ్ఫటికీ చేస్తున్న వారికి దణ్ణాలు.

మంచి చదువరులైన వెనకటి వ్రాయితలు ఒక్కో మాట వెనక ఉన్న లోతును తెలియజేసే తీరున ‘వైనం (వ్యాఖ్యానం)’ వ్రాసేవారు. అందులో విడమరపు(విశ్లేషణ), కోపు (నిమిత్తము) పాటి (ప్రత్యేకత) అన్నీ ఉండేవి.

తప్పొప్పులను ఎంచి, అవుననటమో, కాదని నొక్కి చెప్పటమో జరిగితేనే మంచి వ్రాత వెలుగు లీనుతుంది.

పాడి, పొలుపు, ఒప్పు

ఒక వ్రాత లోని ఓజను, కట్టడగుణాన్ని, పొందికను, విప్పిచెప్పి, మంచి ఎదతో తనకు అనిపించిన దాన్ని అనిపించినట్టుగా చెప్పే విమర్శ ఇప్పుడు లేదు, అప్పుడూ లేదు. ఈసులు (అసూయ), అంకపొంకాలు, గిట్టనితనాలు ఉన్నాయి గంపలకొద్దీ! .

పాడి, (ధర్మం), పొలుపు (న్యాయం) ఒప్పు (సత్యం) నిలిచేలా చూడటాన్ని బరువని తెలుగు విమర్శ దాన్ని నెత్తికెత్తుకోలేదు. ఇది మన విమర్శపైన విమర్శే!

ఈ మూడూ ఏ వ్రాతకైనా కూకటి లాంటివి. ఈ మూడూ రానురాను పలుచన కావడంతో తెలుగు విమర్శ బాగా చులకనైంది. అవుతోంది కూడా!

విమర్శ వ్రాసేవారు మంచి రచన తీరు ఇలా ఉంటుంది అని చూపించాలేగాని తమ మేరలు దాటి, ‘ఇలానే వ్రాయాలి’ అంటూ కర్ర పుచ్చుకుని కట్టడి చేయాలనుకోకూడదు. మోతుబారీతనం ఒక్కోసారి మేరలు దాటుతోంది కూడా!

వ్రాత (రచన) అనేది మంచో చెడో ఉడివోని తీరున (శాశ్వతం) ఎప్పటికీ నిలిచి ఉంటుంది.

తూకానికి నిలబడని విమర్శ వంకర టింకర వో” లాంటిది. దానికి కుదురు తక్కువ. నిన్న ఉన్న బెంగ (ధ్యాస) రేపటికి తీరిపోతుంది. బెంగతో నిన్న మాట్లాడిన మాటలు రేపు ఉండవు. విమర్శ కూడా అలా నిలకడ లేనిదిగా మారిపోతోంది. ఉల్లము తెరచి చూసుకుంటే గుల్ల కనిపించ కూడదు.

పులిపంజా అనే పుస్తకంలో (పేరు చెప్పవలసినంత గొప్ప కాదని చెప్పటంలేదు) జాషువాని పట్టుకుని “కంపుకొట్టే ఆ దరిద్రపు గబ్బిళమే దొరికిందా నీకు వ్రాయటానికి?” అన్నాడు. చివరికి మిగిలిందెవరు..? కవే ఉడివోని మిన్కు! పాడిపొలుపు ఒప్పు తెలీని విమర్శకుడు “నస్మరంతి” అంటామే.. అలా కరిగిపోతారు.

విమర్శకుడంటే మంచి ఎద కలిగినవాడుగా, వ్రాతలోని మర్మాన్ని ఎరిగినవాడుగా ఉండాలి. ఈ మంచితనాలే ఇటు చదువరికీ ఉండాలి. అంటే మంచి విమర్శకుడు ముందుగా మంచి చదువరి కావాలి.

వ్రాతగాడు చదువరికన్నా పై అంతస్తులో ఉన్నాననుకుని వ్రాయాలని కుందుర్తి అన్నారు. తన పైతనకు అంతటి నమ్మకం ఉన్నవాడే మంచి వ్రాయిత కాగలడు.

కానీ, విమర్శ వ్రాసేవాడు వ్రాయితకన్నా పై అంతస్తులో ఉన్నాననుకుంటే కుదరదు; అది వలనయ్యేది కూడా కాదు. ఎందుకంటే, ఒక వ్రాతగాడు పొత్తాన్నో, కబ్బాన్నో తన బతుకులోని ఓజనంతా అందులో కుమ్మరించి వ్రాస్తాడు. కానీ ఇప్పటి మన విమర్శకులు విమర్శ కోసం అంత కుమ్మరించిందేమీ లేదు. కుమ్మరించేందుకు వారిదగ్గర ఉన్నది కూడా ఏమీ లేదు.

అందుకని వ్రాత (రచన)లోని లోతును ఎన్నిక చేయడానికి విమర్శకుడికి గట్టి చేవ కావాలి?

ఒక పక్కకి ఒరిగిన నిట్టలు

ఇప్పుడంతా మారిపోయింది… ఉత్తి పొగడ్తలు, మింటికెత్తేయటం, ఆహావోహో లే విమర్శగా చెల్లుబాటులో ఉన్నాయి. ఎంత మంచి వ్రాతగాడైనా గానీ ఈ విమర్శకులకు ‘మనవాడు’ కాకపోతే పట్టనట్టు వదిలేస్తారు. అంతకు మునుపు పెద్దగా వినిపించని పేర్లు మహాకవి ముద్రలు వేసుకుంటూ ఉంటాయి. ఇది ఇప్పటి పరిపాటి.

వందమంది తెంపరులు మహాకవులైనా వచ్చే కొరత ఏమీలేదు. కానీ, అచ్చమైన ఒక వ్రాతగానిని మరుగున పరచాలని తక్కువ చేసి చూస్తే మనం మాట్లాడక తప్పదు కదా!

1980-90లలో కూడా ఇప్పటిలాగే కొందరికి మహాకవుల ముసుగు ముఖానికి తగిలించి పెద్ద ఎత్తున మంది మీదకు వదిలారు. అయినా మంది వాళ్లని పెద్దగా గుర్తించిందీ లేదు.

వింత ఏమిటంటే ఆనాటి మహాకవుల్లో ఇప్పటికి వెలుగులో ఉన్నవాళ్లు కొద్దిమందే! అప్పుడు గుర్తింపు దక్కని వాళ్లలో ఇప్పుడు వందలాది పొత్తాలు వ్రాసిన వాళ్లున్నారు. వ్రాయితలను గుప్పెట పెట్టుకోవాలనే ఆబ విమర్శకుల్లో అప్పుడు ఎక్కువగా ఉండేది. వాళ్ల గుప్పెళ్ళకు చిక్కని వాళ్లందర్నీ పక్కన పెట్టారు, పక్కకు నెట్టారు కూడా!

ఏదో ఒక వైపుకు ఒరిగి నిలబడి, తమ వైపుకు ఒరగని వారందరినీ ఈసడించటమే విమర్శ.. అన్నట్టుగా ఉండేది. దాని వల్ల మంచి వ్రాయితలు కూడా ఎద నొచ్చుకునేవాళ్లు.

ఇప్పుడు కొత్త తీరు కనిపిస్తోంది. కులం పేరుతో కొందరిని, వర్గం పేరుతో కొందరిని, నేలపేరుతో కొందరిని తమవైపు ఒంగలేదనే కారణంతో మరికొందరిని తక్కువ చేయటం, కొంచెగాళ్లను కూడా పొగిడి నింగి కెక్కించటం పెద్ద పనిగా పెట్టుకున్న వాళ్ల అంకెలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదేమంటే అప్పుడు మీవాళ్లకు మీరు చేసుకున్నారు, ఇప్పుడు మా వాళ్లకు మేము చేసుకుంటున్నాం అంటున్నారు. ఇలాంటి విమర్శకులది కొద్దికాలమే వెలుగు. వీళ్లవలన అప్పుడే కాదు, ఇప్పుడూ తెలుగు వ్రాతలకు ఒరిగేదేమీ లేదు.

మంచి ఓజ కలిగిన వ్రాతల్ని ఎవడూ ఆపలేడు! అయితే మెత్తని ఎద కలిగిన వ్రాతగాళ్లు తేలికగా గాయపడతారు. అది వారి వ్రాత తీరుని కూడా దెబ్బతీస్తుంది.

ఒకప్పుడు బాగా పేరున్న రచయితని “గురూజీ వ్రాయటం లేదేమండీ” అనడిగితే వెంటనే అయన “ఎవరి కోసం వ్రాయాలి?” అనడిగారు. ఒట్టేసి చెప్తున్నా ఆయన అడిగినదానికి నేను ఏమీ చెప్పలేకపోయాను. ఆయనే అన్నారు..

“పెన్షన్ డబ్బులు పెట్టి నా పొత్తాన్ని నేనే అచ్చు వేసుకుని ఉచితంగా ఇచ్చినా ఒక్క పుటను కూడా తెరిచి చూడటాన్ని బరువుగా అనుకునే చదువరుల కోసమా? ఒకపక్కకు ఒరిగే విమర్శకుల మెప్పు కోసమా? వ్రాతగాళ్లను తామే ఉద్ధరిస్తున్నా మనుకునే తెలుగు అచ్చుదారుల ఆనిక (ప్రాపకం) కోసమా? ఎవరికోసం వ్రాయాలి..?”

గడిచిపోయిన నిన్నలెన్ని ఉన్నాయో, గడవవలసిన రేపులూ అన్నే ఉన్నాయి. వాటికి ఒక మేర అంటూ లేదు. ఈ నేల కూడా మన కన్ను ఆననంత పెద్దది. ఈ పెద్ద నేలపై ఎప్పుడో ఒకప్పుడు నేను వ్రాసిందాన్ని చదివేవాడు ఒకడు పుడతాడు; వాడికోసమే వ్రాస్తున్నానన్నాడు భవభూతి.

మనందరమూ తెల్లగుర్రం ఎక్కి వచ్చే ఆ ‘ఒక్కడు’ కోసం ఎదురుచూద్దాం!

చదవని చదువరులు

ఇతర నుడుల్లో విమర్శ ఇంతగా సన్నబడిపోలేదు. ఒక్క తెలుగు వారికే చదవడం అనేది పెన్సెగగా మారింది. ‘పుస్తకం’ ముట్టుకుంటే చెయ్యి కాలుతుందన్నట్టుగా తయారయ్యారంతా! ‘పేపరు చూశావా?’ అని అడుగుతున్నారు కానీ, ‘చదివావా?’ అని అడగట్లేదెవరూ! నుడువులు చూడబడ్తున్నాయే గానీ చదవబడట్లేదన్నది తిరుగులేని మాట!

ఒకప్పుడు పత్తిరాకులు (పత్రికలు) పుస్తక సమీక్షకు పెద్ద పీట వేసేవి. ఇప్పుడు వంద మాటల్లో వ్రాస్తే చాలంటున్నాయి. చదువరుల్లో ఉసిపాటు (ఉత్సాహం, ఆసక్తి) తగ్గిపోవటాన విమర్శకు అంతకన్నా చోటు అక్కరలేదనేది వారి తలంపు.

మారేపల్లి రామచంద్రశాస్త్రిగారు గ్రంథాలయాన్ని ‘పొత్తముల గుడి’ అన్నారు. ఏలినవారు ఈ గుడిలోకి వేల్పుల్ని రానివ్వటం లేదిప్పుడు. పదేనేళ్లైపోయింది గట్టిగా పుస్తకాలు కొని.

అందువలన పుస్తకాలు అచ్చు కావటం సగానికి పైగా పడిపోయింది. పుస్తకాలు అచ్చువేసేవాళ్లంతా మూగనోము పట్టారు. అమ్మకాలు పడిపోయాయి. చదువరులు చదవనప్పుడు పుస్తకం అచ్చయి చెదలను మేపటానికి తప్ప దేనికి మేలు చేస్తుంది?

ఇందులో వ్రాతగాడు కూడా బేల ఏమీ కాడు. చదువరులకు ఏది కావాలో చాలామంది వ్రాయితలకు తెలీదు. చాలా మంది వ్రాతగాళ్లు కూడా మంచి చదువరులేమీ కాదు.

ఆ మాటకొస్తే, మొన్నటి నన్నయాదులే కాదు నిన్నటీ శ్రీశ్రీ చలాల్ని కూడా తెలీకుండా నిలువునా మాటల్ని పేర్చేసే చాకచక్యం మాత్రమే కలిగినవాళ్లు వ్రాతగాళ్లలో పెరిగిపోతున్నారు.

ఎలా వ్రాయకూడదో చెప్పేవాళ్లు లేక కాదు, అడిగేవాడు లేకపోవటమే ‘దబ్బర’ అనిపిస్తుంది!.

వెనకటి వ్రాయితల వ్రాతలను చదవక పోవడం, ఎలా వ్రాయాలో, ఎలా వ్రాయకూడదో పెద్దలతో చర్చించకపోవడం- ఇవన్నీ వ్రాయితల్లోని మరుగుపాట్లే.

ఏలితెలివి-అతితెలివి

ఇప్పటి కొత్త వ్రాతగాళ్లను చెడగొడ్తున్నది ఏలితెలివి (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు). అందులో అడిగి ఒక కైతను తెచ్చుకుని కైతలకూటము (కవిసమ్మేళనం)లో చదివేసి, వాట్సాపులో పెట్టేసి ఒక పనయిపోయిం దనుకుంటున్న వాళ్ల అంకెలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏలి అంటే కృత్రిమత ఏఐ లోంచి ఏలిగాతెచ్చిన ఈ దొంగతనాన్ని ఎవ్వడూ కనుక్కోలేడని వీళ్ల లెక్క. కానీ, చూడగానే అది ఏఐ కైత/పాట అని ఇట్టే తెలిసిపోతుంది.

ఏలి తెలివిని నమ్ముకోవటం అతితెలివే! అది వ్రాతగానికి నిలుపు నిచ్చేది కాదు. దాన్ని ఉపయోగించు కోవటానికీ సొంత తెలివి ఉండాలి!

నిన్నెప్పుడో ట్రంపు అనే తంపులమారి ఈ ‘ఏలితెలివి’ని సూపర్ ఇంటెలిజెన్స్ అని పిలవాలన్నాడు.

ఇప్పటికే సొంతగొంతుని పోగొట్టుకుంటున్న వ్రాతగాళ్లు సూపర్ ఇంటెలిజెన్సు అంటే ఏకంగా నుదురు, పొట్ట కాళ్లు నేలకాన్చి మొక్కుతారు.

ఉగాది, కళారత్నల కోసం ఎగబడిన లేదా తెగబడిన వాళ్లలో ఈ ‘ఏలితెలివి’ కొడుకులూ కూతుళ్ళూ ఎక్కువగా ఉన్నారు.

అందుకని మొదట మారవలసినది వ్రాతగాళ్లే! వాళ్లు చదువరుగా మారాలి. వ్రాతలో లోతు అంటే ఏదో తెలీకుండా వ్రాయటం సరికాదు. వ్రాయటానికన్నా చదవటానికి తొందరపడాలి.

Exit mobile version