Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మిర్చీ తో చర్చ-18: చెప్పాలని వుంది!

వేడి మిర్చీ బజ్జీలో కారాన్ని కొరకగానే కలిగే భావనను కలిగించే పచ్చిమిర్చి కారం లాంటి వ్యంగ్యంతో వేదాంతం శ్రీపతి శర్మ అందించే ఫీచర్ “మిర్చీ తో చర్చ“.

వాకిలి దగ్గర చీకటి కమ్ముకుంది. ఆకాశం మబ్బులతో నిండు గర్భిణిలా ఉంది. అడపాదడపా వానలు కురవవచ్చని అంచనా. మత్స్యకారులు – కాదు గత్యంతరం లేని వారు ఇంటిపట్టున ఉండవలసిందిగా సూచన… ఏంటి? వాతావరణ సమాచారంలా ఉంది. ఏమీ లేదు. తలుపు దగ్గర ఓ పెద్దావిడ నిలబడి ఉంది. అంత శరీరం ఆవిడకు అంతులేని కథలా ఉంది. అదలా ఉంచి అంత చిన్నని హ్యాండ్ బ్యాగ్ అంత పెద్ద చేతి మీదకు ఎలా ఎక్కించ కలిగిందో అంతుపట్టలేదు. ఆ మాటకొస్తే మహిళలు ఎవరికీ అర్థం కారు. వారిలోని గొప్పతనమే అది.

“మిర్చీ?” అన్నారావిడ.

మన దేశం చాలా గొప్పది. విద్యుత్ సంస్థలో పని చేస్తాడంటే అతను కరెంటు స్తంభం మీద ఉంటాడని అర్థం. రైల్వేలో పని చేస్తాడంటే వంటి నిండా బొగ్గు పులుముకుని ఇంజన్‍లో కూర్చొని ఉంటాడని అందరూ గట్టిగా నమ్మడమే కాదు, చాలా మందికి అదే నిజం అని చెబుతారు.

‘మిర్చీ కన్సల్టెన్సీ’ ఎంత చదునుగా ఉందో ఆలోచించండి! అయినా ఇక్కడ వినిపించే మాట ఒక్కటే! మిర్చీ!

“రండి”

ఆవిడ లోపలికి నడిచిందని నేను చెప్పలేను. రాజమండ్రి నుంచి భద్రాచలం వెళ్లే లాంచీ ఒకటి అలా తేలిపోయి తీరానికి చేరినట్లుంది. ఆవిడ కూర్చున్న కుర్చీ చిత్రమైన స్పందనకు గురి అయింది. అతి కష్టం మీద స్వస్థత చెందింది. సుందరం ఆవిడ తాలూకు కాగితాలు తిరగేసాడు.

“చెప్పండి” అన్నాడు.

“ఒక్కటి అడిగితే చెబుతాను. అన్నీ సమస్యలే.”

“ఒక్కొక్కటిగా చెప్పండి.”

“ఇంజనీరింగ్ చేసాడు, ఎమ్మెస్ చేసాడు.”

“వెరీ గుడ్.”

“నేను పూజలు చేశాను.”

“శభాష్.”

“ర్యాంకు వచ్చింది.”

” గుడ్. మిర్చీ తీసుకోండి.”

టీపాయ్ మీద పెట్టి ఉన్న మిర్చిని ఓ చూపు చూసింది. అతి కష్టం మీద దాన్ని చేత్తో పట్టుకొని రజనీకాంత్ లాగా నోట్లోకి విసిరింది. ఏదో మూలకి వెళ్ళింది. అక్కడ నములుతూనే చెబుతోంది.

“మండల పూజలు చేశాను. నలబై రోజులు దీక్ష కూడా సాగింది.”

“ఓ!”

“మొదటిసారి చూసిన అమ్మాయి జాతకమే కలిసిపోయింది. పెళ్ళయిపోయింది.”

“అదృష్టం.”

చెయ్యి అడ్డంగా పెట్టింది. ఆ హస్తాన్ని అలాగే వెనక్కి తీసుకొని పోయి గుండె మీద గట్టిగా కొట్టింది.

“అదృష్టం అంటే అయిపోదు. న్యాయం పట్టి పిండితే నేను చేసిన పూజలవి.”

“కరెక్ట్. వారికి పిల్లలు పుట్టలేదా?”

రెండో మిర్చీ గాలిలో ఎగిరింది. కుర్చీ చేతి మీద తీవ్రంగా ఉంది.

“ఏడు మంగళ వారాలు ఉన్నాను. ఎనిమిదో వారం నెల తప్పింది కోడలు.”

“మీ చేతిలో మహిమ ఉంది మేడమ్.”

“ఎవరికి కావాలి?”

“అంటే?”

“పెరటి వైద్యం పనికిరాదు.”

“కరెక్ట్.”

“సమస్య అక్కడ ఉంది. ఎవరైనా ఎదురైతే నమస్కారం పెట్టడం సర్వసామాన్యం.”

“కరెక్ట్.”

“నాకు అలా జరగదు.”

కొద్దిగా అటూ ఇటూ జరిగాను.

“ఎలా జరుగుతుంది మేడమ్?”

“నేను నా లోకంలో ఉంటాను. వీధిలో అలా వెళ్ళిపోతాను.”

“ఓహో!”

“నేను అలా వెళ్ళి పోయిన దారి వైపు చూస్తూ జనం నమస్కారం పెట్టుకుంటారు… ఆఁ… మాటకి చెబుతున్నాను.”

“ఛా”

“అదీ! పక్క ఇంటి పెద్దాయన దగ్గుతూనే ఉన్నాడు”

“పాపం”

“వాళ్ల అబ్బాయితో అన్నాను – ఫరవాలేదు తగ్గిపోతుంది అని, అంతే, ఇరవై నాలుగు గంటలలో ఆగిపోయింది.”

ఇద్దరం ఒకళ్ళ మొహాలొకళ్ళం చూసుకున్నాం.

“చూశారా? ఆశ్చర్యంగా లేదూ? కానీ ఇదే సమస్య! ఈ మాట ఇంట్లో చెబితే మీ ఇద్దరి లాగే కొడుకు కోడలు ఒకళ్ళ మొహాలొకళ్ళు చూసుకుంటారు. ఎందుకో చిరునవ్వు నవ్వుకుంటారు.”

“వారి అజ్ఞానం మేడమ్.”

“ఎంత కాలం అలా వదిలేస్తాం? నాలో వున్న శక్తి గురించి అందరికీ చెప్పేయాలని ఉంది.”

ఈసారి సుందరం మూడో మిర్చీ తన చేతుల మీదుగా ఇచ్చాడు.

ఆవిడ తీసుకొని చక్కగా ఆస్వాదించారు.

“సింపుల్.” చెప్పాడు సుందరం. “…ఈ ఆల్బమ్ చూడండి.”

ఆవిడ ఆల్బమ్ తీసి అన్నీ చూసింది.

“ఏంటివి?”

“ఇవి మోడల్స్. ఈ గెటప్‌లో సాధ్వీ పీతాంబరిలా ఉండవచ్చు. ఇది వాగంభరి… ఇలా…”

ఆవిడ ఒక చోట ఆగి పోయింది.

ఆ బొమ్మ భలే ఉంది. ముత్యాల హారాలు, పలకసర్లు, రుద్రాక్షలతో పసుపుపచ్చని పట్టుచీరలో ఒక సాధ్వి ఉంది.

“ఇది బాగుంది. ఇంతకీ ఏం చెయ్యాలి?”

“సింపుల్. సాధన బృందం అని ఒక గ్రూపు వాట్సప్‌లో కూడా ప్రారంభించండి. నెలకి ఒక స్తోత్రం పట్టుకోండి.”

ఇంత శరీరం ఉన్న మనిషి ఒక విద్యుత్ తీగెలాగా ఎలా లేచి నిలబడగలిగిందో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. హ్యాండ్ బ్యాగ్ సర్దుకుని వెళ్ళబోతూ గాలికి కదిలిన ఆల్బమ్ లోని బొమ్మను చూసింది. ఒక సాధ్వి టీపాయ్ మీద కాళ్ళు పెట్టుకుని ఉంది. ఆ పాదాలు పళ్ళెంలో ఉన్నాయి. లైనులో ఒక్కొక్కళ్ళు వచ్చి తల ఆన్చి వెళ్తున్న దృశ్యం అది. ఆ ఫోటోను తన మొబైల్లో స్నాప్ తీసుకుంది. పక్కనే పెట్టి ఉన్న ఖాళీ మిర్చీ ప్లేటును ఎందుకో కళ్ళకద్దుకుంది.

***

మా బండి ఎందుకో ఒక చోట ఆగింది. ఫ్లెక్సీ మీద ‘సాధ్వీ సువర్చలాంబ’ అని ఉంది. దాని కింద బ్రాకెట్లలో ‘మిర్చీ తంత్రం’ అని ఉంది. మహిళలందరూ ఏవేవో స్తోత్రాలు పఠిస్తున్నారు. ఈ మేడమ్ అనేక ఆభరణాలతో సింహాసనం మీద కూర్చొని అందరికీ అభయహస్తం ఇస్తోంది.

ఫోన్ మోగింది.

“హలో”

“సార్, సుందరం గారా?”

“అవును.’

“మీకు అనేక నమస్కారాలు”

“నమస్కారం మీరు…”

“‘సాధ్వీ సువర్చలాంబ’ గారి అబ్బాయిని. మీకు జీవితాంతం ఋణపడి ఉంటాను.”

“ఎందుకలాగ?”

“మాకు రోజు ఇంట్లో ‘చెప్పాలనుంది’ అనే కదంబ కార్యక్రమం తప్పింది.”

“ఛా!”

“అంతేకాదు, సన్యాసులలో కలిసి పోయిన ఓ మా నాన్న అనుకోకుండా ఇంటికి వచ్చేసారు.”

“మరి మీ అమ్మగారు?”

“ఆవిడకు తీరికెక్కడ? ఆవిడ సెక్రటరీని కనుక్కొని ప్రోగ్రామ్ వివరాలు తెలుసుకుని ఇంట్లో ఉండే నెలకి ఆ రెండు రోజులు మేమందరం మరో ప్రోగ్రామ్ పెట్టుకుంటాం!”

00000

Exit mobile version