Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మిషన్, ఇండియా దట్ ఈజ్ భారత్-11

[శ్రీ కోవెల సంతోష్ కుమార్ రచించిన ‘మిషన్, ఇండియా దట్ ఈజ్ భారత్’ అనే వ్యాస పరంపరని అందిస్తున్నాము.]

చాప్టర్ 12.

ఏసుక్రీస్తు భౌతికంగా ఈ భూమి మీద నడిచారనడానికి ఒకటి రెండు చారిత్రక ఆధారాలు మాత్రం కనిపించాయి. ఆ తరువాత ఆయన భారతదేశం దాకా వచ్చారన్న అభిప్రాయమూ నికోలస్ నొటోవిచ్ ద్వారా బలంగా వినిపించింది. ఏసు పార్థివ దేహంపై కప్పిన వస్త్రంగా భావిస్తున్న ష్రౌడ్ ఆఫ్ టురిన్ కూడా 14వ శతాబ్దపు తరువాతిదని తాజా పరిశోధనలు భావిస్తున్నాయి. కానీ వీటిలో వేటికి శాస్త్రీయమైన అంటే మన మార్క్సిస్టు చరిత్రకారులు పేర్కొనే ఏ ఒక్క ఉపకరణం (శాసనం, రాతప్రతి, శిల్పం ఇతరత్రా) కూడా లభించలేదు. ఈ క్రమంలో ఏసు భౌతికంగా ఈ నేలపై తిరిగిన వ్యక్తేనా? లేక మరేదైనా అంశాన్ని ఏసు చరిత్రగా మార్చారా అన్న సందేహమూ వస్తుంది. దీనికి బీజాలు బైబిల్ లోనే మనకు కనిపించడం వల్ల కొత్త ఆలోచనలు రేకెత్తిస్తున్నాయి. ఖగోళ మండలంలో సౌరమండలం, నక్షత్ర మండల కదలికలను అనుసరించి క్రీస్తు చరిత్ర రచన జరిగిందా అన్న సందేహం వ్యక్తమవుతున్నది. రోదసిలో సూర్యుడి కదలికలను అనుసరించి క్రీస్తు చరిత్రను రచించారని భావించే అవకాశాలున్నాయి. క్రీస్తుకు ముందు ఉన్నఅనేక మతాలు, సంస్కృతులు కూడా సూర్యచంద్ర కదలికలను విస్మరించలేదు. వారిని ప్రత్యక్ష దేవుళ్లుగానే పరిగణించారు. మన దేశంలో పన్నెండు మంది ఆదిత్యులు, వసువులు, రుద్రులు కూడా ఇలా ఖగోళ కదలికల ఆధారంగా ఏర్పడినవారే (వివరాలు ముందరి వ్యాసాల్లో ఉన్నాయి). క్రీస్తు చరిత్ర కూడా సూర్యుడికి సంబంధించిన చరిత్ర అని కొందరు చరిత్రకారులు చెప్తారు. ఇందుకు సంబంధించి బైబిల్ లోనే కొన్ని ఆధారాలను వారు చూపుతున్నారు.

ఏసుక్రీస్తు జననం డిసెంబర్ 25 న జరిగిందని అంటారు. క్రిస్‌మస్ పర్వదినాన్ని అదే రోజున జరుపుకుంటారు. కానీ జనవరి 1న నూతన సంవత్సరం జరుపుకుంటారు. క్రీస్తు పుట్టిన నాటినుంచి క్రీస్తు శకం ప్రారంభం అయిందనుకుంటే.. డిసెంబర్ 25న నూతన సంవత్సరం ప్రారంభమై ఉండాలి. ఎందుకంటే ఒక మహానుభావుడి పేరు మీద శకం ప్రారంభం కావడం అంటే.. అదొక ప్రత్యేకమైన ఘటనకు ప్రతీకగా ఉండాలని ఒక అభిప్రాయం. ముస్లింలకు హిజరీ క్యాలెండర్ ఉన్నది. మహమ్మద్ ప్రవక్త మక్కా నుంచి మదీనా వెళ్లిన రోజున ముస్లింల హిజరీ క్యాలెండర్ ప్రారంభమైంది. భారతదేశంలో విక్రమాదిత్యుడు సామ్రాజ్యాన్ని స్థాపించిన రోజును మనం విక్రమ శకం ప్రారంభించుకున్నాం. మనకు శాలివాహన శకం కూడా శాలివాహనుడి పట్టాభిషక్తుడైన రోజున ప్రారంభమైంది. అలాగే క్రీస్తు శకం కూడా యేసు జననం నుంచే ప్రారంభమైందని భావించాలి. క్రైస్తవులు కూడా అదే భావిస్తారు. జనవరి 1వ తేదీని క్రీస్తు శకం మొదలు కావడం యాదృచ్ఛికమా లేక దీని వెనుక ఖగోళ సంబంధమైన అంశాలు ఏవైనా ఉన్నాయా? అన్న ప్రశ్న ఉదయిస్తుంది. మనం గూగుల్ లోకి వెళ్లి Age of Pisces అని సర్చ్ చేస్తే.. మీన రాశి ప్రారంభమైన కాలాన్ని సూచిస్తుంది. ఇది యేసుక్రీస్తు జనన కాలాన్ని సూచిస్తుంది. అమెరికాలో చాలా కార్ల మీద మనకు చేప గుర్తు కనిపిస్తుంది. చేప గుర్తు మధ్యలో జీసస్ అని రాసి ఉంటుంది. ఇది యాదృచ్ఛికమైతే కాదనే అనిపిస్తుంది. యేసుక్రీస్తు జననం, ఆయన ప్రతీకగా దీన్ని చెప్పుకోవచ్చనిపిస్తుంది.

ఇక్కడ మరో విషయం చెప్పుకోవాలి. బైబిల్ లో మనకు మూడు ముఖ్యమైన అంశాలు కనిపిస్తాయి. 1. యేసు తిరిగి వస్తాడని, 2. కొత్త యుగం ప్రారంభమవుతుందని, 3. అది దేవుడి రాజ్యం (Kingdom of God) అవుతుందని. అంటే ఒక యుగం ముగిసి మరో యుగం ప్రారంభమవుతుందని అర్థం.

ఉదాహరణకు Ephesians 1:21 లో –

“Not only in this world but also in the world to come” అని ఒక వర్షన్ చెబుతుంది.

మరో వర్షన్‌లో –

“Not only in this age but also in the coming age” అని ఉంటుంది.

ఇక్కడ ఏజ్ (యుగం), వరల్డ్ (ప్రపంచం) అని వేరు వేరుగా అనువదించారు. దీనివల్ల ప్రపంచం అంతమై.. కొత్త ప్రపంచం వస్తుందనే భావన కలిగించారు. కానీ.. ఒక యుగం ముగిసి.. మరో యుగం మొదలవుతుందని అర్థం.  ఈ మాటలు ముందుగా మనం చెప్పుకున్నట్టు ఖగోళ శాస్త్రంతో సరిగ్గా సరిపోతాయి. దీనికి కారణం age of Pisces ముగిసిన తరువాత age of Aquarius మొదలవుతుంది. అక్వేరియస్ అంటే కుంభ రాశి. ఈ కుంభ రాశికి సంబంధించిన సంకేతాలు కూడా మనకు బైబిల్‌లో కనిపిస్తాయి. బైబిల్‌లో ఒక చోట ‘నగరంలోకి ప్రవేశించినప్పుడు నీళ్ల కుండ మోసుకొని వెళ్తున్న ఒక మనిషి మీకు కనిపిస్తాడు.’ ఈ విధంగా విశ్లేషించినప్పుడు బైబిల్ లోని వాక్యాలు, ఉపమానాలు, ఘటనలు.. రోదసిలోని ఖగోళ చక్రాలతో అనుసంధానించినట్టు కనిపిస్తుంది. యేసు భౌతికంగా భూమిపై జన్మించిన చారిత్రక వ్యక్తి అన్న అంశానికి సంబంధించిన అంశాలను ఇంతకు ముందు వ్యాసంలో చర్చించుకున్నాం. కానీ క్రీస్తు జననం అన్నది ఖగోళ సంబంధమైనదిగా కనిపించడానికి కూడా బలమైన ఆధారాలు మనకు బైబిల్ లోనే కనిపిస్తాయి.

ఒకసారి ఖగోళ గణితాన్ని అధ్యయనం చేద్దాం. భూమి తన కక్షపై తనచుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. దీనివల్లనే పగలు, రాత్రి ఏర్పడుతుంటాయి. అయితే.. భూమి తన కక్షపై స్థిరంగా తిరుగదు. తనచుట్టూ తాను తిరుగుతున్నప్పుడు కొద్దిగా పైకీ కిందకూ ఊగుతుంటుంది. దీన్ని ఇంగ్లిష్ లో precession of equinoxes అంటారు. ఈక్వినాక్స్ అంటే పగలు, రాత్రి సమానంగా ఉండే రోజు అని అర్థం. మనకు మార్చి 21, సెప్టెంబర్ 21 అంటే వసంత రుతువులో, శరదృతువులో రెండు రోజుల్లో పగలు, రాత్రి సమానంగా ఉంటాయి. మార్చి 22 నుంచి పగలు ఎక్కువ అవుతుంది.. రాత్రి తక్కువ అవుతుంది. జూన్ 21 నాటికి పగలు అత్యంత ఎక్కువగా ఉన్న రోజు వస్తుంది. ఈరోజే మనం అంతర్జాతీయ యోగా జరుపుకుంటాం అది వేరే సంగతి. జూన్ 22నుంచి రాత్రి ఎక్కువ అవుతూ.. సెప్టెంబర్ 21 నాటికి మళ్లీ సమానమవుతుంది. ఈక్వినాక్సెస్‌కు సంబంధించిన పరిభ్రమణ చక్రమిది. భూమి కొద్దిగా ఊగుతూ తిరుగుతుండటం కారణంగా ప్రతి 2150 సంవత్సరాలకు సూర్యుడు ఒక కొత్త రాశిలో ఉదయిస్తాడు. అంటే ప్రతి రాశికీ ఒక యుగం ఉంటుంది. అది ప్రతి 2150 సంవత్సరాలకు ఒకసారి మారుతుంది. ప్రస్తుతం నడుస్తున్న యుగం మీన రాశి యుగం అంటే age of Pisces. క్రీస్తు శకం 1వ సంవత్సరం జనవరి 1వ తేదీ నుంచి కొనసాగుతున్నది. ఏసుక్రీస్తు పుట్టిన సమయంలో ఈ యుగం మొదలయిందా? లేక ఈ యుగ ప్రారంభాన్ని శక ప్రారంభంగా క్రైస్తవులు భావించారా అంటే.. రెండవదనే చెప్పాలి. ఇక్కడ మరో ముఖ్యమైన అంశాన్ని మనం పరిశీలించాలి. బైబిల్ లోనే మరో మాట మనకు ముఖ్యంగా కనిపిస్తుంది. ‘నేను ఎల్లప్పుడూ మీతోనే ఉన్నాను యుగాంతం వరకూ’.. ఇది కూడా జ్యోతిష కాలచక్రం గురించి చెప్పడమే. ఎందుకంటే.. మీన యుగం ప్రారంభమైనప్పుడు యేసు అవతరించాడు. యేసు రెండవసారి రానున్నాడు. అంటే యుగమార్పును ఇది సూచిస్తుంది. ఆధ్యాత్మిక పరిభాషలో ‘ప్రభువు తిరిగి వస్తాడు’ అని పేర్కొన్నారు. దానితో పాటే ‘నీవు నగరంలోకి వెళ్లినప్పుడు నీళ్ల కుండ తీసుకొని వెళ్తున్న మనిషి నీకు కనపడతాడు. అతడిని అనుసరించు’ అని అనడం స్పష్టంగా కుంభరాశిని ఉద్దేశించి చెప్పినదే.

ఈ సిద్ధాంతానికి మరో బలమైన ఆధారం మనకు బైబిల్ లోనే కనిపిస్తుంది. డిసెంబర్ 25న క్రీస్తు జన్మించాడని చెప్తారు. ఈ డిసెంబర్ 25 ఏమిటంటే, భూమిపై సంవత్సరంలో అతి చిన్న రోజు ఇదే. సెప్టెంబర్ 22 నుంచి డిసెంబర్ 21 వరకు పగలు తగ్గుతూనే ఉంటుంది. ఆ తరువాత మూడు రోజులు అంటే.. డిసెంబర్ 22, 23, 24 తేదీలలో సూర్యుడు ఒకే స్థానంలో కనిపిస్తాడు. ఈ మూడు రోజులు కూడా సూర్యుడు ఒకే చోటినుంచి ఉదయిస్తాడు. మనం కన్యాకుమారిలో స్వామి వివేకానంద రాక్‌కు వెళ్లి చూస్తే.. అక్కడ సన్‌రైజ్ రాక్ అని ఉంటుంది. అందులో సూర్యుడు ఏ రోజు ఏ డిగ్రీలో ఎటు నుంచి ఉదయిస్తాడో స్పష్టంగా కనిపిస్తుంది. ఎవరైనా చూడవచ్చు. డిసెంబర్ 25 నాడు సూర్యుడు ఉత్తర దిశగా కదులుతాడు. ప్రాచీన కాలపు ప్రజలు ‘సూర్యుడు జీవించి లేచాడు’ అని నమ్మారు. మనకు క్రైస్తవ విశ్వాసంలో కూడా యేసు క్రాస్‌పై మరణించాడు. మూడు రోజులు చనిపోయి ఉన్నాడు.. తరువాత జీవించి లేచాడు అన్న భావన ఉన్నది. అయితే ఇక్కడ చిన్న తేడా ఉంటుంది. అంటే ఈ  సూర్యుడి ఖగోళ కదలికలనే యేసుగా నాటి ప్రజలు భావించారా? వాటినే యేసు గురించిన చరిత్రగా రచించారా? అయితే డిసెంబర్ 25న క్రీస్తు జన్మించి.. ఆ తరువాత మూడు రోజులకు తిరిగి జన్మించాడు అన్నది క్రైస్తవ ప్రజల విశ్వాసం. ఖగోళ శాస్త్రం ప్రకారం సూర్యుడి కదలికలు డిసెంబర్ 25కు ముందు మూడు రోజులు కదులకుండా ఉన్నాయి. దీన్ని ఎలా భావించాలి. వీటిని ముందు వెనుకలుగా మార్చారా? క్రైస్తవ మత పెద్దలు చెప్పాలి. ఇక్కడ చిన్న మాయ జరిగిందో, యాదృచ్ఛికమో చెప్పలేము కానీ.. సూర్యుడిని ఇంగ్లిష్ లో Sun అంటారు. దేవుడి కుమారుడిని Son of god అంటారు. అంటే sun of god ని son of god గా మతపరమైన అర్థంలోకి మార్చారా అన్న అభిప్రాయం ఏర్పడుతుంది. దీనికి ఇదమిత్థంగా ఎలాంటి ఆధారమూ లేదు.

ఇక్కడ మరొక విషయం ఉన్నది సరిగ్గా 2025 సంవత్సరాల క్రితం డిసెంబర్ 22న సూర్యుడు ఉదయించిన దిశలో ఒక నక్షత్ర రాశి ఉండేది. దానిని లాటిన్ భాషలో crux అంటారు. ఇంగ్లిష్ లోకి వచ్చేసరికి అది cross (క్రాస్) అవుతుంది. దీన్ని బట్టి చూస్తే.. యేసు క్రాస్ మీద మరణించాడు అన్న మాటకు.. సూర్యుడు క్రక్స్ రాశి దగ్గర నిలిచిపోవడం అన్న ఖగోళ ఘటనకు ప్రతిబింబంగా భావించవచ్చు.

బైబిల్ లో మరొక మాట ఉన్నది. యేసు జన్మించినప్పుడు ముగ్గురు జ్ఞానులు ఒక నక్షత్రాన్ని అనుసరించి వచ్చి ఆయనకు శుభాకాంక్షలు చెప్పారు. యేసు జననానికి సాక్ష్యాలుగా ఈ ఘటనను ఉదహరించడం జరిగింది. అందుకే క్రిస్మస్ పర్వదినం రోజున నక్షత్ర ఆకారపు చిహ్నాన్ని క్రైస్తవులు తమ ఇండ్లపై ప్రదర్శిస్తారు. ఈ ముగ్గురు, ఆ నక్షత్రం కూడా ఖగోళ సంబంధమైనదే. ఎందుకంటే రోదసిలో ఓరియన్ (Orion) అనే నక్షత్ర మండలం ఉన్నది. ఇందులోని మూడు నక్షత్రాలు సరళ రేఖలో ఉంటాయి. ఈ మూడూ కూడా చాలా ప్రకాశవంతంగా మెరుస్తుంటాయి. ఈ మూడు నక్షత్రాలనే క్రైస్తవ మతాచార్యులు ముగ్గురు రాజులు లేదా ముగ్గురు మేధావులుగా వర్ణించారు. మరోవైపు డిసెంబర్ 25 రాత్రి కానీ, తెల్లవారుజామున కానీ ఆకాశంలో తూర్పువైపు చూస్తే.. ఒక ప్రకాశవంతమైన నక్షత్రం మనకు కనిపిస్తుంది. దాన్ని సిరియస్ (Sirius) గా పిలుస్తారు. ఓరియన్ నక్షత్ర మండలంలోని మూడు నక్షత్రాలు ఈ సిరియస్ నక్షత్రాన్ని డిసెంబర్ 25న చూపిస్తాయి. ఈ మూడు నక్షత్రాల నుంచి నేరుగా ఒక గీత గీస్తే.. అది సిరియస్‌ను తగులుతుంది. ఈ నాలుగింటినీ కలిపి ఒక గీత గీసినప్పుడు అది సూర్యుడి వైపునకు నేరుగా చూపిస్తుంది. ఈ సిరియస్ నక్షత్రం ఉన్న ప్రదేశం నుంచే సూర్యుడు పునర్జన్మ పొందుతున్నాడు అని వారు నమ్మేవారు. ఆకాశంలో నక్షత్రాలు ఒక దిశను చూపిస్తాయి. వాటిని చూసి.. పూర్వకాలపు ప్రజలు ఒక కొత్త రక్షకుడు (messiah) పుట్టాడు అని వ్యాఖ్యానించారు.

బైబిల్ లోనే ప్రముఖమైన మరొక కథనం ఉంది. యేసు క్రీస్తు ఐదు రొట్టెలు, రెండు చేపలతో వేల మందికి ఆహారం అందించాడని ఈ కథ. ఇది చాలా ప్రసిద్ధమైంది. ఇది కూడా ఖగోళ సంబంధమైనదే. రొట్టె అంటే ధాన్యం. ఇది కన్యారాశి (Virgo)కు ప్రతీక. చేపలు మీనరాశి (Pisces) కు ప్రతీక. యేసు తన శిష్యులకు చేపలు పట్టాలని పంపాడు అని బైబిల్ లో కనిపిస్తుంది. అంటే ఒకవైపు కన్యారాశి, మరోవైపు మీన రాశి.. ఈ రెండూ కూడా జ్యోతిష్య చక్రంలో ఒకదానితో ఒకటి కలుస్తాయి. దీనినే కథగా చెప్పి యేసు అద్భుతం చేశారని పేర్కొన్నారు. ద్రాక్షరసం, ద్రాక్ష తోట వంటివన్నీ కూడా ఖగోళంలో జరిగే ఘటనల ఆధారంగా రాసినట్టుగానే భావించవచ్చు.

శిలువ (cross): crux అనే నక్షత్ర సమూహం

మూడు రోజుల మరణం: సూర్యుడు మూడురోజులు ఒకే కోణంలో కదలకుండా నిలబడటం

ముగ్గురు జ్ఞానులు : ఓరియన్ బెల్ట్ లోని మూడు నక్షత్రాలు

ప్రకాశించే తార: సిరియస్ నక్షత్రం.

రాశులు, సూర్యుడు, సమాన దినాలు, ఉత్తరాయణ, దక్షిణాయనాలు.. వీటన్నింటి ఆధారంగా యేసు జీవిత చరిత్రను మిషనరీలు నిర్మించాయి. వీటినుంచే క్రైస్తవ మతం పుట్టుకొచ్చింది. ప్రపంచంలోనే అత్యంత కమర్షియల్ మతంగా రూపాంతరం చెందింది. అనేక బిలియన్ డాలర్ల బిజినెస్.. ఈ క్రైస్తవం మిథ్య అని నిరూపణ అయితే ఈ మొత్తం వ్యాపారం నాశనమవుతుంది. అందువల్లనే దీని అస్తిత్వాన్ని సజీవంగా ఉంచడం కోసం ప్రతి ఏటా దాదాపు అయిదారు వందల పుస్తకాలు పెద్ద్ ఎత్తున మార్కెట్లోకి వస్తాయి. ప్రపంచ వ్యాప్తంగా మిషనరీల ఏర్పాటు అత్యంత విస్తారంగా జరుగుతాయి. వాటి పని వీలైనంత ఎక్కువ మందిని క్రైస్తవ మతంలోకి తీసుకొని రావాలి. సామ దాన భేద దండోపాయాలన్నింటినీ ఉపయోగించి మత మార్పిళ్లకు బిలియన్ల కొద్దీ డాలర్లు కుమ్మరిస్తుంటారు. ఈ విషయంలో కమ్యూనిస్టుల వ్యవహారం ప్రపంచం అంతటా ఒక విధంగా ఉంటే, భారతదేశంలో మాత్రం మరో రకంగా ఉంటుంది. సాధారణంగా కమ్యూనిస్టులు దేవుడి ఉనికిని విశ్వసించరు. కమ్యూనిస్టు చరిత్రకారులు కానీ, విద్వాంసులు కానీ, పాత్రికేయులు కానీ, ఉద్యమకారులు కానీ దేవుడి అస్తిత్వాన్ని ఎంతమాత్రం అంగీకరించరు. అయితే వారు ఇస్లాం విషయంలో మాత్రం కొంత ఉదారంగా వెళ్తారు. కానీ, పశ్చిమ దేశాల్లో క్రైస్తవం పై తీవ్రంగా పోరాడారు. జీసస్‌ను అబద్ధమని నిరూపించడానికి, ఆ మతాన్ని అబద్ధమని చూపడానికి ఆర్గనైజ్డ్ యుద్ధమే చేశారు. జీసస్ చరిత్రను తవ్వి తీయడానికి చాలా ప్రయత్నాలు చేశారు. దీని ప్రభావం కొద్దో గొప్పో పశ్చిమదేశాలపై పడిందనే చెప్పాలి. మరోవైపు ఇస్కాన్, నారాయణ ట్రస్ట్, ఇతర హిందూ సంస్థల ప్రభావం కూడా పెరుగుతుండటంతో ఐరోపాలో చర్చిని విశ్వసించేవారి సంఖ్య తగ్గిపోతున్నది. అమెరికాలో సుమారు 500 వరకూ హిందూ దేవాలయాలు నిర్మాణమయ్యాయి. అయినప్పటికీ అమెరికాలో క్రైస్తవం ఇప్పటికీ చాలా బలంగానే అక్కడ కనిపిస్తుంది.

జీసస్ పుట్టుక, ప్రబోధాలు అన్నీ పునాదులు లేని అతి పెద్ద భవంతుల మాదిరిగా నిర్మాణమయ్యాయి. ఒకటి రెండు ఆధారాలు తప్ప మరేమీ కనిపించవు. అందుకే తమ మతం ఆధిపత్యాన్ని కొనసాగించడానికి రాముడిని, కృష్ణుడిని నకిలీ చేశారు. ప్రపంచం అంతా క్రైస్తవం మీద పోరాటం చేసిన కమ్యూనిస్టులు మాత్రం మన దేశంలో ఇస్లాం, క్రైస్తవాలతో కలిసి పనిచేస్తూ.. భారతీయ ధర్మాన్ని నాశనం పట్టించేందుకు కృషి చేస్తూనే ఉన్నారు.

(ఇంకా ఉంది)

Exit mobile version