Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మిషన్, ఇండియా దట్ ఈజ్ భారత్-13

[శ్రీ కోవెల సంతోష్ కుమార్ రచించిన ‘మిషన్, ఇండియా దట్ ఈజ్ భారత్’ అనే వ్యాస పరంపరని అందిస్తున్నాము.]

చాప్టర్ 14.

శిలువకు బలైపోయిన దేవుళ్లు

క్రైస్తవం, ఇస్లాం మతాలు ప్రపంచాన్ని ఆక్రమించడానికి ముందు ఎన్నో అద్భుతమైన నాగరికతలు, సంప్రదాయాలు అనేక దేశాలలో విస్తరించి ఉన్నాయి. దాదాపు అన్నింటికీ మధ్యన సమానతలు, సారూప్యతలు స్పష్టంగా కనిపించేవి. దాదాపు అన్ని చోట్లా అగ్ని ఆరాధన, సూర్యారాధన ఉండేవి. ఎందుకంటే.. మనందరికీ ప్రత్యక్షంగా కనిపించే దేవుడు సూర్యుడే. ముందే చెప్పుకున్నట్టు మనకు సూర్యుడి 12 రూపాలు 12 ఆదిత్యులుగా మారారు. సూర్యుడు కాకుండా ప్రకృతిని ఆరాధించడం రెండో విధానం. ఇది కూడా అనేక సంస్కృతులలో ఉన్నది. కొలంబస్ ఆక్రమించడానికి ముందు అమెరికా ఖండం అనేక సంప్రదాయ నాగరికతలు, మత విశ్వాసాలు అనేకం ఉండేవి. ఇక్కడి నాగరికతల జీవన విధానాలు కానీ, మతం కానీ ప్రకృతి కేంద్రంగా కొనసాగినవే. వీటిలో కూడా ఆత్మ అనేది ఒకటి ఉంటుందని బలమైన నమ్మకం ఉండేది. భారత్ లో ఏ విధంగానైతే వసుధైక కుటుంబకం అన్న సూత్రం ప్రబలంగా ఉంటూ వచ్చిందో.. అక్కడా కూడా సామూహిక సమతాభావం బలంగా ఉండేది. ప్రస్తుతం సౌత్ డకోటా ప్రాంతంలో లకోటా సీయోక్స్ జాతి ప్రజలు ఆరాధించిన దేవుని పేరు వాకన్ టంకా (wakan tanka) ఈ దేవుడు లకోటా జాతి ప్రజల ప్రధాన దేవుడు. ప్రపంచంలోని జీవరాశులన్నింటిని రక్షించేవాడు అని అర్థం. ఇతనికి బర్రె తల ఉంటుందిట. అంటే.. మనకు గోమాత ఎట్లనో.. అట్ల.. జీవరాశులన్నిటికీ ఆహారాన్ని అందించి రక్షించేది ఆవే కదా..

అమెరికాలోనే అల్గాన్ క్వియన్ అనే జాతుల వారు సృష్టి కర్తగా గిట్చె మానిటావ్ (Gitche Manitou) అనే దేవతను పూజించారు. ప్రకృతి, జీవరాశుల రక్షణ కోసం ఈ దేవతను వారు పూచించారు. హోపి, జుని, పుయెబ్లో అనే జాతుల ప్రజలు.. పొడవాటి తలకట్టుతో, గాలి వాద్యం చేతిలో కలిగిన దేవుడిని కొలుస్తారు. ఈ దేవుడి పేరు కోకోపెల్లి.. ఈ దేవుడు ఫల ప్రదత్వ దేవుడు, సంగీతం, సరదాలకు చిహ్నం. ఇక్కడే చాలా జాతుల్లో కనిపించే మరో దేవుడు ఉన్నాడు.. ఈయన పేరు కోయోటే.. ఈయన లౌక్యానికి, తెలివికి, వినోదంగా కనిపిస్తూనే సృష్టిలో అనేక ముఖ్యమైన మార్పులకు కారణభూతుడయ్యాడని ఈ జాతుల పురాణ కథనాలు చెప్తున్నాయి. హోపీ తెగల ప్రజల ముఖ కవళికలు చూస్తే భారతీయుల ముఖకవళికలను పోలి ఉంటాయి. ఈ దేవుళ్ల స్వరూప స్వభావాలను చూస్తుంటే మనకు ప్రస్ఫుటంగా గుర్తుకు వచ్చే దేవుడు జగద్గురువైన శ్రీకృష్ణుడు. గాలి వాద్యం అంటే మరేమీ కాదు.. వేణువే. ఇక లౌక్యంలో, తెలివిలో స్వధర్మ స్థాపనలో ముఖ్యమైన వాడు కూడా కృష్ణుడే. ఈ విశ్వంలో అనేక మార్పులకు కారణమైన వాడు కూడా అతడే. వ్యవసాయంలో, వైద్యంలో, యుద్ధ నైపుణ్యంలో, రణనీతిలో, రాజనీతిలో, నిర్మాణ రంగంలో వినూతనమైన చైతన్యానికి కారణభూతుడైన వాడు కృష్ణుడే. సరిగ్గా అలాంటి దేవుళ్లే మనకు అమెరికాలోనూ క్రైస్తవానికి బలి కాకముందు ఉన్న జాతుల్లో కనిపిస్తారు.

మధ్య అమెరికాకు వస్తే.. అక్కడ మనకు కనిపించే నాగరికతలు మాయా, అజ్టెక్, టోల్టెక్, ఒల్మెక్ వంటివి కనిపిస్తాయి. అజ్జెక్ ప్రజలు ప్రకృతిలోని మౌలిక అంశాలను దేవతలుగా కొలిచేవారు. ఉదాహరణకు అక్కడ సర్ప పూజ ఉన్నది. క్వెట్జల్కోటల్ (quezalcoatl) అనే దేవత సర్పమే. ఈ దేవత మానవులకు విద్య నేర్పుతుంది. నాగరికత నేర్పుతుంది. జ్ఞానం అందిస్తుంది. ఈ దేవుడే సృష్టి దేవుడు కూడా. మనకూ సర్పపూజ సంప్రదాయంగా వస్తున్నదే. నాగుల చవితి కానీ, నాగ పంచమి కానీ మనం ఎప్పుడూ చేసుకునేదే. కుండలినీ యోగం కూడా సర్ప రూపంలోనే ఉంటుంది. సుబ్రహ్మణ్యేశ్వరుడు కూడా సర్పరూపంలోనే ఉంటాడు. శివకేశవులిద్దరూ కూడా సర్పంతో సంబంధం ఉన్నవారే కదా.. ప్రపంచంలోని ఏ నాగరికతలోనైనా పాములకు ఎందుకు ప్రాధాన్యం ఇస్తారంటే.. ప్రకృతిలో అత్యంత ప్రధానమైన జీవి పాము. పర్యావరణ సమతుల్యాన్ని సాధించడంలో పాముల పాత్ర చాలా కీలకమైంది. అన్నింటికీ మించి వ్యవసాయంలో పాము పాత్ర కీలకమైంది. పంటలకు హాని కలింగించే ఎలుకలు, ఇతర చిన్న జంతువులను నియంత్రించడంలో పాము ముఖ్యపాత్ర పోషిస్తుంది. అందుకే అన్ని నాగరికతల్లోనూ పాముకు దైవ స్థానం లభించింది.

అజ్జెక్ జాతి ప్రజలకు సూర్యుడు, వరుణ దేవుడి లాంటి దేవతలూ ఉన్నారు. టెజ్కాట్లిపోకా (Tezcatlipoca) అనే మరో దేవుడిని కూడా పూజించేవారు. ఈ దేవుడు వారికి అదృష్ట దేవుడు. కోరిన కోరికలన్నీ తీర్చే దేవుడు. రాత్రి పూట భయాన్ని పారదోలే దేవుడు. ఈయన కాక హుయిట్జిలోపోచ్ త్లి అనే మరో దేవుడు ఉన్నాడు. ఇతను మరెవరో కాదు.. సూర్యుడే. అజ్టెక్ జాతికి ఇతను ప్రధాన దేవుడు. ఈ దేవుడికి నరబలులను సమర్పించేవారు.

ఇక మాయా ప్రజలు దేవతలకు బలులు అర్పించడం, జ్యోతిష్యశాస్త్ర ఆధారంగా ఉత్సవాలు నిర్వహించడం వంటి మతచర్యలు అనుసరించేవారు. మాయా నాగరిక ప్రజలకు ఇట్జమ్నా, ఇక్స్ చెల్, చాక్, అనే దేవుళ్లు ప్రధానమైన వారు. వీరిలో మొదటి ఇద్దరు సూర్యచంద్రులు. ఈ ఇట్జమ్నాయే సృష్టికర్త. ఇతడు మనుషులకు వర్ణమాలను అందించాడు. మనకు శివుడి ఢమరుకం నుంచి వర్ణమాల వచ్చినట్టే.. అక్కడ ఇట్జమ్నా చేతిలో కూడా ఒక ముంతలాంటి వస్తువు ఉంటుంది. దాని నుంచే వర్ణమాల వచ్చిందని భావిస్తారు. మనకు వరుణదేవుడు ఎలా ఉన్నాడో.. వాళ్లకు కూడా వర్షానికి ఒక దేవుడు ఉన్నాడు. పంటకు అవసరమైన వర్షం కురిపించాలని రైతులు ఈ దేవుడిని పూజించేవారు. మొదటి నుంచీ కూడా గమనించండి.. అనేక నాగరికతల్లో.. జీవన విధానంలో, సాంస్కృతిక వ్యవహారాల్లో రూపాలు వేరు కావచ్చు కానీ.. మౌలికమైన సూత్రం ఒకటిగానే కనిపిస్తుంది. ఇక దక్షిణ అమెరికా ప్రాంతంలోని ఆండిస్ పర్వతాలలో ఇన్కా నాగరికత కొనసాగింది. ఇక్కడ ఇంటీ అనే ఒక దేవుడు ఉన్నాడు. పేరు వేరు కానీ.. ఇతడూ సూర్యుడే. ఇక్కడి రాజులు తాము సూర్యుని సంతానంగా భావించేవారు. పచమమ లనే దేవత ఉన్నది. ఈమె భూదేవి. భూమిని తల్లిగా కొలిచేవారు. విరకోచ అనే దేవుడు ఉన్నాడు. ఇతడు సృష్టికర్త. అమెరికాలో అక్కడక్కడా మిగిలిపోయిన శిథిల నిర్మాణాలలో.. గోడలపై ఈ దేవతల చిత్రాలు మనకు కనిపిస్తాయి. కొకొపెల్లి సన్నగా చేతిలో పొడవాటి కర్రలాంటిది పట్టుకున్నట్టుగా కనిపిస్తుంది. కచినాస్ (పితృదేవతలు) బొమ్మలు, వర్ష పూజల చిత్రాలు కూడా మనకు కనిపిస్తాయి. మన దేవాలయాలలో మాదిరిగానే పిరమిడ్ ల మెట్లకు ఇరువైపులా దేవీదేవతల బొమ్మలు చూడవచ్చు. కొడవలితో నరబలి చేస్తున్న దేవతల బొమ్మలు కూడా మనకు కనిపిస్తాయి. వకన్ టంకా దేవుడికి పూజారులు శరీరానికి గాయం చేసుకుంటూ.. ఒక పద్ధతి ప్రకారం నృత్యం చేస్తారు. మాయా ప్రజలు తమ దేవతలకు వజ్రాలు, ఆహారాన్ని నైవేద్యంగా సమర్పించేవారు. వీరు భూమిని సంతానమిచ్చే దేవతగా కొలిచారు. భూమి మనకు అందుకే భూమిలో గోయి తీసి అందులో ఆహారాన్ని సమర్పించేవారు. సమస్త జీవరాశి భూమి నుంచే ఉద్భవిస్తుంది. అందుకే ఆమెకు ఆహారం పెడతారు. మనం కూడా ఆషాఢ మాసంలో గ్రామ దేవతలకు బోనాలు సమర్పించుకోవడం ఆనవాయితీగా వస్తున్నదే. సంప్రదాయ దేవతలు కాకుండా అప్పుడు కూడా ప్రాంతీయ దేవతలు ఉన్నారు. ఎంత అద్భుతం అంటే.. రుతువుల మార్పు, పుట్టుక, జీవన వ్యవస్థలకు కూడా ఒక స్త్రీ దేవత ఉన్నది. ఆమె పేరు అస్ద్ జా నద్లీహీ (Asdzą́ą́ Nádleehi) ఈమె జీవ వ్యవస్థకు మూలం. ఈమెకు ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. వీరి పేర్లు.. మాన్స్టర్ స్లేయర్, బార్న్ ఫర్ వాటర్..( Monster Slayer & Born-for-Water) ఈ ఇద్దరు కూడా ప్రకృతిలోని సహజ వనరులకు అధిష్ఠాన దేవతలన్నమాట. మరో దేవత ఉన్నది. ఆమె పేరే ఆకాశ దేవత. ఈమె మానవుడి జన్మకు కారణమైంది. ఆమె నేలమీదకు దిగివస్తుంటే.. పక్షులు ఆమెను సున్నితంగా పట్టుకొని నేలమీదకు తీసుకొని వచ్చాయంట. నవాహో (Navajo), చెరోకీ (Cherokee), లక్సా (Lakota), హాపీ (Hopi), ఇరోక్వాయ్ (Iroquois) మొదలైన పేర్లు కూడా దేవతలమే.. ఇవన్నీ కూడా ప్రపంచంలోని అన్ని సంస్కృతులతో ఏదో రూపంలో సమన్వయం అవుతూనే ఉంటాయి. ఇస్లాం, క్రైస్తవాలు రావడానికి ముందు వరకు కూడా ప్రజలు ప్రకృతిని ప్రేమించారు. పంచభూతాలను ప్రేమించారు. ఆరాధించారు. పరిరక్షించుకున్నారు. తాత్త్విక దృష్టితో ప్రపంచాన్ని చూశారు. ఇది భారత్ లోనూ.. ప్రపంచంలోని అన్ని నాగరికతల్లోనూ జరిగిన పరిణామమే. భారతదేశంలోని ద్వైతాద్వైతవిశిష్టాద్వైత సిద్ధాంతాల్లోని తాత్త్వికత మరో రూపంలో మనకు ఈ నాగరికతల్లో కనిపిస్తుంది. అందులో ప్రధానమైనవి.. ప్రతి జీవుడిలో ఆత్మ ఉన్నది. పర్వతాలు, నదులు, జంతువులు, ప్రకృతి, సమస్త జీవరాశి కూడా పవిత్రమైనదే. ప్రతి తెగలకూ ఒక మత లేదా ఆధ్యాత్మిక గురువు ఉంటాడు. అతడిని శమన్ అని పిలిచేవారు. దక్షిణ భారత దేశంలో ఆచార్యులు పవిత్రోత్సవాలలో స్వామికి నృత్యాల ద్వారా పూజ సమర్పించుకుంటారు. భజన సంప్రదాయం కూడా ఉన్నది. ఈ సంప్రదాయం మనకు అమెరికా తెగల్లో కూడా కనిపించేది. వలయాకార భూమి నిర్మాణాలు అప్పుడే సాగినట్టు చరిత్ర చెప్తున్నది. ఇవి విశ్వానికి ప్రతీకగా ఉన్నాయి. క్రైస్తవం మాత్రం చాలాకాలం పాటు భూమిని వలయాకారంగా ఉంటుందని అంగీకరించనే లేదు. క్రైస్తవం వచ్చిన తరువాతే ప్రేమ, ఆరాధన స్థానంలో ఎక్స్ ప్లాయిటేషన్ ప్రారంభమైంది. నాగరికత నాశనమే కాదు.. ప్రకృతి విధ్వంసానికి కూడా క్రైస్తవం కారణమైందనడంలో సందేహం లేదు. దీని గురించి మరింత వివరంగా మరో వ్యాసంలో చదువుకుందాం.

స్థూలంగా ఈ పట్టికను పరిశీలిస్తే అమెరికా ఖండంలోని ప్రాచీన దేవతల గురించిన ఒక అవగాహనకు రావచ్చు.

దేవుడు/దేవత              జాతి              ప్రాతినిధ్యం/శక్తి             పూజించే విధానం
Wakan tanka               Lakota             సృష్టి                        సన్ డ్యాన్స్
                             Sioux               పరమాత్మ                  ధ్యానం
Kokopelli                     hopi                 వరాలనిచ్చేవాడు           పాటలు
                                    Zuni                 సంగీతం                    చిత్రాలు
Quetzalcoatl                అజ్టెక్             జ్ఞానం, నాగరికత           బలులు, గుడుల నిర్మాణం
Huitzilopoctli                అజ్టెక్             యుద్ధం, సూర్యుడు        నరబలి
Pachamama               ఇన్కా             భూమాత                   భూమిలోకి కానుకలు వేయడం
Chac                           మాయా          వర్షం,                             వర్ష పూజలు, నీటి తర్పణ

క్రైస్తవం ఎంతగా అణచివేసినప్పటికి కూడా.. ఇప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 82 నాగరికతల్లో అగ్ని ఆరాధన కొనసాగుతున్నదని ఒక పరిశోధనలో తెలిసింది. క్రైస్తవం తరువాత నాగరికతా వినాశనానికి పాల్పడిన పెద్ద ఖండం ఆఫ్రికా. క్రైస్తవం వచ్చేసరికి ఆఫ్రికాలోనూ విగ్రహారాధన ఉన్నది. జీవితంలో ప్రతి అంశానికి కూడా మతపరమైన ప్రాతినిధ్యం తప్పనిసరిగా ఉండేది. ప్రకృతి, కుటుంబం, భూమి, పశువులు.. ఇలా ఒకటేమిటి.. ప్రతి అంశానికి ఒక దేవత మనకు ఆఫ్రికాలో కనిపిస్తుంది. ప్రకృతి ఆరాధన కొనసాగింది. దైవారాధన అన్నది జీవన వైవిధ్యంలో ఒక భాగమైంది. మన దేశంలో మాదిరిగానే బహుళ దేవతారాధన అన్నది అక్కడా ఉన్నది. పితృదేవతల కాన్సెప్ట్ అక్కడ కూడా ఉన్నది. అన్నింటినీ మించిన ఆదిదేవుడు, ఆది దేవత ఒకరున్నారనే భావన కూడా ఆఫ్రికా నాగరికతలో ప్రముఖంగా కనిపిస్తుంది. విగ్రహాలే కాకుండా ఇక్కడ మాస్కుల రూపంలో కూడా దేవతలను ఆరాధించారు. పూరీ జగన్నాథుడి మాదిరిగా చెక్క విగ్రహాలను కూడా వీరు రూపొందించుకొని ఆరాధించారు. వీరిలో విశ్వ సృష్టికర్తగా భావించే ఒక దేవుడి పేరు ఒలొరున్ (olorun). నైజీరియాలోని యోరుబా ప్రజల ప్రధాన దేవుడు. ఈయనకు ఒక కుమారుడు ఒబటాలా అనే మరో దేవుడు తండ్రికి సృష్టి కార్యంలో పూర్తిగా సహకరించాడంట. ఇదే తెగకు చెందిన ప్రజలు ప్రకృతి శక్తి రూపాలుగా ఒరిషా అనే స్త్రీ దేవతలను పూజించారు.

ఇక ఈజిప్టు నాగరికతలో అమన్ రా అనే దేవతను పూజించేవారు. ఇతను కూడా సూర్యుడే. ఈజిప్టు పాత మతాలలో దేవతలు మానవులుగా అవతరించేవారు. ఇక జంతు రూపాలలో హోరస్, ఈసిస్ వంటి దేవతలు ఉన్నారు. ఘనాలోని అషాంటీ తతెగలో న్యామి అనే దేవుడు ఆకాశానికి ప్రతినిధి. ఆతని భార్య అసాసే యా అనే దేవత భూమి. ఈజిప్టు దేవతలలో ఇంద్రుడు, వరుణుడు, యముడు, బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు, సూర్యుడు, భూదేవి వంటి భారతీయ దేవీ దేవతలకు సంబంధించిన ప్రతిరూపాలు అన్నీ కూడా మనకు కనిపిస్తాయి. ఆఫ్రికాలో పితృదేవతలకు గుర్తుగా చెక్క బొమ్మలు చేసేవారు. మత సంబంధమైన అంశాలలో మంత్రగత్తెలు ఉండేవారు. బౌలె, ఫాంగ్ తెగల్లో మృతుల ఆత్మల సంరక్షణ కోసం బైరల్ అనే చెక్క బొమ్మలను తయారుచేసేవారు. ఆత్మ, పునర్జన్మ సిద్ధాంతాలు కూడా ఈ తెగల్లో మనకు కనిపిస్తాయి. క్రైస్తవం ప్రవేశించిన తరువాత కూడా ఆఫ్రికాలోని పలు ప్రాంతాల్లో పాత సంప్రదాయాలను పూర్తిగా మాత్రం అమెరికాలో మాదిరిగా నిర్మూలించలేకపోయారు. ఇప్పటికీ పలు ఇండ్లలో క్రైస్తవ మత దేవుడు ఏసుక్రీస్తుతో పాటు, తమ ఇంట్లో సంప్రదాయంగా వస్తున్న ఇలవేల్పులను కూడా పూజిస్తూనే ఉన్నారు. కాంగో వంటి ప్రాంతాల్లో క్రీస్తుతో పాటు స్థానిక మాస్కు రూపంలోని దేవతలను పూజిస్తారు. విశేషం ఏమిటంటే క్యూబా, బ్రెజిల్ వంటి దేశాల్లో ఆఫ్రికన్ భక్తి సంప్రదాయం సాంబా, కాండొంబ్లె, సంతోరియా పద్ధతుల్లో కొంతమేరకు కనిపిస్తుంది.

ఈ కింది పట్టికలో ఆఫ్రికాలో క్రైస్తవానికి ముందు పూజలందుకున్నవివిధ విగ్రహ రూపాల్లోని దేవీ దేవతల వివరాలు చూడొచ్చు.

దేవత పేరు తెగ / ప్రాంతం పాత్ర / శక్తి పూజా రూపం / లక్షణాలు
ఒలొరున్ (Olorun) యోరుబా (నైజీరియా) సృష్టికర్త, ఆకాశదేవుడు ఆకాశమధ్య స్థానం; ప్రత్యక్ష విగ్రహం లేదు
ఒబటాలా (Obatala) యోరుబా మానవుల సృష్టికర్త, మృదుత్వానికి ప్రతీక తెల్ల వేషధారణ; చెక్కవిగ్రహాలుగా పూజిస్తారు
ఒగున్ (Ogun) యోరుబా యుద్ధం, లోహ కళల దేవుడు ఆయుధాలతో చెక్కబొమ్మలు
షాంగో (Shango) యోరుబా మెరుపు, ఉరుముల దేవుడు మంటలతో పూజ, విగ్రహంలో డ్రమ్స్, మెరుపు చిహ్నాలు ఉంటాయి
న్యామె (Nyame) అషాంటీ (ఘానా) ఆకాశదేవుడు, సర్వశక్తిమంతుడు సూర్యుని రూపంగా పూజ
అసాసే యా (Asase Yaa) అషాంటీ భూమిదేవత, పంటల దేవత భూమిపై ప్రార్థనలు, విగ్రహం లేదు.
అమున్ రా (Amun Ra) ఈజిప్టు సూర్యుని దేవుడు, సృష్టికర్త మానవశరీరానికి కుడితల పక్షిరూపం (ఫాల్కన్ హెడ్)
ఐసిస్ (Isis) ఈజిప్టు తల్లి ప్రేమ, మంత్రశక్తి, సంరక్షణ స్త్రీ రూపంలో రెక్కలతో కూడిన విగ్రహం
హోరస్ (Horus) ఈజిప్టు రక్షక దేవుడు, పక్షిరాజు శిరస్సుతో ఫాల్కన్ హెడ్‌తో మానవశరీరం రూపం
అనుబిస్ (Anubis) ఈజిప్టు మరణానంతర లోక దేవుడు (యముడు), శవ సంరక్షణ కుక్క తల, మానవ శరీరం
లెగ్బా (Legba) ఫోన్ / వోడూన్ (బెనిన్) మార్గాలను తెరిచే దేవుడు, మాధ్యమికుడు చిన్నవయస్సులో ఉన్నరూపం
ఈశు (Eshu) యోరుబా సందేశదాత, మాయా దేవుడు ఆకాశవాణి లాంటిది ద్వంద్వ స్వభావం కలిగిన రూపం

ఇక ఐరోపా ఖండానికి వస్తే.. ప్రధానంగా మనకు కనిపించేవి గ్రీకు, రోమన్ నాగరికతలు ప్రధానమైనవి కాగా అనేక నాగరికతలు ఐరోపా ఖండమంతా విస్తరించి ఉన్నాయి. ఐరోపాలో అనేక దేశాలు ఉన్నట్టే.. అనేక భిన్నమైన నాగరికతలు.. మత విశ్వాసాలు, పూజా పద్ధతులు కూడా ఉన్నాయి. అదే విధంగా ప్రతి నాగరికతకూ ప్రత్యేకమైన దేవతలు, పురాణ కథనాలు కూడా ఉన్నాయి. ఒక విధంగా చెప్పాలంటే.. బహుళ దేవతామతాల సమాహారంగా ఐరోపా నాగరికతలు విస్తరించాయి. క్రైస్తవ మతం ఈ నాగరికతల ప్రజలందరినీ ఒకే గాటన కట్టి ఫాగన్ తెగలు అని ఒక పేరు పెట్టారు. మనం జాగ్రత్తగా గమనిస్తే.. వివిధ నాగరిక సమాజాలను అగౌరవపరిచేలా.. వాటిని వివిధ తెగలుగా పేరు పెట్టడం తోనే క్రైస్తవం తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. తాము మాత్రమే అత్యున్నతమైన మత సంప్రదాయవాదులమని.. మిగతావాళ్లంతా దెయ్యాలను, పాములను, పక్షులను, చెట్లను, పుట్టలను పూజించేవారని ఎద్దేవా చేయడం ప్రారంభించారు. ఒక్కో నాగరికత పూజించిన దేవతల వివరాలను చెప్పుకుంటూ పోతే.. ఇదే ఒక ఉద్గ్రంథమవుతుంది. అందుకని నాగరికతల వారీగా మాట్లాడుకుందాం.

ఐరోపాలో అత్యంత ప్రాచీనమైనదీ, సుసంపన్నమైనదీ అయిన గ్రీకు నాగరికత కాలంలో అప్పటి ప్రజలు అనేకమంది దేవీ దేవతలను పూజించేవారు. ఆలింపస్ పర్వతాన్ని దేవతల నివాసంగా భావించేవారు. యూదు వీరికి ప్రధాన దేవుడు. విశేషమేమిటంటే.. యజ్ఞాలు, విగ్రహాల ఆరాధన గ్రీకు నాగరికతలో ప్రధాన పూజా పద్ధతులుగా కనిపిస్తాయి. గ్రీకు మతాన్ని అనుసరించినప్పటికీ రోమన్లు దేవతలకు తమదైన రూపాలను సృష్టించుకున్నారు. వీరిలో ఇంటి దేవతలు వేరు.. మొత్తం సమాజానికి, జాతికి సంబంధించిన దేవతలు వేరుగా ఉండేవారు. వీరు తమ దేవాలయాలలో నిర్ణీత పద్ధతులలో పూజలు నిర్వహించేవారు. మనం బతుకమ్మ, దసరా, వినాయకచవితి, బోనాలు, సిరిమాను ఉత్సవాలు, శివరాత్రి, సంక్రాంతి వంటి సామూహిక పండుగల్లాంటివే.. రోమన్ ప్రజలు కూడా ఎన్నెన్నో సామూహిక పండుగలు జరుపుకునేవారు. ఇవాల్టి స్కాట్లాండ్, వేల్స్, ఇంగ్లండ్, ఐర్లాండ్ వంటి పలు దేశాల్లో క్రైస్తవ మతానికి ముందున్న ప్రజలను కెల్ట్స్ అనేవారు. వీరిది ప్రధానంగా ధ్వని చిత్ర సంప్రదాయం. ఈ సంప్రదాయం చాలా అద్భుతమైనది. మన పూజా విధానం లోనూ ధ్వని, చిత్ర విధానం ఉన్నది. ధ్వని కెల్టిక్ మతంలో అత్యంత ప్రధానమైనది. మన పూజా విధానంలో ధ్వనిలో ముఖ్యమైనది మంత్రం.. ప్రణవంతో మొదలవుతుంది. ద్రష్టలు చెప్పిన మంత్రాన్ని ఒక క్రమ పద్ధతిలో ఉచ్చరించడం ద్వారా దేవుడిని పూజించే విధానం కెల్టిక్ మతంలో అద్భుతంగా ఉన్నది. మానవ జీవనానికే పరిమితం కాకుండా అఖిలాండం కూడా ఉనికిలో ఉన్నది. ఇది దాదాపుగా మన సంప్రదాయంతో సమన్వయం అవుతున్నది. బార్డులు అనే కవులు తమ కవిత్వం, గేయాలు, వీరగాథల ద్వారా ఆధ్యాత్మిక విషయాలు, దేవతల కథలు, జ్ఞాన విషయాలు చెప్పేవారు. మన దేశంలోనూ నాయనార్లు, ఆళ్వారులు, పదకవితలు పలికిన అన్నమయ్య, క్షేత్రయ్య లాంటివారు.. వాగ్గేయకారులు, కళాకారులు ఎంతో మంది భక్తి ఉద్యమాన్ని ముందుకు తీసుకునిపోయిన వారే. ఇలాంటి వారే బార్టులు కూడా కెల్టిక్ మత వాగ్గేయకారులుగా చెప్పవచ్చు. యజ్ఞాలలో, ఆరాధనలో, డెలివరీ సమయాల్లో, మరణించినప్పుడు మంత్రాలు పఠించేవారు. మనకు రకరకాల వాద్య పరికరాలు ఉన్నట్టే.. వారికి కూడా సర్కిల్ ఆకార పరికరాలు, బాగ్ పైప్ వంటి ఆకారంలోని పరికరాలు ఉండేవి. తాళ స్వరాల మేళవింపుతో మనం భజన చేసినట్టుగా.. వాళ్లు కూడా భజించి దేవతలను ప్రసన్నం చేసుకునేవారు.

ఇక మంత్రాలతో పాటు చిత్రాలు, గుర్తులు కూడా దేవతారాధనలో పాలుపంచుకున్నాయి. స్పైరల్ లు, నాటు గీతలు త్రిస్కలియన్, కెల్టిక్ నాట్స్, సూర్యుడి గుర్తులు ఎక్కువగా మనకు కనిపిస్తాయి. డ్రూయిడ్లు, కెల్టిక్ యాజకులు ఓఘం లిపిని వాడేవారు. దేవాలయాలలోని శిల్పాలు, పద్మాకార నమూనాల్లో దేవతల కథలను చిత్రించేవారు. ఆయా చిత్రాలను చూపిస్తూ.. బార్డులు పురాణ గాథలను తన గేయాల ద్వారా వివరించేవాడు. స్కాట్లాండ్ వంటి ప్రాంతాల్లో కల్చరల్ కార్యక్రమాల్లో అక్కడక్కడా ఈ సంప్రదాయం మనకు కనిపిస్తుంది. జెర్మనిక్ మతం ఉత్తర ఐరోపాలో క్రైస్తవం కన్ను పడకముందు కొనసాగింది. ఒడిన్, థోర్, ప్రేయా వంటి దేవతలను అప్పటి ప్రజలు పూజించేవారు. ఈ పూజలన్నీ అధికంగా పర్వత ప్రాంతాల్లో, అడవుల్లో జరిగేవి. స్కాండినేవియన్ దేశాల్లో నోర్సు (NORSE) అనే మతాన్ని అవలంబించిన ప్రజలు గ్ర్యాసిల్ అనే చెట్టు ఆధారంగా ఈ సమస్త విశ్వం నిర్మింపబడిందని విశ్వసించేవారు. దేవతలకు కూడా మానవ లక్షణాలున్నాయనేది వీరి నమ్మకం. తూర్పు ఐరోపాలో స్లావిక్ మతం విస్తరించి ఉండేది. వీరు పెరున్, వెలెస్, మోకోష్ అనే దేవతలను ఆరాధించేవారు. నదులు, అరణ్యాల దగ్గర పూజలు, జన్మ మరణ ఉత్సవాలు, గ్రామ దేవతల ఆరాధన ఈ మతంలో ప్రధానంగా ఉండేది. లిథువేనియా, లాట్వియా లాంటి ప్రాంతాల్లో బాల్టిక్ మతం విస్తరించింది. వీరు ప్రకృతిని ప్రధానంగా ఆరాధించేవారు. ఆత్మలకు పండుగ చేయడం, అగ్నిని ఆరాధించడం, చెట్లను ఆరాధించడం ఈ మతంలోని ప్రధాన సంప్రదాయాల్లో ఒకటని చెప్పవచ్చు. ఇలా చాలా మతాలు ఇక్కడ విస్తరించాయి. ఈ నాగరికతలన్నింటికీ క్రైస్తవం చెక్ పెట్టేసింది. ఇవన్నీ ఇప్పుడు లుప్తమయ్యాయి. కొండకొచో ఉంటే.. కొన్ని ఇండ్లలో ఉండవచ్చేమో. మారుమూల ప్రాంతాల్లో వేళ్ల మీద లెక్కించదగిన మంది మాత్రం మిగిలి ఉండవచ్చేమో. ఈ కింది పట్టికలో ఐరోపాలోని వివిధ నాగరికతలు.. వారి దేవతల వివరాలను మనం చదువవచ్చు.

నాగరికత ప్రధాన దేవతలు ప్రాతినిధ్యం
గ్రీకు యూదు, హెరా, ఏథెనా, అపోలో వజ్రం, వివాహం, జ్ఞానం, సంగీతం
రోమన్ జూపిటర్, జునో, డయానా, మార్స్ వజ్రం, వివాహం, వేట, యుద్ధం
కెల్టిక్ డగ్డా, బ్రిడ్జిడ్, లుక్ ఋతువులు, విద్య, సౌందర్యం
గెర్మానిక్ ఒడిన్, థోర్, ఫ్రేయా జ్ఞానం, యుద్ధం, ప్రేమ
నార్సు ఒడిన్, థోర్, లోకి, ఫ్రేయా దేవతా నేత, ఉరుము, మాయ, ప్రేమ
స్లావిక్ పెరున్, వెలెస్, మోకోష్ ఉరిమాడుడు, ధనసంపత్తి, స్త్రీ శక్తి
బాల్టిక్ డైవాస్, లాయమా, ప్యౌర్న్ సూర్యుడు, రాతలు లేదా చదువు, మేఘం

ఇక ఆస్ట్రేలియా విషయానికి వస్తే.. క్రైస్తవం రావడానికి ముందు ఆస్ట్రేలియాలో ప్రధాన తెగ అబోరిజిన్లు. వారిది దయ్యాల మతంగా ముద్ర వేసి క్రైస్తవం దాన్ని చింపేయడానికి పూనుకుంది. గత వందేళ్లుగా దాని పునరుజ్జీవన ఉద్యం కొనసాగుతున్నది. అబోరిజన్లది మతం అనడానికి వీలు లేదు. హిందుత్వం మతం కాదు. అదొక జీవన విధానం. అబోరిజన్లది కూడా ఒక జీవన విధానమే. ప్రకృతి ఈ జీవన విధానాన్ని సృష్టించిందా అనిపిస్తుంది. మానవ జాతికి విలువైన ఆధ్యాత్మిక మార్గం చూపినవారు అబోరిజన్లు. భారతీయత మాదిరిగానే పూర్తిగా ప్రకృతితో మమేకం అయ్యారు కాబట్టే, వారి దేవతల రూపం ప్రకృతి మూలాలతోనే సమ్మిళితమై ఉంటాయి. మన దగ్గర ఉన్నట్టుగానే అక్కడ కూడా ఇంద్రుడు, సరస్వతి, సూర్యుడు, వరుణుడు, దిక్పాలకులు, మన్మథుడు లాంటి దేవతలు వేరే పేర్లతో కొలువబడ్డారు. కాకపోతే అక్కడి తెగలను అనుసరించి పేర్లు కొంత మారవచ్చు. దేవతలు అనేవి ప్రత్యేకంగా ఒక ఆకారం లేదా లింగంగా కాక, ప్రకృతి మూలాలతో మిళితమై ఉంటాయి. వివిధ తెగల ప్రకారం పేర్లు మారుతూ ఉంటాయి. మరణించిన వారిని పితృదేవతలుగా పరిగణించి వారిని దైవత్వాన్ని ఆపాదించి కొలిచే సంప్రదాయం ఇక్కడ మనకు కనిపిస్తుంది. ప్రకృతి, భూమి, పూర్వికులు ఆధారంగా ఈ మతం మనుగడ సాగించింది. దేవతలు ఈ సృష్టిని నిర్మించారని, భూమి మీదకు వచ్చి కొండలు, నదులు, అడవులు, జాతులను సృష్టించి వారికి జీవన విధానాన్ని చూపించి వెళ్లారని నమ్మేవారు. కథలు, పాటలు, బొమ్మల ద్వారా దేవతల కథలు చెప్పేవారు. ప్రతి తెగకు కొన్ని భూభాగాలు, కొండలు, అడవులు, నదులు పవిత్రమైనవిగా ఉంటాయి. ఆస్ట్రేలియాలోని ఉలురు అనే కొండ కొన్ని తెగలకు పవిత్రమైనది. పితృదేవతలకు చిత్రాలు వేసి వారిని పూజించటం మనలాగే వారికీ సంప్రదాయమే.

దేవత / శక్తి పేరు వివరాలు ప్రదేశం / తెగ
బైమే (Baiame) సృష్టికర్త దేవుడు, న్యాయాన్ని స్థాపించిన శక్తి న్యూ సౌత్ వేల్స్ (NSW)
రెయిన్ బో సర్పెంట్ (Rainbow Serpent) జలవనరుల దేవత, సృష్టి సమయంలో భూమిని రూపొందించిన నాగదేవత వివిధ తెగలు – దేశవ్యాప్తంగా
వేజిల్ (Wagyl) పర్వతాలు, నదుల సృష్టికర్త సర్పపు దేవత నూంగార్ తెగ (పశ్చిమ ఆస్ట్రేలియా)
దారాములుమ్ (Daramulum) బైమే కుమారుడు, చంద్రుడు కమ్మిలారాయ్ తెగ
తిద్దాలిక్ (Tiddalik) నీరు లాగేసిన ధన్య రాణా జంతువు, జల వనరుల మూల కథ తూర్పు తెగలు
బంజిల్ (Bunjil) గాలుల దేవుడు, సృష్టికర్త, గద్ద విక్టోరియా ప్రాంతం (Kulin Nation)
నర్గున్ (Nargun) మాయ, అద్భుత శక్తుల దేవత గిప్స్‌లాండ్ తెగలు (విక్టోరియా)
మిమి స్పిరిట్స్ (Mimi Spirits) క్షుద్ర దేవతలు, గుహల్లో నివసిస్తూ కళల్ని నేర్పిన శక్తులు అర్నెహెమ్ ల్యాండ్ (ఉత్తర ఆస్ట్రేలియా)

ఇక చివరగా చైనా దగ్గరకు వద్దాం. ప్రపంచ నాగరికతల్లో మరో పురాతనమైన నాగరికతగా చెప్పుకోదగింది. చైనా మతాలలో బహు దేవతారాధన, పితృ దేవతారాధన ప్రధానంగా కనిపిస్తున్నది. ఈ దేవతలు చిత్ర, విచిత్రమైన రూపాలు.. స్వరూపాల్లో కూడా భిన్నమై ఉంటారు. కొందరు ఉగ్రరూపంలో ఉంటే, మరికొందరు శాంత స్వభావులుగా ఉంటారు. వీరికి సంప్రదాయ వస్త్రధారణ చేసేవారు. వీరి చేతుల్లో ఆయుధాలు, ప్రతీకలు ఉంటాయి. కొందరు దేవతలు ప్రకృతికి ప్రాతినిధ్యం వహిస్తే.. మరికొందరు మానవులుగా జన్మించి దైవత్వాన్ని పొందిన వారు. మన రామకృష్ణుల మాదిరిగానే. జానపదుల్లో పితృదేవతల ఆరాధన, దేవతల పవర్‌ను బట్టి.. దాని స్థాయిని అంచనా వేసుకొని ఆ మేరకు దేవాలయాలను నిర్మించడం, ప్రకృతి, నీటిని పూజించడం సంప్రదాయాలుగా ఉండేవి ఈ జానపదుల మతంనుంచే ఫెంగ్ షుయి, యిన్ యాంగ్ సిద్ధాంతాలు వెలుగు చూశాయి. అదే టావిజం దగ్గరకు వచ్చేసరికి అమరులైన వారు దేవతలుగా కొలువబడ్డారు. మన దేశంలో సమ్మక్క సారలమ్మ, పైడితల్లి లాంటి వారు దేవతలుగా అయినట్లే ఇక్కడ కూడా అయినారు. నక్షత్ర దేవతల ఆరాధన వీరు చేశారు. ఔషధ గుణాలున్న పదార్థాలను పూజించే ఆచారం ఉన్నది. ఒక కన్ ఫ్యూషియనిజం దగ్గరకు వచ్చేసరికి సమాజమే ఒక దేవత. పితృదేవతలను పూజించటం, స్వర్గానికి నివేదనలు సమర్పించుకోవడం వంటివి జరిగాయి. అగర్బత్తీలు వెలిగించడం, నగదు సమర్పించుకోవడం, సంగీతం, పాటలు దేవతలకు వినిపించడం, దావోయిస్ట్ దేవాలయాల్లో మెడిటేషన్, హవనాలు నిర్వహించడం, శాంతి పఠనాలు చేయడం వంటివి పూజా విధానాలుగా ఇక్కడ కొనసాగాయి.

దేవత / శక్తి పేరు శ్రేణి స్వరూపం / స్వభావం మతం / విశ్వాసం
యుది (Yu Di) / జేడె ఎమ్పెరర్ పరమేశ్వరుడు దేవతల అధిపతి, ఆకాశాధిపతి జానపద మతం, టావిజం
సాన్ క్వింగ్ (Three Pure Ones) తావు తత్త్వాదులు ప్రపంచాన్ని సృష్టించిన తావు మూలశక్తుల ప్రతీకలు టావిజం
గుయాన్ యిన్ (Guanyin) కరుణామయీ మాతృత్వాన్ని, కరుణను సూచించే దేవి బౌద్ధం, జానపద మతం
ఝావ్ షెన్ (Zhao Shen) ఇంటి దేవత వంటింటి దేవుడు – కుటుంబ రక్షకుడు జానపద మతం
తు డి గోంగ్ (Tu Di Gong) గ్రామ దేవత భూమి దేవుడు – వ్యవసాయ, ప్రాంతీయ దేవత జానపద మతం
చెంగ్ హువాంగ్ (Cheng Huang) పట్టణ దేవత పట్టణాన్ని కాపాడే దేవుడు జానపద మతం
సెం నోంగ్ (Shennong) ఔషధ దేవుడు పంటల, ఔషధాల మూల దైవం పురాతన చైనా నాగరికత
గుం గంగ్ (Gong Gong) నీటి దేవుడు ఉగ్ర స్వరూపం, వరదలతో సంబంధం పురాణ మతాలు
హౌ యి (Hou Yi) అగ్ని / బాణ యోధుడు సూర్యులను తక్కువ చేయించి మానవాళిని రక్షించిన ధీరుడు పురాణ చరిత్ర, మత గాథలు
పాన్ గు (Pangu) సృష్టికర్త పురుషుడు విశ్వాన్ని విప్పిన మొదటి దేవత పురాతన చైనా మిథాలజీ

ఇక భారత దేశానికి వద్దాం.. ఇక్కడ గోండులు, సంతాళ్, ఖోండి, కురుఖ్, మొండా, జుయాంగ్, హో, బిర్జియా వంటి తెగల దేవుళ్లు శిలువ ఎక్కేశారు. మధ్య భారతంలో గోండులు చాలామంది క్రైస్తవంలోకి మారిపోయారు. వీరి దేవతలు ఫల్స్ పెన్, భీమాపెన్, ఆనామదేవి. ప్రకృతికి, పితృ దేవతలకు అవినాభావ సంబంధం ఉన్నదని గట్టిగా నమ్మేవారు వీరు. ఇక ఒడిశాలోని ఖోండ మతానికి చెందిన దేవతలు టారేని పెన్ (అమ్మ) బిసమ్మ, మలంగా.. ఇప్పుడు చాలా చోట్ల టారేని ఆరాధన నిషేధించారు. ఇక సంథాల్ లు చాలా మంది క్రైస్తవంలోకి మారారు. వీరి దేవతలు మారంగ బురు, జాహెర ఆయో.. శివుడు పార్వతి తరహా దేవతలు వీరు. చెట్టు, శిలా రూపాల్లో పూజించేవారు. ఇక బీహార్, జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్ గఢ్ లలో బిర్జియా, హో, మొండా తెగలు ఉండేవి. ఇప్పుడు క్రైస్తవం వల్ల పూర్తిగా దెబ్బ తిన్నాయి. వీరి దేవతలు సింగబోంగా (ఈ దేవుడు ఆకాశానికి రాజు), అజోనా, నేటా అనే వారు ఉన్నారు. వీళ్లు సూర్యుడి రూపంలో పరమేశ్వరుని పూజించేవారు. ఇక ఈశాన్య భారతంలో ప్రధానంగా నాగా, మిజో, ఖాసీ తెగల వారు తంగఖుల్, హావీగన్, కాసీఉతిరోత్ అనే దేవతలను కొలిచేవారు. ఇప్పుడు 90 శాతం మంది క్రైస్తవంలోకి మారడంతో ఈ దేవుళ్లకూ పూజలు అందట్లేదు.

భారతదేశంలో కనుమరుగయిన, అవుతున్న దేవీ దేవతలు.. వివరాలు

మతం / తెగ పేరు దేవత పేరు స్వరూపం / స్వభావం ప్రస్తుత స్థితి
గోండ్ ఫల్స్పెన్ సృష్టికర్త, రక్షకుడు పూజలు తగ్గుముఖం పట్టినవి
గోండ్ ఆనామ దేవి తల్లి, భూమి కొన్ని గ్రామాల్లో మాత్రమే జీవించి ఉంది
ఖోండ్ టారేని పెన్ శక్తి, ప్రకృతి నిషేధం కారణంగా చరిత్రతో కలిసిపోయింది
సంథాల్ మారంగ్ బురూ ఆకాశ దేవుడు, శుద్ధ తత్వం పునరుజ్జీవన ఉద్యమం మొదలైంది
సంథాల్ జాహెర ఆయో వన దేవత, మాతృ తత్వం సమాజ పునరుద్ధరణలో భాగస్వామి
ముండా, హో సింగ్ బోంగ్ సూర్యుని ప్రతీక, పరమశక్తి కొన్ని ప్రాంతాల్లో కొనసాగుతోంది
నాగాలాండ్ తెగలు హావీగన్, అప్ఫీ యుద్ధ దేవతలు, పితృ తత్వాలు పూర్తిగా క్రైస్తవీకరణ జరిగిన సమాజం

ఇలా చెప్పుకుంటూ పోతే.. ఎందరు దేవుళ్లు.. ఎన్ని ఆరాధనా పద్ధతులు.. ఆశ్చర్యమేస్తుంది. ఏ నాగరికతను తీసుకున్నా సరే.. అనేక ఉన్నతమైన ఆధ్యాత్మిక భావనా సంపత్తి మనకు దర్శనమిస్తుంది. ప్రకృతి స్వరూపంలో అమ్మవారు అన్ని నాగరికతల్లో సాక్షాత్కరించి ఈ విశ్వాన్ని సుసంపన్నం చేశారు. మన పురాణాలన్నింటిని పుక్కిటి పురాణాలనే వారికి ఈ దేవీ దేవతల గురించి ఒకసారి తెలుసుకుంటే కనువిప్పు కలుగుతుందేమో తెలియదు. ఈ దేవతలు అందరూ కూడా మనుషులతో మంచి సంబంధాలు కలిగి ఉన్నారనే విశ్వాసం ప్రతి నాగరికతలోనూ ఉన్నది. చివరకు ఏసుక్రీస్తు పెయింటింగ్ లలో కూడా రెక్కలు కట్టుకొని దేవతలు దిగివచ్చినట్టు మనకు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఆఫ్రికాలోని ఘనా లో ఉన్నట్టుగానే భూమి తల్లి.. ఆకాశం దేవుడు అనే భావన, గౌరవం అన్ని నాగరికతల్లోనూ ఒకే మనకు స్పష్టంగానే కనిపిస్తుంది.

ఏపున మంటినుండి యుదయించిన జానకి, మింటినుండి ఆ
వాపముగన్న రాఘవుడు వచ్చి ఋగధ్వజములందు నుండి ద్యా
వాపృథువుల్ సమాహరణ భావము పొందిన రీతి సంగమ
వాపృతి పండు వెన్నెల మయంబుగ జేసెద రాత్మరోదసిన్
(రామాయణ కల్పవృక్షము, కల్యాణ ఖండము)

రాముడు ఆకాశం నుంచి దిగి వచ్చిన చైతన్యం అయితే.. సీత భూమి నుంచి ఉదయించిన మహాశక్తి. ఇదే భావన, ఇదే చైతన్యం విశ్వంలోని అన్ని నాగరికతల్లోనూ ఉన్నది. ఈ మహా చైతన్యాన్ని, అద్భుత భావనను క్రైస్తవం సర్వ నాశనం చేసింది. ఇంతమంది దేవీదేవతలను శిలువమీదకు ఎక్కించింది. ఒక్క భారత్‌లో రెండు వందల ఏండ్లు పాగా వేసినాసరే.. అరకొర తప్ప అంగుళం కూడా భారతీయతను కదిలించలేకపోయింది.

(ఇంకా ఉంది)

Exit mobile version