Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మిషన్, ఇండియా దట్ ఈజ్ భారత్-17

[శ్రీ కోవెల సంతోష్ కుమార్ రచించిన ‘మిషన్, ఇండియా దట్ ఈజ్ భారత్’ అనే వ్యాస పరంపరని అందిస్తున్నాము.]

చాప్టర్ 18.

మిషనరీలు, కమ్యూనిస్టులు పోటీలు పడి నాశనం చేసిన గొప్ప నాగరికతల్లో చైనా నాగరికత ముఖ్యమైనది. పాత రాతి యుగం నాటి ఈ నాగరికత మనకు లభిస్తున్న చరిత్ర ప్రకారమే కనీసం ఆరువేల సంవత్సరాలకు పూర్వానిది. దాదాపు ఐదు రాజవంశాలు చైనాను సుదీర్ఘంగా పరిపాలించాయి. ఇది ఎంత గొప్ప నాగరికత అంటే.. దాదాపు మూడు వేల సంవత్సరాలకు పూర్వమే.. చైనా ప్రజలు అయస్కాంతంతో దిక్సూచిని తయారుచేశారు. భవిష్యత్తును అంచనా వేయడానికి దీన్ని ఉపయోగించారు. 2200 సంవత్సరాల క్రితం పొడవైన చైనా వాల్ నిర్మాణం జరిగింది. క్రీస్తు పూర్వం ఏడవ శతాబ్దంలో అప్పటి రాజు క్విన్ షి హువాంగ్ 5 వేల కిలోమీటర్ల గోడను నిర్మించాడు. ఆ తరువాత హాన్ వంశీయులు ఏకంగా పదివేల కిలోమీటర్లు ఈ గోడను పెంచారు. తరువాత వచ్చిన మింగ్ రాజవంశం మరో 8,800 కిలోమీటర్లు పెంచింది. క్రైస్తవం పుట్టడానికి ముందే చైనాలో కాగితం వాడకం మొదలైంది. మన దేశంలో మాదిరిగానే ప్రాచీన చైనా కూడా ఇప్పటిలాగా ఒకటిగా ఉన్న దేశం కాదు. మనకు అందుతున్న సమాచారం ప్రకారం దాదాపు 8 వేల సంవత్సరాలకు ముందు చిన్న సమూహాలుగా.. తరువాత చిన్న చిన్న దేశాలుగా, ఆ తరువాత మహా సామ్రాజ్యంగా ఎదిగివచ్చింది చైనా. 1912 నుంచి ఆధునిక చైనా యుగం మొదలైంది. ప్రాచీన చైనా చరిత్రను చదువుతుంటే.. ఒళ్లు గగుర్పొడుస్తుంది. చైనా నాగరికత ఒక నిరంతర ప్రవాహంగా వేల సంవత్సరాలు సాగుతూ వచ్చింది. తత్త్వ చింతన, కళలు, శాస్త్రాలతో నిరంతర అభివృద్ధి చెందిన నాగరికత ఇది. ప్రపంచంలోని అనేక నాగరికతలు క్షీణించినప్పటికీ.. చైనా మాత్రం తన సంప్రదాయ మూలాలను, విలువలను పోగొట్టుకోకుండా నిలువగలిగింది. షియా, షాంగ్, ఝౌ, మింగ్, చింగ్, హాన్ వంటి రాజవంశాలు చైనాను ముందుకు నడిపించాయి. లావోజీ, కన్ఫ్యూషియస్ వంటి తత్త్వవేత్తల చింతనలు చైనాలోని సామాజిక, రాజకీయ నిర్మాణాలకు పునాది అయ్యాయి. బౌద్ధం కూడా చైనా నాగరికత పురోగతిలో తనవంతు పాత్ర పోషించింది. కాలిగ్రఫీ, మట్టి పాత్రలు, చిత్రలేఖనం, శిల్పకళ, సంగీతం వంటివన్నీ కూడా చైనా జనజీవన స్రవంతిలో విడదీయరాని బంధంగా నిలిచాయి. చిత్రలిపి చైనీస్ భాషకు ప్రత్యేకమైంది. చైనా నాగరికత కేవలం ఆ దేశానికే పరిమితం కాలేదు. సిల్క్ రూట్ ద్వారా మధ్య ఆసియా, ఐరోపా, ఆఫ్రికా వరకూ చైనా పట్టు, కాగితం, దిక్సూచి వంటివి వాణిజ్యరంగంలో కీలక పాత్ర పోషించాయి. వాణిజ్యంతో పాటు చైనా కళలు, సంప్రదాయాలు, ముఖ్యంగా కన్ఫ్యూషియస్ తాత్త్విక చింతన పశ్చిమాసియా, ఐరోపా పునర్జీవన ఉద్యమాలలో ముఖ్యభూమిక పోషించాయి.

ఇంత గొప్ప నాగరికత, సంస్కృతిని మూలాలతో సహా పెకలించలేక పోయినప్పటికీ.. ధ్వంసం చేయడంలో ఒక వైపు నుంచి మిషనరీలు.. మరో వైపు నుంచి కమ్యూనిస్టులు ముఖ్యపాత్ర పోషించారు. ఏ సిల్క్ రూట్ ద్వారా అంతర్జాతీయ వాణిజ్యం చేసి చైనా దేశం ప్రపంచాన్ని ప్రభావితం చేసిందో.. ఆ సిల్క్ రూటే.. చైనా నాగరికత ధ్వంసానికి కారణమైంది. 16, 17వ శతాబ్దంలో యురోపియన్ వలసదారులు, మిషనరీలు జెసూట్ మిషనరీలు సిల్క్ రూట్‌లో చైనా లోకి ప్రవేశించారు.

అయితే చైనాలో క్రైస్తవం క్రీస్తు శకం 635లో టాంగ్ రాజుల కాలంలోనే ప్రవేశించింది. పర్షియా నుంచి వచ్చిన అలోపెన్ (alopen) అనే మిషనరీ చైనాలో తొలిసారిగా క్రైస్తవానికి బీజం వేశారు. తరువాత 781సంవత్సరంలో నెస్టోరియన్ స్టెలే అని రాతి శాసనంపై క్రైస్తవాన్ని జింగ్జియావో (వెలుగులీనే మతం) అని పేర్కొన్నది.

మిగతా దేశాల్లో చేసిన మాదిరిగానే చైనాలోకూడా ప్రవేశించగానే మిషనరీలు రాజ్యాధికారులను టార్గెట్ చేసుకున్నాయి. వాళ్లతో మతపరమైన చర్చలు మొదలు పెట్టాయి. అంతకుముందున్న సంప్రదాయాలు, సంస్కృతి అంతా కూడా ఆధునికతకు, అభివృద్ధికి ఆటంకమంటూ ఉసిగొల్పడం మొదలుపెట్టారు. 1552 మధ్యన 1610లో మేటియో రిక్కి అనే ప్రవర్తకుడు చైనాలో అక్కడి స్థానిక తత్త్వవేత్తలను, ఆచార్యులను తీవ్రంగా ప్రభావితం చేశారు. 17వ శతాబ్దం చివరలో క్వింగ్ రాజవంశం హయాంలో మిషనరీలు పెద్ద ఎత్తున చొరబడ్డారు. 1807లో రాబర్ట్ మోరిసిన్ చైనాకు వచ్చిన మొదటి ప్రొటెస్టెంట్. బైబిల్ ను చైనా భాషలోకి అనువదించాడు. అక్కడి నుంచి మిషనరీలు పావులు కదపడం మొదలుపెట్టారు. స్థానిక భాష, సాహిత్యాన్ని, తాత్త్విక ఆలోచనలను వారి పరిభాషలో ‘పాపం’ అని ముద్ర వేశారు. విద్యావిధానాన్ని మార్చేశారు. విద్యార్థులు భయం భయంతో బతకాల్సిన పరిస్థితి నెలకొంది. క్రమంగా విద్యాలయాల్లో బైబిల్ బోధన మొదలైంది. గ్రామాల్లో, నగరాల్లో దేవాలయాలను ధ్వంసం చేయడం మొదలైంది. 19వ శతాబ్దానికి వచ్చేసరికి మిషనరీల ఆధిపత్యం తీవ్రమైంది. బలవంతంగా క్రైస్తవ మతంలోకి మార్చడం మొదలైంది. 1850లో చైనాలో క్రైస్తవ మతాంతరీకరణ ప్రక్రియలో భయంకరమైన రక్తపాతానికి నాంది పడిన సందర్భం. ఈ రక్తపాతానికి పేరు తైపింగ్ అంతర్యుద్ధం(Taiping Rebellion) ఈ అంతర్యుద్ధం యావత్ చైనాను క్రైస్తవీకరించాలని, అప్పడు అధికారంలో ఉన్న క్వింగ్ వంశాన్ని నాశనం చేసి క్రైస్తవ సామ్రాజ్యాన్ని స్థాపించడం కోసం ఈ అంతర్యుద్ధం మొదలైంది. ఈ మారణకాండకు నాయకత్వం వహించిన వాడు హాంగ్ జి యుక్వాన్. ఇతను తనకు తానుగానే యేసుక్రీస్తుకు సోదరుడిని అని ప్రకటించుకున్నాడు. ఈ హాంగ్ జి యుక్వాన్‌కు మిషనరీలు పూర్తి మద్దతునిచ్చాయి. తైపింగ్ అంతర్యుద్ధం మొదలు కావడానికి ముందే మిషనరీలు అతనికి క్రైస్తవ మత గ్రంథాలు, ఇతర సాహిత్యాన్ని పెద్ద ఎత్తున పంపించాయి. మొత్తం ఆందోళనకు ఈ మిషనరీల సాహిత్యమే పునాదిగా మారింది. జర్మనీకి చెందిన ప్రొటెస్టెంట్ మిషనరీ Karl Gützlaff  చైనాలో గ్వాంగ్‌డాంగ్ ప్రాంతంలో 1830లలో బైబిల్ గ్రంథాలను, మత పాంప్లెట్లను విస్తృతంగా పంపిణీ చేశాడు. అమెరికన్ బాప్టిస్ట్ మిషనరీ Issachar J. Roberts కూడా హాంగ్‌కు క్రైస్తవ బోధను కొంతవరకు బోధించాడు. ఆ తరువాతే.. గాడ్ వర్షిప్పింగ్ సొసైటీ అంటూ ఒక సంఘాన్ని స్థాపించి ఉద్యమానికి నాంది పలికాడు. తన ఆదేశం ప్రకారం ప్రజలందరూ క్రైస్తవం తీసుకోవాలని నిర్బంధించారు. క్రైస్తవ మిషనరీలు చైనాలో క్రైస్తవ ధర్మ విస్తరణకు ఈ ఉద్యమం చక్కని అవకాశం కలిగించిందని భావించాయి. చైనాలో మెసయ్య పుట్టాడంటూ ప్రచారం చేసుకుంటూ వెళ్లాయి. హంగ్ జియుక్వాన్ తనదైన ఆచారాలను సృష్టించాడు. బైబిల్‌ను సైతం మార్చేసి తన భావజాలాన్ని చొప్పించాడు. ఈ తైపింగ్ తిరుగుబాటు ఐరోపా దేశాలైన బ్రిటన్, ఫ్రాన్స్ వంటి దేశాలకు తమ వాణిజ్య ప్రయోజనాలు నెరవేర్చుకోవడానికి అవకాశం ఇచ్చింది. మిషనరీలు అటు క్వింగ్ రాజవంశంతో, ఇటు తిరుగుబాటుదారుడైన హంగ్ జియుక్వాన్‌తో కలిసి పనిచేశాయి. బ్రిటిష్ మిషనరీ James Legge తైపింగ్ ఉద్యమానికి తన మద్దతు ప్రకటించాడు. హంగ్ క్రైస్తవాన్ని తన సొంత దృక్పథంతో సొంతంగా ఒక కొత్త మతాన్ని సృష్టించే ప్రయత్నం చేయడంతో మిషనరీలు అతనికి దూరం జరిగి అతని శత్రువైన క్వింగ్‌ను ఆశ్రయించాయి. దాదాపు ఒకటిన్నర దశాబ్దం పాటు మానవ చరిత్రలోనే అత్యంత రక్తపాతం జరిగిన యుద్ధాలలో ఇది ఒకటి దాదాపు 20 నుంచి 30 మిలియన్ల మందిని ఊచకోత కోసారంటేనే ఈ అంతర్యుద్ధం పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. మంచూ అనే ఒక మైనార్టీ జాతిని మొత్తంగా తుడిచిపెట్టేశారు. ఈ ఆందోళనలో మిషనరీలు నేరుగా పాల్గొనకపోయినప్పటికీ.. క్రైస్తవ గుర్తులతోనే ఆందోళన అంతా సాగింది.

ఇక ఇరవయ్యో శతాబ్దానికి వచ్చేసరికి చైనా సంప్రదాయ నాగరికతలో కొద్దో గొప్పో మిగిలిపోయిన మేధో సంపత్తి మిషనరీల వ్యవస్థీకృత వ్యూహం వల్ల మొత్తం కరిగిపోయింది. మిషనరీల బలవంతపు మతప్రచారాలు, ఆలయాల ధ్వంసం, సాహిత్య దహన కాండతో మిషనరీలు చైనాలో సాంస్కృతిక జీవన హత్యాకాండ (cultural genocide) కు పూనుకున్నాయి.

1949 తరువాత కమ్యూనిస్టు పరిపాలనలో చైనా మరో విధ్వంసాన్ని చవిచూడాల్సి వచ్చింది. మావో జెడాంగ్ నాయకత్వంలో చైనాలో గ్రేట్ లీప్ ఫార్వర్డ్ పేరుతో పారిశ్రామిక విప్లవం మొదలైంది. వ్యవసాయం నుంచి పారిశ్రామికీకరణకు ప్రజలందరూ మళ్లాలంటూ చేసిన ప్రయత్నం చైనాను తీవ్ర కరువు కాటకాలకు లోనుచేసింది. చిన్న సన్నకారు రైతులపై ఆధారపడి గ్రామీణ పరిశ్రమలను అభివృద్ధి చేయాలని పూనుకున్నాడు. మావో చెప్పిన లక్ష్యాలను సాధించాల్సిందే అనటంతో అధికారులు స్థానిక రైతుల దగ్గరి నుంచి ఇండ్లల్లో మిగుల్చుకున్న ధాన్యాన్ని కూడా లాక్కుపోయారు. ఇది ఎంత అరాచకంగా జరిగిందంటే. 1959-61 మధ్యన దాదాపు 15 మిలియన్ల నుంచి 55 మిలియన్ల మంది ఈ అన్యాయపు సృష్టించిన కరువుకు మృత్యువాత పడ్డారు. దీనికి వాతావరణం కారణమంటూ మావో తప్పించుకున్నారు. ఆ తరువాత వ్యక్తిగత వ్యవసాయాన్ని నిషేధించాడు. సమీకృత వ్యవసాయాన్ని తీసుకొచ్చి భూములన్నీ లాక్కుని రైతులను కూలీలుగా మార్చారు. ఈ విధానం కూడా వ్యవసాయ ఉత్పత్తిపై ప్రతికూల ప్రభావాన్నే చూపింది. మావో అనుసరించిన ఈ విధానం చైనాలో రైతుల సంప్రదాయ వ్యవసాయ విధానాలను దారుణంగా దెబ్బతీసింది. చైనా విధ్వంసంలో మావో ఈ ఒక్క దానితోనే ఆగలేదు. సాంస్కృతిక విప్లవం పేరుతో ప్రాచీన దేవాలయాలు, శిల్పాలు, కళాకృతులను ధ్వంసం చేశారున. పండితులు, తత్త్వవేత్తలను బానిసలుగా మార్చారు. తత్త్వశాస్త్రాలు, సాహిత్యం, భాష, చరిత్ర అంతా విధ్వంసం అయింది.

ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సిన అంశం ఏమిటంటే, మిషనరీల ఆక్రమణ, కమ్యూనిస్టుల ఆధిపత్యం మధ్యన తేడా. మిషనరీలు ఎక్కువగా సాంస్కృతిక, మేధో విధ్వంసం, క్రైస్తవీకరణపై ఎక్కవగా దృష్టి సారించాయి. కమ్యూనిస్టులు దేశవ్యాప్తంగా కనీవినీ ఎరుగని నరమేధానికి పాల్పడ్డారు. సామూహిక జనహననం, ఆర్థిక, సాంస్కృతిక విధ్వంసం, ప్రజల జీవన విధాన ధ్వంసం అన్నీ కూడా అత్యంత విస్తృత స్థాయిలో జరిగాయి.

ప్రపంచంలో పురాతన నాగరికతల్లో ఒకటిగా భావించే సమాజం ఆస్ట్రేలియా.. ఇవాళ్టికీ ఇంగ్లండ్ చర్చి కబ్జాలో ఉన్న ఏకైక ఖండమిది. బైబిల్ ప్రకారం క్రీస్తు పుట్టడానికి 4,500 సంవత్సరాలకు ముందు అసలు ప్రపంచమే లేదని చెప్తుంది. మార్క్సిస్టు చరిత్రకారులు కూడా గుడ్డిగా దీన్నే నమ్ముతూ ఉంటారు. ఆ 4500 సంవత్సరాల చరిత్ర చట్రంలోనే ప్రపంచ చరిత్రను బిగించుకుంటూ వస్తారు. మన దేశ చరిత్రను కూడా మన దిగ్రేట్ మార్క్సిస్టు చరిత్ర కారులు అదే చట్రంలో బంధించేశారు. ఆస్ట్రేలియాలో ‘అబోరిజినల్’ జాతికి చెందిన ప్రజల చరిత్ర ఎప్పటిదో తెలుసా? ప్రపంచ వ్యాప్తంగా చరిత్రకారులు అంగీకరించిన కాలమే 45 వేల నుంచి 80 వేల సంవత్సరాల మధ్యన అని. అబోరిజన్లు వందలకొద్దీ తెగలు కలిగిన వారు. వందలకొద్దీ భాషలు మాట్లాడేవారు. సొంత చట్టాలు, సంస్కృతులు కలిగిన జాతి ఇది. వ్యవసాయం, భూమి మీద ఆధారపడి జీవించినవారు. 18వ శతాబ్దంలో ఇంకా కచ్చితంగా చెప్పాలంటే 1788 లో బ్రిటన్ సామ్రాజ్యవాదం ఆస్ట్రేలియాలోకి చొరబడింది. 1788 నుంచి 1930 దాకా ఆస్ట్రేలియాలో అబోరిజన్ల మీద జరిగిన మారణ కాండను అక్షరాల్లో వర్ణించడం అసాధ్యమైన పని. 1788 లో బ్రిటిష్ సెటిలర్లతో పాటే క్రైస్తవ మిషనరీలు కూడా ఆస్ట్రేలియాలోకి ప్రవేశించాయి. ప్రపంచ క్రైస్తవీకరణలో పాలకులు, సైన్యం, మిషనరీల పాత్రలను విడివిడిగా చేసి చూడలేము.. ఇవన్నీ ప్రత్యక్షంగా, పరోక్షంగా పూర్తి సమన్వయంతో పనిచేసుకుంటూ వచ్చాయి.  కొన్ని ఉదాహరణలు చూద్దాం. 1838 జూన్ పదిన న్యూ సౌత్ వేల్స్ లోని మైఆల్ క్రీక్ దగ్గర కనీసం 28 మంది మహిళలను, పిల్లలను, వృద్ధులను క్రైస్తవులు దారుణంగా హత్య చేశారు. ఆ తరువాత వరుసగా ఊచకోతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ఊచకోతల గురించిన పరిశోధన న్యూకాజిల్ యూనివర్సిటీ స్కాలర్లు నిర్వహించారు. లిండాల్ రేన్ నాయకత్వంలోని స్కాలర్ల పరిశోధనలో 140 సంవత్సరాల కాలంలో ఆస్ట్రేలియాలో బ్రిటిష్ వలసపాలకులు మిషనరీలు కలిసి ఊచకోతలు జరిపిన సుమారు 500 ప్రదేశాలను గుర్తించారు. ఈ 500 ప్రాంతాలలో దాదాపు 311 తీవ్రమైన హింసాత్మక ఘటనలు జరిగినట్టు తేలింది. ఒక్క క్వీన్‌లాండ్స్ లోనే దాదాపు 65 వేల మంది ఆదివాసీ ప్రజలను చంపారని అంచనా వేశారు. టోరెస్ స్ట్రెయిట్ ద్వీపవాసులను సమూలంగా అంతం చేశారు. అబోరిజన్ల సంస్కృతిని నాశనం చేయడం కోసం మిషనరీలు చాలా పకడ్బందీగా వ్యవహరించారు. టోరెస్, స్ట్రెయిట్ ద్వీపాలలోని చిన్న పిల్లలను బలవంతంగా వారి కుటుంబాల నుంచి వేరు చేసి క్రైస్తవంలోకి మార్చేశారు. ఆదివాసీల జనాభా లక్ష కంటే తక్కువ స్థాయికి పడిపోయిందంటేనే ఈ మారణ కాండ ఏ స్థాయిలో జరిగిందో ఊహించుకోవచ్చు. 2010 నాటికి ఆస్ట్రేలియాలో ఒరిజినల్ అంటే లోకల్ ఆస్ట్రేలియన్ల జనాభా కేవలం అంటే కేవలం 5.63 లక్షలు మాత్రమే.

1820-32 మధ్యన బ్రిటిష్ వలసపాలకులు, ఆదివాసీలకు మధ్యన టాస్మానియాలో జరిగిన గెరిల్లా యుద్ధంలో దాదాపు వెయ్యి మంది అబోరిజన్లు చనిపోయారు. 200 మంది బ్రిటిషర్లు చనిపోయారు. ఈ ఘటనను బ్లాక్ వార్‌గా పిలుస్తారు. ఈ యుద్ధం ద్వారా టాస్మానియా నుంచి ఒక్క అబోరిజన్ కూడా లేకుండా చేయడంలో క్రైస్తవ పాలకులు సక్సెస్ అయ్యారు. ఆదివాసీలను, అబోరిజన్లను శత్రువులుగా పరిగణించారు. ఏడాదికి పదివేల మంది చొప్పున హతమార్చినట్టు లెక్కలు చెప్తున్నాయి. 1823 నుంచి దాదాపు పదేండ్ల పాటు ఈ ఊచకోత కొనసాగింది.

1926లో పశ్చిమ ఆస్ట్రేలియాలోని కింబర్లే ప్రాంతంలో ఒక పశువుల కాపరి హత్యను అడ్డం పెట్టుకుని అబోరిజన్ల ఊచకోతకు మిషనరీ పాలకులు పాల్పడ్డారు. పోలీసు విచారణ పేరుతో 16 మంది అబోరిజన్లను చంపారు. తరువాత 1927 లో రాయల్ కమిషన్ పేరుతో విచారణ జరిపించి 11 మందిని హతమార్చారు. అలా మొదలైన ఊచకోత వందలు వేల సంఖ్యలో ఆదివాసీలను చంపేసి వివిధ ప్రదేశాలలో దహనం చేశారు. 1926 మే 18న దుర్రాగీ పర్వత సమయంలో పండుగ చేసుకుంటున్న 300 మంది ఆదివాసీలపై తుపాకులతో దాడి చేసి దారుణంగా హతమార్చారు. మహిళలను, పిల్లలను కొండపైకి తీసుకెళ్లి కిందకు తోసేశారు. ఈ ఊచకోతను ఫారెస్ట్ రివర్ ఊచకోతగా పిలుస్తారు. 1926 జూన్ 6 న ఫారెస్ట్ రివర్ ఎగువ ప్రాంతంలోని ఓడ్గిల్ ప్రాంతంలో గస్తీకి వెళ్లిన పోలీసు బృందాలు 4గురు మగవాళ్లు, ముగ్గురు స్త్రీలను ఖైదీలుగా పట్టుకొని వారిని చంపేసి.. మట్టి పొయ్యిలు ఏర్పాటు చేసి కాల్చి పారేశారు. తరువాత మిగిలిన బూడిద, ఎముకలను నదిలో పారేశారు. 1968 లో డాక్టర్ నెవిల్ గ్రీన్ ఆడియో టేప్ విడుదలైంది. ఇందులో.. ‘They all got together up there and there was a bloody massacre because I think they shot about three hundred [… Aboriginal persons] all in one hit and there was a hell of a row over it. It was all published in the papers and somebody let the cat out of the bag and anyhow the government and the judges in those times they realised what the trouble was and the whole thing was hushed up you see. (Green, Neville (1995). The Forrest River Massacres. Fremantle)

దీని తరువాత ఆస్ట్రేలియాలో నల్ల జాతి నామమాత్రమైపోయింది. పూర్తిగా తెల్లజాతి దేశంగా, ఖండంగా పరివర్తన చెందింది. అప్పటివరకు ఉన్న స్థానిక భాషలు, ఆచారాలు, దేవతా పూజలను అనాగరికం అన్న ముద్ర పడింది. క్రైస్తవ ఆదేశాలు, నిబంధనలు, ఆంక్షలు అమలులోకి వచ్చాయి. ఫారెస్ట్ రివర్, బ్లాక్ రివర్, మైఆల్ క్రీక్ మారణకాండల్లో మిషనరీల సహకారం పూర్తిగా ఉన్నది. అనాథాలయాలు, విద్యాసంస్థల పేరుతో బలవంతంగా అబోరిజన్లలోకి మతాన్ని ఇంజెక్ట్ చేశారు. పాపము నుంచి విముక్తి కల్పిస్తున్నామంటూ.. స్థానిక మతాలను అపమాస్యం చేశారు. బైబిల్ పఠనం తప్ప స్థానిక భాష మాట్లాడటం కూడా పాపమైపోయింది. ఫలితంగా అబోరిజన్ల భూములన్నీ క్రైస్తవుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. మతమార్పిడులతో సామాజిక విభేదాలు, అంతర్గత చీలికలు ఏర్పడ్డాయి (ఇప్పుడు మన దేశంలో జరుగుతున్న మాదిరిగానే). స్థానిక జనాభా వేళ్ల మీద లెక్కించదగిన స్థాయికి పడిపోయింది. 21వ శతాబ్దానికి వచ్చిన తరువాత.. స్థానికులందరినీ నామమాత్రం చేశాక.. ఇప్పుడు చర్చి సంస్థలు అధికారికంగా క్షమాపణలు చెప్తున్నాయి. వాటికన్ నుంచి పోప్‌లు వరుసగా చర్చి చేసిన అకృత్యాలకు అటు లాటిన్ అమెరికన్లకు, ఇటు ఆస్ట్రేలియన్లకు కూడా క్షమాపణలు చెప్తున్నారు. తమ మిషనరీలు సాంస్కృతిక హింసకు పాల్పడినట్టు అంగీకరిస్తున్నారు. అంతా నాశనం చేసిన తరువాత ఇప్పుడు ఎన్ని క్షమాపణలు చెప్తే మాత్రం ఏమి ప్రయోజనం?

(ఇంకా ఉంది)

Exit mobile version