Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మిషన్, ఇండియా దట్ ఈజ్ భారత్-18

[శ్రీ కోవెల సంతోష్ కుమార్ రచించిన ‘మిషన్, ఇండియా దట్ ఈజ్ భారత్’ అనే వ్యాస పరంపరని అందిస్తున్నాము.]

చాప్టర్ 19.

ఇస్లాం, క్రైస్తవ మతాల నుంచి వెయ్యేండ్ల పాటు మారణహోమం నిరంతరాయంగా సాగుతున్నప్పటికీ తట్టుకొని నిలబడింది భారతీయ ధర్మమే కావడం నిస్సందేహంగా అద్భుతమే. కాకపోతే మన విధ్వంసక రచయితలు మాత్రం వీటిని అంగీకరించరు. మన నాగరికతను, చరిత్రను నిరూపించే అనేక గ్రంథాలు కనిపిస్తుంటాయి. ఆనవాళ్లూ లభిస్తుంటాయి.. వాటిని వెతికే దారులూ లభిస్తుంటాయి. అయినా సరే.. ‘నథింగ్ డూయింగ్, మేం ఒప్పుకోం. మీకు ఏమీ లేదు. వాడెవడో వచ్చి మీకు మెతుకు ఉడికించడం నేర్పాడ’ని చెప్పిందే చెప్తుంటారు. మీ దేవుళ్లు డూప్లికేట్ అంటారు.. నకిలీలు అంటారు.. మూఢ నమ్మకాలు అంటారు.. ఇవన్నీ కూడా మనం ముందరి వ్యాసాల్లో క్రైస్తవం తన మత విస్తరణ కోసం అనుసరిస్తూ వస్తున్న విధానమే.. దాన్నే మన కమ్యూనిస్టులు, మేధావులనబడేవారు తుచ తప్పకుండా పాటిస్తుంటారు. కానీ, భారతీయ నాగరికత కానీ, సంస్కృతి కానీ కేవలం భారత్ కు మాత్రమే పరిమితం కాలేదు. యావత్ప్రపంచంలో మన ఆనవాళ్లు మనకు స్పష్టంగా కనిపిస్తాయి. కృష్ణుడికి ముందు నుంచి కూడా మన సంస్కృతి విశ్వంలోని అనేక నాగరికతలను ప్రభావితం చేసినట్టు స్పష్టంగా తెలుస్తుంది. కానీ, క్రైస్తవానికి ముందు, క్రైస్తవం కారణంగా ధ్వంసమైన నాగరికతలను మనం కొద్దిగా లోతుగా అధ్యయనం చేస్తే ఈ విషయం మనకు అవగతమవుతుంది.

అమెరికాలో అత్యంత వైభవంగా.. భారతీయ నాగరికతతో సమానంగా వెలుగొందిన నాగరికతలను ఒకే ఒక్క పుస్తకాన్ని బూచీగా చూపించి మిషనరీలు సర్వనాశనం చేశాయి. యూనాన్, మాయా, ఇన్‌కా, అజ్టెక్, రోమ్, గ్రీకు వంటి అనేక నాగరికతలు, అద్భుతమైన సంస్కృతులు ఈ మిషనరీల పదఘట్టనల కింద నలిగిపోయాయి. కేవలం కొన్ని వందల సంవత్సరాల స్వల్ప వ్యవధిలోనే అంతకుముందు ఎంతో వైభవంగా ఉన్న నాగరికతలు, జాతులు, అనేక జీవన విధానాలు నామరూపాలు లేకుండా మటుమాయమయ్యాయి. ఒకసారి లాటిన్ అమెరికా దేశాలను గురించి ఆలోచిద్దాం. లాటిన్ అమెరికా దేశాల్లో శతాబ్దాల తరబడి జరిగిన అత్యాచారాలకు సంబంధించి వేర్వేరు ‘పోప్’లు పదే పదే క్షమాపణలు చెప్పుకుంటూ వచ్చారు. మిషనరీలు అత్యాచారాలకు పోప్‌లు క్షమాపణలు చెప్పారు.. లాటిన్ అమెరికా దేశాలకు సంబంధించిందే మాయా సంస్కృతి. ఈ క్రీస్తు పుట్టడానికి సుమారు ఎనిమిది వేల సంవత్సరాలకు పూర్వం నుంచే మాయా నాగరికత అమెరికా ప్రాంతంలో విలసిల్లింది. ఈ క్రైస్తవ మిషనరీల వల్లనే మాయా అంతరించిపోయింది. ఇవాళ లభిస్తున్న మాయా సంస్కృతి అవశేషాలను చూస్తుంటే అది ఎంత సుసంపన్నమైనదీ, అద్భుతమైనదీ, అపూర్వమైనదో అర్థమవుతుంది. అంత గొప్ప సంస్కృతి ఇవాళ శిథిలాలుగా, శకలాలుగా దర్శనమిస్తున్నది. ఈ శిథిలాలను పరిశోధిస్తున్న కొద్దీ వేల సంవత్సరాల నాటి మానవ జీవన నాగరికత వెలుగులు ఒక్కటొక్కటిగా బయటపడుతున్నాయి. మానవ సంస్కృతికి సంబంధించి ఇప్పటికీ తెలియని రహస్యాలు ఏవైనా ఉన్నాయో తెలుసుకోవాలంటే.. మాయా సంస్కృతి ద్వారా తెలుసుకోవచ్చు. మాయన్ క్యాలెండర్ ఇప్పటికీ మనకు అనుభవంలోకి ఉన్న విషయమే కదా. లాటిన్ అమెరికా దేశాలన్నింటినీ కలుపుకొని దాదాపు 8 కోట్ల మంది ప్రజలను అత్యంత దారుణంగా హతమార్చడం జరిగింది. చరిత్రలో చాలా అంశాలు మనకు తెలియకుండానే కాలగర్భంలో కలిసిపోయాయి. ఇందుకు ఉదాహరణ మాయా నాగరికత. అమెరికన్ చరిత్రకారులు, యురోపియన్ చరిత్రకారులు మాయా నాగరికతను నిజంగానే మాయగా మార్చేశారు. వెయ్యేండ్ల క్రితం వరకు చక్కగా ఉన్న నాగరికత ఉన్నట్టుండి ఎట్లా మాయమైపోయిందో మాత్రం ఎవరికీ తెలియదంట. మాయా ప్రజలు ప్రస్తుతం మెక్సికో, గ్వాంటమాలా, బెలిజ్, హోండ్యురాస్, ఎల్ సాల్వడార్ (వీటన్నింటిని కలిపి మెసో అమెరికా అన్నారు) ప్రాంతాల్లో నివసించారు. 1500 బీసీ నుంచి 300 ఏడీ వరకు మాయా నాగరికత అద్భుతంగా విలసిల్లింది. 300 ఏడీ నుంచి 900 ఏడీ మధ్యలో యురోపియన్ మిషనరీలు, కొలంబస్.. చర్చి కారణంగా మాయా అసాధారణంగా అంతమైపోయింది. వ్యవసాయం, పట్టణీకరణ, ప్రకృతి ఆరాధన వంటివి మాత్రమే కాకుండా.. ఖగోళ శాస్త్రంలో అపారమైన మేధను కనపరచిన నాగరిక సమాజం మాయా. భారత కాలమానం మాదిరిగానే మాయా కాలమానం కూడా ఈరోజుకు కూడా కచ్చితమైన విశ్వసనీయమైనదిగా ప్రసిద్ధి చెందింది. మాయా క్యాలెండర్‌లో ప్రధాన పాత్ర పోషించిన కుకుల్కాన్ పిరమిడ్ గురించి ఇంతకు ముందరి వ్యాసాల్లో విస్తారంగానే చర్చించుకున్నాం. భారతీయ సంస్కృతిలో మాదిరిగానే సూర్యుడు మాయా ప్రజలకు కూడా ప్రధాన దైవంగా ఉన్నాడు. మనం సూర్యుడిని ప్రత్యక్ష నారాయణుడిగా కొలుస్తాం. వారూ సూర్యుడిని జీవశక్తికి ప్రతీకగా భావిస్తారు.

మాయా నాగరికత గురించి అధ్యయనం చేయడానికి అత్యంత ప్రామాణిక మైన గ్రంథంగా ఫ్రా డీగో డి లాండా రాసిన “Relación de las cosas de Yucatán” స్పానిష్ గ్రంథాన్ని భావిస్తారు. మాయా నాగరికత ధ్వంసంలో కీలక పాత్ర పోషించిన ఫ్రా డిగో డి లాండా, దాని వైభవాన్ని కూడా రికార్డు చేశాడు. మాయా ప్రజలు తమ పురాతన విషయాలు, శాస్త్రాలను రాయటానికి ప్రత్యేక అక్షరాలు, లేదా లిపులు ఉపయోగించేవారని పేర్కొన్నారు.

“Usaban también esta gente de ciertos caracteres o letras con las cuales escribían en sus libros sus cosas antiguas y sus ciencias…” (అధ్యాయం XL, మాయా లిపి, కోడియెక్స్‌లు గురించి). అంతే కాదు.. ఇక్కడి ప్రజల జీవన శైలిని మేధస్సును కూడా ఈయన చాలా స్పష్టంగా వివరించాడు. మాయా ప్రజలు కనీసం 140 ఏండ్ల దీర్ఘాయుష్షుతో జీవించారని పేర్కొన్నాడు. “Que vivían mucho la gente, y que se ha hallado hombre de ciento cuarenta años.” అధ్యాయం II, జీవన విధానం) మాయా ప్రజలు ఎలాంటి విధి నిషేధాలు లేకుండా మద్యపానం చేసేవారని పేర్కొన్నాడు. “Eran muy disolutos en beber y emborracharse, de lo cual les seguían muchos males.” (అధ్యాయం XXIII).

మాయా ప్రజల పూజా విధానాలు, ఆలయ నిర్మాణాలు, దేవతల గురించి కూడా ఫ్రా డిగో డి లాండా, చాలా వివరంగా పేర్కొన్నాడు. మాయా ప్రజలు నిర్మించుకున్న దేవాలయాలు అందమైన దేవాలయాలని, అత్యంత నియమ నిష్ఠలతో పూజారులు జీవించేవారని పేర్కొన్నాడు. “Tenían templos muy hermosos y ordenados, y sacerdotes que guardaban continencia.” (అధ్యాయం XXXV) దేవతలకు నరబలులు, జంతు బలులు కూడా ఇచ్చేవారన్నాడు. మాయా దేవతలకు రక్తం అంటే ఇష్టం అని తెలిపాడు. “Sacrificaban hombres y niños, creyendo que su sangre era agradable a sus dioses.” (అధ్యాయం XXXIII, మతాచారాలు).

34 వ అధ్యాయంలో మాయా నాగరికతలో ప్రతి దేవతకు ఒక సొంత దేవాలయం ఉండేదని రాశాడు. “A cada dios le tenían su templo, su nombre y sus ritos particulares.” (అధ్యాయం XXXIV).

తొమ్మిదో అధ్యాయంలో లాండా ఏం రాశాడో చూడండి.

“Esta gente es de buen entendimiento, valientes y fuertes, y no menos curiosos que nosotros.” (అధ్యాయం IX). ఈ ప్రజలు తెలివైనవారు, ధైర్యవంతులు, శక్తివంతులు. అంతే కాదు.. మనలాంటి ఆలోచనాపరులు కూడా వారికి అద్భుతమైన జ్ఞాపకశక్తి ఉందని, ఎప్పుడో జరిగిన ఘటనలకు క్రమం తప్పకుండా వివరించే శక్తి కలవారని 34 వ అధ్యాయంలో పేర్కొన్నారు. ఇలాంటి ఆలోచనాపరులను నాశనం చేశారు. మాయా మహిళల గురించి లాండా ఒక అద్భుతమైన మాట తన గ్రంథంలో రాశాడు. “Las mujeres son honestas y guardadas, y no consienten liviandades.” (అధ్యాయం XII). దీని అర్థం.. ‘మహిళలు నిజాయితీగా, సంయమనంతో జీవిస్తారు; అసభ్య ప్రవర్తనకు తావు ఇవ్వరు’. అంతే కాదు మాయా వాస్తు శిల్పాన్ని అద్భుతంగా వర్ణించాడు. “Sus edificios eran de piedra labrada, y tan buenos como los de España.” వారి నిర్మాణాలు రాతితో అద్భుతంగా నిర్మించినవి. స్పెయిన్ నిర్మాణాలకు సాటిగా ఉన్నాయి(అధ్యాయం XXVI). ఇంత గొప్ప సమాజాన్ని నాశనం చేయాలని చర్చికి ఎలా అనిపించిందో అర్థం కాదు.

మెసో అమెరికా, భారతీయత:

మాయా నాగరికత కాలం నాటికి ప్రపంచ దేశాల మధ్య కనెక్టివిటీ లేదని చాలా మంది భావిస్తుంటారు. కొందరు సముద్ర మార్గం ద్వారా కనెక్టివిటీ ఉందని కొంతవరకు ఒప్పుకుంటారు. కానీ ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల మధ్యన వాణిజ్య సంబంధాలు చాలా వేల ఏండ్ల నాటి నుంచే ఉన్నాయని ఆధారాలు చాలా ఉన్నాయి. మనకు సుదీర్ఘమైన రహదారిగా సిల్క్ రూట్ ఉన్నది. దీనికి తోడు సముద్ర వ్యాపారం దండిగా సాగుతున్న కాలమది. అయితే.. క్రీస్తు పుట్టడానికి మూడు వేల ఏండ్లకు పూర్వమే ప్రపంచంలో వాణిజ్య మార్గాలు మనకు అనేకం కనిపిస్తాయి. మన సోకాల్డ్ చరిత్రకారులు మాత్రం.. తాము పుట్టిన తరువాతే రాకపోకలు మొదలయ్యాయన్నట్టుగా మాట్లాడతారు. కొలంబస్ అమెరికాను కనుగొన్నాడని, వాస్కొడిగామా భారత్‌ను కనిపెట్టాడని.. అంతకు ముందు ఇక్కడున్న ప్రజలు ఏమీ తెలియని వాళ్లని.. ఆ వాస్కోడిగామా వచ్చిన తరువాతే ఇక్కడ పూలు వికసించడం మొదలైందన్నట్టుగా మాట్లాడేస్తారు.

కానీ, ప్రపంచంలో మిషనరీల రాక ముందు వివిధ దేశాల్లో వెల్లి విరిసిన నాగరికతల మధ్యన మాత్రం ఒక బలమైన కనెక్టివిటీ ఉన్నదని ఆయా నాగరికతలను, సంస్కృతులను గమనిస్తే అర్థమవుతుంది. మెసో అమెరికా, భారతీయ సంస్కృతుల మధ్యన అద్భుతమైన కనెక్టివిటీ కనిపిస్తుంది. ఇంతకు ముందరి వ్యాసాల్లో అనేక దేశాల్లో మిషనరీల రాకకు ముందున్న సంస్కృతుల గురించిన అధ్యయనం మనం చేశాం. ఆయా నాగరికతల్లో ప్రకృతి ఆరాధన, సూర్యారాధన, అగ్ని ఆరాధన, పంచభూతాల ఆరాధనను మనం గమనించాం. అదే విధంగా మాయా నాగరికతను కూడా మనం గమనించినప్పుడు భారతీయ సంస్కృతికి చాలా దగ్గరి సంబంధాలు కనిపిస్తాయి. భారతీయ ధర్మానికి సంబంధించిన ప్రభావం ప్రపంచమంతటా వ్యాప్తి చెందిందనడానికి మనకు మెసో అమెరికాలో విలసిల్లిన మాయా నాగరికతలో కనిపించే అనేక అంశాలు తార్కాణంగా నిలుస్తాయి. భారతీయ ధర్మం లేదా సనాతన ధర్మం.. వీటిలో మనం ఏ పేరుతోనైనా పిలువవచ్చు.. కానీ, ఈ ధర్మం మూడు వేల ఏండ్ల నాటిదేనని కొందరి నెరేషన్. ఎందుకంటే.. బైబిల్ ప్రకారం క్రీస్తు పుట్టడానికి పూర్వం 4000 సంవత్సరాల కంటే ముందు ఈ భూమే అస్తిత్వంలోనే లేదు అన్న భావనను ప్రామాణికంగా తీసుకుంటారు కాబట్టి. అయితే.. హరప్పా నాగరికత బయట పడ్డ తరువాత ‘పోనీ లెండి.. మీ చరిత్ర ఓ నాలుగు వేల ఏండ్లు ఉండవచ్చు’ అని మన మీద మెహర్బానీతో ఒప్పుకున్నారు. కానీ.. మన సంస్కృతి, మన ధర్మం, మన నాగరికత.. ఇన్ని సంవత్సరాలు అని నేను చెప్పను కానీ.. లెక్క తెలియనన్ని సంవత్సరాల క్రితం నుంచి ప్రపంచమంతా తన ప్రభావం చూపించింది. సమస్య ఏమిటంటే.. మిలియన్ సంవత్సరాల నాటి ఆనవాళ్లు లభించడం కష్టం.. దానికి తోడు.. మనది కాని మతాన్ని, ధర్మాన్ని నాశనం చేయాలని పనిగట్టుకొని ధ్వంస రచనకు పూనుకున్న మతాలు.. వాటికి అనుకూలంగా ఉండే కమ్యూనిస్టుల లాంటి వ్యవస్థీకృత దాడులను ఎదిరి నిలిచింది భారతీయ ధర్మమే.

మన సంస్కృతి, నాగరికత ప్రపంచవ్యాప్తంగా ఎలా ప్రభావం చూపించిందనడానికి మాయా నాగరికత ఒక చక్కని ఆనవాలు. మాయా నాగరికతలో మనకు కనిపిస్తున్న ఆనవాళ్లు ఒకసారి చూడండి. ఇక్కడ మీరు చూస్తున్న విగ్రహం హనుమంతుడిది. ఉత్తర అమెరికాలోని హోండ్యురాస్ అడవుల్లో 2012 లో దీన్ని మొదటిసారి కనుగొన్నారు. అమెరికాలోని నేషనల్ జియోగ్రాఫిక్ సంస్థ ప్రతినిధులు దీన్ని మొదట వెలుగులోకి తీసుకొచ్చారు. హనుమంతుడు చేతిలో గదను పట్టుకొని కూర్చొన్న విధానాన్ని చూడవచ్చు.. ఎన్ని సంవత్సరాల క్రితం ఈ ఆలయాన్ని నిర్మించి ఉండవచ్చు? కొలంబస్ అమెరికాలో కాలు పెట్టడానికి చాలా ఏండ్లకు ముందు నుంచే ఈ ఆలయం అక్కడ ఉన్నదంటే.. మన ప్రభావం అక్కడి దాకా విస్తరించిందో అర్థం చేసుకోవచ్చు.

మాయా నాగరికతలోనే మరొక ప్రాంతాన్ని కూడా పరిశీలిద్దాం. మెక్సికోలో ‘తులుమ్’ అనే ప్రాంతంలో మాయా కాలం నాటి ఒక అద్భుతమైన కట్టడం ఉన్నది. దీన్ని ఒక దేవాలయంగా భావిస్తారు. ఇక్కడ పైన మూడు ద్వారాలు ఉన్నాయి. ఈ మూడు ద్వారాలలో విగ్రహాలను ఫ్రాన్సిస్కన్ చర్చి ధ్వంసం చేసింది. ఈ మూడు ద్వారాల పైన గాలిలో ఎగిరే హనుమంతుడి విగ్రహం మనకు కనిపిస్తుంది. దీని ఆధారంగా కింద ఉన్న మూడు ద్వారాలలో రామాయణ సంబంధిత మూడు ప్రధాన పాత్రలైన రామలక్ష్మణ సీతల విగ్రహాలు అక్కడ ఉన్నాయని ఊహించడం అసమంజసమైతే కాదు. అయితే అవే విగ్రహాలు అక్కడ ఉండేవా లేదా అన్నది చెప్పడం సాధ్యం కాదు. కానీ, ఆ పైన ఉన్న వాయు మార్గంలో ప్రయాణిస్తున్న హనుమంతుడి విగ్రహం మాత్రం అక్కడ రామ మందిరం ఉండేదనడానికి ప్రబల సాక్ష్యంగా నిలుస్తుంది.

గుజరాత్ లో డాంగ్ అనే జిల్లా ఉంది. అక్కడ సకర్ పాతాళ్ అనే ప్రాంతం ఉంది. ఇక్కడ మహాభారత కాలంలో ఘటోత్కచుడు మాయా నగరి నిర్మించాడని ఒక కథనం ఉన్నది. ఈ ప్రాంతం నుంచి సరిగ్గా 180 డిగ్రీల కోణంలో గీత గీస్తే సరిగ్గా తులుమ్ ప్రాంతానికి తగులుతుంది. అంటే.. సకర్ పాతాళ్ లో అర్ధరాత్రి 12 గంటలు అయితే.. తులుమ్ లో మధ్యాహ్నం 12 గంటలు అవుతుంది. ఘటోత్కచుడు తాను నిర్మించిన నగరాన్ని మాయానగరి అని పిలిచాడు. తులుమ్ లో ప్రజలు తమది మాయా సంస్కృతి అన్నారు. మాయా అంటే మిస్టరీ.. మ్యాజిక్.. తులుమ్‌లో మనకు కనిపిస్తున్న రామాయణ ఆనవాలు 5 వేల సంవత్సరాలకు పైబడే అని పురాతత్త్వ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అంటే.. కృష్ణుడి కాలం కంటే ముందుదని అర్థం.

తులుమ్ లోనే రామాయణ ఆనవాలుతో ఉన్న కట్టడానికి సరిగ్గా ఎదురుగా మరో దేవాలయం ఉన్నది. విస్తారమైన మైదానంలో నాలుగు వైపుల నాలుగు ద్వారాలతో ఉన్న నిర్మాణం లోపల శివలింగం ప్రతిష్ఠించబడి ఉన్నది. చాలా చిన్న కట్టడం. దీని నిర్మాణాన్ని మనం గమనిస్తే.. వేద సంస్కృతి ప్రతిబింబిస్తుంది. అక్కడ మనం కంపాస్ పెట్టి కనుక చూస్తే.. నాలుగు ద్వారాలు నాలుగు దిశలను ఒక్క డిగ్రీ కూడా తేడా లేకుండా సూచిస్తాయి.. అక్కడే బయట మనం చూసినట్టయితే పానవట్టం కూడా శిథిలమై కనిపిస్తుంది. ఈ ఆలయాన్ని మొత్తంగా ఫ్రాన్సిస్కన్ చర్చి ధ్వంసం చేసింది. ఈ ఆలయంలోని దేవుడిని అక్కడి ప్రజలు ‘శివాల్వా’ అని పిలుస్తారు.. కొలుస్తారు. అక్కడి గైడ్‌ను అడిగితే చాలా స్పష్టంగా చెప్తారు. శివాల్వా అంటే అండర్ వరల్డ్ గాడ్ అని కూడా వివరిస్తారు.

మాయా సంస్కృతిలో భారతీయ సంస్కృతికి సంబంధించి మరిన్ని అనుబంధాలను మనం గమనించవచ్చు. అక్కడ హోపీ తెగకు చెందిన ప్రజలు ఉన్నారు. వారిని మనం పరిశీలిస్తే.. వారి ముఖ కవళికలు, రూపం భారతీయులను పోలి ఉంటాయి. అయితే వారు భారతదేశం నుంచి కొన్ని వేలు, లక్షల సంవత్సరాల క్రితం వలస పోయారా లేక.. వారి రూపం సహజంగానే అలా ఉన్నదా అనడానికి ఎలాంటి ఆధారాలు అయితే మనకు కనిపించవు. కానీ, వారి ఆచార వ్యవహారాలు మాత్రం మన ఆచారవ్యవహారాలను పోలి ఉండటం విశేషం. వాళ్లు పూజలు చేయడానికి ముందు భూమి మీద స్వస్తిక్ గుర్తుతో ముగ్గు వేస్తారు. ఆ తరువాత శివుడిని పూజిస్తారు. ఇవాళ్టికి కూడా వారు ఇదే సంప్రదాయాన్ని పాటిస్తారు.

అమెరికాలోని అరిజోనాలో కోకోనినో కౌంటీలో హిందూ కన్యాన్ అన్న పర్వత శ్రేణి ఉన్నది. ఇందులో 7533 అడుగుల ఎత్తులో ఉన్న శిఖరాన్ని విష్ణు ఆలయంగా పిలుస్తారు. కొలరాడో నదికి 4900 అడుగుల ఎత్తున ఈ శిఖరం ఉంది. ఈ ఆలయం హిందూ దేవుడైన విష్ణువు పేరే పెట్టారు. ఈ శిఖరం క్రీమ్ కలర్‌లో ఉంటుంది. దీనికి దగ్గరలోనే 7551 అడుగుల ఎత్తులో ఉన్న శిఖరాన్ని బ్రహ్మ ఆలయం అని పిలుస్తారు. దీనికి రెండు మైళ్ల దూరంలో జోరాస్టర్ ఆలయం కూడా ఉన్నది. కార్లెన్స్ డట్టన్ ఈ శిఖరాన్ని బ్రహ్మ దేవాలయం అని గుర్తించారు. మాయా నాగరికతకు, భారతీయ నాగరికతకు సామాన్యమైన సారూప్యతలను కొన్ని అంశాలలో మనం గమనించవచ్చు.

పిరమిడ్ ఆకారంలో ఆలయాల నిర్మాణాలు చేపట్టడం భారత్‌లో గోపురం అంటారు. వాళ్లు పిరమిడ్ అంటారు.

కాల గణన, ఖగోళ శాస్త్రాలలో అంతులేని పరిణతి, అత్యాధునిక సాంకేతికత రెండు సంస్కృతులలో కనిపిస్తాయి. భారతదేశంలో పంచాంగాలు, యుగ విభజన, కాలచక్ర పరిభ్రమణం ఉంటే.. మాయా నాగరికతలో లాంగ్ కౌంట్ క్యాలెండర్ ఉన్నది. వాళ్లు సూర్య మానాన్ని అనుసరించి కచ్చితమైన క్యాలెండర్‌ను తయారు చేసుకున్నారు.

భారత దేశంలో సర్పపూజ ఉన్నది. నాగలోకం ఉన్నదని భావిస్తారు. శివ, విష్ణు రూపాలలో కూడా సర్పం ప్రధానంగా కనిపిస్తుంది. వ్యవసాయానికి అత్యంత ముఖ్యమైనదిగా సర్పాన్నిభావించి పూజిస్తారు. మాయా నాగరికతలో సర్ప పూజ ఉన్నది. కుకుల్కాన్ పిరమిడ్ దేవాలయంలో సర్పం పైనుంచి కిందకు దూసుకువస్తున్నట్టుగా శిల్పం ఉంటుంది.

భారతదేశంలో సూర్యుడు, కమలం, చక్రం ప్రతీకలు చాలా చోట్ల కనిపిస్తాయి. మాయా నాగరిక చిహ్నాలలో కూడా సూర్యుడు, కమలం, చక్ర ప్రతీకలు కనిపిస్తాయి. ఇది కాస్మిక్ సింబాలిజమ్. రెండు సంస్కృతుల్లో ఇది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వాస్తవానికి ప్రకృతి ఆరాధనలో భాగంగా సూర్య ఆరాధన, అగ్ని ఆరాధన అనేక నాగరికతల్లో ఉన్నది.

మాయ అంటే మిస్టరీ, మ్యాజిక్ అని అనవచ్చు. మనకు తెలియని అద్భుతం ఇది. మన దగ్గర గుజరాత్‌లో అరేబియా సముద్ర తీరంలో డాంగ్ జిల్లాలో మాయానగరి ఉన్నట్టు తెలుస్తున్నది. దానికి సరిగ్గా 180 డిగ్రీల కోణంలో భూమికి ఆవలి వైపు మాయా నాగరికత విలసిల్లింది. ఇది యాదృచ్చికం అనుకోవాలా? పెద్దలు చెప్పాలి.

మన పెద్దలు చెప్పినట్టు ఎక్కడో వేల సంవత్సరాల నాటి భారతీయ నాగరికత, వేదకాలం, జీవన విధానం జోలికి పోనక్కర లేదు కానీ, భారత దేశంలో సింధు నాగరికత ఈ క్రీస్తు పుట్టడానికి 3300 సంవత్సరాల నాటికే భారత దేశంలో ఉన్నదని మార్క్సిస్టు చరిత్రకారులు కూడా అంగీకరించిన విషయం. క్రీస్తు పుట్టడానికి 1300 ఏండ్ల నాడు సింధు నాగరికత అంతమైందని నిర్ధారణ అయితే చేశారు. అదే సమయంలో మాయా నాగరికత కూడా మెసో అమెరికాలో కొనసాగింది. వీళ్ల లెక్కల ప్రకారమే క్రీస్తు పుట్టడానికి 2000 ఏండ్ల నుంచి క్రీస్తు పుట్టిన తరువాత 1500 ఏండ్ల వరకు మనుగడ సాగించింది. రెండింటి మధ్య భౌగోళికంగా వేల మైళ్లు ఉండవచ్చు. కానీ, రెండు నాగరికతల్లోనూ పెద్ద ఎత్తున ట్రేడింగ్ జరిగినట్టు స్పష్టమైన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. రెండింటి మధ్యన జరిగిందా లేదా అని అంటే.. రెండు సంస్కృతుల మధ్యన మనకు క్లియర్ గా కనిపిస్తున్న సారూప్యతలే అందుకు నిదర్శనం అని చెప్పవచ్చు.

పురావస్తు ఆధారాలు లభించలేదు అన్నారు.. కానీ తులుమ్ లోని దేవాలయం రెండు సంస్కృతుల మధ్య అనుబంధాన్ని బలంగా వ్యక్తీకరిస్తున్నది. జన్యు ఆధారం లేదు అన్నారు.. కానీ హోపీ తెగ ప్రజల్లో భారతీయ ముఖ కవళికలు స్పష్టంగా వ్యక్తమవుతున్నాయి. వీరి జన్యు శోధన చేస్తే వారి డీ.ఎన్.ఏ. ఏమిటన్నది తేలుతుంది. ఖగోళ, తాత్త్విక, పౌరాణిక సంబంధాలు కూడా రెండు సంస్కృతుల మధ్యన స్పష్టంగా కనిపిస్తున్నాయి.

మాయా క్యాలెండర్ గురించి మాయా నాగరికత ధ్వంస రచన చేసిన లాండా ఏమి చెప్పాడో చూడండి.. “Su manera de contar el tiempo era muy curiosa y diferente de la nuestra; sabían los eclipses y el curso del sol y la luna.” (అధ్యాయం XXXVIII, “Relación de las cosas de Yucatán”), దీని అర్థం ఏమిటంటే మాయా ప్రజలు సమయాన్ని లెక్కించే విధానం ఎంతో విచిత్రమైనది.. తమ పద్ధతి కంటే చాలా భిన్నమైనది. సూర్యుడు, చంద్రుడు, గ్రహాల చక్రాల గురించి వారికి అద్భుతమైన జ్ఞానం ఉన్నది. అని పేర్కొన్నాడు.

మాయన్ల కాలచక్రం భారతీయ కాలచక్రంతో అనేక రకాలుగా సారూప్యతలు కలిగి ఉన్నది. కాస్మాలజీ, భవిష్యత్ కాలమానం, గ్రహ నక్షత్రాల కదలికలు, చక్ర భ్రమణాల మధ్య రెండు సంస్కృతుల మధ్యన ఒకే రకమైన సారూప్యత కనిపిస్తుంది. మాయన్లు మూడు ప్రధాన క్యాలెండర్లు రూపొందించారు. మొదటిది ట్జోల్కిన్ (Tzolk’in). ఇది 260 రోజుల కాల చక్రం. 20 రోజుల పేర్లు, 13 సంఖ్యలు ఉంటాయి. ఇది దాదాపుగా జ్యోతిష్యం, ఆధ్యాత్మికం, వైదిక ప్రయోజనాల కోసం వినియోగించారు. భారత దేశంలోని నక్షత్ర, తిథి, యోగ, కరణ తదితర అంశాలకు దాదాపు దగ్గరగా ఉంటుంది.

రెండవది హాబ్ క్యాలెండర్.. ఇది సౌరమాన క్యాలెండర్, 18 మాసాలు, ఒక్కో నెల 20 రోజుల చొప్పున 360 రోజులు అవుతాయి. 5 రోజులు మాత్రం అపశకున రోజులు అంటారు. మనం మూఢాలు అంటామే అలా.. భారత దేశంలోని పంచాంగంలోని సంవత్సరాలు, కాలమానానికి ఇది దగ్గరగా ఉంటుంది.

మూడవది లాంగ్ కౌంట్ క్యాలెండర్. ఇది యుగ విభజనను చేస్తుంది. ఈ లాంగ్ కౌంట్ క్యాలెండర్ ప్రకారం యుగ విభజన ఇట్లా జరుగుతుంది.

యూనిట్ పీరియడ్ రోజులు సంవత్సరాలు
1 రోజు కిన్
20 కిన్ 1 వినల్ 20
18 వినల్ 1 టున్ 360 1
20 టున్ 1 కాటున్ 7,200 20
20 కాటున్ 1 బక్టున్ 1,44,000 394
20 బక్టున్ 1 పిక్టున్ 28,80,000 7885
20 పిక్టున్ 1 కాలాబ్తన్ 5,76,00,000 1,57,704
20 కాలాబ్తన్ 1కించిల్తన్ 1,15,20,00,000 31,54,071
20 కించిల్తన్ 1 అలావుటన్ 23,04,00,00,000 6,30,81,429
20 అలావుటన్ 1 హబ్లాటన్ 4,60,80,00,00,000 1,26,16,28,585

ఇదీ మాయా ప్రజల యుగ విభజన తీరు. ఇక భారత దేశంలో మహాయుగ నిర్మాణం ఎలా ఉన్నదో చూద్దాం.

కృత యుగం 17,28,000 సంవత్సరాలు
త్రేతా యుగం 12,96,000 సంవత్సరాలు
ద్వాపర యుగం 8,64,000 సంవత్సరాలు
కలి యుగం 4,32,000 సంవత్సరాలు
మహాయుగం మొత్తం: 43, 20,000 సంవత్సరాలు.

భారతదేశం, మాయా నాగరికత రెండూ కూడా కాలాన్ని చక్రంగానే పరిగణించాయి. కాలం నిరంతరం చక్రంలాగా భ్రమణం చెందుతూ ఉంటుంది. దీనికి ఆది లేదు.. అంతమూ లేదు. ఖగోళంలో రాశులు, గ్రహాల కదలికలను అనుసరించి బృహత్ కాల గణాంకాలు వేయడంలో ఈ రెండు సంస్కృతులూ అపూర్వమైన పరిశోధన చేసి అపార మైన మేధను సాధించాయి. రెండూ కూడా ఖగోళ సంబంధమైన కాలమానాన్ని అనుసరించాయి. భూమిపై, మనుషులపై వాటి ప్రభావాన్ని కచ్చితంగా అంచనా వేశాయి. ఒక మాటలో చెప్పాలంటే ఈ రెండు క్యాలెండర్లు కూడా విశ్వ చైతన్యపు ఊపిరి. ఈ ఊపిరి ఎన్నటికీ ఆగదు.

ఇప్పడు చెప్పండి.. ఖగోళము, గ్రహాల కదలికలు వాటి జ్ఞానం ద్వారా క్యాలెండర్ ను ఏర్పాటు చేసుకోవడం.. వాటి ప్రభావాలను అంచనా వేయడం అశాస్త్రీయమైనదా.. 1950 దాకా నాసా లేనే లేదు కదా.. మరి ఎక్కడి నుంచి ఈ జ్ఞానం వచ్చింది. రేషనలిస్టులు దీనిపై ఏమంటారు? ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే.. భారతీయ సంస్కృతి ఇక్కడ తూర్పు నుంచి పశ్చిమానికి ఎలా విస్తరించిందో చెప్పటమే నా ఉద్దేశం. ప్రపంచంలో అత్యంత గొప్పదైన మాయా సంస్కృతిని ఫార్కిస్కన్ చర్చి దారుణంగా ధ్వంసం చేసింది. దీని ధ్వంస రచన ఎలా సాగిందో తరువాతి వ్యాసంలో తెలుసుకుందాం.

(ఇంకా ఉంది)

Exit mobile version