[శ్రీ కోవెల సంతోష్ కుమార్ రచించిన ‘మిషన్, ఇండియా దట్ ఈజ్ భారత్’ అనే వ్యాస పరంపరని అందిస్తున్నాము.]
చాప్టర్ 6.
మన దేశంలో మత మార్పిడి అన్న మాట ఎనిమిదో శతాబ్దంలో మహమ్మద్ బిన్ ఖాసిం, 16 శతాబ్దంలో క్రైస్తవ మిషనరీలు రుద్దే దాకా తెలియదు. ఈ రెండు మతాలు రావటానికి ముందు జైన బౌద్ధ ధర్మాలు వచ్చాయి. ఈ రెండు ధర్మాలు కూడా గురు శిష్య పరంపరగానే కొనసాగాయి. జైనం కానీ, బౌద్ధం కానీ గురుశిష్య పరంపరగానే ప్రారంభమయ్యాయి. బౌద్ధాన్ని అనుసరించడం అన్నది అనేకులు ఉపాసనామార్గాలలో ఒకటిగానే ఎంచుకున్నారు. బుద్ధుడి త్రిపీటికలను అనుసరించిన వారు కొందరు. బుద్ధుడి బోధనలను మాత్రమే అనుసరించిన వారు కొందరు. ఈ రోజుకు కూడా బౌద్ధులు కానీ, జైనులు కానీ.. తమ మతంలోకి మారాలని కానీ, తమ మతమే గొప్పదని కానీ ప్రచారం చేయరు. ఒత్తిడి చేయరు. మీరు ఏ రోజైనా దలైలామా మత మార్పిడి గురించి మాట్లాడిన సందర్భం చూశారా? కనిపించదు. జైన సంప్రదాయంలోనూ అంతే.. పనిగట్టుకొని మరీ కనపడ్డ వాళ్లనల్లా మతం మారాలని వెంటపడరు. అదే సిద్ధాంతంగా మలచుకొని దాన్నే పరమార్థ సాధనగా ఉపాసన చేయరు.
జైనులైనా, బౌద్ధులైనా తమ ధర్మాన్ని తాము ఆచరిస్తారు. మత మార్పిడి అంటే రిలీజియస్ కన్వర్షన్ అని ఇంగ్లిష్‌లో అంటున్నాం. అది కూడా సరైన పదం కాదు. కొన్ని పదాలు మనకు తెలిసీ తెలియకుండానే వాడేస్తుంటాం. ఒక విధంగా ఏండ్ల తరబడి ఒకే మాటను ఒకే అర్థంలో పదే పదే ప్రయోగించడం వల్ల ఆ మాటకు ఆ అర్థమే ఖరారవుతుంది. ఇలాంటివి ఒక అజెండా ప్రకారం చేస్తారు. మనకు తెలియకుండానే ఇదంతా జరిగిపోతుంది. అప్పుడు నిజం చెప్పినా అదే అబద్ధమనిపిస్తుంది. అది ఒక పదం అయినా, చరిత్ర అయినా అంతే.. కన్వర్షన్ అన్న మాట కూడా అంతే. కన్వర్షన్ అంటే మారటం. అంటే తనంత తానుగా మారటం. మారటానికి, మార్చటానికి మధ్యన తేడా ఉన్నది. మార్చటం అన్న మాటకు ఇంగ్లిష్‌లో సమానార్థక పదం ప్రొసెలిటైజేషన్ (proselytism). ఇది గ్రీకు భాషలోని ప్రొసెలిటస్ proselytes(προσήλυτος) అన్న మాట నుంచి వచ్చింది. అంటే వెలుపల నుంచి వచ్చిన వాడు, కొత్తగా చేరినవాడు, దగ్గరకు వచ్చిన వాడు, అన్న అర్థాలు ఉన్నాయి. ఇదే మాట లాటిన్ లోకి వచ్చేసరికి ప్రొసెలిటస్ (proselytes) గా మారింది. ఇంగ్లిష్ లోకి వచ్చేసరికి proselyte (కొత్తగా మతంలోకి చేరిన వ్యక్తి), proselytism (ఇతరులను మార్చే చర్య), proselytization (మార్పిడి చేయించే ప్రక్రియ) గా అర్థం మారిపోయింది. అంటే మతం అన్న సందర్భంలో ఈ పదాన్ని వాడినప్పుడు ఇతరులను తమ మతం నుంచి, సిద్ధాంతం నుంచి మార్చేందుకు ప్రయత్నించడం లేదా ప్రేరేపించడం అన్న అర్థం వస్తుంది. క్రైస్తవ మతమే దీన్ని ఎక్కువగా వాడుకున్నది. ఒక్క మాటలో చెప్పాలంటే proselytization అంటే చర్య, కన్వర్షన్ అంటే ఫలితం.
మన దేశంలో మొదటి నుంచీ కూడా ఇలాంటి వాటికి తావు లేదు. ఇంతకు ముందరి వ్యాసాల్లో పేర్కొన్నట్టు.. వేర్వేరు మార్గాల్లో ప్రయాణిస్తున్నప్పటికీ, అంతిమ సత్యమేదో.. దానిని అన్వేషించుకుంటూనే వాదోపవాదాలు సాగించేవారు. అంతే తప్ప నిర్ద్వంద్వంగా తిరస్కరించడం అన్నది జరుగలేదు. ముందే చర్చించినట్టు.. భారతీయ ధర్మమనే ఛత్రచ్చాయ కింద అనేక ఉపాసనామార్గాలు పాయలుగా కొనసాగినప్పటికీ అవిభక్తమైన ఒకే జాతిగా మనుగడ సాగించింది భారతీయ సమాజం.
మతం మారడం అంటే, A person who is in an advantageous position, seeks to impose his conception of god and religion on the other who is in a vulnerable position and strikes at that which is most precious for that fellow. అంతే కానీ.. దుర్బలుడు, నిస్సహాయుడు, కష్టాలలో ఉన్నవాడు, విచారంలో దిక్కుతోచని స్థితిలో ఉన్న వాడిని టార్గెట్ చేస్తూ తమ అభిప్రాయాలను వారిపై బలవంతంగా రుద్దటమే మత మార్పిడి అన్నట్టుగా మారింది. మతం మారడం అంటే మతపరమైన శ్రద్ధాసక్తులు మాత్రమే మారడం లేదు. పూజా పద్ధతి మాత్రమే మారడం లేదు. చదివే ధర్మ గ్రంథాలలోనే మార్పు రావడం లేదు. మనం దర్శించే తీర్థా స్థలాల్లో మాత్రమే మార్పు రావటం లేదు. వ్యక్తులు, కుటుంబాల ప్రాధాన్యాలలోనే సమూలంగా మార్పు వస్తున్నది. తాను ఏ సమాజం నుంచి వచ్చాడో ఆ సమాజం ఆఘాతానికి గురవుతున్నది. ఈ కారణంగానే మత మార్పిడి వెనుక ఉన్న కుట్రను విస్తృతంగా చర్చించాల్సిన అవసరం ఉన్నది.
మన దేశంలో క్రైస్తవీకరణ ప్రక్రియ ఇస్లాం మాదిరిగా నాటకీయత ఉండదు. కథలుగా చర్చించడం కుదరదు.. అనేక ఘటనల సమాహారంగా కనిపించదు. క్రైస్తవీకరణ అన్నది పూర్తిగా అండర్ గ్రౌండ్ రివర్ లాగా ప్రవహిస్తూ వచ్చింది. సమయాన్ని, సందర్భాన్ని బట్టి దాని రూపము, ఆ రూపం వెనుక భావమూ వేరువేరుగా రూపాంతరీకరణం చెందుతూ వచ్చాయి. మన దేశంలోకి మూడు దశల్లో క్రైస్తవం ప్రవేశించింది. మొఘల్ చక్రవర్తి అక్బర్ కాలంలో కేరళలోని మలబారు తీరంలో మిషనరీలు చురుకుగా కార్యకలాపాలు నిర్వహించినట్టు తెలుస్తుంది. అప్పటికి దక్షిణాన పెద్దగా ఇస్లాం ప్రభావం లేకపోవడం వల్ల మిషనరీలు భారత పశ్చిమ తీరాన్ని ఎంచుకున్నాయి. తరువాత పోర్చుగీసులు 15వ శతాబ్దపు చివరలో వచ్చారు. ఈ చరిత్రను ప్రఖ్యాత భారతీయ చరిత్రకారుడు కెఎం ఫణిక్కర్ రికార్డు చేశారు. “In Malabar, the Portuguese and the missionaries worked together to break the cultural autonomy of the Syrian Christians and bring them under Roman ecclesiastical control.” (K.M. Panikkar, Asia and Western Dominance, George Allen & Unwin, London, p. 67)
కేరళలో క్రైస్తవీకరణ కేవలం మత మార్పిడి మాత్రమే కాదు. సాంస్కృతిక, జాతీయ విచ్ఛిన్నంతో పాటు, ఐరోపా సామ్రాజ్యవాద విస్తరణ వ్యూహంలో భాగమేనని వీరసావార్కర్ స్పష్టంగా పేర్కొన్నారు. “Conversion is not a change of faith alone, but a total transformation of cultural allegiance.” (V.D. Savarkar, Hindutva: Who is a Hindu?, Chapter 2.)
మలబారు వంటి ప్రాంతాలలో మతాంతరీకరణలనేవి భారతీయమైన సాంస్కృతిక వారసత్వాన్ని తెంచి వేయడానికి ఒక ప్రధాన ఉపకరణంగా మారాయని సావార్కర్ అన్నారు. “Christian missions in India worked not merely for religious conversion but as instruments of cultural and political denationalization…, In provinces like Malabar, religious conversions became a means of severing people from their ancestral culture and civilizational continuity.” (V.D. Savarkar, Six Glorious Epochs of Indian History, Chapter 6, Malabar Context.)
దాదాపు నాలుగో శతాబ్దంలో క్రైస్తవులు మన దేశంలో కేరళ తీరానికి చేరారు. ముందుగానే చెప్పుకున్నట్టు క్రీ.శ. 52లో సెయింట్ థామస్ వచ్చాడన్న కథ, నోటిమాటగా ప్రచారంలో ఉన్నదే. ఎందుకంటే.. వీళ్లు కథ చెప్పే సందర్భానికి ఐరోపా కూడా క్రైస్తవీకరణ చెందలేదు. పోపుగారి అధికార పీఠం కూడా ఏర్పడనే లేదు. ఇజ్రాయెల్ నుంచి ప్రచారకర్తలు పెద్దగా వ్యూహ రచన కూడా చేయని సందర్భం అది. అలాంటప్పుడు థామస్ రాక అనేది మిథ్య. నాలుగో శతాబ్దం నాటికి రోమ్‌లో క్రైస్తవులపై తీవ్రంగా అత్యాచారాలు జరిగాయి. నీరో, డొమిషియన్, డెసియస్, డయోక్లెటియన్ల కాలంలో తమపై జరుగుతున్న దాడులను తట్టుకోలేక కొంతమంది పర్షియా, అరేబియా, కేరళ ప్రాంతాలకు వలసలు వెళ్లారు. అలా వచ్చిన క్రైస్తవుల చేతుల్లో అప్పుడు బైబిల్ లేదు. ఎందుకంటే బైబిల్ రచన అప్పటికి జరుగలేదు. తరువాత ఎప్పుడో మూడు నాలుగు వందల ఏండ్ల తరువాత రచన జరిగింది. 13వ శతాబ్దంలో ఆంగ్లానువాదం జరిగింది. 345 ఏడీలో నాయ్ తోమా నాయకత్వంలో దాదిపు 72 కుటుంబాలు కేరళకు వచ్చాయి.
“Repeated Roman persecutions drove Christian groups eastward into Persia, Arabia, and eventually to the Malabar Coast of India.” (Stephen Neill, A History of Christianity in India, Cambridge University Press, p. 38)
“The earliest organized Christian settlements in Kerala emerged from Persian-Syrian migrations during the third and fourth centuries, partly caused by Roman religious persecution.” (A. Mathias Mundadan, History of Christianity in India, Vol. I, Church History Association of India, p. 52)
కేరళకు జరిగిన క్రైస్తవ వలసల గురించి కేపీ పద్మనాభ మీనన్ రాసిన హిస్టరీ ఆఫ్ కేరళ, ప్లాసిడ్ జె పాడిపార రాసిన ది థామస్ ఆఫ్ క్రిస్టియన్స్, పండిట్ జవహర్ లాల్ నెహ్రూ డిస్కవరీ ఆఫ్ ఇండియా రచనల్లో కూడా ఈ వలసల వివరాలను మనం చూడవచ్చు. ఇలా వచ్చిన క్రైస్తవులను కేరళీయ క్రైస్తవులని, మలబారీ క్రైస్తవులని పిలిచారు. మనం చెప్పుకుంటున్న మతం మార్చే విధానం ఇలా వలస వచ్చిన వారి ద్వారా జరుగలేదు. ఎందుకంటే.. వారు శరణార్థులుగా మాత్రమే వచ్చారు. అంతే కాదు. ఇలా వచ్చిన వాళ్లు భారతీయులలో కలిసిపోయారు కూడా.
“The Syrian Christians of Kerala adopted the social customs, caste patterns, dress, food habits, and cultural life of the Hindus, while retaining their Christian faith.” (Stephen Neill, A History of Christianity in India, Cambridge University Press, p. 43)
నుదుట బొట్టు పెట్టుకోవటం, తల వెనుక పిలక, చెవులు కుట్టించడం, బారసాల, పునర్జన్మ మీద విశ్వాసం, అక్షరాభ్యాసం వంటి సంప్రదాయాలన్నింటినీ వారు అనుసరిస్తూ వచ్చారు. మన దేవాలయాలకు వచ్చి మొక్కుబడులు కూడా తీర్చుకొనేవారు. అప్పుడు కొవ్వత్తులు రాలేదు. నూనె దీపాలే వెలిగించేవారు. తాళి కట్టడం, ముహూర్తాలు పెట్టించుకోవడం, జాతకాలపై నమ్మకాలు ఉండేవి.
“They became thoroughly Indian in social life, manners, and outlook, and were hardly distinguishable from high-caste Hindus except by their faith.” (A. Mathias Mundadan, History of Christianity in India, Vol. I, Church History Association of India, p. 56)
వలస క్రైస్తవులు మతం తప్ప ఇతర జీవన విధానంలోనూ, కట్టుబాట్లలోనూ, అన్నింటిలో కూడా స్థానికులతో విలీనమై జీవించారు తప్ప తమను తాము వేరు చేసుకోలేదు. వారి పేర్లు కూడా సంస్కృతీకరణ, మలయాళీకరణ అయిపోయాయి. జార్జి కాస్తా గీవర్గీస్ అయింది. థామస్ పేరు తోమా అయింది. పీటర్ ను పౌలోస్ అన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే మతం పరంగా క్రైస్తవం, సాంస్కృతికంగా భారతీయంగా తొలి దశ వలసల ప్రజలు జీవించారు.
క్రైస్తవుల రెండో సముదాయం 15వ శతాబ్దం చివరిలో వాస్కోడిగామాతోనే జరిగింది. వాస్కోడిగామా ప్రయాణం నాటికి చర్చి ఏర్పడింది. పోప్ వచ్చేశారు. నాలుగో శతాబ్దంలో వచ్చిన సిరియన్ క్రైస్తవులకు, వీరికి మధ్యన తేడా చాలా ఉంది. వీరు రావడమే ఒక ప్రత్యేకమైన అజెండాతో వచ్చారు. ముందుగా కేరళను ఎంచుకోవడం వెనుక కూడా వీరి ఉద్దేశం అక్కడ అప్పటికే కొందరు క్రైస్తవులు స్థిరపడి ఉండటం. పోర్చుగీసు వారు ముందుగా కొచ్చిన్‌లో ప్రవేశించారు. స్థానికులతో మమేకం అయ్యారు. ఇక్కడ విచిత్రం ఏమిటంటే అప్పటిదాకా భారతీయులతో మమేకం అయి ఉన్న క్రైస్తవులు కోవర్టులుగా మారిపోయారు. పోర్చుగీసుల మిషన్‌కు వారు పూర్తి అండదండలు ఇస్తూ వచ్చారు.
మన రాజుల ఉదారవాదమే మన కొంపలను ముంచేసింది. మనలోని సహిష్ణుత అనే గుణమే.. భారతదేశంలో విజాతీయకరణకు బీజం వేసింది. కేరళలో పోర్చుగీసు వాళ్లకు కొంచెం చోటిచ్చిన పాపానికి మన సంస్కృతికి చరమగీతం పాడేశారు. వీళ్లను మించిన వారు బ్రిటిష్ వాళ్లు. మీకు తెలుసా? మనకు లంచాలను ఇవ్వటం, తీసుకోవడం, తద్వారా పనులు చేయించుకోవడం నేర్పింది ఈ బ్రిటిష్ వాళ్లే. 16వ శతాబ్దంలో ఆంగ్లేయులు మన దేశానికి వచ్చారు. వాళ్లు మేకవన్నె పులులు. పులి చారలు గీసుకున్న నక్కలు. ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో బ్రిటిష్ వాడి పేను మన జుత్తులోకి చొచ్చుకొచ్చింది. మొదట్లో వాళ్లు చాలా సౌమ్యులుగా, ఉదారవాదులుగా, కేవలం వ్యాపారాలు చేసుకొనే వారిగా మాత్రమే వచ్చినట్టు కనిపించారు. ‘‘The English arrived in India not as conquerors but as humble supplicants, seeking trading privileges from the mighty Mughal emperors.” (William Dalrymple, The Anarchy: The Relentless Rise of the East India Company, Bloomsbury, 2019, p. 3). మొఘల్ చక్రవర్తుల దగ్గర అనుమతులు తీసుకొని వ్యాపారాలు చేసుకోవడం కోసమే వచ్చినట్టుగా వ్యవహరించారు. అక్బర్ కొడుకు జహంగీర్ దగ్గరకు సర్ థామస్ రో వచ్చి వ్యాపారం చేసుకోవడానికి అనుమతించాలని కోరినట్టు తానే రాసుకున్నాడు. “I found the Great Mogul far above all the kings of the East, and I stood before him as a petitioner for trade, not as a representative of power.” (Sir Thomas Roe, Embassy Journal, Hakluyt Society, p. 112). జహంగీర్ ఆత్మకథ తుజుక్ ఇ జహంగిరీ లో కూడా ఈ ప్రస్తావనను మనం చూడవచ్చు. “The English, who have come from distant lands, desire permission to trade in my dominions.” (Tuzuk-i-Jahangiri (Memoirs of Jahangir), Trans. Alexander Rogers, Vol. I, p. 321). జహంగీర్ రాజసభలో చాలా వినయంతో ప్రవర్తించాల్సి వచ్చేదని థామస్ రో వాపోయాడు కూడా. “The English factors at the Mughal court had to observe strict court etiquette and present themselves with humility.” (Percival Spear, A History of India, Penguin, p. 143) ఔరంగజేబ్ కాలంలో కూడా బ్రిటిష్ వ్యాపారుల పట్ల చాలా కఠినంగా వ్యవహరించినట్టు జాదూనాథ్ సర్కార్ తన హిస్టరీ ఆఫ్ ఔరంగజేబ్ అన్న గ్రంథంలో రాశారు. “Aurangzeb kept the European traders under strict control and permitted their commerce only under imperial regulations.” (Jadunath Sarkar, History of Aurangzeb, Vol. III, p. 204). మొఘల్ చక్రవర్తులు బలహీనపడకపోయి ఉంటే.. ఈస్ట్ ఇండియా కంపెనీ చిన్న వ్యాపార సంస్థగానే ఉండిపోయేది. బ్రిటిషర్లు మొదట జహంగీర్ ఆస్థానంలో వినయం, లంచాలు, బహుమతులు, రాజులను విపరీతంగా స్తుతించడం వంటివి చేసేవారు. “Lavish gifts and courtly flattery were essential tools for English survival at the Mughal court.” (William Dalrymple,The Anarchy, p. 18). మన దేశంలో లంచాలను ఒకవిధంగా పరిచయం చేసింది కూడా బ్రిటిష్ వాళ్లే.. ఆశ చూపి తమ పనులు చాలా తేలికగా చేయించుకున్నారు. బంగారు పాత్రలు, ఖరీదైన గడియారాలు, ఐరోపా తుపాకులు, టెలిస్కోప్ వంటివి థామస్ రో, ఈస్టిండియా కంపెనీ తరపున జహంగీర్ సుల్తాన్‌కు లంచాలు సమర్పించుకున్నారు. Roe distributed costly presents among Jahangir’s nobles to secure trading privileges.” (William Foster, The English Factories in India, Vol. I, p. 214)
అదే షాజహాన్ కాలం వచ్చేసరికి ఈ బహుమానాలు బాగా ఖరీదుగా మారాయి. ఏటా రెగ్యులర్ పన్ను చెల్లించిన విధంగా మారింది. 1700 నుంచి 1757 మధ్య కాలంలో మొఘల్ రాజులు, బెంగాల్ నవాబులైన మీర్జాఖాన్, అలివర్దిఖాన్, సిరాజుద్దౌలాల దగ్గర ఏకంగా రాజకీయ లంచాల విప్లవమే రేగిందంటే అత్యుక్తి కానే కాదు. మనదేశానికి లంచాలను పరిచయం చేసిన మహానుభావులు కూడా ఆంగ్లేయులే. చాలా సులువుగా కంపెనీని భారత్‌లో విస్తరించాలన్న లక్ష్యంతోనే వాళ్లు ఈ దారిని ఎంచుకున్నారు. “Bribery and corruption were structural tools of the Company’s expansion in India.” (Philip Lawson – The East India Company, p. 58). ఈ లంచాల ద్వారానే రాజకీయ అధికారాన్ని బ్రిటిషర్లు రాజకీయ అధికారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు ముఖ్యమైన ఉదాహరణ ప్లాసీ యుద్ధం. ప్రపంచ చరిత్రలో అతి పెద్ద రాజకీయ లంచాల విజయంగా దీన్ని అభివర్ణించవచ్చు. తుపాకుల కంటే బలంగా లంచాలు రాజకీయ అధికారాన్ని సంపాదించి పెడతాయని ఈ యుద్ధం నిరూపించింది. రాజకీయ అధికారం చేజిక్కించుకున్న తరువాత కానీ, బ్రిటిషర్లు తమ ముసుగు తొలగించలేదు. బహిరంగంగా మిషనరీలను దేశంలోకి చొప్పించారు. మతపరమైన ధ్వంసం ఆ తరువాత తీవ్రమైంది
(ఇంకా ఉంది)
కోవెల సుప్రసన్నాచార్య గారి తనయుడు జర్నలిస్టు కోవెల సంతోష్ కుమార్. చక్కని రచయిత. దేవ రహస్యం, విలయవిన్యాసం, రామం భజే శ్యామలం, కల్లోల భారతం వంటి పుస్తకాలు వెలువరించారు.
