Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మిషన్, ఇండియా దట్ ఈజ్ భారత్-6

[శ్రీ కోవెల సంతోష్ కుమార్ రచించిన ‘మిషన్, ఇండియా దట్ ఈజ్ భారత్’ అనే వ్యాస పరంపరని అందిస్తున్నాము.]

చాప్టర్ 7.

భారతదేశంలో మిషనరీల కార్యకలాపాల గురించి మరింత లోతుగా చర్చించడానికి ముందు ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవం ఎలా వ్యాప్తి చెందిందో.. ఎలా విస్తరించుకుంటూ వచ్చిందో, దాని పద ఘట్టనల వెనుక ఎన్ని సంస్కృతులు, నాగరికతలు కాలగర్భంలో కలిసిపోయాయో తెలుసుకోవడం మనందరికీ అవసరం. ఎందుకంటే.. క్రైస్తవ మత విస్తరణకు ముందు ప్రపంచ వ్యాప్తంగా విలసిల్లిన అనేక నాగరికతలు, సంస్కృతులకూ.. భారతీయ నాగరికత, సంస్కృతులే కాదు.. దాదాపు అన్నింటి మధ్యన అనేక ఏకరూపత మనకు కనిపిస్తుంది. వివిధ దేశాల మధ్యన కనెక్టివిటీ తక్కువగా ఉన్నప్పుడు ఎలా ఈ సారూప్యత ఉన్నదన్న ప్రశ్న తలెత్తవచ్చు. కానీ, ప్రజల నాగరికత, ప్రకృతి ఆరాధన, దేవతా స్వరూపాలు, పూజా విధానాలను మనం జాగ్రత్తగా విశ్లేషిస్తే.. అన్ని నాగరికతల మధ్యన ఒక సూత్రం ముడిపడి ఉన్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. వివిధ భూభాగాలు, ద్వీపాల మధ్య వాణిజ్య సంబంధాలు మెరుగుపడిన కొద్దీ ఆయా సంస్కృతుల మధ్యన ఏకరూపత మరింత పెరగటం ప్రారంభమైంది. ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి విస్తరించుకుంటూ వెళ్లిందనేది ప్రశ్న కాదు. కానీ మొదట ఎక్కడ ప్రారంభమైందనే ప్రశ్న ఉదయించవచ్చు. కానీ, ఆయా నాగరికతలు, సమాజాలను వసుధైక కుటుంబకం అన్న మౌలికమైన సూత్రం ముడివేసినట్టు వీటిని అధ్యయనం చేయడం ద్వారా మనకు తెలుస్తుంది. కానీ, ఈ ప్రధాన సూత్రాన్ని, చర్చి పూర్తిగా తెంపేసింది. ఈ సమాజాలను క్రైస్తవ చర్చి ధ్వంసం చేసుకుంటూ పోయింది. అనేక సమాజాలు, నాగరికతలు, సంస్కృతులు కేవలం వందల సంవత్సరాల స్వల్ప కాలంలోనే అవి ఉన్నాయో లేవో అన్నంతగా భూగర్భంలో సమాధి అయిపోయాయి. అందుకోసమే క్రైస్తవ మత విస్తరణకు మిషనరీలు దీర్ఘకాలిక లక్ష్యంతో అనుసరించిన వ్యూహాలు తెలుసుకోవాలి. ఈ మాట అనగానే మనకు ముందుగా వినిపించే మాటలు.. అవన్నీ పాత మాటలు.. ఇంకా ఎందుకు మాట్లాడుతారు. అవి ఎప్పుడో అయిపోయాయి. గతం గత: ఇప్పుడు చర్చించడం వల్ల సామరస్యంగా ఉన్న ప్రపంచంలో జనుల మధ్యన చిచ్చు పెట్టడం కాదా.. ఇప్పుడీ అవసరం ఎందుకు వచ్చింది? అనవసరమైన విషయాలను ఎందుకు చర్చిస్తారు? అన్న ప్రశ్న ఉద్భవించడం సహజమే.. కానీ కాస్త శ్రద్ధ పెట్టి గమనించండి.. ఇవాళ్టికీ.. వారి పోకడల్లో, వ్యవహార శైలిలో తొలినాటి చరిత్ర నిరంతరం ప్రతిఫలిస్తూనే ఉన్నది. ఉంటుంది కూడా.. ప్రస్తుత శకం ఎనిమిదో శతాబ్దంలో భారతదేశంలోకి చొరబడిన సందర్భంలో మహమ్మద్ బిన్ ఖాసిం.. ఇస్లాం ప్రపంచ స్థాపన కోసం.. ‘అయితే మతం మారండి.. లేదా పారిపోండి.. లేకుంటే చావండి’ అని చేసిన నినాదం.. ఇవాళ కాశ్మీర్‌లో పండిట్ల నరమేధంలోనూ ప్రతిధ్వనించింది. భారతదేశంలో ఇస్లామిక్ మితవాదులూ, ఉగ్రవాదుల ప్రాథమిక నినాదమూ ఇదే అయింది. ఇప్పటికీ ఇదే పునాదిపై కార్యాచరణ చేస్తుంటారు.

ప్రపంచంలో క్రైస్తవ మిషనరీల చరిత్ర కూడా ఇంతే. అత్యంత క్రూరంగా నర సంహారం చేయకుండా క్రైస్తవం కానీ, ఇస్లాం కానీ విస్తరించనే లేదు. అయితే మిషనరీలు మరింత ఆధునిక ఎత్తుగడలతో ముందుకు సాగాయి. స్థానిక మతాలను, సంప్రదాయాలను, చరిత్రను, నాగరికతను, సాహిత్యాన్ని నకిలీలుగా, మూఢ నమ్మకాలుగా, దేవుళ్లను దెయ్యాలుగా చిత్రించి, ప్రచారం చేసి క్రీస్తు మాత్రమే విశ్వసించదగినవాడని ఇంజెక్ట్ చేస్తూ విస్తరించుకుంటూ పోయాయి. క్రైస్తవ చరిత్ర అంతా మీరు చూడండి. అదే కనిపిస్తుంది. మనం జాగ్రత్తగా గమనిస్తే.. మన దేశంలో మన చరిత్ర విషయంలో, ఇతిహాసాలు, పురాణాలు, మన సంప్రదాయాలు, ఆచారాలు, సంస్కృతి విషయంలో క్రైస్తవ పాలకులు చేసిందీ.. ఆ తరువాత వారికి తొత్తులుగా కమ్యూనిస్టులు అదే పంథాను నెత్తికెత్తుకున్నదానికి కూడా మూలాలు మూడో శతాబ్దంలోనే మనకు కనిపిస్తాయి.

అమెరికా నుంచి ఆస్ట్రేలియా దాకా ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. చేతిలో ఒక పుస్తకం.. అదే వారి ఆయుధం. అది చూపించి.. దాని భయంలో భయానకమైన నర సంహారం యథేచ్ఛగా సాగిస్తూ వచ్చారు. చరిత్రను మాత్రం స్వచ్ఛమైన శ్వేత వస్త్రంలో శాంతి సామరస్యాలకు ఏకైక గమ్యంగా రాసుకుంటూ వచ్చారు. కానీ దీని విస్తరణను గమనిస్తూ పోతే.. ఆశ్చర్యమేస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా క్రైస్తవ మత విస్తరణ తొలినాళ్లలో సైన్యం, తుపాకులు, మందుగుండ్ల సహాయంతో జరిగింది. ఇప్పుడు కుప్పలు తెప్పలుగా వచ్చిపడే విదేశీ నిధులు, మోసపూరిత చర్యలు, కొండొకచో బలవంతపు మార్పిళ్లు.. వంటి సహాయంతో మతాంతరీకరణ జరుగుతున్నది. ఇస్లాం మాత్రమే రక్తపాతం సృష్టిస్తూ విస్తరించిందని తెలుసు. కానీ.. అంతకు వెయ్యి రెట్లు క్రైస్తవం మానవ రక్తాన్ని ప్రవహింపజేసింది. ఇస్లాం రక్తపుటేరులను పారింపజేస్తే.. క్రైస్తవం రక్తపు నదులనే ఉప్పొంగేలా చేసింది. మిషనరీల శ్వేత వర్ణం వెనుక రక్తపు మరకలు మాత్రమే ఉన్నాయి. ఈ రక్తపు మరకల వెనుక క్రైస్తవ మత ప్రాథమిక సిద్ధాంతం నిర్వహించిన భూమిక అసాధారణం. ఈ సిద్ధాంతాన్ని క్రీస్తు ప్రవచించారా? లేక ఆ తరువాత ప్రపంచ రాజకీయ ఆధిపత్యం కోసం చొప్పించారా అన్నదైతే చెప్పలేము.

‘యేసు తప్ప మరొక రక్షణ లేదు’ అన్నది క్రైస్తవ మత నమ్మకం. ఇతర మతస్తులను మార్చటాన్ని దైవ ఆదేశం (great commission) గా మిషనరీలకు బాధ్యతను అప్పగించడం జరిగింది. ఇందుకోసం మిషనరీలు ఎంత డబ్బునైనా ఖర్చు చేస్తాయి. చర్చిలు, ఎన్జీవోలు కేవలం ఈ లక్ష్యం కోసమే పనిచేస్తాయి. కోట్లాది డాలర్లు ఇందుకోసమే కుమ్మరిస్తుంటాయి. మతాంతరీకరణ అయ్యే ప్రతి ఒక్కరూ చర్చి దృష్టిలో కన్వర్షన్ స్టాటిస్టిక్ అవుతారు. ఒకసారి పాశ్చాత్య దేశాలకు వెళ్లి మిషనరీల పోకడలను గమనిస్తే.. తాము భారత్, ఆఫ్రికా, ఆసియా పేదలను యేసు దగ్గరకు తీసుకొని వస్తున్నామని ప్రచారం చేస్తుంటారు. చర్చిలు, విద్యాసంస్థలు, ఆసుపత్రులు అన్నీ కూడా క్రైస్తవ మతానికి పెద్ద వ్యాపార ఉపకరణాలు మాత్రమే. ‘సాంస్కృతిక వినియోగం’ వీరికి అతి పెద్ద వాణిజ్య ఉపకరణం. ఈ మతాంతరీకరణ వెనుక మర్మం ఏమిటన్నది జాగ్రత్తగా మనం గమనించాలి. ఒక ప్రాంతంలో పెద్ద ఎత్తున క్రైస్తవ సమాజం పెరిగితే.. అక్కడ పొలిటికల్ లాబీయింగ్ తేలిక అవుతుంది. దీంతో పాటు, స్థానిక మతాలు, సంస్కృతి బలహీనపడి సాంస్కృతిక ఆధిపత్యం పెరుగుతుంది. ఈ రెండూ పెరుగుతున్న కొద్దీ భౌగోళిక రాజకీయాలపై చర్చి పట్టు పెరుగుతుంది. చర్చి పట్టు పెరిగినకొద్దీ పాలనలో విదేశీ జోక్యం లీగలైజ్ అవుతుంది. ‘ఏకైక దేవుడు’ మాత్రమే నిజం అన్న సూత్రీకరణ వెనుక ప్రపంచ వ్యాప్తంగా మతాధిపత్యం సాధించడానికి పెను కుట్ర జరిగింది. ఒకసారి ప్రజలు ఈ సూత్రాన్ని గట్టిగా నమ్మితే, సాంస్కృతిక ఆధిపత్యం (local traditions collapse), రాజకీయ ఆధిపత్యం (Christian blocs, voting influence), ఆర్థిక ఆధిపత్యం (చర్చిలు, విద్యాసంస్థలు, దాతృత్వం ద్వారా నియంత్రణ) వంటివి సాధ్యపడుతుంది. ఈ సిద్ధాంతం ఆధారంగానే చరిత్రలో అనేక సామ్రాజ్యాలు కాలగర్భంలో కలిసిపోయాయి. నాగరికతలు అంతమయ్యాయి.

ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవం విస్తరణకు ఒకే రకమైన విధానాన్ని అనుసరిస్తూ వచ్చింది. స్థానిక దేవతలను నకిలీలుగా ప్రచారం చేయడం ప్రధాన కుట్ర. గ్రామ దేవతలను సైతానులు, దెయ్యాలుగా అభివర్ణించడం, స్థానిక పూజలను అనాగరిక ఆచారాలుగా, మూఢ నమ్మకాలుగా ప్రచారం చేయడం ఒక ప్రణాళికాబద్ధంగా జరుగుతుంది. వీళ్ల మత మార్పిడులకు ట్రైబల్స్ మొదటి టార్గెట్‌గా మారుతారు. ప్రధాన స్రవంతిలోని నాగరికత వారిని వేరుగా చూస్తున్నదని, మీరు ఆ మతానికి సంబంధించినవారు కారని వారిలో జాతి, కులభేదాలను రెచ్చగొడుతుంది. తద్వారా మత మార్పిడి చాలా సులభమవుతుంది. ఎందుకంటే క్రైస్తవ సిద్ధాంతంలోనే ఈ లక్షణం ఉన్నది. ముందుగానే చెప్పుకున్నట్టు యేసు మాత్రమే దేవుడు.. ఇతరులు కాదు. ఇతర దేవుళ్లను నమ్మేవాళ్లను శిక్షించండి అని బైబిల్ స్వయంగా చెప్తుంది.

‘ye shall utterly destroy all the places where in the nations which ye possess served their gods upon the high mountains, and upon the hills, and every green tree: 12:3 And ye shall overthrow their altars and break their pillars, and burn their groves with the fire; and ye shall hew down the graven images of their gods and destroy the names of them out of that place.” (holy bible, king james version, pilot books, p.168).

ఇందులోనే మరో మాట చదవండి. “thou shall not bow down to their gods, nor serve them, nor do after their works; but thou shalt utterly overthrow them, and quite break down their images. (holy bible, king james version, pilot books, p.68)

తెలుగు బైబిల్ లోని పాత నిబంధనలో అనేక సందర్బాల్లో ఇతర దేవుళ్లను పూజించేవారిని నశింపజేయాలని చాలా సందర్భాల్లో దేవుడి ఆదేశం మనకు కనిపిస్తుంది.

“యెహోవాను విడిచి ఇతర దేవుళ్లను ఆరాధించమని చెప్పిన వానిని రాళ్లతో కొట్టి చంపవలెను.” (ద్వితీయోపదేశకాండము 13:6–10)

ఇతర దేవుళ్లను ఆరాధించవద్దు; వారి విగ్రహాలను ధ్వంసం చేయవలెను.( ద్వితీయోపదేశకాండము 7:1–5)

“యెహోవా తప్ప ఇతర దేవుడికి బలి అర్పించిన వాడు నశింపబడి తీరవలెను.”( నిర్గమ కాండము 22:20).

పాత నిబంధనలో ఒకే దేవుడిని నమ్మని వారిని శత్రువుల్లా చూడాలి అనే తీరు కనిపిస్తుంది. కానీ కొత్త నిబంధనలో కొంత మార్పును మనం చూడవచ్చు. ‘మీ శత్రువులను ప్రేమించుడి. మిమ్ములను హింసించువారి కొరకు ప్రార్థించుడి’ (మత్తయి 5:44) అని  ఉంటుంది. అయినప్పటికీ ‘యేసు మాత్రమే మార్గం’  అన్న సూత్రం మాత్రం కొత్త నిబంధనలో కూడా కొనసాగింది. క్రైస్తవ విస్తరణ ప్రారంభమైనప్పుడు మిషనరీలకు ఈ పాత టెస్ట్‌మెంట్ ఆలంబన అయింది. చర్చి బోధనలను తిరస్కరించిన వారిపై తీవ్రమైన దమనకాండను మిషనరీలు నిర్వహించాయి ఇస్లాం తరహాలోనే.  అయితే మతాంతరీకరణం, లేదా నిర్మూలన అనే సూత్రాన్ని కఠినాతి కఠినంగా అమలు చేస్తూ వచ్చారు. చర్చిని తిరస్కరించిన వారిని హెరెటిక్స్ (heretics) అని పిలిచేవారు. హెరెటిక్స్ అంటే యేసు ఉనికిని ప్రశ్నించిన వారు అని అర్థం. యేసు దేవుడా లేక ప్రవక్త మాత్రమేనా అని ప్రశ్నించిన వారు.. బైబిల్ లోని వాక్యాలకు మత విశ్వాసానికి విరుద్ధమైన అర్థాలను చెప్పేవారు, పాప విముక్తి కోసం చర్చి అవసరమే లేదని ధిక్కార స్వరం వినిపించేవారిని హెరెటిక్స్ అని పిలిచేవారు. వీరిపై ‘రాక్షస ఆత్మ’ అన్న ఆరోపణ చేసేవారు. అంటే.. ఇతడు దైవ విరోధి అయిన రాక్షసుడి ఆత్మ కలిగిన వాడు అన్న అర్థం వచ్చేలా ఆరోపణ చేసి బహిరంగంగా కాల్చి చంపేసేవారు. లేదా నానా రకాల చిత్రహింసల పద్ధతులను అనుసరించి యాతన పెట్టేవారు. వారిని వేధించి సజీవదహనం చేసేవారు. ‘దయ్యమును పట్టుకున్న వారిని బతికించవద్దు (Exodus 22:18 king james version) అనే వాక్యంతో మహిళలను లక్ష్యం చేసి దాడులు చేసి హింసించేవారు. మహిళలను నీళ్లలో ముంచి వారు దయ్యమైతే మునిగి చనిపోతారు.. లేకుంటే తేలిపోతారు అని ముంచేసేవారు. శరీరాన్ని కాల్చి, గుచ్చి చూసి రక్తం కారకపోతే.. దయ్యం అని తేల్చి చంపేవారు. కొన్ని చోట్ల గ్రామాలకు గ్రామాలనే సామూహిక హననం చేసిన ఉదంతాలు ఉన్నాయి. దీన్ని ఒక రకంగా ఆధ్యాత్మిక ఉగ్రవాదం అనవచ్చు. 15, 17 శతాబ్దాలలో ఒక్క యూరప్ లోనే దాదాపు 60 వేల మంది మహిళలను బలిగొన్నట్టు బ్రియాన్ లెవాక్, రాబిన్ బ్రిగ్స్ లాంటి చరిత్రకారులు పేర్కొన్నారు. తమ దేవుడిని అంగీకరించని వారిని బానిసలుగా చేసుకొని వారిని బహిరంగంగా వేలం వేసి అమ్మేశారు. ఇస్లాం మాదిరిగానే క్రైస్తవ మిషనరీలు పెద్ద ఎత్తున బానిసల వ్యాపారం చేశాయి. కొత్త టెస్ట్‌మెంట్ రావడం, అమెరికా, ఐరోపా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా వంటి ఖండాలు తమ మత స్వాధీనంలోకి వచ్చిన తరువాత ఇక మిగిలిన ప్రాంతాల్లో మత వ్యాప్తి కోసం మిషనరీలు సాంస్కృతిక దొంగతనం మొదలు పెట్టాయి.

(ఇంకా ఉంది)

Exit mobile version