[24 ఫిబ్రవరి, శ్రీ ముళ్ళపూడి వెంకటరమణ గారి వర్థంతి సందర్భంగా ఈ కవితని అందిస్తున్నారు సముద్రాల హరికృష్ణ.]
1.
‘కోతి కొమ్మచ్చు’ల బహు కొంటెవాడు
రాతలో పన్ను దట్టించు ‘పన్’ డితుడు
వాత లన్పించని చుర్కుల పెన్వీరుడు
ఎంతకూ నవ్వు లాపని రవఁణ వీడు!
2.
పేదరికముతో హాస్యాలాడిన వాడు
ఆదరణ లేమి క్షణ మోపనివాడు
ఉద్యోగా ల్లెక్కకు మించిన వాడు
సద్యోగాల మిగుల విజృంభించినవాడు!
3.
అమ్మ ఊసులతో చెమ్మ కలిగిస్తాడు
అమ్మమ్మ కబురులతో నవ్వించి ఏడ్పిస్తాడు
తన తప్పుల దాపరిక మెరుగనివాడు
అవమానమూ, బహుమానమనే ధీరుడు!
4.
బతు క్కష్టాలు జంతిక ల్తిన్నట్టు చెప్తాడు
ఏడ్చి శోకించే సమయమే లేదంటాడు
ఎదురీత రొప్పు కాదు, నీళ్ళ గొప్పంటాడు
వెనుక చూపే లేని గుండె దిటవుల వాడు!
5.
రామ భక్తితో హనుమంతుడైనాడు
రామాయణము పదే పదే వ్రాశాడు
కృష్ణ రక్తితో రాధాగోపాలం వల్లించాడు
శ్రధ్ధ రంగరించి భాగవత సుధ నందించాడు!
6.
చిత్ర సంభాషణలనో చిత్రిక పట్టాడు
హాస్యానికి కొత్త ఒరవడి దిద్దాడు
రవఁణీయం కమనీయ మన్పించాడు
నవ్వులకే పట్టుపుట్ట మలంకరించాడు!
7.
బొమ్మల బాపూతో మిత్రాలయం కట్టాడు
సృష్టిలో స్నేహమే ‘తీయని’ దన్నాడు
అందుకే ‘స్నేహం’ చిత్రం ‘తీశా’నన్నాడు
విజయహస్తంతో గట్టిగ జత కట్టేశాడు!
8.
సీతాకళ్యాణం తెలుగులో చేయించాడు
గంగను సెల్యులాయిడ్ లో బంధించాడు
మాట మొగ్గలతో ముత్యాల ముగ్గులేశాడు
నవ్వులకు కొత్త సింహాసనా లమర్చాడు!
9.
బుడుక్కి పెసూన చెకుముకి నంటించాడు
చిలిపి ఊసుల పువ్వొత్తుల పూయించాడు
ఇట్టే నాన్నంత పెద్దవ్వాల నువ్విళ్ళూరించాడు
ఇప్డే అమ్మంత ఆరిందానని నమ్మీకం పెంచీశాడు!
***
మరి కొసరుండొద్దూ..!
ఔను ఉండొద్దూ..!
కనుక
ఓ కొసరు, ఓ కొక్కొసరు, ఓ చివరాఖరు!
కొసరు:
ఆత్మ వ్యథలనే హాస్యాత్మకథగ వ్రాసినవాడు
దాటేసిన కష్టాలకింత చక్కెరద్ది చెప్పినవాడు
మాటమాటకు తెల్గునవ్వుల పూయించినవాడు
ఎవడయ్య వాడు, ఘనుడీ రవఁణాంజనేయుడే!
***
కొక్కొసరు:
మురుగుల లోలక్కుల ధవళేశ్వరపు చిన చక్రవర్తి
దరిమిల చతురుల సినిమోక్తుల హాస్య చక్రవర్తి
అబద్ధాల్దు బారగ వాడననిన హరిశ్చంద్రమూర్తి
ఎవడయ్య వాడు, ‘ఫను’ డీ రవఁణాంజనేయుడే!
***
చివరాఖరు:
ఇచ్చుటలోని హాయి నేర్చిన పేద జమీందారుడు
అచ్చపుపాఠాల కమ్మ గురువను వరకుమారుడు
నొచ్చినను, నొప్పించు టెరుగని యెద సుకుమారుడు
ఎవడయ్య వాడొక్కడే ఒక్కడు, రవఁణాంజనేయుడే!
~
కాలి గమనికలు:
(అర్థమయ్యేట్టు వ్యాఖ్యానం రాస్తే – ‘ఫుట్నోట్సు’!)
1. గుండె నిండా తడీ,బుర్ర నిండా ఫన్ గలవాడు కాబట్టి, ‘ఫను’డీ రవఁణ, హాస్య వడ్డనలో నెంబర్ వను డీ రవఁణ!
2. ఆంజనేయుడి లాగే అంతటి మాటసంపన్నుడైనా, వినయానందుడు కావటం వల్లనూ, కొహొతికొమ్మచ్చుల ప్రీతుడు కావటం వల్లనూ, ‘రవఁణాంజనేయుడు’! అని సబబోపాఖ్యానం!
3. వాడిన (పూలు కాదు, పదాలు) ఆ రెండూ, ఆయన బాణీ మీద కుంచెం బోల్డు ఇష్టం తోనే అని వేరే చెప్పాలా, తిరువేంకటరమణప్పా!
4. ‘వెంకటరమణ’ కదూ, అందుకూ ఈ ఏడుకొండల వాడి ఊ..సు!
ఇక చాలు కామోసు!
ఓం నమో వెంకటరమణాయ!
