[రాయపెద్ది హనుమంతరావు – సంజీవ లక్ష్మి స్మారక కథల పోటీ 2025 లో థ్రిల్లర్ కథల విభాగంలో బహుమతి పొందిన కథ ‘మూసిన తలుపుల వెనక..’. రచన శ్రీమతి అవధానుల విజయలక్ష్మి.]
విశాఖపట్నం.. ద్వారకానగర్‌లో..
అదొక ఐదంస్తుల భవనం.. పాలపిట్ట రంగు గోడలు.. నిలువెత్తు ఫ్రెంచ్ విండోలు.. భవనం ముందు యాభై రంగుల గులాబీ తోట.. బిల్డింగ్ ముందువైపు అర కిలోమీటర్ దూరం దాకా కనపడే ‘బ్యాంక్ ఆఫ్ విశాఖపట్నం’ అన్న బంగారం రంగు అక్షరాలు.. (కేవలం కథ కోసం కల్పితం).
లేజర్ సెక్యూరిటీ.. ప్రతీ ఛాంబర్‌కీ బయోమెట్రిక్ డోర్లు.. అన్నీ హైటెక్.
మొత్తం దేశంలో ఉన్న ఉన్న డిపాజిట్లలో సగం ఈ బ్యాంక్ లోనే ఉన్నాయని అందరికీ తెలుసు..
ఇక్కడ సెక్యూరిటీ సిస్టమ్ కూడా చాలా గట్టిగా ఉండడం వల్ల కొన్ని ముఖ్యమైన ప్రభుత్వ కాగితాలూ, మెమొరి కార్డులు ఇక్కడి లాకర్‌లో ఉంటాయి..
ఆ బ్యాంకు భవనానికి బయటకు వెళ్ళడానికి ఉన్న ఐదు తలుపులూ నాలుగు అంగుళాల మందం ఉన్న స్టీల్‌తో చేయబడినవి..
ఆ తలుపు తెరవడానికి కేవలం ఇద్దరి స్మార్ట్ ఫోన్లలో ఒక యాప్ ఉంది. ఆ యాప్‌లో రోజూ కోడ్ మారుతూ ఉంటుంది.. ఆ కోడ్ వేరే ఫోన్ కి వస్తుంది. యాప్‌లో ఆ కోడ్ ఎంటర్ చేసిన తర్వాతనే ఆ ఐదు తలుపులూ తెరుచుకుంటాయి..
ఆ యాప్ సెక్యూరిటీ గార్డ్ ఫోన్లోనూ, చీఫ్ మేనేజర్ అనుపమ ఫోన్లోనూ మాత్రం ఇన్‌స్టాల్ చేసి ఉంది.. ఎంటర్ చెయ్యవలసిన కోడ్ ఆ బ్యాంకు చీఫ్ మేనేజర్ అనుపమ వేరే ఫోన్లోకి వస్తుంది..
***
అనుపమకు నలభై ఐదేళ్ళు.. ఆమె సాంకేతిక విషయాల్లో ఎంత అప్డేటెడ్ ఉంటుందో వస్త్రధారణలో అంత సాంప్రదాయంగా ఉంటుంది.. బ్యాంకుకు ఎప్పుడూ చీరతోనే వస్తుంది.
మంగళవారం ఉదయం.. మీగడ రంగు బెంగాల్ కాటన్ చీరతో తయారయ్యి బ్యాంకుకు వెళ్ళక ముందు తన గదిలోకి వెళ్ళింది..
బట్టల గూడు తలుపు వెనక అంటించిన ఫోటోను తదేకంగా చూసింది.. అది ఇరవై ఏళ్ళ క్రితం ఫోటో!
ఫోటోను చేత్తో అప్యాయంగా తడిమింది.. కళ్ళలో నీళ్లు బయటకు రాబోయి ఆగిపోయాయి.
‘ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు? ఇవాల్టికి నువ్వు వెళ్ళిపోయి ఇరవై ఏళ్ళు అయింది.. ఒక్కసారి.. ఒక్కసారి.. కనిపించవూ’ ఆరాటంగా మనసులో అనుకొంది.
అంతలోనే తన కర్తవ్యం గుర్తొచ్చింది..
గూడు తలుపు గబుక్కున వేసేసి బయటకు నడిచింది..
ఫోన్ తెరిచి ‘లాక్ ఓపెనింగ్ కోడ్’ ను బ్యాంక్ సెక్యూరిటీ గార్డ్ కి పంపింది. అది సెక్యూరిటీ గార్డ్ ఫోన్లో కనపడటానికి అరగంట పడుతుంది.. అరగంటలో ఆమె ఆఫీసు చేరుకుంటుంది..
***
అనుపమ తన ముందున్న పేపర్లను జాగ్రత్తగా చదివి ఒక్కొక్క దాని మీద సంతకం చేస్తోంది.. ఎంత ఏకాగ్రతతో పని చేస్తున్నా ఆమె మనసు ఒక మూలలో పొద్దున్న చూసిన ఫోటో అలాగే ఉంది..
గంట గడిచిపోయింది..
అనుపమ పీయే డాలీ ఆ గదిలోకి పరుగు పరుగున వచ్చింది..
“మేడమ్.. బ్యాంక్ బయటా లోపల చాలా గొడవగా ఉంది.. అందరూ ఆందోళనగా ఉన్నారు” రొప్పుతూ అంది..
“ఏమయింది?” కాగితాలు పక్కన పెట్టీ అడిగింది అనుపమ.
“మేడమ్, బ్యాంక్ బయటకు వెళ్ళే తలుపులన్నీ ఆటోమేటిక్ గా లాక్ అయిపోయాయి. బయటి వాళ్ళు లోపలికీ, లోపలి వాళ్ళు బయటికీ వెళ్ళలేకపోతున్నారు”
“ఇంపాజిబుల్.. నేను సెక్యూరిటీ కోడ్ పంపే దాకా అలా అవకూడదు కదా!? ఇదెలా జరిగింది?”
బ్యాగ్ నుండి ఫోన్ తీసి డోర్ లాకింగ్ అప్ ఓపెన్ చేసి లాగిన్ అవడానికి ప్రయత్నించింది..
‘ఇన్‌కరెక్ట్ పాస్‌వర్డ్’ అన్న ఎర్రని అక్షరాలు బ్లింక్ అవుతూ కనిపించాయి!
‘గాడ్! నా ఫోన్ హాక్ అయింది’ తలపెట్టుకొని ఆందోళనగా అనుకుంది ఆమె.
నిమిషాల్లో ఈ వార్త బ్యాంకులో అందరికీ తెలిసిపోయింది.. బయటి నుండీ లోపలికి వద్దాం అనుకొంటున్న కష్టమర్లకూ తెలిసి పోయింది. బ్యాంకు లోపల ఉద్యోగస్థుల మొహాలు భయంతో పాలిపోయాయి. తాము బంధించబడ్డారు!! తర్వాత ఏం జరుగుతుంది?
ఇంతలో అనుపమ ఛాంబర్ లో స్పీకర్ లో ఒక సింథటిక్ వాయిస్ వినిపించింది..
“ఇది ఎమర్జెన్సీ లాక్‌డౌన్. ఒక సేఫ్ వాల్ట్ తెరవాలి.. అందులోని డాక్యుమెంట్స్ బయట పెట్టాలి. లేకపోతే ఈ లాక్‌డౌన్ ఎప్పటికీ తీయబడదు.” అన్న మాటలు గది గోడలకు తగిలి ప్రతిధ్వనించాయి..
బ్యాంకు సిబ్బందికి గజిబిజి!!
ఆశ్చర్యకరంగా ఆ వాయిస్‍లో ఎలాంటి బెదిరింపు లేదు. “మీరు ఆస్తులు ఇచ్చేస్తేనే సేఫ్‌గా బయటికి వెళ్ళగలరు” అన్న మామూలు మాటలు.. అంతే!
అనుపమ వెంటనే ఐటి సిస్టమ్‍కి యాక్సెస్‌కి ప్రయత్నించింది.
కానీ బ్యాంక్ సిస్టమ్ కూడా లోపలినుంచే హ్యాక్ అయింది అన్న విషయం అర్థమైంది. అంటే.. ఎవరో బయటవాడు కాదు, లోపలవాడు ఈ ప్లాన్ వెనక ఉన్నాడు.
అనుపమ ఆఫీసులో ఒక్కొక్క ఉద్యోగి సీటు దగ్గరికి వెళ్ళి వాళ్ళ మొహాలు పరిశీలించింది.. అందరి మొహాలూ భయంతో పాలిపోయి ఉన్నాయి..
జూనియర్ ఉద్యోగి గౌతమి మొహంలో మాత్రం భయంతో బాటు ఆందోళన కూడా కనపడుతోంది.. ఆమె చేతులు సన్నగా ఒణకడం అనుపమ దృషిని దాటిపోలేదు..
అప్పటికే వాయిస్ మరోసారి వినిపించింది:
“లాకర్ నెంబర్ మూడు వందల పన్నెండు తెరవండి. అది తెరిచినప్పుడే తలుపులు అన్‌లాక్ అవుతాయి.”
లాకర్ మూడు వందల పన్నెండు..
అది సాధారణ కస్టమర్ దాచుకున్న బంగారం కాదు. ప్రభుత్వానికి చెందిన గోప్యమైన ఫైళ్ళు దానిలో ఉన్నాయి. వాటిని బయటికి తీస్తే దేశానికి భారీ నష్టం.
అనుపమకు అర్థం అయింది; ఇది కేవలం బ్యాంక్ దోపిడీ కాదు, ఒక సమాచార దోపిడీ!!
అనుపమ నిశ్శబ్దంగా గౌతమి దగ్గరకు నడిచింది..
“గౌతమీ లాప్‌టాప్‌లో ఏం చేస్తున్నావ్?” మృదువుగా అడిగింది.
“నేను.. మేడమ్. నేను.. డిపాజిట్ లెడ్జర్‌లో ఎంట్రీలు వేస్తున్నాను”
“ఏదీ చూడనీ” అంటూ గౌతమికి ఎదురుగా కూర్చుని లాప్‌టాప్ తన వైపు తిప్పుకుంది.
స్క్రీన్ మీద లెడ్జర్ కనపడుతున్నా, బ్యాక్‌గ్రౌండ్‌లో ఏదో ప్రోగ్రాం రన్ అవుతున్నట్లు వెంటనే కనిపెట్టింది అనుపమ.
బ్యాంక్‌లో ఆ హాలు మొత్తం సూది కిందపడితే వినపడేంత నిశ్శబ్దంలో మునిగిపోయింది..
అందరి కళ్ళూ వీళ్ళిద్దరి వైపే ఉన్నాయి..
సిస్టమ్‌లోకి వెళ్ళి ఆ ప్రోగ్రాం చూసింది..
తాను అనుకొన్నది నిజమే అయింది.. అనుపమ కళ్లెత్తి సూటిగా గౌతమి కళ్ళలోకి చూసింది. అప్పటికే ఆమె కళ్ళు భయ విహ్వలంగా మారాయి.. పెదవులు అదురుతున్నాయి..
బ్యాంకు లాక్‌డౌన్ సిస్టమ్‌ను నిర్వీర్యం చేసే ప్రోగ్రామ్ అది..
ఆ ప్రోగ్రామ్ రాసేవాళ్ళు ప్రోగ్రామింగ్‌లో నిష్ణాతులు అయి ఉండాలి.. ముందు బ్యాంక్ ప్రోగ్రామ్‌ను హాక్ చెయ్యాలి. తర్వాత దాన్ని నిర్వీర్యం చేసే ప్రోగ్రామ్ రాయాలి..
కేవలం బ్యాంకు పరీక్షలు పాసయ్యి, ఏదో జూనియర్ లెవెల్ డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పని చేస్తున్న గౌతమికి ఇవన్నీ సాధ్యమా?
“లాప్‍టాప్ తీసుకొని నా చాంబర్ లోకి రా” అంది అనుపమ గౌతమితో..
జారిపోతున్న చున్నీ సర్దుకుంటూ తడబడే అడుగులతో అనుపమ వెనకే నడిచింది గౌతమి..
ఇద్దరూ గదిలోకి వెళ్ళాక బయోమెట్రిక్ సిస్టమ్‌తో తన ఛాంబర్ తలుపు వేసేసింది..
“ఇప్పుడు చెప్పు.. ఇదంతా ఎలా చేశావ్? ఎందుకు చేసావ్?” గౌతమి మొహంవైపు పట్టిపట్టి చూస్తూ అడిగింది..
అంతదాకా ఉగ్గపట్టుకున్న దుఃఖం పెల్లుబికి రాగా భోరున ఏడుస్తూ అనుపమ కాళ్ళమీద పడిపోయింది గౌతమి.
“మేడమ్ ప్లీజ్ నన్ను రక్షించండి.. నా ఉద్యోగం ఊడితే మా కుటుంబం అంతా వీధిన పడుతుంది.. నాకు వాళ్ళు ఇస్తామన్న డబ్బు కూడా రాదు..” అంది వెక్కుతూ..
“వాళ్ళా అంటే ఎవరు? ఎంత ఇస్తామన్నారు?”
“……”
“నువ్వు అలా మౌనంగా ఉంటే ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేసి పిలుస్తాను.”
“చెప్తాను మేడం. వాళ్ళెవరో తెలియదు.. కానీ కొన్ని పనులు చేస్తే కోటి రూపాయలు ఇస్తామన్నారు”
“కోటి రూపాయలు!! అంటే ఏం పనులు చెయ్యమన్నారు? వాళ్ళెవరో నీకు తెలియకుండా పనులు ఎలా చెప్పారు?”
“మొదట ఒక వాట్సాప్ మెసేజ్ వచ్చింది మేడం. ‘మేము వాట్సాప్ అటాచ్మెంట్ కింద మీకు ఒక ఏపీకే ఫైల్ పంపుతాము. నువ్వు దాని మీద క్లిక్ చేసి ఓపెన్ చేస్తే చాలు.. నీకు యాభై లక్షలు ఇస్తాము. తర్వాత మీ బ్యాంకులో కొంత గొడవ జరుగుతుంది.. ఆ గొడవ అయ్యాక మా చేతిలోకి కొన్ని ప్రభుత్వ సమాచారం ఉన్న కాగితాలు వస్తాయి. అవి వచ్చాక నీకు మిగిలిన యాభై లక్షలూ ఇస్తాము’ అన్నారు.”
“ఐతే మొదటి విడత డబ్బులు ఎలా ఇచ్చారు? ఫోన్ పే? గూగుల్ పే? బ్యాంకు ట్రాన్స్‌ఫర్?”
“అవేవీ కాదు మేడం.. ఫలానా రోజు రుషి కొండ బీచ్‌లో కూర్చోమన్నారు. నేను కూర్చున్నాను.. కొంతసేపటికి ఫోన్లో మెసేజ్ వచ్చింది. ‘నీ కుడిపక్కకు తిరిగి రెండువందల అడుగులు నడువు. అక్కడ నీకు ఒక ఎర్రని బ్యాగ్ కనిపిస్తుంది తీసుకో. తర్వాత వెనక్కు తిరక్కుండా తిన్నగా ఆటో స్టాండు దగ్గరికి వెళ్ళిపో’ అని. నేను అలాగే చేసాను. నిజంగానే అక్కడ బ్యాగ్ ఉంది. ఇంటికి వచ్చాక చూస్తే అందులో యాభై లక్షల రూపాయిలు ఉన్నాయి. అన్నీ పాత వంద నోట్లూ, యాభై నోట్లూనూ.”
“ఆ వాట్సాప్ మెసేజెస్ చూపించు”
“ఆ మెసేజ్‌కి ఆటో డిలీట్ ఆప్షన్ పెట్టినట్లు ఉన్నారు. మెసేజ్ వచ్చిన పది నిమిషాల్లో డిలీట్ అయిపోతూ ఉండేవి..”
అది అనుపమ ఊహించిందే.. అందుకే ఎక్కువ ఆశ్చర్య పోలేదు.
ఆ హాకర్స్ చేసిన పని అర్థమైంది. మొదట వాళ్ళు ఒక ఏపీకే ఫైలును గౌతమి ఫోన్లోకి పంపి ఆమె ఫోన్ హాక్ చేశారు. ఆ తర్వాత గౌతమి లాప్టాప్ కూడా హాక్ చేశారు. బ్యాంకు లోకి వచ్చి ఆమె లాప్టాప్ బ్యాంకు వైఫై కి కనెక్ట్ అవగానే అందులో బ్యాంక్ డోర్ లాకింగ్ సిస్టమ్‌ను హాక్ చేసి, దాన్ని తమ చేతుల్లోకి తీసుకొన్నారు..
వీళ్లకు డబ్బు అక్కర్లేదు.. డబ్బు కోసమే అయితే ఇంత పకడ్బందిగా ప్లాన్ చేసిన వాళ్లు పెద్దపెద్ద అకౌంట్లు హాక్ చేసి డబ్బులు డ్రా చేసుకోవడం అంత కష్టం కాదు.. బ్యాంక్ లాకర్లో ఉన్నది ఏ కంప్యూటర్ ప్రోగ్రాము కాదు, కాగితాలూ.. మెమొరి కార్డులు. అవి సంపాదించాలంటే ఇలా భౌతికంగా ఏదోకటి చెయ్యక తప్పదు..
ఆలోచనలతో ముడిపడిన అనుపమ భ్రుకుటివైపే ఆత్రంగా చూస్తోంది గౌతమి..
అనుపమ బ్యాంక్ సిస్టమ్ ఆఫీసరును పిలిపించి అతనికి గౌతమి లాప్‌టాప్ అందించి విషయం అంతా చెప్పింది..
అతను గౌతమి లాప్‌టాప్ లోని ప్రోగ్రామ్‌లో మార్పులు చేసి బ్యాంక్ లాకింగ్ సిస్టమ్ పని చేసేటట్లు చేశాడు..
బ్యాంక్ తలుపులు తెరుచుకున్నాయి..
పోలీసులు లోపలికి వచ్చారు..
గౌతమిని అరెస్ట్ చేశారు..
నాలుగు గంటల తర్వాత సిస్టమ్ ఆఫీసర్ వచ్చి చెప్పాడు..
“మేడమ్, గౌతమి గారి లాప్‌టాప్ లోకి ప్రవేశపెట్టబడ్డ ప్రోగ్రామ్ ఎక్కడి నుండి వచ్చిందో ఐపి అడ్రస్ తెలిసింది..”
“క్విక్.. సైబర్ క్రైమ్ వాళ్లకి రిపోర్ట్ చెయ్యాలి” అంది అనుపమ.
పోలీసులు ఆ ఐపి అడ్రస్‌ను ట్రేస్ చేయగా అది ‘కలపకోనా’ లోని ఒక విడిచిపెట్టిన గోదాముకు కనెక్ట్ అయ్యింది.
టీమ్ అక్కడికి వెళ్ళినప్పుడు కేవలం పాత లాప్‌టాప్లు, ఆటోమేటెడ్ సర్వర్లు, స్పీకర్ మాత్రమే ఉన్నాయి. అక్కడ ఎవరూ లేరు!
లాప్‌టాప్ స్క్రీన్ మీద ఒక లైన్ మాత్రమే మిగిలి ఉంది..
“నేను ఒక వ్యక్తిని కాదు.. ఒక నీడను. నేను నీ కోసమే ఎదురు చూస్తున్నాను.”
సైబర్ టీమ్ అతను వాడిన ప్రోగ్రామ్‌ని విశ్లేషించింది.
అందులో ఒక లూప్ కోడ్ ఉంది..
ప్రతి ఇరవై నాలుగు గంటలకు ఒకసారి కొత్త ప్రదేశం నుంచి కనెక్ట్ అవుతుంది. తదుపరి కనెక్షన్ శ్రీకాకుళం తీర ప్రాంతం నుంచి జరగబోతోందని వారు కనుగొన్నారు. లొకేషన్: శ్రీకాకుళం దగ్గర చిన్న లైట్‌హౌస్.
పోలీసులు, అనుపమతో పాటు సైబర్ టీమ్ అక్కడికి దూసుకెళ్లింది.
లైట్‌హౌస్‌లో అతను కూర్చున్నాడు!!
చుట్టూ స్క్రీన్లు, కోడ్ల వరస.
అతడు నవ్వుతూ అన్నాడు:
“అనుపమా, చివరికి నువ్వే నన్ను పట్టుకుంటావనుకున్నాను. పట్టుబడితే నీ చేతిలోనే పట్టుబడాలి అనుకొన్నాను.. నువ్వు వచ్చావు.. నిన్ను చూసాను అది చాలు..”
దిగ్భ్రాంతితో అనుపమ అతడిని చూస్తూ ఉండిపోయింది..
ఉదయాన్నే బట్టల గూట్లో చూసిన ఫోటో గుర్తొచ్చింది..
‘ఈ ఇరవై ఏళ్లలో ఇతని మొహం ఎక్కువ మారలేదు’ ఆనుకొంది ఆవేదనగా.
“జయంత్ ఎందుకు చేశావు ఇలా? ఇరవై ఏళ్ళ క్రితం నా నుండి, నా ప్రేమ నుండీ ఎవరికీ తెలియకుండా ఎందుకు పారిపోయావు?” ఆరాటంగా అడిగింది.
జయంత్ ముఖం కఠినంగా మారింది.
“ప్రతీకారం!! ఈ బ్యాంక్ నా కెరీర్‌ను నాశనం చేసింది. నేను సృష్టించిన సెక్యూరిటీ సిస్టమ్‌ని వాడి, నన్ను ఒక స్కామ్‌లో ఇరికించి, నన్నే తొలగించారు. ఆ అవమానమే నన్ను నీడగా మార్చింది. పట్టుబడితే నీకే పట్టుపడతాను. పెట్టుబడకపోతే నా ప్రతీకారం తీరుతుంది.. జీవితంలో ఇంకేం అక్కర్లేదు” తెరలు తెరలుగా నవ్వుతూ అన్నాడు.
పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు..
పోలీసు వాన్ ఎక్కబోతూ అతను అనుపమ వైపు తిరిగి అడిగాడు.. “నువ్వు పెళ్లి చేసుకున్నావా?”
“లేదు” నిర్లిప్తంగా సమాధానం ఇచ్చింది అనుపమ.
(సమాప్తం)
నా పేరు అవధానుల విజయలక్ష్మి. నేను 2010 లో కోల్ ఇండియా నుండి పదవీ విరమణ చేశాను. 1970నుండి 1992 మధ్యకాలంలో నావి వంద కథల వరకు ప్రసిద్ధ వార, మాస పత్రికలలో ప్రచురింపబడ్డాయి. వివిధ పోటీలలో పది కథలకు బహుమతులు అందుకున్నాను.
ఆ తర్వాత విధి నిర్వహణలు ఎక్కువ అయి సాహిత్యానికి కొంత విరామం ఇచ్చాను.
2019 నుండి ప్రతిలిపి అన్న అంతర్జాల వేదిక మీద రచనలు చేస్తున్నాను. అక్కడ వందకు పైన కథలు, రెండు వందల కవితలు, వందకు పైగా వ్యాసాలు, ఇరవై నవలలు వ్రాసాను. ఐదు నవలకు బహుమతులు అందుకున్నాను.
