Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మోసం చెయ్యటం ఎలా?-1

[ప్రముఖ రచయిత శ్రీ వేదాంతం శ్రీపతిశర్మ రచించిన ‘మోసం చెయ్యటం ఎలా?’ అనే హాస్య వ్యంగ్య నవలని ధారావాహికంగా అందిస్తున్నాము.]

1. సన్నాసి-సన్యాసి

రాత్రి ఒంటిగంట దాటిన తరువాత ఎందుకో హఠాత్తుగా మెలకువ వచ్చింది. వయసు మీద పడ్డవారికి పెద్ద సాధనతో పని లేదు. గృహస్థ ధర్మాలు పాటించే వారికి పెద్ద పెద్ద యోగులు చేసే సాధన ద్వారా పొందిన సత్ఫలితాలన్నీ లభిస్తాయని భాగవతం ఎనిమిదవ స్కంధం సూటిగా చెప్పింది. అలాగే వయసు మీద పడ్డవాడు దైనందిన జీవితంలో సలిపే అన్ని కార్యక్రమాలూ కొద్దిగా చిత్రంగానే చేసుకుంటూ పోతాడు. ఓ కిలోమీటరు వరకూ ట్రంకు పెట్టె వీపు మీద మోసుకుంటూ వెళ్లినవాడు దానిని క్రిందికి దింపాక కూడా మరి కొద్ది దూరం వంగి నడుస్తాడు. తనను తాను మరచిపోయి తనకు జరిగినదానిని బరువుగా తలచుకోవటమే వార్ధక్యమని నిద్రపోతూ కొందరు, నిద్రలోంచి లేచి ఆవులించి మరి కొందరు గట్టిగా తీర్మానించిన అంశం!

మెలకువ వచ్చినా అలా చూస్తూనే ఉన్నాను. ఏం జరిగిందో తెలియాలంటే శరీరంలోని ఆ పరికరాలకు మనలను పలుకరించే వ్యవధి ఇవ్వవలసిన అవసరం ఉంటుంది. ఎదురుగా ఇటీవల సున్నం కొట్టించిన తెల్లని గోడ కనిపిస్తోంది. గొప్ప పేరు సంపాదించిన సినీ దర్శకులు చాలా మంది మనలను ఆలోచింప జేస్తున్నారనుకుంటూ ఇలాంటి గోడలను అలా కొద్ది సేపు తెర మీద కదలకుండా ఉంచేస్తారు. అదో ప్రతిభ!

అంచాత ప్రతిభావంతునిలాగా నేనూ అలాగే ఉండిపోయాను. అలాంటి సందర్భాలలో హఠాత్తుగా వచ్చి చూసేవారికి పడుకున్నాడా? పడుకుంటాడా? కూర్చుంటాడా? లేక లేస్తాడా.. ఉన్నాడా? లేక.. ఇలాంటి ప్రశ్నలు విరివిగా కలుగుతూ ఉంటాయి.

ఫరవాలేదు, బ్రతికేస్తాను అనుకుంటూ బ్రతకటంలో గల పెద్ద మోసం అదే! అంతలోనే గోడ మీద ఏదో బొమ్మలా కనిపిస్తోంది.. వాస్తవానికి అది ఏర్పాటు అవుతోంది. ఏమిటీ బొమ్మ? లేక ఏదైనా దయ్యం లాంటిది ఈ ఒంటరి గదిలోకి తుంటరి దానిలా ప్రవేశించి అద్దె కట్టకుండానే ఇక్కడ స్థిరపడిపోయిందా?

ఆ మాటకొస్తే దయ్యాలూ, భూతాలూ నన్ను ఎన్నడూ బాధించలేదు! తోచనప్పుడు అలాంటివి ఎక్కడ దొరుకుతాయో బావుండు, టైమ్ పాస్ చెయ్యవచ్చు అనుకున్నాను కూడా! చిన్న పిల్లలు చాలా మంది మనుషులని చూసి భయపడ్డారు కానీ భూతాలని చూసి వెర్రిగా నవ్వటమే చూసాను!

ఈ గోడ మీద అదేంటో నాలాంటి వాడే కనిపిస్తున్నాడు. ఫాషన్‌లో ఉన్న కాషాయం తొడిగాడు! చూస్తుండగా స్వరూపం ఇంకా ప్రస్ఫుటంగా ఏర్పడుతోంది. కళ్లజోడు కూడా తయారయింది. ఇక లాభం లేదనుకుని అటూ ఇటూ కదలి ఇది మన లోకమనే నిర్ధారించుకుని అనుమానంగా ప్రక్కనున్న నీళ్ల చెంబు చూసి దానిని అదిమి పట్టుకుని గొంతు తడుపుకుని మరీ చూసాను. వాడు చక్కగా చిరునవ్వు నవ్వాడు.

“ఎవరు నువ్వు?”, అడిగేసాను.

నాకున్న అలవాటే అతనూ ప్రదర్శించాడు. కళ్లజోడు సద్దుకున్నాడు.

“అబ్బా! ఎన్నాళ్లయింది? ఈ ప్రశ్నకి?”, అన్నాడు.

“అంటే?”

“నీలో, నీతో, నిరంతరం మసలుకొనే నీ వాడిని, నీ సన్యాసిని!”

“అన్యాయం.”

“శిశువా! నాకు వయసు లేదు. కానీ నీ వయసుతో కలసి మెలసి ప్రవర్తిస్తాను.”

“ఇప్పుడెందుకు దర్శనమిచ్చావు స్వామీ?”

“మంచి ప్రశ్న! రైల్లో చెయిన్ లాగినట్లు పాయింట్ లాగావు. ఇంతవరకూ నిన్ను నువ్వు మోసం చేసుకున్న సన్నాసివి!”

“ఓ. ఇప్పుడు?”

“ఈ రాత్రి నుండీ అందరినీ మోసం చేయవలసిన సన్యాసివి!”

“ఎందుకు? ఎలా?”

“చెబుతాను. కళ్లు మూసుకో శిశువా!”

(తదుపరి భాగం వచ్చే వారం)

Exit mobile version