[ప్రముఖ రచయిత శ్రీ వేదాంతం శ్రీపతిశర్మ రచించిన ‘మోసం చెయ్యటం ఎలా?’ అనే హాస్య వ్యంగ్య నవలని ధారావాహికంగా అందిస్తున్నాము.]
[గదిలో ఉన్న ఆ విదేశీ వనిత ఉన్నట్టుండి నృత్య భంగిమ పెడుతుంది. కథకుడు భయపడతాడు. ఇంతలో అక్కడి టీపాయ్ మీద సన్యాసి ప్రత్యక్షం కాగా, తనని కాపాడమని వేడుకుంటాడు కథకుడు. ఆమె రష్యన్ నర్తకి అనీ, అభ్యాసం చేస్తున్నట్లున్నదని అంటాడు సన్యాసి. కాసేపయిన తర్వాత ఆమె చిన్న కూచిపూడి భంగిమ చేసి ఎలా ఉందని కథకుడిని అడుగుతుంది. బావుందని చెప్పి, ఆమె పేరు అడుగుతాడు. వోంద్రా అని చెబుతుంది. గుండ్రంగా తిరిగి, కథకుడుని ఒక్క లాగు లాగి, గోడ మీదకి ఎగురుతుంది. కథకుడి పేరు అడుగుతుంది, సుందర్ అని చెప్తాడు. ‘సూపర్! అయాం వోంద్రా, యూ ఆర్ సూంద్రా.. సూపర్!’ అని అంటుంది. సుందర్ కుడికాలిని తొక్కుతుంది. ఎడమకాలిని తొక్కకుండా తప్పించుకునే ప్రయత్నంలో సుందర్ కింద పడబోతాడు. ఆ సమయంలో ఎందుకో ఆమెకి చిత్రమైన ఆనందం కల్గుతుంది. ‘మా ఆశ్రమంలో సీనియర్ సన్యాసి ఒకరు ఇలానే డాన్స్ చేస్తారు, రా’ అంటుంది. సుందర్ నేల మీద బోర్లా పడతాడు. అతని మీద వోంద్రా పడుతుంది. అంతలో తలుపు తీసుకుని లోపలికి వచ్చిన అనకాపల్లి యువతి కెవ్వున కేక వేస్తుంది. తన నడుం ప్రాంతంలో నొప్పి కలుగుతున్నట్టు తెలుస్తుంది సుందర్‌కి. ఇంతలో సన్యాసి ప్రత్యక్షమై, ‘అరైజ్ అవేక్’ అని అంటాడు. – ఇక చదవండి.]
సమోసా ఉపాఖ్యానం (9)
చాలా చిన్నప్పుడు నా కంటే చిన్న వాళ్లని వీపు మీద ఎక్కించుకుని ఉప్పు మూట ఆడి యున్న జ్ఞాపకం ఉన్నది. మరొక్క సారి ఆస్పత్రిలో నన్ను ఆ భంగిమలో పడుకో పెట్టి వీపు మీద అక్కడక్కడ నొక్కి నా వీపు టోపోగ్రఫీలో ఎక్కడుందో డాక్టర్లు నా అరుపులను, మూలుగులను ఆధారం చేసుకుంటూ నిర్ధారించుకున్న సందర్భం గుర్తుకొచ్చింది. కానీ ప్రస్తుతం నొప్పిని నేను ఎక్కడైనా సృష్టించగలను అనే ధీమాతో ఈ వోంద్రా అను మహిళ ఇసుమంత కూడా కదలకుండా నా చిన్న సైజు అస్తిత్వం మీద సంపూర్ణ సార్వభౌమత్వాన్ని నిశ్శబ్దంగా ప్రకటించి ఊరుకుంది. ఎంత ప్రయత్నం చేసినా పట్టు సడలించే ఆలోచన ఇప్పుడప్పుడే కలిగేలా లేదు. గీత దగ్గర నేను కనీసం ‘కబడ్డీ కబడ్డీ’ అనగలిగే పరిస్థితీ కాదు. ఆమెను ఆ ఆలోచన వైపు పయనించే ప్రయత్నం చేయాలన్నా ద్వైపాక్షిక చర్చలు అసలు ప్రారంభించలేము! ఒక అల్పజీవి మీద దురాక్రమణ జరిగిపోయింది. వేరే సమీకరణలు చెయ్యాలన్నా కష్టమే! సన్యాసి చక్కగా నవ్వుతున్నాడు.
“ఇదేమిటో తెలుసా?”, అడిగాడు.
“ఇలాంటి పరిస్థితికి కూడా నిర్వచనం ఉంటుందా సన్యాసీ?”
“మన భూమి మీద నిర్వచించలేని వస్తువు, విషయం ఉండనే ఉండవు శిశువా.”
“అయితే నీ బాధ కూడా చెప్పెయ్యి సన్యాసీ! వాంతి చేసుకునేటప్పుడు పూర్తిగా అన్నీ బయటకు వచ్చెయ్యాలంటారు.”
“భయపడకు శిశువా! గ్రంథంలోని అవాంతరప్రకరణాన్ని నీకు అమాంతం చెప్పేస్తాను.”
“చిత్తం!”
“తెలుగు సినిమా హీరోలా ఇద్దరు హీరోయిన్ల మధ్య విచిత్రమైన భంగిమలో ఇరుక్కున్నావు శిశువా. దర్శకేంద్రులెవరైనా ఈ దృశ్యాన్ని వీక్షిస్తే కనుక నీకు శిరస్సు వంచి పాదాభివందనం చేసేస్తాడు!”
అంతే కానీ నన్ను బంధవిముక్తుడను చేసే ప్రయత్నం మటుకు చెయ్యడన్నమాట! ఎంత మాట? ఇంతలోనే కిఞ్చిత్తు గర్వం కూడా లోన మరో మూలుగులా చోటు చేసుకుంది. గొప్ప గొప్ప కథలకు ముగింపులు ఒక్క చిన్న వాక్యంతో జరిగిపోతుంది. ఏ కారణం చేతనో ఈ వోంద్రా అనే పిశాచం క్రిందకి దిగే ప్రయత్నం చేస్తూ నా మెడను అదిమి పట్టినా తక్షణం నాకు ఆత్మదర్శనం అలవోకగా జరిగిపోగలదు! తలుపు అవతల కాచుకుని నిలబడ్డ అనకాపల్లి దయ్యం అసలు ఇంకా రంగంలోకి దిగే సూచన కూడా ఇయ్యలేదు. ఈ ఇద్దరూ నాకు హీరోయిన్లా? ఆహా.. వేళాకోళానికైనా సన్యాసికి పరిధులు లేవు అస్సలు!
“సన్యాసీ”
“యస్?”
“హీరోయిన్లు, హీరోలూ కారు.”
“మరి?”
“నారీ నారీ నడుమ నడుమూడిన మురారిని! ముందర కార్యక్రమం గురించి ఆలోచించు స్వామీ!”
“మానవ జన్మ చిత్రమైనది”
“కరెక్ట్”
“సంచిత కర్మలలోంచి ఈ జన్మలో అనుభవించవలసినవి ప్రారబ్ధ కర్మలు.”
“ఇంకా?”
“ఆ కర్మల ఫలితంగా ఎవరు పైనుంటారు, ఎవరు క్రిందనుంటారు..”
“ఎవరు పీక్కుంటారు, ఎవరు గోక్కుంటారు, ఎందరు లాక్కుంటారు.. ఇవన్నీ నిర్వచించబడతాయి.”
“కరెక్ట్. లెస్స పలికావు. ముసలితనంలో బాధలు మొసళ్లలా మారి మరీ పీకుతాయి శిశువా. దానికి సిద్ధం కమ్మని సూచన!”
“గజేంద్రుడిని క్రిందనుండి పట్టుకుంది మొసలి”
“నిన్ను పైనుండి బాధిస్తున్నది.”
“జగమేలే పరమాత్మా! ఎవరితో మొరలిడుదు? అల వైకుంఠపురం నుండి అతగాడు రావాలంటే ఇప్పుడెలా? తలెత్తి మొరపెట్టుకోవాలన్నా కుదిరేటట్లు లేదు సన్యాసీ!”
“ఊ.. సాధన మార్గం అనేది కత్తి మీద సాము లాంటిది శిశువా!”
“ఛా! ప్రస్తుతం నా మీద కొండచిలువ పాములాగున్నది స్వామీ! ఇంతకీ అనకాపల్లి ఏం సాధిస్తోంది? ఒక్క సారి అరచింది. అంతే. ఇప్పుడు మౌనంగా ఎందుకున్నది?”
“రాక్షసీమణులు రెండు రకాలు.”
“ఓ”
“తెగ మాట్లాడే వాణీమణులు, ఏ మాత్రం మాట్లాడని మహారాణులు.”
“ఎందుకు మాట్లాడటంలేదో గమనించావా?”
“ఉత్తిష్ఠత, జాగ్రత, ప్రాప్యవరాన్నిబోధత.. అరైస్, అవేక్, స్టాప్ నాట్.. ఇది ఉపనిషత్తు వాక్యం.”
“నేను గొప్పవాడిని సన్యాసీ!”
“ఎందుకలాగ?”
“నన్నొక్కడినీ ఇంతమంది చంపాలనుకోవటం గొప్ప కాదా? నువ్వు కూడా పూనుకున్నావంటే నేను చాలా గొప్పవాడిని!”
“కాదు శిశువా! జాగ్రత్తగా తల ఎత్తే ప్రయత్నం చేసి అనకాపల్లిని చూడు!”
బలమంతా కూడగట్టుకుని గాలి లోపలికి పీల్చి కొద్దిగా తల పైకి ఎత్తాను..
దేని విలువైనా అది దూరమైనప్పుడు తెలుస్తుందంటారు పెద్దలు. పై ప్రాణం పైనే పోతున్నప్పుడు అదసలు లోపల ఒకప్పుడు ఉండేది, అది ఇదేనా అనే ఆలోచన కూడా ఎంతో విలువైనది.. కల కానిది!
ఏమీ లేదు. అనకాపల్లి ఎంతో అంకితభావంతో, సూక్ష్మదృష్టితో మనస్సును లగ్నం చేసిన ఏకాగ్రతతో, చుట్టూ ఉన్న ప్రపంచాన్ని పూర్తిగా విస్మరిస్తూ నేను ఇరుక్కున్న ఈ నాగపాశబంధనాన్ని తన మొబైల్ లోని కెమెరాలో అందంగా బంధిస్తున్నది. అదే పనిని మరి కొందరు చేయటానికి ఉత్సాహంగా దూరం నుండి వస్తున్నట్లు కూడా ఆ కొద్దిపాటి సమయంలోనే అవగాహనలోకి వచ్చింది. రాబోయేది పెద్ద పర్వం, జరగబోయేది అసలు చరిత్ర అని కూడా తేలిపోయింది.
“గర్వపడు శిశువా..”, సన్యాసి అంటున్నాడు, “..చరిత్ర సృష్టించబోతున్నావు!”
“అలాక్కానీ సన్యాసీ! ఇంతకీ ప్రస్తుతం నన్ను చూస్తే నీకేమనిపిస్తోంది?”
“నిన్న రాత్రి గోడ మీద కనిపించిన దృశ్యం ఙ్ఞప్తికి వచ్చుచున్నది శిశువా!”
“నాలో ఇంకా జవసత్వాలుండగానే వినిపించి పుణ్యం కట్టుకో!”
“మరేమీ లేదు శిశువా! బల్లి నోట్లో ఇరుక్కుని సగం చచ్చి పూర్తిగా చావబోతున్న బొద్దింకలా ఒకింత నాకు స్ఫురించుచున్నావు!”
(తదుపరి భాగం వచ్చే వారం)
వేదాంతం శ్రీపతిశర్మ కథా రచయిత. నవలా రచయిత. వ్యంగ్య హాస్య రచనలకు పెట్టింది పేరు. “ఆరోగ్య భాగ్యచక్రం” అనే పుస్తకాన్ని వెలువరించారు.
