[ప్రముఖ రచయిత శ్రీ వేదాంతం శ్రీపతిశర్మ రచించిన ‘మోసం చెయ్యటం ఎలా?’ అనే హాస్య వ్యంగ్య నవలని ధారావాహికంగా అందిస్తున్నాము.]
[తన వీపు మీదెక్కి ఆడుతున్న వోంద్రాని భరించలేకపోతాడు సుందర్. అది చూసి సన్యాసి నవ్వుతాడు. ఇదేమిటని సుందర్‌ని అడుగుతాడు. సుందర్ చెప్పలేడు. తెలుగు సినిమా హీరోలా ఇద్దరు హీరోయిన్ల మధ్య విచిత్రమైన భంగిమలో ఇరుక్కున్నాడనీ, దర్శకేంద్రులెవరైనా ఈ దృశ్యాన్ని వీక్షిస్తే కనుక సుందర్‍కు శిరస్సు వంచి పాదాభివందనం చేసేస్తాడనీ అంటాడు సన్యాసి. అనకాపల్లి కనకం ఏమీ మాట్లాడక, సాయం చెయ్యకుండా నిల్చుండిపోయేసరికి సుందర్‌కి ఆశ్చర్యం వేస్తుంది. జాగ్రత్తగా తల ఎత్తే ప్రయత్నం చేసి అనకాపల్లిని చూడమంటాడు సన్యాసి. ఎంతో అంకితభావంతో, సూక్ష్మదృష్టితో మనస్సును లగ్నం చేసిన ఏకాగ్రతతో, చుట్టూ ఉన్న ప్రపంచాన్ని పూర్తిగా విస్మరిస్తూ సుందర్ ఇరుక్కున్న ఆ నాగపాశబంధనాన్ని తన మొబైల్ లోని కెమెరాలో అందంగా చిత్రీకరిస్తూంటుంది కనకం. రాబోయేది పెద్ద పర్వం, జరగబోయేది అసలు చరిత్ర అని కూడా తేలిపోతుంది సుందర్‌కి. – ఇక చదవండి.]
సమోసా ఉపాఖ్యానం (10)
“నాకు ఇప్పుడైనా తెలియాలి”, వోంద్రా చెవిలో ఊదింది.
“ఏందది?”
“ఏమి చేస్తారు మీరు?”
“ఇది అన్యాయం”
“ఏమి? ఏది అన్యాయం?”
“ఇలా నన్ను నేల మీద పెట్టి, నొక్కి పట్టుకుని, ఏం చేస్తావో చూద్దాం అన్న మాట చాలా దారుణం.”
“ఓ నో.. అది కాదు. మీరు ఏం పని చేస్తారు అని ఇంతాకటినుండి అడుగుతున్నాను.”
“ఓ.. రచనలు చేస్తాను”, అని సన్నగా ఏమీ చేతకాదు అని చెబుతున్నట్లు చెప్పాను.
“రచన? ఓ.. రైటర్?”
“అవును.”
సన్యాసి ప్రత్యక్షమైనాడు.
“సూపర్ శిశువా!”
“ఎందుకలాగ?”
“రచనలలో కొందరిని చంపి, చదివించి ఇంకొందరిని చంపి ఏ ఇతర పని చెయ్యాలన్నా నన్ను కాకుండా లెక్కేసుకోమనే నీ లాంటి వాడిని నువ్వేం చేస్తావు అనే ప్రశ్న ఇలా నిలదీసేటట్లే ఉండాలి. వోంద్రా నీ మెడ మీద చెయ్యి పెట్టి అడిగింది. శభాష్!”
ఇంతలో పట్టు సడలింది. ఏమనుకుందో ఏమో, మెల్లగా దిగింది. సద్దుకుని దీర్ఘమైన నిశ్వాస విడిచింది. నిజానికి తననుకున్న పని కూడా అయిపోయింది. ఎదురుగా ఉన్న మరో ఆడ మనిషి చక్కగా వీడియో కూడా తీసేసింది. ఇంక చంపుకోవలసినది ఏమీ ఉండదు. నిరంతరం కావలసినంత చంపుకునేదానిని సోషల్ మీడియా అంటారు.
వోంద్రా చెయ్యి అందించి నన్ను లేపింది.
సన్యాసి మరల మెరిసాడు.
“నన్ను.. నన్ను.. అదేమి? చలించండి.. అయాం సారీ”, అంది.
“చలించండి కాదు తల్లీ.. క్షమించండి.”
అనకాపల్లి స్టైల్‌గా లోపలికి వచ్చింది. మైసూర్ పాక్ తింటావా అన్నట్లు ఆ మొబైల్‌ని చూపించి కొంటెగా నవ్వింది.
“నన్ను కొద్దిగా మోసం చెయ్యమని అడిగా.. నన్ను చులకన సేసేసారు గదండీ? ఇప్పుడేమైపోనాది? అంతా ఇందులోకి ఒచ్చేసినాది మరండి!”
ఓ సారి మొబైల్ లోకి తొంగి చూసింది.
“వామ్మో!”, అరచినంత పని చేసింది, “..ఇప్పటికే పది వేల హిట్లు.. వైరల్ అవుతా ఉంది ఓయమ్మో!”
సన్యాసి చేతులు కట్టుకున్నాడు.
“ఇదెక్కడి సమస్య సన్యాసీ?”
“మరేం ఫరవాలేదు శిశువా!”
“బయటకి రావటం ఎలా?”
“అసలు బయటకు ఎందుకు రావాలి?”
“అన్యాయం సన్యాసీ!”
“తొందర పడకు.”
“ఏం చెయ్యమంటావు? ఇక్కడ బ్లాక్‌మెయిల్ నడుస్తోంది.”
“జో హై నాం వాలా వొహీతో బద్‌నాం హై!”
“కరెక్ట్!”
“అంటే ఆలోచించు. ఇప్పటికే నీకు పేరు వచ్చేసినట్లు. ఆలోచించు..”
“జనం..”
చెయ్యి అడ్డు పెట్టాడు సన్యాసి.
“ఈ రోజు ఒకలా అనుకుంటారు. ఇంతలో రెండు రోజుల తరువాత ఓ తెలివిగలవాడు అసలు నిజం ఇక్కడుంది అని ఇంకో మాట అంటాడు. మీడియాలో అసలు చర్చ జరగాలనే చాలా మంది పిచ్చి పనులు చేసి పిచ్చి ప్రాచుర్యం తెచ్చుకుంటారు. నువ్వు కష్ట పడకుండానే నీకు అది లభించింది.”
“లభించింది.. లాభిస్తుందా?”
“సందేహం లేదు. నువ్వు సమోసా సంస్థ వద్ద ఉన్నావు! మొదటి అధ్యాయం ఇదే అనుకో!”
అనకాపల్లి కనకం, వోంద్రా ఇద్దరూ సోఫాలో కూర్చున్నారు.
అనకాపల్లి తెగ కులుకుతున్నది. “నాకు పదివేలే అన్నాడు. ఇప్పుడు బొమ్మ చూపించి పది లక్షలు చేసేత్తాను. టక టకా ఇరవై ఆంగిల్స్‌లో తీసాను బొమ్మ.. అసలా.. వీడియో అదిరిపొయ్యింది!”
“నాక్కూడా షేర్ చెయ్యి.. నా నంబరిస్తాను”, అన్నాను.
“ఏంటి సారూ! మేడమ్ చూడరా? ఏటనుకుంటున్నారేటి?”
ఇంతలో సమోసా ఆర్గనైజర్ వచ్చాడు.
“కనకం! చాలా థాంక్స్!”, అన్నాడు.
“అదేంటి?”, అన్నది లేస్తూ.
“బొమ్మ అదిరింది..”, అతనన్నాడు, “..అక్కడ చూడండి.”
అందరం వాకిలి వైపు వెళ్లి ఆ మైదానం లోని స్క్రీన్‌ను చూసాం.
అప్పటికే ఆ బొమ్మ దాని మీద మెరిసిపోతోంది. జనం పోగయ్యారు. చప్పట్లు కొడుతున్నారు. “ఆ బొమ్మని ఎవరో కంప్యూటర్‌లో మార్చేసాడు. మా ఇద్దరి క్రిందా కాప్షన్ – ఇక మీ మీద నుండి ఎవరూ దూకెయ్యలేరు! సమోసా అందుకోండి! మీరు ముందుంటారు! ఎన్నటికీ మోసపోలేరు!”
మాకు అవతల ఒక ప్లేట్ లోంచి సమోసాలు జారి పడుతున్నాయి!
వోంద్రా ఎందుకో మురిసిపోతోంది. “మీ మూక ఎక్స్‌ప్రెషన్ చానా బాగున్నది!”, అంది.
“మూక కాదు వోంద్రా.. ముఖ.. అలా అన్నమాట!”
సన్యాసి ఆ జనంలోంచి ఇటు తిరిగాడు.
“శిశువా! నువ్వు చేతకాని రైటర్వని నీకు తెలుసు. మొదటిదే రైటనుకో.. మూక కవిలా నువ్వు మూక రచయితవు!”
అనకాపల్లి పళ్లు బిగించింది!
(తదుపరి భాగం వచ్చే వారం)
వేదాంతం శ్రీపతిశర్మ కథా రచయిత. నవలా రచయిత. వ్యంగ్య హాస్య రచనలకు పెట్టింది పేరు. “ఆరోగ్య భాగ్యచక్రం” అనే పుస్తకాన్ని వెలువరించారు.
