[ప్రముఖ రచయిత శ్రీ వేదాంతం శ్రీపతిశర్మ రచించిన ‘మోసం చెయ్యటం ఎలా?’ అనే హాస్య వ్యంగ్య నవలని ధారావాహికంగా అందిస్తున్నాము.]
[సుందర్ మీద కూర్చుని ఉన్న వోంద్రా, ఇప్పుటికైనా అతనెవరో తనకి తెలియాలని అంటుంది. తానొక రచయితని అని చెప్తాడు సుందర్. ఇంతలో సన్యాసి ప్రత్యక్షమై సుందర్‌ని అభినందిస్తాడు. వోంద్రా పైకి లేచి, చేయి అందించి సుందర్‌ని కూడా లేపుతుంది. తనని క్షమించమని అడుగుతుంది. అనకాపల్లి కనకం సుందర్‍ని ఏడిపిస్తూ, తను తీసిన వీడియో తెగ వైరల్ అయిపోయిందని మురిసిపోతుంది. తనని ఆమె బ్లాక్‌మెయిల్ చేస్తోందని సుందర్ సన్యాసితో వాపోతాడు. ఏం పర్వాలేదంటాడు సన్యాసి. ఏమీ చేయకుండానే నీకు ప్రాచుర్యం లభించిందని అంటాడు. ఈ లోపు ఆర్గనైజర్ వచ్చి, కనకం తీసిన వీడియోని మెచ్చుకుని, ఆమెకు థాంక్స్ చెప్తాడు. తనకి కూడా ఆ వీడియోని షేర్ చెయ్యమంటాడు సుందర్. ఈ లోపు బయట బిగ్ స్క్రీన్ మీద ఆ వీడియో ప్లే అవుతుంది. జనాలంతా చప్పట్లు కొడతారు. సుందర్ ఎక్స్‌ప్రెషన్స్ బాగున్నాయని అంటుంది వోంద్రా. – ఇక చదవండి.]
సమోసా ఉపాఖ్యానం (11)
సమోసా సంస్థ వాళ్ళకి ఎందుకో నా మీద కొద్దిసేపు జాలి కలిగినట్లుంది. భరత భూమి మీద ఇంకా గంగ నీరు ప్రవహిస్తున్నట్లు అన్ని రకాల దుర్బుద్ధులు, విచ్చలవిడి వ్యవహారాలు, వీర విహంగం చేసేస్తున్నా అన్నింటినీ భరిస్తున్న నా బోటి వాడిని ఎందుకో ఓ మారు పరికించి బయటకు అనకపోయినా లోన ‘పాపం’ అనుకుంటారనిపించేటట్లు ఏమీ కాని వాడికి ఓ కానీ పారేసినట్లు ఓ చిరునవ్వు దానం చేసేస్తారు!
అతను ఆ ఇద్దరు మహిళలను బయటకు తీసుకెళ్లి తలుపు దగ్గరగా మూస్తూ “సార్, రిలాక్స్” అన్నాడు. ఇది గొప్ప మాట. రక్త పరీక్షకి వెళ్ళినప్పుడు కూడా ఆ రక్త పింజరి లాంటి సిస్టర్ నువ్వు మగాడివి అని మరచిపోకు అన్నట్లు పిడికిలి బిగించమంటుంది. మూడు నాలుగు సార్లు ఒకే చోట కుళ్లబొడిచి రక్తాన్ని కళ్ల చూసే ముందర కూడా “రిలాక్స్” అంటుంది!
“ఇంకా ఎంత టైం ఉందండి?”, అడిగాను.
“నే చెబుతాను సార్. ఓ అరగంట అనుకోండి” అని చెప్పి అతను వెళ్ళిపోయాడు.
ఆ మూసివేసిన తలుపు మీద మొబైల్ చూస్తూ సన్యాసి కనిపించాడు.
“శిశువా!”
“చెప్పు సన్యాసీ”
“అనకాపల్లి బాగానే తీసింది వీడియో.”
“అవునా!”
“జూమ్ చేయడం, చక్కగా హావ భావాలను చూపించ గలగటం బాగానే నేర్చుకున్నట్లు ఉంది.”
“ఏ కారణంగానైనా క్రింద పడ్డ వాడిని చూసి అందరూ నవ్వుకునే వారే సన్యాసీ!”
“తప్పు శిశువా. క్రింద పడ్డావు. కానీ పై చేయి నీదే అయినది. మోసం చేయటం నేర్చుకునే వారి సిలబస్‌లో ఇది తొలి అధ్యాయం. ఒక్కోసారి కావాలని కూడా కిందపడి పళ్ళు విరగ లేదని చూపించేందుకు పళ్ళు ఇకిలించి మరీ ఆ మాట చెప్పాలి!”
తలుపు తెరుచుకుంది. అత్యంత వినయంగా లోపలికి ఒకాయన ప్రవేశించి తలుపులు చాలా సున్నితంగా మూశాడు. జీన్స్ పాంట్ అతని పాదాలను కూడా కప్పేసింది. సమోసా వారు మరో డ్రామా కంపెనీని ఇక్కడికి వదిలినట్లు ఉంది. అప్పటికప్పుడు అందుబాటులో ఉన్న పాంట్ తొడుక్కోమని ఇచ్చినట్లున్నారు.
నా వైపు తిరిగి రెండు చేతులు జోడించి నమస్కారం చేశాడు. అలా చేసినప్పుడు ఆ కుర్తాకున్న జేబులోని కాగితాలన్నీ కదలి పైకి వచ్చాయి.
“నమస్కారం”, అన్నాను.
“నేను సరస్వతిని”, అని చేతులు కట్టుకున్నాడు.
“ఛా”
మెడలో ఏదో గట్టిగా పట్టుకున్నదనో లేక పట్టకుండా ఎవడో తెరపిస్ట్ ఇచ్చిన ప్రక్రియనో తెలియలేదు. తలని సవ్యంగా రెండు మార్లు, అపసవ్యంగా ఒకసారి తిప్పి సోఫాలో కూర్చున్నాడు. ఎడమ కాలి మీద కుడికాలు ఆంచాడు. ధ్యానం లోకి వెళ్లి పోతాడేమో అనిపించేటట్లు కళ్ళు మూసుకున్నాడు.
“పూర్తి పేరు సంధిగ్ధానంద సరస్వతి” అని తేల్చాడు.
ఇందాక తలని ఎందుకలా తిప్పాడు అన్నది ఇప్పుడు అర్థమైంది. అలా చేసినప్పుడు తల వెనుక ఒక జ్యోతిష్చక్రం ఆవిర్భవించే అవకాశం ఉన్నదన్న గట్టి నమ్మకం తన కుండి ఉండవచ్చు.
“ఇక్కడికి ఏ పని మీద వచ్చారు సార్?”, అడిగాను.
“మీ మీద రెండు లేదా మూడు..”
ఎందుకైనా మంచిదని వెనక్కు జరిగాను.
“ఆ.. ఏం లేదు. నేను ఆశు కవిని.”
“అవునా?”
“మరి? సమోసా సంస్థ వారు ఆశువుగా రెండు మూడు కవితలు మీ మీద స్టేజ్ మీద వదల మన్నారు.”
“అందుకని నా గురించి తెలుసుకునేందుకు వచ్చారు.”
“నో!..”, ముక్కు మీద వేలు వేసుకున్నాడు, “..అలా ఎన్నడూ జరగదు. ఆశు కవిత్వం అప్పటికప్పుడు ఉద్భవిస్తుంది. ఎవరి మీద అయినా అదే వస్తుంది. వ్యక్తితో సంబంధం లేదు సార్.. విన్నారా? సరస్వతి – లోపల, బయట కూడా!”
ఇతను ఇక్కడికి విశ్రాంతికి వచ్చినట్లు ఉంది. ఆవులించి అప్పటికప్పుడు ఆశువుగా నిద్రలోకి జారిపోయాడు. అతని ప్రక్కన సన్యాసి కూర్చుని కనిపించాడు.
“శిశువా! ఏకంగా ఓ టైపు స్వామీజీయే వచ్చేశాడు నీ కోసం!”
“నా గురించి ఏమీ తెలియకుండానే కవిత చెబుతాడుట!”
సన్యాసి నవ్వాడు.
“శిశువా..”
“యస్?”
“ఇందులో ఆశ్చర్యం లేదు. ఎవరి గురించీ దేని గురించీ ఎవరికీ ఏమీ తెలియనవసరం లేదు.”
“ఎందుకని?”
“పప్పులో ఉప్పు లేకుండా వండేది ఉపన్యాసం”
“ఓ”
“తెలిసీ తెలియకుండా పస లేకుండా చేసేది ప్రసంగం!”
“ఓహో!”
“పూర్తి అజ్ఞానంతో చెప్పేది ప్రవచనం!”
(తదుపరి భాగం వచ్చే వారం)
వేదాంతం శ్రీపతిశర్మ కథా రచయిత. నవలా రచయిత. వ్యంగ్య హాస్య రచనలకు పెట్టింది పేరు. “ఆరోగ్య భాగ్యచక్రం” అనే పుస్తకాన్ని వెలువరించారు.
