[ప్రముఖ రచయిత శ్రీ వేదాంతం శ్రీపతిశర్మ రచించిన ‘మోసం చెయ్యటం ఎలా?’ అనే హాస్య వ్యంగ్య నవలని ధారావాహికంగా అందిస్తున్నాము.]
[సమోసా సంస్థ వాళ్ళకి సుందర్ మీద జాలి కలిగి, గదిలో ఉన్న ఆడవాళ్ళిద్దరినీ బయటకు తీసుకువెళ్తూ, రిలాక్స్ అవమని చెప్తారు. ఇంకా ఎంత టైమ్ ఉందని సుందర్ అడిగితే, ఓ అరగంట అనుకోండి అంటారు. ఇంతలో సన్యాసి ప్రత్యక్షమవుతాడు. అనకాపల్లి కనకం వీడియో బాగా తీసిందనీ, హావభావాలను చక్కగా చూపించిందనీ చెప్తాడు. క్రిందపడినవాడిని చూసి అందరూ నవ్వుతారని అంటాడు సుందర్. క్రిందపడినా నీదే పై చేయి అయింది కదా అంటాడు సన్యాసి. ఇంతలో జీన్సు పాంట్ వేసుకున్న ఒకాయన వినయంగా లోపలికొస్తాడు. వస్తూనే సుందర్‍కి నమస్కరించి, ‘నేను సరస్వతిని’ అంటాడు. మెడని మాటిమాటికి అటూ ఇటూ తిప్పుతుంటాడు. కొద్ది సేపటి తర్వాత తన పూర్తి పేరు ‘సంధిగ్ధానంద సరస్వతి’ అని చెప్తాడు. ‘ఏం పని మీద వచ్చారని సుందర్ అడిగితే, మీ పని మీదే’ అని అంటాడు. సమోసా సంస్థ వాళ్ళు సుందర్ గురించి ఆశువుగా రెండు మూడు కవితలను స్టేజ్ మీద వదలమన్నారని చెప్తాడు. ‘ఓ అందుకని నా గురించి తెలుసుకునేందుకు వచ్చారా’ అంటాడు సుందర్. అలా ఎప్పటికీ జరగదనీ, ఆశు కవిత్వం అప్పటికప్పుదు ఉద్భవిస్తుందనీ, వ్యక్తితో సంబంధం లేదని అంటాడు. సన్యాసి మళ్ళీ కనబడి, ఏకంగా ఓ టైపు స్వామీజీయే వచ్చేసాడు నీకోసం అని అంటాడు సుందర్‌తో. కాసేపు సుందర్, సన్యాసి ఆ సరస్వతి గురించి మాట్లాడుకుంటారు. – ఇక చదవండి.]
సమోసా ఉపాఖ్యానం (12)
“ఏమిటి ఆలోచిస్తున్నారు?”
ఆ మాట ఒక్కసారిగా వినిపించి సన్యాసిని వదలి ఈ లోకంలోకి వచ్చాను. ఎదురుగా సరస్వతి సమాధానం కోసం ఎదురు చూస్తున్నాడు.
“ఏం లేదు సార్..”, చెప్పాను, “..మీ పేరు సందిగ్ధానంద సరస్వతి అని ఎలా పెట్టుకున్నారా అని ఆలోచిస్తున్నాను.”
“ప్రశ్న మంచిది. రైల్లో చెయిన్ లాగినట్లు పాయింట్ లాగేసారు. కాకపోతే బండీ ఇక్కడ ఆగదు. యు సీ.. నేను తెగింపు ఉన్నవాడిని. ఉన్నదానికీ సిద్ధాంతం చెప్పగలను, లేనిదానికీ సిద్ధాంతం చెప్పగలను. అందుచేత వినేవారు అంతా సందిగ్ధమేనని వాపోయి ఈ పేరు సార్థకం చేసారు. అలా చేస్తేనే మీడియాలో చెలామణైపోతామని, అందులోనే ఆనందమని సందిగ్ధానంద సరస్వతి అనేసారు. ఇటీవలే ఉగాది రోజున పీఠాధిపతి గారి చేతుల మీదుగా ఆ బిరుదు, ప్రశంసాపత్రం, శాలువా అందుకున్నాను.”
“శభాష్! ఇంతకీ అది ఏ పీఠం సార్?”
అతను ఎందుకో కులికాడు. గోడకి ఆనుకుని ఆవులించాడు. అంత సేపు ఆవులించటం మొదటిసారి చూసాను. ఎవ్వరూ పట్టించుకోలేదు కానీ ఇది గిన్నెస్ బుక్ రికార్డ్ అయి ఉంటుంది. ఎన్ని చిటికెలు వేసినా నోరు మూత పడలేదు. ఏం చెయ్యాలో తెలియలేదు. అతను ఆ వింత భంగిమలోనే గదంతా కలయచూస్తున్నాడు. ఇప్పుడు ఈ ఇండియా గేటు మూస్కోకపోతే నా లెక్క మూసుకునేటట్లుంది! ఎరక్కపోయి అడిగాను. అతను ఓ పెన్ను తీసి కాగితం మీద ఏదో గీకాడు. ఆ కాగితం నాకిచ్చాడు.
“సార్, నోర్ముయ్ అని గట్టిగా అరవండి. లేకపోతే ఇది మూస్కోదు” అని దాని మీద ఉంది.
“నోర్ముయ్” అన్నాను. వాస్తవానికి అరిచాను. చాలా కాలంగా ఇలా మైక్ పట్టుకుని సార్వజనికంగా అరుద్దామనుకున్నాను. ఆఖరుకి ఆ అవకాశం ఈశ్వరుడిలా ప్రసాదించాడు.
మరో సారి “నోర్ముయ్” అని అన్నాను.
ఆవులింత కార్యక్రమం ఓ కొలిక్కి వచ్చింది. అతను ఎందుకో నవ్వాడు. కొందరు ఆవులిస్తే పేగులు లెక్కపెడతారంటారు. ఇతను ఆవులిస్తూ ప్రాణాలే తీసేటట్లున్నాడు..
అతని నవ్వులో ఒక సాహిత్య అకాడమీ బహుమతి పొందిన గర్వం తొణికిసలాడింది.
“ఇది వింతగా ఉంది. ఈ రహస్యం కూడా చెప్పెయ్యండి సార్”
“ఏం లేదు..”, మొదలెట్టాడు సరస్వతి-జ్ఞానిలా భంగిమ ఇచ్చాడు, “..నేను విచ్చలవిడిగా ఉపన్యాసాలు ఇస్తూ ఉంటాను సార్. నిద్రలో కూడా దంచేస్తూ ఉంటాను. మా ఆవిడ డాక్టర్‌కి నన్ను బలవంతంగా చూపించింది. ఆ డాక్టరు ఏదో గొంతు దగ్గర అక్కడా ఇక్కడా నొక్కి ఏదో పరీక్ష చేస్తున్నాడనుకున్నాను. అది కానే కాదు. నేను రచయితని, వక్త అని అక్కడున్న కాగితం మీద వ్రాసుకుని గట్టిగా దాని కింద రెండు సార్లు అండర్‌లైన్ చేయటం నేను చూసాను. అతను చేసింది పరీక్ష కాదు. వాస్తవానికి నా పీక పిసికే అవకాశాన్ని తీవ్రంగా శోధించాడు. హత్య చేయకూడదని నిర్ణయించుకుని చివరగా ఆ కాస్త ప్రాణాన్ని వదలి పెట్టి మందులు, ఇంజెక్షన్సు వ్రాసి మా ఇద్దరినీ పొమ్మన్నాడు.”
“మొత్తానికి మీది గట్టి ప్రాణం సార్!”
“చాలా”
“ఇంతకీ అసలు విషయం చెప్పలేదు.”
“మంచి నిద్ర పట్టేది సార్. నిద్రలో గ్రుక్క తిప్పుకోకుండా కనీ వినీ ఎరుగని శాస్త్రాల గురించి చెప్పేస్తుంటే ప్రక్కన మా ఆవిడ నోర్ముయ్ అని గట్టిగా అరుస్తుందన్న మాట. వెంటనే పడుకునేవాడిని. ఇప్పుడు ఆవులింత అలవాటయింది. దీనికీ ఆవిడ వాడే మందు ఇదే! ఇప్పుడు మీరు వాడారు!”
“మన చరిత్ర గొప్పది సార్.”
“కరెక్ట్!”
“మహాభారతంలో ధర్మరాజు యుద్ధం ముందర కురువృద్ధులను సమీపించి ఒక్కొక్కరినీ ఎలా ఇంటికి పంపాలో విషయం తెలుసుకుని వచ్చాడు. శ్రీకృష్ణుడు అందరికీ ఒక్కొక్కడిని సెట్ చేసి ఉంచాడు.”
“కరెక్ట్!”
“అలా భర్తలకు భార్యలను నియమించాడు ఈ యుగానికి!”
నోరు తెరిచాడు సరస్వతి. వెంటనే ఆపాను..
“సార్.. ఆవులించకండి. ఇంతకీ ఈ పీఠం గురించి చెప్పలేదు.”
“దాని పేరు ఏకలవ్యపీఠం!”
“ఛా!”
“ఈయన ఏకాకి. మీరనుకున్న ఏకలవ్యుడు కాడు.”
“ఓ. ఆవులిస్తాడా? ప్రక్కన ఎవరూ లేరంటున్నారు కూడా?”
“లేదు. కేవలం ఒక్క సారి ప్రేమలో పడ్డాడు. లవ్.. ఏక లవ్! అందుచేత ఏకలవ్యుడైనాడు!”
“పీఠం ఎందుకు ఈయనకి?”
“లవ్ విఫలమైంది.”
“అయితే? సన్యాసం పుచ్చుకోవటంలో అర్థముంది. పీఠం ఎలా పెడతాడు?”
“నిజమైన సన్యాసం పుచ్చుకుని అవతలకి పోతే ఉపయోగం ఎవరికి? ఒంటరిగానే పీఠం పెట్టేసాడు. ఆశ్రమంలో ఒక్కడే ఉంటాడు. ధ్యానంలో ఉంటాడు.. అలా కనబడతాడు. చీకటి పడుతున్నప్పుడు దర్శనం ఇస్తాడు.”
“జనం వస్తారా?”
“వస్తారు.”
“ఎవరు? ప్రేమలో విఫలులైనవారా లేక ప్రేమిస్తూ ప్రేమ పండాలని కోరుకునేవారా?”
“అలాంటి వాళ్లు తప్పకుండా వస్తారు. కటకటాల వెనుక కనపడతాడు. కొంత మంది చప్పట్లు కొడతారు.”
“దేనికి? కనిపించినంత మాత్రానికే?”
“కాదు. చిత్రం ఏమిటంటే అటు ఆడా ఇటు మగా కాని మాడా లాంటి వారు కూడా ఎక్కువగా వస్తారు.”
“ఎందుకు?”
“ఈ స్వామీజీ ఒక శల్య చికిత్స ద్వారా ఆడ నుండి మగగా మారుతున్న అద్భుతమైన తరుణంలో సిద్ధులు పొందాడని ఒక మాట జనబాహుల్యంలో ఉన్నదండీ! అందుకే నాకిచ్చిన బిరుదు కూడా.. సందిగ్ధా..”
ఆవులింత ప్రారంభమైంది. గబుక్కున లేచి నోరు గట్టిగా మూసాను. ఎవరో అప్పుడే తలుపు దగ్గర నిలుచున్నట్లు అనిపించింది..
(తదుపరి భాగం వచ్చే వారం)
వేదాంతం శ్రీపతిశర్మ కథా రచయిత. నవలా రచయిత. వ్యంగ్య హాస్య రచనలకు పెట్టింది పేరు. “ఆరోగ్య భాగ్యచక్రం” అనే పుస్తకాన్ని వెలువరించారు.
