[ప్రముఖ రచయిత శ్రీ వేదాంతం శ్రీపతిశర్మ రచించిన ‘మోసం చెయ్యటం ఎలా?’ అనే హాస్య వ్యంగ్య నవలని ధారావాహికంగా అందిస్తున్నాము.]
[ఏమిటాలోచిస్తున్నారని ఆ స్వామీజి సుందర్‌ని అడుగుతాడు. ఆయన పేరు సందిగ్ధానంద సరస్వతి అని ఎలా పెట్టుకున్నారా అని ఆలోచిస్తున్నానని చెప్తాడు సుందర్. తాను ఉన్నదానికీ లేనిదానికి సిద్ధాంతం చెప్పగలననీ, అందుకే వినేవాళ్ళు అంతా సందిగ్ధమేనని వాపోయి ఆ పేరు సార్థకం చేశారని చెప్తాడు. ఇటీవలే ఉగాది రోజున పీఠాధిపతి చేతుల మీదుగా ఆ బిరుదు లభించిందని అంటాడు. ఏ పీఠమని సుందర్ అడిగితే, బదులు చెప్పక గట్టిగా ఆవులిస్తాడు. తెరిచిన నోరు అలాగే ఉండిపోతుంది. ఒక కాయితం మీద “సార్, నోర్ముయ్ అని గట్టిగా అరవండి. లేకపోతే ఇది మూస్కోదు” అని రాసిస్తాడు. సుందర్ అలా అరవగానే అతని నోరు మూతబడుతుంది. అలా ఎందుకవుతుందో సుందర్‌కి చెప్తాడా స్వామీజీ. ఇంతకీ మీదే పీఠం అని సుందర్ అడిగితే, ఏకలవ్య పీఠమని చెప్తాడు. ఆ పీఠం గురువు గురించి సుందర్‌కి చెప్తాడు స్వామీజీ. అంతలో అతనికి మళ్ళీ ఆవులింత రావడంతో సుందర్ లేచి, అతని నోరు గట్టిగా మూస్తాడు. – ఇక చదవండి.]
సమోసా ఉపాఖ్యానం (13)
సరస్వతి నోటి మీద చెయ్యి పెట్టగానే తలుపు చప్పుడయింది. అటు చూసే లోపల సన్యాసి ప్రత్యక్షమైనాడు.
“తప్పు శిశువా!”
“ఏంటి తప్పు?”
“ఒక రచయిత కావచ్చు, లేదా ఒక వక్త కావచ్చు, ఇలా నోరు నొక్కటం వలన ప్రజల స్వాతంత్ర్యాన్ని, స్వేచ్ఛని తొక్కి పెట్టలేవు.”
“నేను ఇతని ఆవులింతని ఆపాను. అది ఎందుకో నీకు తెలుసు.”
“ఒక రచయితవై యుండి మరో రచయిత నోరు నొక్కటం అన్యాయం, అమానుషం! ఈ చర్య ఎంతో సిగ్గుమాలినదన్న సంగతి నువ్వు ఏ మాత్రం గమనించటంలేదు.”
“సన్యాసీ..”
“యస్?”
“ఆ పని నేను చెయ్యకపోయినా ఆ మాట అంటున్నావు కాబట్టి నేనూ ఓ మాటంటాను.”
“వదులు.”
“రచయితలు చూడటానికి ఒకలా కనిపిస్తారు.”
“ఒకేలా “
“కావచ్చు.”
“అయితే?”
“వాస్తవానికి వాళ్లు కబడ్డీ ఆటగాళ్లు.”
“ఛా “
“కొత్త ఊపిరితో కబడ్డీ కబడ్డీ అంటూ రంగంలోకి ప్రవేశించిన సరిక్రొత్త రచయితని మా దగ్గరికి ఎలా వస్తావు అన్నట్లు కాపు కాసి కాలు లాగి క్రింద పడేసి కావలిస్తే ఇద్దరిద్దరు జతగా చేతులు కలిపి కొన ఊపిరి కూడా ఉండనీయకుండా అవుట్ చేసేసి వాళ్లకు వాళ్లు గీసిన ఒక గీతకి అవతల నిలబెడతారు.”
“శిశువా! అది అనాదిగా వస్తున్న సంప్రదాయం.”
“మోసం కాదా?”
“ఆటకు ఒక మైదానం-ఒకే మైదానాన్ని సృష్టించటం మోసం క్రింద రాదు. చేతనైతే ఆడండి. లేకపోతే లేదు!”
“మైదానం లోకి వచ్చినవారిని..”
సన్యాసి చెయ్యి చూపించాడు.
“కాదు శిశువా. ఆలోచించు. చేతైన వానికి, చేతకాని వానికి తేడా ఏంటో చెప్పు సూటిగా”
“నువ్వే చెప్పు.”
“చేతైన వాడు చేసి చూపిస్తాడు.”
“చేతకాని వాడు?”
“ఎలా చెయ్యాలో చెబుతాడు.”
“అదేంటి?”
“అదే కీలకం ఇక్కడ. ఏదో తెలిసిన వానిలా నీకు అదీ ఇదీ అంటూ ఏవో ఈ మైదానంలోని నియమాలను వల్లిస్తాడు. నువ్వు ఏదో గియ్యబోయి మరేదో గీసేస్తావు. అదుగో చేతకాదని చెప్పి నువ్వన్న కబడ్డీ మైదానంలోంచి తోసేస్తాడు.”
“సన్యాసీ..”
“యస్?”
“నా గదిలో నేనేదో వ్రాసుకుంటాను. ఇలా ఎందుకు బయటకి వచ్చానో తెలియటంలేదు.”
“రావాలి. సార్వజనిక జీవితంలో ఎవరికీ ఎవరి మీదా ఎటువంటి గౌరవం ఉండదు. ఓ డ్రామా ఆడుకొని ఆలోచించుకోవాలి.”
సన్యాసి మాయమయ్యాడు. సరస్వతి నోటి మీద నుండి చెయ్యి తీసేసాను.
అతను హాయిగా గాలి పీల్చాడు.
“ఎవరితో మాట్లాడుతున్నారు సార్?”, అడిగాడు.
“నాలో నేనే!”
“కానీ బాగా చెప్పారు సార్. అన్నీ విన్నాను. ఈ ఆటలో క్రిందా మీదా పడి ఇలా తయారయ్యాను. వస్తాను. టీ సేవించి వస్తాను. నాకు నా కవితకి సరుకు దొరికింది.”
అతను సంచీ సద్దుకున్నాడు. తలుపు దగ్గర ఒక మాటన్నాడు, “..సార్, ఈ దేశంలో సరిగ్గా చెలామణి అవ్వాలంటే ఒక్క ఇన్‌స్టిట్యూట్‌కి వెళ్లాలి.”
“ఏంటది?”
“ఐ.ఐ.సి.టి”
“ఛా!”
“మీరనుకున్నది కాదు. నేనంటున్నది – ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్రిమినల్ టెక్నాలజీ!”
“అదెక్కడుంది?”
“అంతవంత ఇమే దేహా: – అందరిలో దేదీప్యమానంగా విరాజిల్లుతుంది.”
“లైను బాగుంది.”
“మీసం మొలవకనే మోసం నేర్చుకునే పుణ్యభూమి ఇది. వస్తాను..”
అతన్ని వెళ్లనిచ్చి ఒక మహిళ లోపలికి వచ్చింది. ఎక్కడో చూసినట్లుంది.
“నువ్వు..”
కళ్లు పెద్దవి చేసింది.
“సారూ, నేను, గంగమ్మని, మీ వీధిలో ఇస్త్రీ చేస్తాను.”
“కరెక్ట్.”
“మీరేనా రచయిత?”
“కాసేపు అలా అనుకోవమ్మా. నువ్వేంటి ఇక్కడ?”
“వెయ్యి రూపాయలిస్తామన్నారు.”
“ఎందుకు? జిందాబాద్ లాంటిదేమీ లేదే?”
“అయ్యో కాదు సారూ! నేను దేనికో ఏంటది..”
“అధ్యక్షురాలవి అన్నాడా?”
“అదే ఏదో సారూ…ఇగో, ఈ కాగితం లోనున్నదాన్ని మీ దగ్గర ప్రాక్టీస్ చేయమన్నాడు.”
కాగితం తీసుకున్నాను. గట్టిగా చదివాను.
“స్త్రీ ఒక శక్తి”
తల చక్కగా ఆడించింది.
“ఇస్త్రీ ఒక శక్తి!”, అనేసింది.
(తదుపరి భాగం వచ్చే వారం)
వేదాంతం శ్రీపతిశర్మ కథా రచయిత. నవలా రచయిత. వ్యంగ్య హాస్య రచనలకు పెట్టింది పేరు. “ఆరోగ్య భాగ్యచక్రం” అనే పుస్తకాన్ని వెలువరించారు.
