[ప్రముఖ రచయిత శ్రీ వేదాంతం శ్రీపతిశర్మ రచించిన ‘మోసం చెయ్యటం ఎలా?’ అనే హాస్య వ్యంగ్య నవలని ధారావాహికంగా అందిస్తున్నాము.]
[స్వామీజీ ఆవులిస్తుంటే, ఆయన నోటి మీద సుందర్ చేయి పెట్టగానే సన్యాసి ప్రత్యక్షమవుతాడు. తప్పు చేస్తున్నావంటాడు. ఏం చేశానని అడుగుతాడు సుందర్. నువ్వొక రచయితవైయుండి మరో రచయిత నోరు నొక్కటం అన్యాయమని అంటాడు సన్యాసి. కొన్ని మాటలయ్యాకా, సన్యాసి మాయమవుతాడు. స్వామీజీ నోటిపై నుండి చెయ్యి తీసేస్తాడు. ఆయన హాయిగా ఊపిరిపీల్చుకుని, మీరెవరితో మాట్లాడుతున్నారని సుందర్‌ని అడుగుతాడు. నాలో నేనే మాట్లాడుకుంటున్నా అని చెప్తాడు సుందర్. తన కవితకి సరుకు దొరికిందని, టీ తాగి వస్తానని అతను బయటకు వెళ్తాడు. ఇంతలో ఓ మహిళ లోపలికి వస్తుంది. ఆమెని ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది. ఆమె సుందర్‌ని పలకరించి, తాను గంగమ్మ అని చెప్పి, వాళ్ళ బట్టలు ఇస్త్రీ చేస్తుంటానని చెప్తుంది. ఎందుకొచ్చావంటే, ఓ కాగితం చూపించి, అందులో ఉన్నది మీ దగ్గర ప్రాక్టీసు చెయ్యమన్నారని చెబుతుంది. అందులో ‘స్త్రీ ఒక శక్తి’ అని రాసి ఉంటుంది. గంగమ్మ ‘ఇస్త్రీ ఒక శక్తి’ అని పలుకుతుంది. – ఇక చదవండి.]
సమోసా ఉపాఖ్యానం (14)
“నీకేం చెప్పారు?”, గంగమ్మని అడిగాను.
“మీరింత గొప్పోరని నాకు తెల్దండి.”
“నాకూ తెలియదు.”
“అదేటి సారూ? అమ్మాయిలు మోసపోకుండా కాపాడుకుంటారుట?”
“నేనా?”
“అవును.”
“ఎలాగేంటి? అది కూడా చెప్పారా?”
“చెప్పారండీ!”
అయిపోయింది. అమ్మాయిలు మోసపోకుండా నేను కాపాడుకోవటం ఏమిటి? ఆ విషయమై ఈ ఇస్త్రీ పెట్టెతో పనేంటి? ఒకే ఒక ఫుట్‌బాల్‌ని ఇంతమంది ఇంతసేపు కాలితో తన్నటం బాలేదు. సన్యాసి ఏదో ఆలోచిస్తున్నట్లు కనిపించాడు.
“సన్యాసీ..”
“యస్?”
“నువ్వు ఎప్పుడు ప్రత్యక్షమవుతావో ఎప్పుడు మాయమవుతావో తెలియటం లేదు.”
“దటీజ్ సన్యాసి. నన్ను తక్కువగా అంచనా వెయ్యవద్దు.”
“నిన్ను ఏ రోజూ అంచనా వెయ్యను.”
“ఎందుకో?”
“ఈ రోజు నన్ను బాధించేందుకు ఎవరూ లేరని నేను అనుకుంటే చక్కగా సిద్ధమవుతావు. బాధ కలిగినప్పుడు పక్కింట్లో పనున్నదన్నట్లు మాయమైపోతావు.”
“శిశువా!”
“చెప్పు.”
“సన్యాసి అంటే ఎవరో తెలుసా?”
“ఇవ్వాళ చెప్పెయ్”
“నన్ను కాకుండా లెక్కెయ్యండి అని ఓ మారు, సర్వం నా వల్లనే అని చొక్కా చించుకుని మరో మారు మరో మనిషికి తెలియకుండా చాటేవాడు. నేను ఎప్పుడు రగిలి కలుగజేసుకుంటానో నాకే తెలియదు. ఎప్పుడూ ఇంకా వడ్డన మొదలెట్టని కంచాన్ని! అంచనాలతో మనకి పని లేదు. ఏ పదార్థం అందులో పడి ఊరుకుంటుందో చెప్పటం చాలా కష్టం!”
“ఇంతకీ ఏమి ఆలోచిస్తున్నావు?”
“ఈ కార్యక్రమం మోసం చెయ్యటం ఎలా? అనే శీర్షికకు చెందినది.”
“కరెక్ట్.”
“ఈ ఇస్త్రీ పెట్టె నువ్వు అమ్మాయిలు మోసపోకుండా కాపాడుకుంటావు అంటోంది. అదెలా సాధ్యం?”
“ఒక ఆలోచన కలుగుతున్నది.”
“చెప్పు.”
“రకరకాల మోసాల గురించి మనం చెబుతున్నప్పుడు ఆ విద్య ఇతరులకు తేలిగ్గా చెప్పవచ్చును కదా?”
“ఊ.. అన్ని అనారోగ్యాలూ అనుభవించిన వాడికి ఎం.బి.బి.ఎస్ అక్కరలేదు! ఎంతో మందికి వైద్యం చేసెయ్యగలడు.”
“గుడ్. నా సూక్ష్మబుద్ధి రవ్వంత నీకూ అంటుతున్నట్లుంది.కానీ అంతరార్థం కొంత బాధిస్తున్నది.”
“ఏమిటది?”
“నువ్వు ఎందరో అమ్మాయిలను మోసం చేసి బాధించిన వాడిలా తెర ముందుకు రావచ్చు, లేదా జీవితాంతం అమ్మాయిలతో సంచరిస్తూ ఈ రోజు కూడా వాళ్లని దగ్గరికి తీసుకుని కాపాడుకోవాలని చూస్తున్న దుర్మార్గుడివీ కావచ్చు!”
“సన్యాసీ!”
“యస్?”
“అసలు అమ్మాయిలు మోసపోతున్నారా? అబ్బాయిలా?”
“అది తరువాత తేల్చుకో. ముందు ఇస్త్రీ పెట్టె సంగతి చూడు.”
అటు తిరిగాను. గంగమ్మ ముందరకి వచ్చి కుడి చెయ్యి పైకి పెట్టి పిడికిలి బిగించింది. బోనాలు జాతరలో పూనకం వచ్చిన దానిలా పళ్లు బిగించింది.. ఎందుకైనా మంచిదని నా సంచీ సోఫా చివరకి జరిపి నేనూ అటుగా జరిగాను. గంగమ్మ తన తల మీద ఏదో బరువు జారి పడబోతున్నట్లు కళ్లు పైకి పెట్టింది. చెక్క టేబిల్, ఇస్త్రీ పెట్టెకీ మధ్య నలుగుతూ లెక్క తేల్చుకుంటున్న బట్టలా ఉంది నా పరిస్థితి. వీళ్లందరినీ ఏ మహానుభావుడు టాలెంట్ సర్చ్ చేసి పట్టుకొచ్చాడో వాడికి అర్జంటుగా ఓ కొబ్బరికాయ కొట్టటం కరెక్ట్ అనిపించింది!
“ఇస్త్రీ ఒక శక్తి!”, గంభీరంగా అంది గంగమ్మ!
నన్ను ఓర కంట చూసి ఎందుకో చిన్నగా ఒక దారుణమైన చిరునవ్వు నవ్వింది.
నేను చూస్తుండగానే మరేదో అభ్యాసం (విన్యాసం) గుర్తుకొచ్చి కుడికాలు లేపి నేల మీద గట్టిగా తన్నింది..”శకితి..” అంటూ వికటాట్టహాసం చేసింది. సోఫా మీద నుండి సంచీతో పాటు క్రిందకి జారాను.
తలుపు ఇంతలో సన్నగా తెరుచుకుంది. తల ఒక్కటీ లోపలికి వచ్చింది. అది తాటికాయో, పండో నిర్వచించటం కష్టం. రెండు కళ్లూ, ఆ నోరూ ఇంచుమించు ఒకే సైజులో సరిగ్గా తాటి ముంజెల్లా అగుపించాయి. ఆ మనిషి గంగమ్మని, క్రిందకి జారి సోఫాని ఆధారం చేసుకుని లేవబోతున్న నన్నూ చక్కగా నవ్వుతూ పరిశీలించాడు. ఒక ఆడదాని పాదఘాతానికి క్రింద నేను పడ్డట్లు అనుకున్నట్లున్నాడు. అయినా ఎందుకో దృశ్యాన్ని పెద్దగా సమీక్షించదలచుకోలేదు. ఇది అంతటా ఉన్న సంగతే అనుకున్నట్లున్నాడు!
“నేను జ్యోతిని”, పూర్తి ఆడ గొంతులో పలికాడు!
ఈ గదిలో ఇంత పెద్ద వెయిటింగ్ లిస్టా అనుకున్నాను. గంగమ్మ తన శపథం నుండి ఇవతలికి రాదలచుకోలేదు. ఇంతలో జ్యోతిట.. ఆయన కనిపించటమే మన భాగ్యం వెలిగినట్లు భావ ప్రకటన చేస్తున్నాడు.
“సన్యాసీ..”
“యస్?”
“నేను ఇక వెళ్లిపోతాను. ఇన్ని పాత్రలతో వేగటం నా వల్ల కాదు!”
“నో”
“యస్.”
“ధైర్యం శిశువా! ధైర్యే, సాహసే, జ్యోతిలక్ష్మి!”.
(తదుపరి భాగం వచ్చే వారం)
వేదాంతం శ్రీపతిశర్మ కథా రచయిత. నవలా రచయిత. వ్యంగ్య హాస్య రచనలకు పెట్టింది పేరు. “ఆరోగ్య భాగ్యచక్రం” అనే పుస్తకాన్ని వెలువరించారు.
