[ప్రముఖ రచయిత శ్రీ వేదాంతం శ్రీపతిశర్మ రచించిన ‘మోసం చెయ్యటం ఎలా?’ అనే హాస్య వ్యంగ్య నవలని ధారావాహికంగా అందిస్తున్నాము.]
[నీకేం చెప్పి లోపలికి పంపారని గంగమ్మని అడుగుతాడు సుందర్. బదులుగా, అతనెంత గొప్పవాడో తనకి తెలియలేదని అంటుంది. అమ్మాయిలు మోసపోకుండా కాపాడుతున్నందుకు సుందర్‌ని అభినందిస్తుంది. అతనికేమీ అర్థం కాదు. సన్యాసి ప్రత్యక్షమై ఏదో ఆలోచిస్తున్నట్టు కనబడతాడు. ఎప్పుడొస్తావో, ఎప్పుడు మాయమైపోతావో తెలియడం లేదని సుందర్ అంటే, తాను ఎప్పుడు రగిలి కలగజేసుకుంటానో తనకే తెలియదని అంటాడు సన్యాసి. గంగమ్మ చెప్పిన మాటలు సన్యాసికి చెప్పి, అదెలా సాధ్యమని అడుగుతాడు. సన్యాసి చెప్పిన వివరణ సుందర్‌కి సరిగా అర్థం కాదు. ఇంతలో గంగమ్మ ముందుకి వచ్చి కుడి చెయ్యి పైకి పెట్టి పిడికిలి బిగించి, బోనాలు జాతరలో పూనకం వచ్చిన దానిలా పళ్లు బిగిస్తుంది. ‘ఇస్త్రీ ఒక శక్తి’ అని అంటూ కుడికాలు లేపి నేల మీద గట్టిగా తన్ని వికటాట్టహాసం చేస్తుంది. ఇంతలో తలుపు తెరుచుకుని ఓ మనిషి లోపలికొస్తాడు. ‘నేను జ్యోతిని’, అంటూ పూర్తి ఆడ గొంతులో పరిచయం చేసుకుంటాడు. – ఇక చదవండి.]
సమోసా ఉపాఖ్యానం (15)
“ఏ చింతలు వలదయ్యా, నా చింతలు కూడ వలదు, నను గన్నయ్య” అన్నారు ఓ కవి గారు.
ఇక్కడ ఓ మహిళ ‘స్త్రీ ఒక శక్తి’ అంటూ విజృంభించాలి అంటుండగా పూర్తి స్త్రీ గొంతులో ఓ పురుషుడు స్త్రీ పేరు ‘జ్యోతి’ తన పేరుగా ప్రకటించి ఇప్పుడేం మాట్లడతావంటూ సవాలు విసురుతున్నాడు. కొద్దిగా ఆవులింత విన్యాసాన్ని ప్రదర్శించి సందిగ్ధానందుల వారు అటువైపు వెళ్లిపోయారు.
“సన్యాసీ..”
“యస్?”
“ఏంటిది?”
“అంటే?”
“ఇక్కడేదో సమస్తం అర్ధనారీశ్వర తత్త్వ బోధలా ఉంది స్వామీ!”
“లెస్స పలికితివి శిశువా! న్యాయం పట్టి పిండితే ప్రస్తుత కాలం యావత్తూ సనాతనమే!”
“సగతనం ఏంటి సన్యాసీ?”
“మగతనం బదులు సగతనం!”
“ఓ! కొత్త పదం.”
“తప్పు లేదు. పదాల గురించి ఎవరికీ పట్టనప్పుడు నువ్వు పుట్టించుకోవటంలో దోషం లేదు.”
“ఇప్పుడే ఓ మాటన్నావు “
“నేను మాటలననను శిశువా. వాస్తవాలతో వస్తు ప్రదర్శన చేసేస్తాను.”
“ఛా!”
“అవును. నిజాలని మీరు నిర్ధారించుకోవాలి.”
“ఇంతకీ ఇలా ఎందుకంటున్నావు?”
“ఓ మాటనుకుందాం.”
“చెప్పు.”
“ఎవరైనా ఏదైనా చెబుతుంటే పూర్తిగా వింటున్నామా?”
“నో “
“ఎవరికైనా ఏ విషయమైనా పూర్తిగా తెలిసినట్లు అనిపిస్తోందా?”
“ససేమిరా”
“నీవు వెచ్చించే డబ్బుకు పూర్తి విలువ లభిస్తున్నదా?”
“పొరపాటుగా కూడా లేదు.”
“ఓ కార్యక్రమం పూర్తిగా నిర్విరామంగా సాగుతున్నదా?”
“అన్నీ బ్రేక్సే! విరామాలే సజావుగా సాగుతున్నాయి. మంచి కల కూడా నిద్రాభంగం చేస్తూ ముందుకు సాగే భంగిమలా కనిపిస్తోంది!”
“కరెక్ట్! ఒక చక్కని వాక్యం పూర్తిగా పలుకగలిగే ప్రబుద్ధుడున్నాడా?”
“లేడు. ఇక మీద కనిపించడు కూడా!”
“సినిమాలో ఒక పాట పూర్తిగా సాగుతోందా?”
“సగం వాంతి అయి పూర్తిగా వాంతి చేసుకోవాలనిపిస్తున్నది.”
“ఆకలైతే డాక్టరు పూర్తిగా దేనినైనా తిననిస్తున్నాడా?”
“అన్నీ కొద్ది కొద్దిగా తినాలంటాడు. మనలను పూర్తిగా తింటున్నాడు!”
“ఏ రోగమైనా పూర్తిగా నయమవుతున్నదా?”
“పాత మిత్రునిలా జ్ఞాపకం ఉండిపోతోంది. తోచినప్పుడు తొంగి తొంగి చూస్తోంది!”
“అంతా సగం సగం పాకేజింగ్. లోపల సగం, బైట సగం. కస్టమర్ కేర్ వాళ్లు పూర్తి పని ఎప్పుడైనా చేసారా?”
“చెయ్యరు. చెయ్యకూడదు.”
“అదే సరళిలో నా సంగతి కూడా చూడు శిశువా!”
“నీ సంగతేంటి సన్యాసీ?”
“నేనూ నీలో సగం! నన్నూ నువ్వు సగమే నమ్ముతావు.”
“ఇది నిజమా?”
“అవును. నీకు సత్యం అనిపించినా ఆఫీసులో బాస్ లాగా సగమే నమ్మి ఇంకో సగం ఇంకొకరితో పంచుకుంటావు.”
“ఆలోచించాలి.”
“ఆలోచన కాదు. అటు చూడు, తాటికాయ శాస్త్రి లోపలికి వచ్చేసి గంగమ్మని తిలకిస్తున్నాడు.”
అటు తిరిగాను. జ్యోతి సోఫాలో కూర్చున్నాడు.
“నేను చూసి మరచిపోయిన దానిలో సగం కూడా ఏ జ్యోతిష్కుడూ ఈ రోజుకీ చూడలేదు”, అన్నాడు.
“ఓ. మీరు జ్యోతిష్కులన్నమాట! జ్యోతి అంటే..”
“పూర్తి పేరు సగం మందికి కూడా తెలియదు.”
“ఆ సగంలో నన్ను చేర్చి సెలవియ్యండి.”
“పరంజ్యోతి పరబ్రహ్మశాస్త్రి. చిన్నగా.. జ్యోతిని. మామూలుగా లేం!”
“సూపర్!”
“చీకటిలో జ్యోతిని వెలిగించి చూస్తే అంతా కనబడి పోతుంది.”
“కరెక్ట్.”
“నాకంతా కనిపించినా కొంతే చెబుతాను.”
“గుడ్. అన్నింటిలో సగభాగమే సరైనదని నేనూ ఇప్పుడే అనుకుంటున్నాను. అదే ప్రస్తుత లోకతంత్రం!”
“మంచి మాట! నా గొంతు కూడా ప్రారంభ దశలో ఆడ గొంతులా విడుదలయ్యి చివర మగ గొంతులో పరిపూర్ణత్వం చెందుతుంది.. అదే తమాషా!”
“శబ్దానికి ఆడా మగా ఏంటి సార్ మరీనూ! చాప్లిన్ అన్నట్లు క్లోజ్ షాట్లో జీవితం ఒక ట్రాజడీ. లాంగ్ షాట్లో పూర్తి కామెడీ..”.
(తదుపరి భాగం వచ్చే వారం)
వేదాంతం శ్రీపతిశర్మ కథా రచయిత. నవలా రచయిత. వ్యంగ్య హాస్య రచనలకు పెట్టింది పేరు. “ఆరోగ్య భాగ్యచక్రం” అనే పుస్తకాన్ని వెలువరించారు.
