[ప్రముఖ రచయిత శ్రీ వేదాంతం శ్రీపతిశర్మ రచించిన ‘మోసం చెయ్యటం ఎలా?’ అనే హాస్య వ్యంగ్య నవలని ధారావాహికంగా అందిస్తున్నాము.]
[సుందర్, జ్యోతిష్కుడు జ్యోతి మాట్లాడుకుంటారు. గంగమ్మ వాళ్ళిద్దరినీ చూస్తూ ఉంటుంది. కానీ అంతలోకే ఆమె నీరసపడుతుంది. సుందర్ కారణమడిగితే, తేలిగ్గా డబ్బులొస్తాయని అనుకున్నాననీ, ఇక్కడ కూడా చాకిరేననీ చెబుతుంది. తమరి నామధేయం అని గంగమ్మని అడుగుతాడు జ్యోతి. ఆమెకి అర్థం కాదు. పేరు అడుగుతున్నారని సుందర్ చెప్తాడు. అసలు పేరు గంగమ్మ అనీ, ఇక్కడ ఇచ్చిన పేరు శకితి అని చెప్తుంది. జ్యోతికి అర్థం కాదు. ఆమె పేరు శక్తి అని చెప్పి, స్టేజ్ మీద ఆమెను జిల్లేళ్ల పోలేరమ్మగా సమస్త మానవాళికి పరిచయం చేస్తారని అంటాడు సుందర్. వాళ్ళిద్దరూ కాసేపు జ్యోతిష్యం గురించి మాట్లాడుకుంటారు. ఆ మాటల్లో, జ్యోతికి జ్యోతిశ్యంలో పెద్దగా ప్రవేశం లేదని, ఏదో మిడిమిడి జ్ఞానంతో నెట్టుకొస్తున్నాడని తెలుస్తుంది. టీవీలలో ప్రేక్షకులు అడిగే ప్రశ్నలను ఎలా మేనేజ్ చేస్తాడో చెప్తాడు. చివర్లో గట్టిగా నవ్వుతాడు జ్యోతి. ఇంతలో సన్యాసి ప్రత్యక్షమవుతాడు. అప్పుడే గంగమ్మ సుందర్ వైపు నెమ్మదిగా కదులుతుంది. ఆమె అలా కదలడాన్ని గమనించమంటాడు సన్యాసి. గంగమ్మ సుందర్ చెవి దగ్గరకు వచ్చి – జ్యోతిని ఉద్దేశించి మాట్లాడుతూ, అతనెవరని అడిగి, అతన్ని తాను ఏదో పెళ్ళిలో చూశానని చెబుతుంది. – ఇక చదవండి.]
సమోసా ఉపాఖ్యానం (17)
గంగమ్మకి ఎలా సమాధానం చెప్పాలో అర్థం కాలేదు.
“గంగమ్మా..”
“సారూ”
“నీకొకరు ఇస్త్రీ చెయ్యమని సంచీ ఇచ్చినప్పుడు ఆ బట్టల సంచీని తిరిగి ఎవరికిస్తావు?”
“ఆల్లకే ఇచ్చేత్తానండీ. ఇంకొకరికి ఇస్తే ఊరుకుంటారా ఏంది?”
“కరెక్ట్. నీకు ఈయనని ఏదో పెళ్లిలో చూసిన అనుమానం కలిగింది.”
“అవును సార్. అలా అని పెళ్లికొడుకో లేక మరొకటో కాదండీ..”
జ్యోతి ఎందుకో చిరునవ్వు నవ్వుతూనే ధ్యానంలో ఉన్నట్లు ప్రదర్శన ఇస్తున్నాడు.
“మరి ఆయన్ని అడక్కుండా నన్నడిగితే ఏమి ప్రయోజనం?”
అవునన్నట్లు తల ఊపింది. నేల మీద కూర్చునే జాగ్రత్తగా పరంజ్యోతి పరబ్రహ్మశాస్త్రిని పరిశీలించింది. తొడ మీద చిన్నగా తట్టింది.
“సారూ..”
ప్రతిక్రియ ఏదీ కనిపించలేదు. ధ్యానమార్గం సామాన్యంగా ఆత్మసాక్షాత్కారానికని పెద్దలు చెబుతారు. ఒక్కో సారి ఆత్మవంచనకి, ఆత్మ సంరక్షణకి కూడా పని చేయగలదని ఇటీవలే ఒకింత అర్థమవుతున్నది నాకు. అలాగే ఉన్నాడు కానీ ప్రతిక్రియ ఏదీ కనబరచలేదు. గంగమ్మకి ఏదైనా సందేహం కలిగినప్పుడు నివృత్తి కాకుండా జీవించి ఉండలేదన్న సంగతి అర్థమైపోయింది. తొడ ప్రాంతం మీదనే చిన్నగా గిల్లి ఊరుకుంది.
“ఆ.. ఎవరూ?”, కళ్లు మూసుకునే అడిగాడు జ్యోతి.
“నేను సార్, గంగమ్మని!” పలికింది గంగమ్మ. ఎవరికోసమైతే జీవితాంతం వెదకి వెదకి అలసిపోయావో ఇదుగో నేనే నీ ముందరున్నాను చూడు అన్న భావం, అలాగే నేను నీకు తెలియకపోవటమేమిటి? విక్టోరియా రాణి వచ్చింది, తరువాత మళ్లీ నేనే వచ్చానన్న ఆత్మబలం కూడా కొట్టొచ్చినట్లు శబ్దతరంగాలు ఆ వాక్యంలో ప్రతిధ్వనించాయి! ఈ ఒరవడిలో ఒక పది శాతమైనా నాకుండి ఉంటే ఇప్పటికి ఎందరి కంచాలనో లాగేసి ఉండేవాడిని..
“ఎవరైతే ఏమి గానీ నన్ను సంప్రదించే పద్ధతి అది కాదు”, జ్యోతి ఉద్బోధ ఇచ్చి పడేసాడు.
“మరి?”, చక్కగా అడిగింది గంగమ్మ.
కళ్లు తెరిచాడు. భృకుటిని ముడి వేసి నిద్రాభంగమైన ముచుకుందునిలా తీక్ష్ణంగా చూసాడు గంగమ్మని. ఆమెలో ఏ మాత్రం బెదురు లేదు.
“పెద్దలను పలుకరించేందుకు వారి తొడలను గిల్లి గేలి చేయరు”
“గిల్లలేదు సారూ! మీరు నిద్ర పోతున్నారని అనుకున్నాను.”
“కావచ్చు. దానికి నా పాదాలు సిద్ధంగా ఉన్నాయి. చక్కగా నమస్కరించి చిన్నగా తట్టి చూడవచ్చు. ఖర్చు లేకుండా కొద్దిగా పుణ్యం కూడా దక్కుతుంది. తెలిసిందీ?”
“ఏదో ఇవన్నీ తెలియవు సారూ! బట్టల మీద నీళ్లు చల్లి ఇస్త్రీ చేసినట్లు అవసరమైతే మొహం మీద నీళ్లు చల్లి నిద్ర లేపుతాను సారూ ఆడిని.”
“ఆడు అంటే?”
గంగమ్మ లైటుగా సిగ్గు పడింది. జిల్లేళ్ల పోలేరమ్మకే సిగ్గు వస్తే ఇలా ఉంటుందన్నమాట!
“ఇంకెవరిని సారూ, నన్ను కట్టుకున్నోడిని!”
“ఆ ఒక్కరినే అలా చేసి లేపే అధికారం నీకుంది. వాస్తవానికి నేను లేచే ఉన్నాను. ఇంతకీ నీ బాధ ఏమిటి?”
“మిమ్మల్ని చాలా సార్లు పెళ్లి.. కాదు సారూ, పెళ్లిళ్లలో చూసినట్లు అనిపించి..”
“అయితే?”
“మీరేటి సేతారని సారూ?”
“నేను జ్యోతిష్కుడను”
“సేతులూ కాళ్లూ సూత్తారా?”
జ్యోతి నన్ను బాధగా చూసాడు. నేను నేల వైపు చూసాను.
“నీ దుంప తెగ! జాతకాలు లేని వాళ్లకి చెప్పాలంటే చేతులు చూస్తాను.”
గంగమ్మ కళ్లు మూసుకుంది. ఈసారి ఈమె ధ్యానం లోకి వెళ్లినట్లుంది.
ఒక్కసారిగా లేచింది. ఆడవాళ్లు ఒకసారి నేల మీద కూర్చున్నాక అంత త్వరగా లేచి నిలబడటం మొదటిసారి చూసాను.
“కరెక్టు సారూ!”, దాదాపు అరచింది.
“ఏమైంది?”, ఇద్దరం అడిగాం.
“మీరు ఆ మధ్య ఒక పెళ్లిలో వంట చేసారు. అక్కడ కాటరింగ్ లేదు. నేను గుర్తొచ్చానా? అక్కడ గిన్నెల సంగతి నేను చూసుకున్నాను. అదీ సంగతి. హమ్మయ్య!”
జ్యోతి నిట్టూర్చి మరల కళ్లు ముసుకున్నాడు. గంగమ్మ మహిళల వెయిట్ లిఫ్టింగులో స్వర్ణపతకం సాధించినట్లు రెండు చేతులూ పైకి పెట్టి జాతిని ఉద్దేశించి ఇప్పుడే ప్రసంగించబోతున్నట్లు కనిపించింది.
మరి ఇంత జరిగిపోతుంటే సన్యాసి రాకుండా ఎలా ఉంటాడు? మెల్లగా జ్యోతి తాటి పండు వంటి తలకాయ వెనుక ప్రత్యక్షమయ్యాడు!..
(తదుపరి భాగం వచ్చే వారం)
వేదాంతం శ్రీపతిశర్మ కథా రచయిత. నవలా రచయిత. వ్యంగ్య హాస్య రచనలకు పెట్టింది పేరు. “ఆరోగ్య భాగ్యచక్రం” అనే పుస్తకాన్ని వెలువరించారు.
