Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మోసం చెయ్యటం ఎలా?-19

[ప్రముఖ రచయిత శ్రీ వేదాంతం శ్రీపతిశర్మ రచించిన ‘మోసం చెయ్యటం ఎలా?’ అనే హాస్య వ్యంగ్య నవలని ధారావాహికంగా అందిస్తున్నాము.]

[జ్యోతిని ఉద్దేశించి మాట్లాడుతూ, అతనెవరని అడిగి, అతన్ని తాను ఏదో పెళ్ళిలో చూశానని అంటుంది గంగమ్మ. ఆమెకి ఎలా జవాబివ్వాలో సుందర్‍కి అర్థం కాదు. ఆయననే అడగమంటాడు. గంగమ్మ ధ్యానభంగిమలో ఉన్న జ్యోతిని గిల్లి, మాట్లాడేలా చేస్తుంది. ఎవరని అతను అడిగితే నేను గంగమ్మని అని చెబుతుంది. ‘నువ్వు ఎవరైనా, నన్ను సంప్రదించే పద్ధతి ఇది కాదు’ అంటాడు జ్యోతి. పాదాలకు నమస్కరించి, చిన్నగా తట్టి లేపవచ్చని అంటాడు. అవన్నీ తనకి తెలియవని, తన మొగుడి మీద కూడా అవసరమైతే నీళ్ళు జల్లి నిద్ర లేపుతానని అంటుంది. ‘మీరేం చేస్తార’ని అడుగుతుంది. అతను చెప్పింది ఆమెకి అర్థం కాదు. అర్థమయ్యేలా చెప్తాడు సుందర్. ఉన్నట్టుండి గంగమ్మకి తాను జ్యోతిని ఎక్కడ చూసిందో గుర్తొస్తుంది. కేటరింగ్ లేని ఓ పెళ్ళి వంట చేశాడని, తాను గిన్నెలు కడిగాననీ అంటుంది. జ్యోతి నిట్టూర్చి కళ్ళు మూసుకుంటాడు. ఇంతలో సన్యాసి ప్రత్యక్షమవుతాడు. – ఇక చదవండి.]

సమోసా ఉపాఖ్యానం (18)

ఆకలి వేళల అమ్మగా, చీకటి వేళల వెలుగుగా, బాధ కలిగినప్పుడు పెయిన్ బామ్‌లా, తల్లిదండ్రులు లెక్క చెయ్యనప్పుడు దగ్గరకి తీసుకునే బామ్మలా, గోడు వినిపించుకునేటప్పుడు అనవసరంగా బదులు చెప్పని గోడ మీద బొమ్మలా, నేనే ఉన్నాను, నేనూ ఉన్నాను అని అనుక్షణం చాటే పోటుగాళ్ల మధ్య నీకెందుకు, నేను నీకున్నాను అంటూ పాపం ప్రత్యక్షమవుతాడు ఈ సన్యాసి.

“శిశువా”

“యస్?”

“ఈశ్వరుడు గొప్పవాడు.”

“చాలా”

“విధి విధానాలలో ఎంతో వైవిధ్యాన్ని పూరించి గొప్ప సహాయం చేసాడు.”

“సహాయం ఎందుకైంది?”

“ఒకే రకం మనుషులని ఇక్కడ దించి ఉంటే అందరం ఒకే ఆస్పత్రిలో, ఒకే వార్డులో ఒకే రకం టాబ్లెట్లు వేసుకుంటూ గోడ మీదున్న టి.వి.లో ఒకే కార్యక్రమం మధ్య ఒకే రకం వాణిజ్య ప్రకటనను చూస్తూ ఉండేవాళ్లం.”

“ఈ ఒకే ఒక మాటకు ఒకే ఒక్క నమస్కారం నీకు ఇప్పుడే గ్రాంట్ చేసేసాను.”

“ఏంటది? నమస్కారాన్ని గ్రాంట్ చేస్తున్నావా?”

“అవును. జనం ఎలా ఉన్నారు? ఈ శాల్తీకి నమస్కారం పెట్టాలా? పెడితే ఎందుకు పెట్టాలి? పెట్టాలీ అంటే తిరిగి ఏమొస్తుంది? ఇలా ఆలోచిస్తున్నారు.”

“లెస్స పలికితివి శిశువా! అన్నీ కొలతలే! అన్నీ రాంకింగులే! స్వతంత్రంగా ఎవరూ లేరు.”

“అంతా అయిపోయిన తరువాత నా కొలతల వ్యవహారానికి రేటింగ్ ఇమ్మని అడుగుతారు.”

“కరెక్ట్. ఇంతకీ నీలో ఏదో రగిలింది, నేను ఇలా వచ్చాను. నీ బాధేంటో చెప్పేసుకో.”

“జ్యోతిష్కులు వంటలు చెయ్యకూడదా?”

“మంచి ప్రశ్న. అసలు వాళ్లకి చేతైనదే వంట చెయ్యటం.”

“ఛా”

“అవును శిశువా! పదకొండో ఏట ఏమైంది? అని అడుగుతాడు.”

“ఎందుకు?”

“అందరికీ ఆ సమయంలో దెబ్బ తగలటమో, అనారోగ్యమో, కొత్త స్కూలో, కొత్త ఊరో, ఒక మంచి స్నేహితునితో కలవటమో, ఇలాంటివి ఉంటాయి.”

“నిజమా?”

“నిజం. నీ జీవితమే చూస్కో.”

“అవును. సైకిల్ నేర్చుకుంటూ పడ్డాను.”

“మీకు చాలా విషయాలు తెలుసు. ఎందుకో జంకుతారు, త్వరగా చెప్పరు. ఈ మాటతో కుక్కరు పొయ్యి మీద పెట్టేస్తారు.”

“ఓ”

“ఆ విన్నవాడి లోపలున్న ద్రవపదార్థం యావత్తూ బుడగలు బుడగలుగా చిందులేస్తుంది.”

“ఇంకా?”

“మీరు ఒకరి బాధని చూడలేరండీ – ఈ మాటతో కుక్కర్ మొదటి ఈల వినిపిస్తుంది. సూర్యోదయంతో మొదలుకుని అర్ధరాత్రి వరకూ ఎవరో ఒకరిని తిట్టకుండా, ఏడిపించకుండా, బాధ పెట్టకుండా నిద్ర పోలేని వాడు కూడా ఆ ఈలకి తన కుర్చీలో తెగ కులికి కులికి కుర్చీ తాలూకు శబ్దాలను వినిపించి ఫర్నిచర్ షాపు వాడి మోసాన్ని బహిరంగం చేసేస్తాడు.”

“ఆలోచించాలి. ఇంకా?”

“మీరు ఖర్చు పెడితే డబ్బు అదే వస్తుంది. దాచుకోవాలనుకుంటే అనవసరపు ఖర్చుగా అవతలికి వెళ్లిపోతుంది. – ఈ రెండో మాటతో కుక్కరు రెండవ ఈల విడుదల అవుతుంది.”

“అదిరింది.”

“అదీ సంగతి. ఆ రెండో ఈలకి జ్యోతిష్కుని టేబిల్ మీద పెద్ద దెబ్బ వేస్తాడు. దుమ్ము పైకి లేస్తుంది. ఇద్దరూ అకస్మాత్తుగా, అనుకోకుండా బ్రహ్మపదార్థాన్ని పొందేసిన ఆనందంలో ఒకరినొకరు మనసారా చూసుకుని మౌనంగా అభినందించుకుంటారు.”

“బాగుంది సన్యాసీ. మూడవ ఈల?”

“ఒక్కో సారి మీరు ఆఫీసు నుండి ఇంటికి వచ్చినప్పుడు పిక్కల్లో నొప్పులు, లేదా మెడ చుట్టూ ఏదో ఇబ్బందిగా ఉంటుంది అనగానే అతను అవునండీ అంటాడు. ఆయన శ్రీమతి ప్రక్కనుంటే గట్టిగా అరచి మరీ ఒప్పేసుకుంటుంది.. డాక్టరు, ఆస్పత్రి, మందుల గురించి మొదలెడుతుంది.  జ్యోతిష్కుడు చెయ్యి అడ్డం పెట్టి ఆపేస్తాడు.”

“ఎందుకు?”

“ఇది కీలకం. లోపల బియ్యం, పప్పు పెట్టినప్పుడు సరైన కొలతలో నీళ్లు పోసామా లేదా అన్నది మూడో ఈలకి ప్రతిబింబం.”

“ఛా.”

“మరి? చెయ్యి అడ్డు పెట్టి ఈ నొప్పులన్నీ నిజానికి మీ అనారోగ్యం యొక్క సూచనలు కావు అంటాడు.”

“మరి దేనికి సూచనలు?”

“అదీ సంగతి. దృష్టిదోషం! మీ ఇద్దరినీ చూసి అనేకమంది వొంతులు వేసుకుని షెడ్యూల్ ప్రకారం ప్రతి రోజూ ఈర్ష్యతో ఏడుస్తూ ఉంటారు, అంటాడు.”

“ఓ.”

“వెంటనే వాళ్లిద్దరూ ఒకళ్ల మొహాలొకళ్లు చూసేసుకుని అమాంతం అతని కాళ్ల మీద పడిపోతారు. కుక్కరు మూడో ఈల గదంతా దద్దరిల్లిపోతుంది!”

(తదుపరి భాగం వచ్చే వారం)

Exit mobile version