Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మోసం చెయ్యటం ఎలా?-2

[ప్రముఖ రచయిత శ్రీ వేదాంతం శ్రీపతిశర్మ రచించిన ‘మోసం చెయ్యటం ఎలా?’ అనే హాస్య వ్యంగ్య నవలని ధారావాహికంగా అందిస్తున్నాము.]

[రాత్రి ఒంటిగంట దాటాకా కథకుడికి మెలకువ వస్తుంది. మెలకువ వచ్చినా అలా చూస్తూనే ఉంటాడు. ఎదురుగా ఉన్న తెల్ల సున్నం వేయించిన గోడ మీద దృష్టి నిలుపుతాడు. అలాగే ఉండిపోతాడు. హఠాత్తుగా ఇప్పుడెవరైనా వచ్చి తనని చూస్తే, ఎన్నో ప్రశ్నలు కలుగుతాయని అనుకుంటాడు. ఇంతలో గోడ మీద ఒక బొమ్మలాంటిదేదో కనిపిస్తుంది. దెయ్యమా అనుకుంటాడు. కానీ దెయ్యాలూ భూతాలూ తననేమీ చేయలేవని భావిస్తాడు. కొద్దిసేపటికి ఆ గోడ మీద ఉన్నది తనలాంటి ఆకారమేననీ, కాషాయరంగు దుస్తులు, కళ్ళజోడు ధరించి ఉన్నాడనీ గ్రహిస్తాడు. మంచం పక్కన ఉన్న చెంబులోని నీళ్ళు కొన్ని తాగి మళ్ళీ చూస్తాడు. గోడ మీద బొమ్మ లాంటి మనిషి చిరునవ్వు నవ్వుతాడు. ఎవరు నువ్వని అడుగుతాడు కథకుడు. నీలో, నీతో, నిరంతరం మసలుకునే నీవాడిని, నీ సన్యాసిని అంటాడతను. ఇప్పుడెందుకు దర్శనమిచ్చావని కథకుడు అడిగితే, ఈ రాత్రి నుంచి నువ్వు అందరినీ మోసం చేయాల్సి ఉంటుందని, కళ్ళు మూసుకోమంటాడు. – ఇక చదవండి.]

సమోసా ఉపాఖ్యానం (1)

దయం లేచి అన్నీ ముగించుకుని వరండాలో కూర్చున్నాను. రాత్రి చూసింది కలా? లేక నిజంగా గోడ మీద నా అంతరాత్మా అన్నది ఇంకా రూఢిగా తెలియటంలేదు.

లోపలి నుండి కాఫీ వచ్చింది. మా ఆవిడ అలా బల్ల మీద పెట్టి ఓ చూపు చూసి వెళ్లిపోయింది. ఎందుకలా చూసింది? ఇంతలో శరీరమంతా ఒక్కసారి విద్యుత్తు తరంగాలు పాకినట్లయింది. వాకిట్లో గేటు ప్రక్కనున్న దిమ్మె మీద అదే సన్యాసి ఇటు తిరిగి కూర్చుని కాళ్లు ఆడిస్తున్నాడు.

“గుడ్ మార్నింగ్ శిశువా!” అన్నాడు.

“మార్నింగ్. నువ్వు అక్కడికెలా చేరావు?”

“అదేవన్నమాట? ఎవరెస్ట్ మీద కూడా రెస్ట్ తీసుకుని అవసరం అనుకున్నప్పుడు తిరిగి రాగలను!”

“ఇంతకీ ఎందుకు ప్రత్యక్షమైనావు?”

“చెబుతా. మామూలుగా నీకు కాఫీ ఇచ్చి ‘పంచదార సరిపోయిందా? లేక వేడిగా ఉందా?’ అని అడిగేవారు. అవునా?”

“కరెక్ట్.”

“మరి ఈ మధ్య ఎందుకు అడగటంలేదు?”

“అదే బ్రహ్మసూత్రం, అర్థం కావటం లేదు.”

“అందుకు కనిపించాను నీకు శిశువా.”

“ఓ. చెప్పు.”

“పైగా ఆఫీసుకెళ్లినప్పుడు ఫుల్ బనియన్, టక్ షర్ట్‌లో వెళ్లావు.”

“కరెక్ట్. కొద్దిగా పౌడర్ అద్దాను.”

“మరి ఈ కట్ బనియన్‌లో, ఏదో పచ్చగడ్డి కోసేటి పాటలో ఎ.ఎన్.ఆర్.‌లా కూర్చుంటే ఏమన్నట్లు?”

“నువ్వు చాలా మంచివాడివి సన్యాసీ.”

“పిచ్చివాడా. మంచివాళ్లందరూ సన్యాసులే. ఇంతకీ ఎందుకంటావు?”

“రమణారెడ్డి శరీర సౌష్ఠవాన్ని ఏకంగా ఎ.ఎన్.ఆర్.‌తో పోల్చేసావు!”

టక్కున మాయమయ్యాడు సన్యాసి.

“ఎవరితో మాట్లాడుతున్నారు?”, ఈమె గొంతు వినిపించింది.

“ఏమీ లేదు. రాత్రి కలొచ్చింది.”

“ఓ. అమ్మాయిలు కనిపిస్తున్నారా? మొహం చూడు..”

విసుగ్గా వెళ్లిపోయింది.

మళ్లీ తయారయ్యాడు సన్యాసి.

“హ హ హ”

“నీకేం సన్యాసీ, నవ్వుతావు.”

“ఇంతకీ మోసం సంగతి ఏం చేసావు? అమ్మాయిని చూస్తున్నావా?”

“ఆ.. ఏదీ వినిపించకపోయినా మనసులో మాట వినిపించుకునే అమ్మాయిని చూస్తున్నాను.”

“అంటే నా లాంటి అమ్మాయినా శిశువా?”

“ఇదేదో బాగుంది.”

ఫోన్ మ్రోగింది.

“హలో?”

“మేము సమోసా నుండి మాట్లాడుతున్నాము.”

“సమోసా.. అదేంటండీ?”

“తినేది కాదండీ. మీరు వినలేదా? సరస మోసగాళ్ల సాహితీ వేదిక.. చిన్నగా సమోసా.”

“శభాష్!”

“మీరు మాకు ఓ పుస్తకం వ్రాయాలి.”

“ఎందుకు?”

“ఇంత అమాయకులైతే ఎలా సార్?”

“చెప్పండి.”

“మోసం చెయ్యటం ఎలా? అది మీ పుస్తకం టైటిల్. సమోసా వారు ప్రచురిస్తారు!”

సన్యాసి నవ్వుతున్నాడు..

(తదుపరి భాగం వచ్చే వారం)

Exit mobile version