[ప్రముఖ రచయిత శ్రీ వేదాంతం శ్రీపతిశర్మ రచించిన ‘మోసం చెయ్యటం ఎలా?’ అనే హాస్య వ్యంగ్య నవలని ధారావాహికంగా అందిస్తున్నాము.]
[జ్యోతిని తానెక్కడ, ఎలా చూశానో గంగమ్మ చెబుతుండగా, అక్కడ ప్రత్యక్షమవుతాడు సన్యాసి. సుందర్ని పలకరించి, ఈశ్వరుడు గొప్పవాడని, విధి విధానాలలో ఎంతో వైవిధ్యాన్ని పూరించి గొప్ప సహాయమని అంటాడు. ఎలా అని సుందర్ అడిగితే, వివరంగా చెప్తాడు సన్యాసి. సుందర్ మనసులో ఏదో సందేహం మెదిలిందనీ, అందుకే తానొచ్చాననీ అంటాడు సన్యాసి. జ్యోతిష్కులు వంట చేయకూడదా అని సుందర్ అడిగితే, వాళ్ళకసలు వచ్చిందే వంట చెయ్యడమని అంటాడు సన్యాసి. అందరి జీవితాలలో సాధారణంగా సంభవించే పరిణామాలనే జ్యోతిష్కులు విశేషంగా ప్రస్తావిస్తారని ఉదాహరణలు చెప్తాడు సన్యాసి. – ఇక చదవండి.]
సమోసా ఉపాఖ్యానం (19)
పరంజ్యోతి పరబ్రహ్మశాస్త్రి అలా చూస్తూ కూర్చున్నాడు. గంగమ్మ ఏదో అనితరసాధ్యమైనదానిని సాధించి చూపించినట్లు మురిసిపోతూ కూర్చుంది. సన్యాసి నాకు జ్యోతిషానికి సంబంధించిన కొంత మోసాన్ని రుచి చూపించి అలా ఎక్కడో మాయమైపోయాడు.
నేను జ్యోతి సమాధానం కోసం చూసాను. ఆయన గంగమ్మను ఓ చూపు చూసాడు.
“నీ పేరేమన్నావు?”, అడిగాడు.
“గంగమ్మ సారూ. ఇక్కడ జిల్లేళ్ల పోలేరమ్మ అని చెప్పమన్నారు.”
“ఒ.కే, చూడు గంగమ్మా..”
ఆమె క్రింద కూర్చునే మరింత దగ్గరగా జరిగింది.
“మనిషిని పోలిన మనుషులుంటారు గంగమ్మా.”
“లేదు సారూ, మీరు.. నేను మిమ్మల్నే చూసాను సారూ. చాలా దగ్గరగా చూసాను సారూ.”
“సరే, చూసావు. నన్ను ఏం చెయ్యమంటావేంటి?”
“అది కాదు సారూ, మీరు ఒప్పుకుంటే ఓ మాటంటాను.”
“ఒప్పుకోకపోతే?”
“అయినా అంటాను.”
“ఒప్పుకోలేదనుకుని అను.”
“పోనీ అట్లనే. మీరు ఈ ఏషం ఎట్ల ఏత్తారేంటి?”
“నువ్వు ఇస్త్రీ చేసే దానివి. ఈ వేషం ఎలా వెస్తున్నావు?”
“ఏషం ఎయ్యంది ఎవరండీ సారూ?”
“కరెక్ట్. వేషం మోసం కానే కాదు. చాలా నిజాయితీ కలవాడే సూటిగా ఒప్పుకుని వేషం వెయ్యగలడు.”
“అంటే?”
“ముందు ఓ కల కనాలన్నారు కలామ్ గారు.”
“ఎవరు సారూ?”
“ఎందుకులే? ముందర ఊహల్లో కంజూసీ లేకుండా మనం అనుకున్న వేషాన్ని చక్కగా నిర్వర్తించాలి.”
“అర్థం కాలేదు సారూ.”
“ఏమీ లేదు. మన గురించి మనం ఏదో కల లాంటిది కనేసి ఆ కలలో నేనున్నానని అనేసుకుని అలా గాలిలో తేలిపోతూ మనమందరం ప్రయాణం చేస్తూ ఉంటాం. అది మోసమే కదా?”
“ఇప్పటికి ఇరవై సార్లు అరిచాను సార్.”
“ఎందుకు?”
“ఇస్త్రీ ఒక శకితి అని. ఎట్లుంది?”
“కరెక్ట్. రేపు పొద్దున్న ఈ గోల అయిపోయాక కూడా అదే పని చెయ్యి.”
“ఎవరూ ఇనరు సార్.”
“నీ ఇస్త్రీ బండీ దగ్గరికి ఎవరొచ్చినా ఈ మాటే వినిపించు. ఈ రోజు నుంచి సరిగ్గా ఆరవ నెల తరువాత నువ్వు కనీసం కాలనీ వార్డ్ మెంబర్ కాకపోతే చెప్పుల దండ మెడలో వేసుకుంటాను.”
గంగమ్మ పళ్లు ఇకిలించింది.
“అవును సారూ..”
“చెప్పు.”
“నిజంగా జాతకం చెబుతారా?”
“అవును.”
“నాదో కోరిక.”
“చెప్పెయ్!”
“చెప్పుల దండ అన్నారు కదా?”
“కొంప దీసి రెడీగా తెచ్చావా?”
“అయ్యో లేదు సారూ.”
“ఆన్లైన్ ఆర్డర్ చేసావా?”
“లేదు సారూ. నాకు వారానికి ఒక రోజు కనీసం ఒక్క సారైనా ఒక కల వస్తుంది.”
జ్యోతి గట్టిగా తన తొడ మీద చరచి శబ్దం చేసాడు.
“ఇప్పుడర్థమైంది.”
“ఏంటి సారూ?”
“నన్ను కలలో చూసి ఉంటావు.”
“లేదు సారూ. కలలో నాకు ఎప్పుడూ ఒకడే వస్తూ ఉంటాడు.”
“ఎవరు? నిన్ను కట్టుకున్నవాడా?”
“లేదు సారూ. నాకు కట్టలు కట్టలు అప్పులిచ్చినోడు. అలా ఇంటికొచ్చి గోడ మీద తల కొట్టుకుంటూ కనిపిస్తాడు.”
“ఇంతకీ ఏం చెప్పాలి నీకు?”
“సారూ, అప్పుడప్పుడు ఆరు, లేదా ఏడుగురు మనుషులొచ్చి నాకు వరుసగా పూలదండలు వేసినట్లు కలొస్తుంది సారూ.”
“శభాష్!”
“ఇప్పుడు చెప్పండి. ఆ కల నిజమవుతుందా?”
జ్యోతి మఠం వేసి కళ్లు మూసుకున్నాడు. గంగమ్మ నన్ను గంభీరంగా చూసింది. జ్యోతిని గుచ్చి గుచ్చి చూస్తోంది. కొద్ది సేపయ్యాక జ్యోతి అకస్మాత్తుగా కరెంట్ షాక్ తగిలినట్లు కదిలాడు. ఇద్దరం రెండు అడుగులు వెనక్కి జరిగాం.
కళ్లు తెరిచాడు.
“పిల్లా..”
“నన్ను కాలనీలో ఆంటీ అంటారు సారూ..”
“ఫరవాలేదు. నీ ఆ కల ఈ రోజే నెరవేరబోతోంది.”
గంగమ్మ లేచి నిలబడింది. “అవునా సారూ? నిజంగా ఇదే జరిగితే అయిదొందలు ఇచ్చేస్తాను. మిమ్మల్ని వంటవాడిగా చూడలేదని చెబుతాను.”
జ్యోతి తల పట్టుకున్నాడు!
(తదుపరి భాగం వచ్చే వారం)
వేదాంతం శ్రీపతిశర్మ కథా రచయిత. నవలా రచయిత. వ్యంగ్య హాస్య రచనలకు పెట్టింది పేరు. “ఆరోగ్య భాగ్యచక్రం” అనే పుస్తకాన్ని వెలువరించారు.
