[ప్రముఖ రచయిత శ్రీ వేదాంతం శ్రీపతిశర్మ రచించిన ‘మోసం చెయ్యటం ఎలా?’ అనే హాస్య వ్యంగ్య నవలని ధారావాహికంగా అందిస్తున్నాము.]
[గంగమ్మ అడిగిన ప్రశ్నకు వెంటనే జవాబు చెప్పకుండా జ్యోతి కాసేపు మౌనంగా ఉంటాడు. తర్వాత నీ పేరేమన్నావు అని గంగమ్మని అడిగి, మనుషులను పోలిన మనుషులుంటారనీ, ఆమె చూసింది తాను కానని అంటాడు. కాదంటుంది గంగమ్మ. తాను అతన్నే చాలా దగ్గరగా చూశానని వాదిస్తుంది. కాసేపయ్యాకా, మీరు నిజంగా జాతకం చెప్తారా అని జ్యోతిని అడుగుతుంది. చెప్తానని చెప్పి, ఆమె వార్డు మెంబర్ అవుతుందని అంటాడు. తనకి అప్పుడప్పుడు – ఆరు, లేదా ఏడుగురు మనుషులొచ్చి వరుసగా పూలదండలు వేసినట్లు కల వస్తుందని చెప్పి, ఆ కల నిజమవుతుందా అని అడుగుతుంది. ఆ కల ఈ రోజో నెరవేరబోతోందని అంటాడు జ్యోతి. నిజంగా అదే జరిగితే, ఐదు వందలు ఇచ్చి, అతన్ని తాను వంటవాడిగా చూడలేదని చెప్తానని అంటుంది గంగమ్మ.]
సమోసా ఉపాఖ్యానం (20)
గంగమ్మ ఆనందంలో పరవశిస్తుండగా తలుపు చప్పుడయింది. అలా తలుపు కొట్టిన వారు దేని కోసమూ అసలు వేచి యుండరు అని అర్థమైంది. తలుపును బార్లా తెరచి రెండు చేతులూ నడుము మీద పెట్టుకున్నాడు. అతని వెనుక అస్తమిస్తున్న సూర్యుని వింతైన కాంతి వలన మనిషి ‘ప్యాసా’ సినిమాలో చివర గురు దత్ హాల్లోని తలుపు దగ్గర నిలబడి పాట పాడిన వైనం గుర్తుకు వచ్చింది.
“అక్కడే ఉండండి”, గంగమ్మ అరచింది.
ఆ మానవుడు దగ్గాడు.
“ఎందుకు? ఎందుకని అడుగుతున్నాను”, అన్నాడు.
గంగమ్మ లేచి నిలుచుంది. “లైట్ ఏత్తానుండండి.”, అంటూ స్విచ్ ఆన్ చేసింది. అందరం ఒకళ్ల మొహాలొకళ్లు కాస్త గట్టిగా చూస్కున్నాం. వచ్చిన పెద్దమనిషి కూడా చక్కగా కనిపించాడు. లోపలికి వచ్చి మా అందరినీ జాగ్రత్తగా చూసాడు.
“పూలదండ తేలేదు సారూ..”, గంగమ్మ చప్పరించింది.
“నేను దండలు తెచ్చే మనిషిని కాదు.”
“మరి?”
“పంచామృతం”, అన్నాడు.
“ఇప్పుడక్కరలేదు”, గంగమ్మ గంభీరంగా చెప్పింది. అతను చక్కగా చిరునవ్వు చిందించి తల అడ్డంగా ఊపాడు.
“కాదు సిస్టర్”
“ఆ.. నేను నర్సమ్మలా కనిపిస్తున్నానా?”, గంగమ్మ దాదాపు గర్జించింది.
“నో. సోదరీమణి-నాకు తోబుట్టువు అని అర్థం.”
“ఓ.. అలా అనండి. ఇంతకీ మీరెవరు?”
“పంచామృతం! నా పేరది!”
“పేరు బాగుంది.”, జ్యోతి అన్నాడు. నేను మాట్లాడాను.
“ఇది టైటిల్ అనుకోవాలా సార్? లేక అసలు పేరేనా?”
సోఫాలో కూర్చుని అక్కడున్న మంచినీళ్లు గడగడా త్రాగాడు. నన్ను ఒక మహాజ్ఞాని చూసినట్లు చూసాడు.
“ఆకాశానికి అనంతం ఒక టైటిల్!”
“కరెక్ట్.”
“అసలు మీరడిగింది చాలా చెత్త ప్రశ్న.”
“ఎందుకో?”
“చెబుతా. మీరు నా గొంతు వినగానే మీకు అర్థమైపోవాలి.”
“ఏమని?”
“నేను పంచామృతాన్ని అని.”
“ఛా!”
“అవును. నా పాట మీరు చాలా చోట్ల వినుంటారు.”
జ్యోతి దగ్గాడు. దగ్గరగా జరిగాడు.
“ఒక సందేహం”, అన్నాడు.
“అడిగెయ్యండి. కళాకారుల వద్ద సందేహాలు పనికి రావు. దేహమెట్టి సందేహపడక వైదేహి భాగ్యమా, దేహి దేహి అని రామనామం భజరే అన్నాడు త్యాగయ్య.”
గంగమ్మ గబగబా అడుగులు వేసుకుంటూ చక్కగా జారుకుంది.
“సందేహం అడుగుతాను.”
“యస్”
“నా పాట చాలా చోట్ల వినుంటారు అని సెలవిచ్చారు.”
“అది నేను చిన్నగా చెప్పేసిన నిజం మాష్టారూ!”
“నేను నమ్మేసాను.”
“మీకది తప్పదు సార్.”
“కానీ మీరు నా పాట అని ఒక పాట లాగే అన్నారు.”
“అవును. నేను అన్ని సభలలో ఒకే పాట పాడుతాను. “
“అదేమిటో తెలుసుకోవచ్చా?”
లేచి నిలబడ్డాడు. నేరుగా ఎదురుగా ఉన్న గోడ దగ్గరకెళ్లి చెయ్యి దాని మీద పెట్టాడు. “భయపడకండి..”, అన్నాడు, “..నేను తల బాదుకోను. నాకు ఈ అవమానం అలవాటైపోయింది.”
“సార్..”, నేనన్నాను, “..ఇది అవమానం ఎందుకవుతుంది? ఆయన ఏ పాట అని కేవలం గుర్తు తెచ్చుకునేందుకు అడిగారు.”
“తప్పు మీది కాదు..”, చెప్పాడు, “..పంచామృతాన్ని గ్రోలిన వారు పూర్తిగా మైమరచి, ఆ తన్మయత్వంలో నన్ను కూడా మరచిపోతారు.”
“ఛా!”
“అవును.”
“ఇంతకీ ఏ పాట సార్ అది?” ఇద్దరం ఒకే గొంతులో అడిగాం.
పంచామృతం గది మధ్యలోకి వచ్చి శంకరశాస్త్రి లాగా రెండు చేతులూ వెనుక కలిపాడు. సమాజాన్ని కేవలం తన చూపులతోనే ప్రశ్నిస్తున్నట్లు ముక్కును కదిలించాడు.
“ఘంటసాల మార్కు శుక్లాంబరధరం లేకుండా ఏ కార్యక్రమమూ ఉండదు. అది నేను పాడినప్పుడల్లా అక్కడ రికార్డ్ పెట్టి ఇక్కడ నేను నటించాననుకుంటారు!”, బాధగా కళ్లు మూసుకుని స్ప్రింగులా తల ఆడించాడు.
“శభాష్”, అన్నాను.
అతను నిట్టూర్చాడు.
“ఈ దేశంలో నిజమైన కళాకారునికి ఏ రోజూ నిజమైన గుర్తింపు ఉండదు. ఐనా సరే.. ఆ బాధలన్నిటినీ విషంలా మింగేసి అందరికీ ఇలా పంచామృతాన్ని పంచుతూనే వస్తున్నాను.”
స్టేజ్ మీద నటుడిలా సోఫాలో వెనక్కి వాలిపోయి కుది చెయ్యిని కళ్ల మీద వాల్చేసాడు.
సన్యాసి కనిపించాడు.
“శిశువా!”
“యస్?”
“నిజం మనకు అబద్ధం వలననే తెలుస్తుంది.”
“కరెక్ట్.”
“కానీ మనం నిజాన్నే కోరుకుంటాం.”
“కరెక్ట్.”
“ఇది అబద్ధాన్ని నిజం చేసే మోసం కాదా?”
(తదుపరి భాగం వచ్చే వారం)
వేదాంతం శ్రీపతిశర్మ కథా రచయిత. నవలా రచయిత. వ్యంగ్య హాస్య రచనలకు పెట్టింది పేరు. “ఆరోగ్య భాగ్యచక్రం” అనే పుస్తకాన్ని వెలువరించారు.
