Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మోసం చెయ్యటం ఎలా?-22

[ప్రముఖ రచయిత శ్రీ వేదాంతం శ్రీపతిశర్మ రచించిన ‘మోసం చెయ్యటం ఎలా?’ అనే హాస్య వ్యంగ్య నవలని ధారావాహికంగా అందిస్తున్నాము.]

[తలుపు తీసుకుని ఆ గదిలోకి మరో వ్యక్తి ప్రవేశించబోతాడు. తలుపును బార్లా తెరచి రెండు చేతులూ నడుం మీద పెట్టుకుంటాడు. అతన్ని అక్కడే ఉండమని లైట్ స్విచ్ వేస్తుంది గంగమ్మ. అతన్ని చూసి పూలదండలు తేలేదని అంటుంది. తాను పూలదండల మనిషిని కాదని, తన పేరు పంచామృతం అని చెప్తాడతను. ఇది టైటిలా  లేక అసలు పేరేనా అని సుందర్ అడిగితే, అది చాలా చెత్త ప్రశ్న అని అంటాడు పంచామృతం. తన గొంతు వినగానే తాను పంచామృతాన్నని అర్థమైపోవాలని అంటాడు. తన పాటని వాళ్ళంతా చాలా సార్లు విని ఉంటారని అంటాడు. అతను ఏ పాట పాడతాడో తెలుసుకోవచ్చా అని సుందర్ అడిగితే, తనకి అవమానాలు అలవాటైపోయాయని అంటూ, తాను ‘శుక్లాంబరధరం’ పాడితే, ఘంటసాల రికార్డు పెట్టినట్టే ఉంటుందని అంటాడు. ఈ దేశంలో నిజమైన కళాకారునికి ఏ రోజూ నిజమైన గుర్తింపు ఉండదనీ, ఐనా సరే ఆ బాధలన్నిటినీ విషంలా మింగేసి అందరికీ పంచామృతాన్ని పంచుతూనే వస్తున్నాననీ చెప్తాడు. ఇంతలో సన్యాసి ప్రత్యక్షమై, ఇది అబద్ధాన్ని నిజం చేసే మోసమని అంటాడు. – ఇక చదవండి.]

సమోసా ఉపాఖ్యానం (21)

జనం లోకి వెళ్లాం. వేదిక కళకళలాడిపోతోంది. ఎక్కడి నుంచి వచ్చారో జనం అలా వస్తూనే ఉన్నారు. ఆ మైదానంలో తరగతులలా తయారు చేసారు. ఒక్కో బారికేడ్ వెనుక ఒక రకమైన దుస్తులలో ప్రేక్షకులు కనిపిస్తున్నారు. ఏదో రాజకీయపు రాలీలా ఉన్నది. దారి పొడుగునా అమ్మాయిలు, అబ్బాయిలు మెడలలో ఏవో ఐడింటిటీ కార్డులను వ్రేలాడదీసుకుని ఉన్నారు. అక్కడ శుభ్రం చేసేవారు కూడా చక్కని దుస్తులలో ఉన్నారు. నా ముందరకి ఓ కుర్రాడు వచ్చి చక్కగా నమస్కారం చేసాడు. అతని ఐడెంటిటీ కార్డు చూసాను. ‘సమోసా రిసెప్షన్ కమిటీ’ అని ఉన్నది.

“ఇలా ముందు వరుసలోకి రండి సార్”, అన్నాడు.

“ఎందుకు?”, అడిగాను కావాలని.

“సార్, మీరు పుస్తకం వ్రాసిన వారు. ఈ కార్యక్రమమే మీ వలన ఏర్పాటు చేసుకుంటున్నాం.”

“నా గురించి ఎలా తెలుసు?”

అతను అందంగా చిరునవ్వు నవ్వాడు. తన టాబ్ తీసి టకటకా ఏదో నొక్కాడు. “ఇదిగోండి”, అంటూ నాకు చూపించాడు. బాగుంది. అందులో అన్ని వింతలూ, విశేషాలు, సశేషాలు చక్కగా అందరి ప్రొఫైల్స్‌తో పాటు మెరిసిపోతున్నాయి. సమోసా ఒక చక్కని ఐకాన్‌లా మారిపోయి ప్లేట్‌లో గిరగిరా తిరుగుతోంది.

“ఓ. బాగుంది, నీ పేరు?”

“శశిధర్. సమోసా టైగర్ ఫ్రంట్!”

“అంటే?”

“అది మా టీం సార్. ఇక్కడ పది సమోసా టీమ్‌లు ఉంటాయి.”

“ఓ. మీరు టైగర్ ఫ్రంట్.”

“కరెక్ట్. రండి సార్.”

అతనితో అలా నడుచుకుంటూ వెళ్లి ముందు వరుసలో కూర్చున్నాను.

నేను కూర్చున్న సోఫా ప్రక్కన అటూ ఇటూ రెండు సోఫాలున్నాయి. ఒక సోఫాలో అటు చివార్న ఎవరో మహిళ వింత మేకప్‌లో అలా కూర్చుంది. ఎందుకైనా మంచిదని జాగ్రత్తగా చూసాను. గబుక్కున పలుకరిస్తే ఏమవుతుందో తెలియదు.

“శశీ..”, కుర్రాడిని పిలిచాను.

“సార్ “

“మీరు ఇదంతా ట్రెయినింగ్ అయ్యాక వస్తారా?”

“కొత్తగా, ప్రత్యేకంగా ఏదీ ఉండదు సార్.”

“ఓ.”

“మరి?”

“ఇవన్నీ మాకు అలవాటే.”

“అంటే?”

“మాది ప్రీమియర్ మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ సార్.”

“ఓ.”

“ఐ.ఐ.ఎమ్..”

“ఓ శభాష్!”

అతను దగ్గరకి వచ్చి మెల్లగా అన్నాడు, “సార్, ఐ.ఐ.ఎమ్ అంటే ఏదో అనుకునేరు.”

“మరి?”

“ఇరగవరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ – బ్రాకెట్స్‌లో ఎమ్”

“అంటే ఐ.ఐ.ఎమ్ (ఎమ్) అన్నమాట. ఈ బ్రాకెట్ ఎందుకు?”

“అదే లైఫ్ బ్లడ్ సార్. మావి దేశంలో ప్రస్తుతానికి ఎనిమిదున్నాయి. ఇరగవరం లోనిది ఎమ్‌లో స్పెషలైజేషన్.”

“అంటే?”

“మోసాల మేనేజ్‌మెంట్!”

“శభాష్! మిగతావి?”

“చెబుతాను సార్. వేరే వాళ్లని రిసీవ్ చేసుకోవాలి.”

“ఓకే!”

అతను గబగబా వెళ్లిపోయాడు. నాకు కుడి ప్రక్కన స్టేజ్ క్రింద విపరీతంగా రంగులు పులుముకున్న అమ్మాయిలు నిలబడున్నారు. చిరకాలం చిరునవ్వులు చిందించే మిస్ ఇండియాలు వచ్చినట్లున్నారు. దేవతా విగ్రహాలను ఆరాధించి అమ్మాయిలు నేర్చుకున్నది ఇదొక్కటే అనిపిస్తుంది – అలా నవ్వుతూ నిలబడటం! ఎందుకో మటుకు తెలియదు. అది అడక్కూడదు కూడా!

ప్రక్కనున్న సోఫా వైపు చూసాను. ఆ అమ్మాయిలను చూసి నన్ను ఎందుకు పరీక్షగా చూస్తావన్నట్లు చూసింది.

సన్యాసి దర్శనమిచ్చాడు.

“శిశువా..”

“యస్?”

“మొత్తానికి ముందు వరుసకు చేరావు.”

“..”

“జాగ్రత్త! ఎవరినీ పలుకరించకు.”

“ఎందుకు?”

“ఇక్కడ ఎవరూ ఏమీ కారని అర్థమవటం లేదా?”

“అది తెలిసింది.”

“మామూలుగా తెర తీస్తే నాటకం ముందుకొస్తుంది.”

“కరెక్ట్.”

“ఇక్కడ అలాక్కాదు. ముందు వరుసలో ఉన్నవారంతా అసలు వేషగాళ్లు!”

“అంటే నేను కూడానా?”

“సందేహమా?”

“టూ మచ్ సన్యాసీ!”

“బాధ పడకు. పనికిమాలిన పాత్ర పోషించటానికి ఇక్కడికి వచ్చి కుర్చున్నావా లేదా?”

“నాకు బాధగా, భయంగా కూడా ఉంది సన్యాసీ!”

“రెండూ వద్దు.”

“వద్దంటే కుదురుతుందా?”

“ఆ రెండూ వదలాలంటే ముందర ఒకటి వదిలెయ్యాలి.”

“ఏంటది?”

“ఏకాం లజ్జాం పరిత్యజ్య సర్వత్ర విజయీ భవేత్!”

“అర్థం?”

“సిగ్గు అనే ఒక్క పదార్థాన్ని వదిలివేస్తే అంతటా విజయమే!”

“నిజమే! ఎలా? ఈ వేషం వెయ్యలేను సన్యాసీ!”

“పిచ్చివాడా! ఏ వేషమూ, ఆవేశమూ లేకుండా జీవితం అనే సన్నివేశాన్ని రక్తి కట్టించటం కష్టం. ఇంత మాత్రానికే ఇబ్బంది పడకు!”

(తదుపరి భాగం వచ్చే వారం)

Exit mobile version