Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మోసం చెయ్యటం ఎలా?-23

[ప్రముఖ రచయిత శ్రీ వేదాంతం శ్రీపతిశర్మ రచించిన ‘మోసం చెయ్యటం ఎలా?’ అనే హాస్య వ్యంగ్య నవలని ధారావాహికంగా అందిస్తున్నాము.]

[గదిలోని వారంతా జనంలోకి వెళ్తారు. వేదిక కళకళలాడిపోతుంది. జనం తెగ వస్తారు. . ‘సమోసా రిసెప్షన్ కమిటీ’ అనే ఐడి కార్డు మెడలో వేసుకున్న ఒక కుర్రాడు వచ్చి సుందర్‌ని పలకరించి, పుస్తకం రాసినది అతనే కాబట్టి, ముందువరుసలోకి రమ్మని చెప్తాడు. తన గురించి ఎలా తెలుసని సుందర్ అడిగితే, తన వద్ద ఉన్న టాబ్‌‍లో నొక్కి వివరాలు చూపిస్తాడు. తన పేరు శశిధర్ అని, సమోసా టైగర్ ఫ్రంట్ అనే టీమ్‍ని చూస్తానని, మొత్తం పది టీమ్స్ ఉన్నాయని చెప్తాడు. సుందర్‍న్ కూర్చోబెట్టిన సోఫా చివర్న ఓ మహిళ వింత మేకప్‍తో కూర్చుని ఉంటుంది. పలకరించవచ్చో లేదో అని ఊరుకుంటాడు సుందర్. శశిని అతని గురించి అడిగితే, తమ టీమ్ వివరాలన్నీ చెప్పి, ఇంకా చాలా మందిని రిసీవ్ చేసుకోవాలని చెప్పి వెళ్ళిపోతాడు. అంతలో అక్కడికి చాలామంది అమ్మాయిలు వస్తారు. సన్యాసి ప్రత్యక్షమై సుందర్‌తో మాట్లాడుతాడు. ఇలా ఇక్కడ కూర్చోడానికి చాలా బాధగా ఉందంటాడు సుందర్. సిగ్గు అనే ఒక్క దాన్ని వదిలివేస్తే అంతటా విజయమేనంటాడు సన్యాసి. – ఇక చదవండి.]

సమోసా ఉపాఖ్యానం (22)

తెర మీద సమోసా బొమ్మ గొప్పగా ఉంది. అటూ ఇటూ సమోసా కొసలలో ఎవరో నవ్వుతున్నట్లు ఉంది. సన్యాసి వచ్చి నేరుగా ప్రక్కనే కూర్చున్నాడు.

“శిశువా!”

“యస్?”

“ఎంత మోసగాడివి?”

“అన్యాయం”

“అదేవన్నమాట? ఒక చక్కని తెర వెనుక ఎంత కథ నడుపుతున్నావు?”

“నేనా?”

“మరి? నువ్వు ఈ వ్యవహారానికి ఒప్పుకోకపోతే ఈ దారుణమైన మోసం జరిగేదా?”

ఇది ఆలోచింపజేసే ప్రశ్న. ఈ సన్యాసి ఎందుకు రగులుకుంటాడో తెలియదు. జీవితాంతం వీడిని సమాధానపరచటమే పనిగా అయిపోయింది. ఆంగ్లంలో ఒక మాటున్నది-బుద్ధిమంతునికి అన్నీ సందేహాలే. దుర్మార్గుని బుద్ధి ఒక్కటే స్థిరంగా ఉంటుంది. సూటిగా వాడు చేయవలసిన పని చేసుకుంటూ పోతాడు.

“సన్యాసీ..”

“చెప్పు శిశువా”

“నేను కాకపోతే మరొకడు వస్తాడు. సభ ఆగదు. కార్యక్రమమూ ఆగదు.”

“కానీ నీకొక అంతరాత్మ అనేది-అంటే నేనొకడిని ఉన్నాను కదా?”

“ఉన్నావు. ఆ బాధకే నాకు ఈ రోజుకీ మందు దొరకలేదు. నా చుట్టూ ఉన్న వాళ్లకి ఈ పురిటి బాధలు ఉన్నట్లు నాకైతే కనిపించటం లేదు. అందుచేతనే చక్కగా సుఖపడుతున్నారనిపిస్తుంది.”

“సుఖం అనగా ఏమి శిశువా?”

“ఏ చింతలూ లేకపోవటం.”

“కాదు. అలాంటి పరిస్థితి రాదు. ఉండదు. అసలు నేను కనపడకపోవటమే సుఖం.”

“అంటే ఏ ఆలోచనా లేకుండా టకటకా పనులు అయిపోతూ ఉంటే సుఖం. అంతేనా?”

“పోనీ అలా అనుకో. మరి ఇప్పుడు నీకు కనిపిస్తున్నానే మరి? అంటే సుఖం లేదనే కదా?”

“సన్యాసీ..”

“చెప్పు శిశువా!”

“ఇది సుఖం, ఇది సుఖం కాదు అనే స్థాయి చేయి జారిపోయి చాలా కాలం అయిపోయింది.”

“గుడ్. కుర్రాడు ఏదో తెచ్చాడు చూడు. జారిపోకుండా పట్టుకో!”

అక్కడ ప్లేట్లో ఓ కుర్రాడు రెండు కూల్ డ్రింకు బాటిల్స్‌తో వచ్చాడు. ఒక బాటిల్ తీసుకున్నాను. అతను నా ప్రక్కన ఉన్న సోఫాలో ఉన్న మహిళ వైపు చూసాడు.

“అక్కడ ఇయ్యాలా సార్?”, అడిగాడు.

సన్యాసి నవ్వాడు. “శిశువా..”

“యస్?”

“మంచి ప్రశ్న నేరుగా నిన్నే అడిగాడు.”

“ఏం చెప్పమంటావు?”

“అసలు నాకెందుకిచ్చావని అడగవో..”

“అన్యాయం.”

“ఏదో ఒకటి చెప్పు. లేకపోతే వాడే రెండూ త్రాగి వెళ్లిపోయేటట్లున్నాడు.”

“కరెక్ట్..”

“అడిగి ఇవ్వు బాబూ..”, చెప్పాను. అతను అక్కడికి వెళ్లి నిలబడ్డాడు. ఆవిడ కుడి కన్ను కొసలోంచి బుస కొడుతున్న నాగుపాములా చూసింది. బాటిల్ తీసి నా మీదకి ప్రయోగిస్తుందనుకున్నాను. సరదాగా చిరునవ్వొకటి పారేస్తే ఏమి పోతుందనుకున్నాను. కుర్రాడు నన్నొక చూపు చూసి పళ్లు ఇకిలించాడు. ఆవిడ ఏదో అర్థమైనట్లు తల ఊపింది. కెమెరా వాళ్లు కవర్ చేసేస్తున్నారు. వాళ్లని ఓ చూపు చూసింది.

“ఒక గ్లాసులో పోసి పైన కోస్టర్‌తో కవర్ చేసి పట్టుకుని రా”, అని కొద్దిగా గట్టిగా చెప్పింది. కుర్రాడు “అలాగేనండీ.. సారీ” అంటూ వెళ్లిపోయాడు.

సన్యాసి నన్ను ఎగాదిగా చూసాడు.

“శిశువా!”

“యస్?”

“అర్థమైందా?”

“ఏంటి?”

“నువ్వెందుకూ పనికిరావని?”

“అది నేను పుట్టినప్పుడే అక్కడున్న వారికి నా చిన్ని చిన్ని చేతులు అటూ ఇటూ చక్కగా ఊపుతూ నేను పనికి రాని వాడినని సైగలు చేసేసాను. ఆకాశవాణి కూడా అలాంటిదేదో వినిపించిందని ఇద్దరు బంధువులు చెప్పారు. అది అర్థం కాక అందరూ ఎత్తుకుని మరీ ముద్దులు పెట్టేసారు. కానీ వాళ్లనీ నేనేమీ అనను. ప్రపంచానికి పనికిమాలిన వాళ్లే ఎక్కువ ముద్దొస్తారు!”

“లెస్స పలికితివి శిశువా! ఇప్పుడర్థమైందా? అలా బాటిల్ ఇవ్వగానే పుచ్చుకుంటే నువ్వు దేనికీ పనికిరావని అర్థం. ఆవిద చూడు.. ఒక నఖరా, అకడ్ ప్రకటించింది.”

“కరెక్ట్. ఇప్పుడు ఇది ఇలా త్రాగాలా వద్దా?”

“పిచ్చివాడా. అవకాశం జారవిడిచావు. మహా ఏదైనా విన్యాసం చూపగలిగితే కాస్త చల్లది తీసుకుని రా, వేడిగా ఉంది అని చూడు.”

ఆలోచన బాగుంది. కుర్రాడు ప్లేట్‌తో వచ్చాడు. ఆవిడ గ్లాసును ఎంతో స్టైల్‌గా చేతిలోకి తీసుకుని నన్ను చూసి నిన్నెవరూ బాగు చేతలేరన్నట్లు చూసి అర్థమైందా అన్నట్లు త్రాగటం మొదలెట్టింది. కుర్రాడు నా ముందరనుండి వెళ్లబోతుంటే ఆపాను. నువ్వు కూడా మాట్లాడతావా అన్నట్లు ఒక చెవి ఇటు జార్చాడు.

“చూడూ..”

“చెప్పండి సార్.”

“కొద్దిగా కూలింగున్న బాటిల్ తెస్తావా?”, అన్నాను. అతను ప్లేటును వెంటనే చంకలోకి చేర్చి కొద్దిగా వంగి రహస్యం చెబుతున్నట్లు చెప్పాడు, “సార్, ఇలా గ్లాసులో తెమ్మని అడగమని నేనే ఆవిడకి ట్రెయినింగ్ ఇచ్చాను. అర్థమైపోయిందనుకుంటాను.”

“వార్ని. మరి నేనలా అడగనని నీకెలా అర్థమైంది?”

అతను ఏమీ మాట్లాడకుందా నవ్వి నాలుగడుగులు ముందరకి వేసి నన్ను వెనక్కి తిరిగి చూసి చక్కగా కన్ను కొట్టాడు.

సన్యాసి చక్కగా కాలు మీద కాలు వేసుకున్నాడు.

“శిశువా.. నీవన్నది నీవనుకున్నది-రెండూ ఒకటే! మనిద్దరం సన్యాసులమే!”

“బాగా సెలవిచ్చావు సన్యాసీ!”

“దీనినే పెద్దలు ఆత్మసాక్షాత్కారం అంటారు!”

ఆ మహిళ కూడా ఎందుకో చక్కని చిరునవ్వుతో కూల్ డ్రింక్ సేవిస్తోంది. నా బాటిల్ నన్ను చక్కగా వెక్కిరిస్తోంది!

(తదుపరి భాగం వచ్చే వారం)

Exit mobile version