[ప్రముఖ రచయిత శ్రీ వేదాంతం శ్రీపతిశర్మ రచించిన ‘మోసం చెయ్యటం ఎలా?’ అనే హాస్య వ్యంగ్య నవలని ధారావాహికంగా అందిస్తున్నాము.]
[సుందర్‌కీ, సన్యాసికీ మధ్య చమత్కారభరితమైన సంభాషణ జరుగుతుంది. నువ్వు కాకపోతే, ఇంకొకడు వస్తాడు తప్ప, కార్యక్రమం ఆగదని అంటాడు సన్యాసి. ఇంతలో ఓ కుర్రాడు కూల్ డ్రింక్ బాటిల్స్ తెస్తాడు. సుందర్ ఒకటి తీసుకుంటాడు. సుందర్ పక్కనే ఉన్న మహిళకి కూల్ డ్రింక్ బాటిల్ ఇవ్వబోతే, ఆ మహిళ ఎంతో స్టైల్‌గా దానిని గ్లాసులో పోసి, మూత పెట్టి తీసుకురావాలని ఆదేశిస్తుంది. సుందర్ మాత్రం ఏమాత్రం ఆలోచించకుండా నేరుగా బాటిల్ అందుకోవడంతో, సన్యాసి అతని లోకజ్ఞానాన్ని ఎగతాళి చేస్తాడు. సన్యాసి చెప్పిన మీదట, మరో చల్లటి బాటిల్ తెచ్చి ఇవ్వమని సుందర్ ఆ కుర్రాడికి చెప్తాడు. ఆ సర్వింగ్ కుర్రాడు తానే ఆ మహిళకు అలా స్టైల్‌గా అడగమని ముందే ట్రైనింగ్ ఇచ్చానని రహస్యంగా చెప్పి కన్నుకొట్టి వెళ్ళిపోతాడు. సుందర్ అవాక్కవుతాడు. – ఇక చదవండి.]
సమోసా ఉపాఖ్యానం (23)
అందరూ చప్పట్లు కొడుతుండగా తెర పైకి లేచింది. వేదిక మీద ఒక అద్భుతమైన సెట్ వేశారు. టమాటో సాస్, మిర్చి సాస్ సగం సగం ఉన్నట్లు ముందరున్న లైట్ లలో అర్థమవుతున్నది. నేపథ్యంలో గల తెర మీద సమోసా పెయింటింగ్ నోరూరిస్తున్నది. ఒక్కసారిగా లైట్లు వెలిగాయి. తెర మీద సమోసా ని చీల్చుకుని రోబోలా నడుచుకుంటూ ఒకడు ముందరకి వచ్చాడు. సన్నగా సంగీతం బీట్లు వినిపిస్తున్నాయి. ఆ మర మనిషి అక్కడికి వచ్చి నిలబడితేనే జనం గగ్గోలు పెట్టేస్తున్నారు, ఎందుకో తెలియదు. ఆ బీట్ కి అనుగుణంగా చప్పట్లతో తాళాలు వేస్తున్నారు. అతను తన కుడి చెయ్యిని ఒకసారి బోరింగ్ పంపు హ్యాండిల్ ని కొట్టగానే ఇనుప చువ్వ పైకి లేచినట్లు పైకి లేపాడు. అంతే! ఇక్కడ జనం పొలి కేకలు పెడుతున్నారు. ఆ బీట్ కి వినిపిస్తున్న మాటలు ఒక్కటి కూడా అర్థం కావడం లేదు,
“జాగ్రత్తగా విను”, అంటున్నాడు సన్యాసి.
“దేనిని?”, అడిగాను.
“మంచి ప్రశ్న”
“ఎందుకలాగా?”
“పైన ఉన్న వాని పాట? ఇక్కడున్న జనం చేస్తున్న గోలనా? అనే మాట అందులో ఉంది.”
“కరెక్ట్.”
“మరి వినిపిస్తోందా?”
నిజమే. జాగ్రత్తగా వింటే అర్థమవుతున్నది. స స స స స స స.. సమోసా.. అన్నప్పుడు గంతు వేసి తిరిగి ఆ రంగు లైట్ లోని సర్కిల్లోకి దూకుతున్నాడు ఆ కుర్రాడు. స స స స స స స స స స అన్నప్పుడు టైలర్ కాళ్లతో కుట్టు మిషన్ మీద చేసే విన్యాసాన్ని చేస్తున్నాడు.
నా వెనుకనున్న జనాలను చూశాను. పెద్దవాళ్ల చంకల్లోంచి కూడా చిన్న పిల్లలు ఎందుకో కేరింతలు పెడుతున్నారు. ఇంతలో వీధి చివర కుళాయి నీళ్ల కోసం పెట్టుకునే బిందెలు ఓ నలుగురు అమ్మాయిలు నడుముల మీద పెట్టుకుని స్టేజ్ మీదకు వచ్చారు. అతని చుట్టూత పెట్టి నడుముల మీద చేతులు పెట్టుకున్నారు.
“నీళ్లు లేవు ఏ ఊళ్లోను”, అన్నాను.
సన్యాసి కూడా ఎందుకో తాళం వేస్తున్నాడు.
“ఇతను నీళ్లు నింపుతాడు ఏమో..”
“నీళ్లు అయితే పర్వాలేదు.. మరి ఏదైనా..”
సన్యాసి ముక్కు మీద వేలు పెట్టాడు.
“తప్పు శిశువా.. నాట్యం చూసి ఆనందించు.”
ఆ కుర్రాడు ఒక్కో బిందె దగ్గర మైకేల్ జాక్సన్ విన్యాసాలు చేశాడు. ప్రేక్షకులలో ఉన్న కుర్ర కారు పొలికేకలు పెడుతున్నారు. గొంతులోని నరాలు చిట్లి పోతాయేమో అని అనిపించింది. ఆ బిందెల మధ్యలో నుంచి అమ్మాయిల చిందులు ప్రారంభమయ్యాయి.
నాకు ఎడమ ప్రక్కన కూర్చున్నావిడ నన్ను చూసి చిరునవ్వు నవ్వింది.
“ఏమంటావు?”, సన్యాసిని అడిగాను.
“చిరు నవ్వు నవ్వు”, అన్నాడు.
“అంటే?”
“చిరాకు నవ్వు!”
“ఓ ఓ..”
“నా ఖర్మ”, అన్నట్లు నవ్వాను. ఆవిడ ఎందుకో మురిసిపోయింది.
“మా అమ్మాయిలు”, గట్టిగా ప్రకటించింది.
“శభాష్.. మీ..”
“మా డాన్సింగ్ ఇన్స్టిట్యూట్ పిల్లలు!”
“ఓ”
సన్యాసి కూడా దాదాపు గంతు లేస్తున్నాడు.
“శిశువా”
“యస్?”
“సమోసాలో చాలా కలుస్తాయి.”
“కరెక్ట్. మచ్చుకి?”
“డాన్స్, జిమ్, ఫిజియోథెరపీ, పిచ్చి, వెర్రి.. ఇలా ఎన్నో”
చప్పుడు మారు మ్రోగి పోతోంది..
స స స స స స స స స స స.. సమోసా..
“ఇంతకీ దేని గురించి సన్యాసి ఇదంతా?”
సన్యాసి కూడా ఒక చిత్రమైన స్టెప్ వేశాడు.
“శిశువా! సృష్టిలో లోపం ఉండదు. దృష్టిలోనే లోపం ఉంటుంది.”
“కరెక్ట్”
“ఇది సరస మోసగాళ్ల సాహితీ వేదిక!”
“అయితే?”
“పేరుకు తగ్గట్లు వ్యవహారం ఉంటుంది!”
“ఓ!”
“అవును. అక్కడ చూడు. ఈనాటి సాహిత్యం ఆ ఖాళీ బిందెలు చేస్తున్న చప్పుడు లాంటిది. విరగకుండా కాపాడుకుంటున్న కర్ర ముక్కలలా అతగాడి అవయవాలు ఆడుకుంటున్నాయి. పురాతనం, సనాతనం, అధునాతనం.. అన్నీ అర్ధార్థాలతో, భావ రహిత శబ్ద విన్యాసాలతో కేవలం చప్పుడు చేస్తున్నాయి.. ఆ బిందెల చప్పుళ్ళు వాదాలు, వివాదాలుగా వినపడుతున్నాయి. ఆలోచించు!”
“అవును సన్యాసీ! ఇది అద్భుతంగా ఉంది. ఇప్పుడు వినిపిస్తున్న సాహిత్యమంతా మోసమో లేక మన మోసం అంతా సాహిత్యంగా కనిపిస్తున్నదా అనిపిస్తున్నది.”
“అదే అర్థం కాకూడదు”
“కరెక్ట్”
“అదే చమత్కారం. అదే సాహిత్యం. అదే ఎంటర్టైన్మెంట్!”
(తదుపరి భాగం వచ్చే వారం)
వేదాంతం శ్రీపతిశర్మ కథా రచయిత. నవలా రచయిత. వ్యంగ్య హాస్య రచనలకు పెట్టింది పేరు. “ఆరోగ్య భాగ్యచక్రం” అనే పుస్తకాన్ని వెలువరించారు.
