Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మోసం చెయ్యటం ఎలా?-25

[ప్రముఖ రచయిత శ్రీ వేదాంతం శ్రీపతిశర్మ రచించిన ‘మోసం చెయ్యటం ఎలా?’ అనే హాస్య వ్యంగ్య నవలని ధారావాహికంగా అందిస్తున్నాము.]

[అందరూ చప్పట్లు కొడుతుండగా తెర పైకి లేస్తుంది. వేదిక మీద ఒక అద్భుతమైన సెట్ వేయబడింది. టమాటో సాస్, మిర్చి సాస్ సగం సగం ఉన్నట్లు ముందరున్న లైట్ లలో అర్థమవుతున్నది. నేపథ్యంలో గల తెర మీద సమోసా పెయింటింగ్ నోరూరిస్తుంటుంది. ఒక్కసారిగా లైట్లు వెలిగాయి. తెర మీద సమోసాని చీల్చుకుని రోబోలా నడుచుకుంటూ ఒకడు ముందరకి వస్తాడు. ఆ కుర్రాడు మరమనిషిలా వింత విన్యాసాలు చేస్తూ, బిగ్గరగా వినిపిస్తున్న సంగీత బీట్లకు అనుగుణంగా “స స స స.. సమోసా..” అంటూ డాన్స్ చేస్తుంటే, ప్రేక్షకులు పిచ్చి కేరింతలు కొడతారు. వారి మధ్యలోకి ఖాళీ బిందెలతో నలుగురు అమ్మాయిలు వచ్చి చిందులు వేయడం, జనం పొలికేకలు పెట్టడం చూసి సుందర్, అతని పక్కనున్న సన్యాసి చర్చించుకుంటారు. ప్రస్తుత సాహిత్యం కూడా ఈ ఖాళీ బిందెలు చేస్తున్న చప్పుడు లాగే, భావ రహిత శబ్ద విన్యాసాలతో కేవలం గందరగోళాన్ని సృష్టిస్తోందని, అసలైన అర్థం ఏమిటో బోధపడకుండా చేయడమే ఈ కాలపు చమత్కారం, ఎంటర్టైన్మెంట్ అని సన్యాసి వ్యంగ్యంగా వివరిస్తాడు. – ఇక చదవండి.]

సమోసా ఉపాఖ్యానం (24)

తెర మెల్లగా క్రిందికి జారుతోంది. ఈ సారి తెర మీద సన్యాసి కనిపించాడు.

“శిశువా”

“యస్?”

“నేను తెర మీదకి ఎందుకు వచ్చానో తెలుసా?”

“నన్నే అడిగావా?”

“ఎందుకు?”

“ఎవరు ఎందుకు ఎక్కడ ఎలా ఉంటారో ఏ మాత్రం తెలియనివాడిని. ఆ మాటకొస్తే నేనే ఎక్కడైనా ఎందుకుంటానో ఈ మధ్య అర్థం కావటంలేదు.”

“ఆరాటం శిశువా..”

“కరెక్ట్”

“ఒకప్పుడు బ్రతుకు తెరువుకై ఆరాటం అన్నారు. ఇప్పుడు అందరికీ ఆకాశం కావాలి.. దండలు, శాలువాలు, అవార్డులు, వెండి తెరలు, వెండివెలుగులు,నూట నలభై కోట్లమందిలో నూట నలభై కోట్ల సెలెబ్రిటీలిలు తయారవ్వాలి!”

“మరీ అంత అన్యాయంగా చెప్పొద్దు సన్యాసీ..”

“కొద్దిగా అటూ ఇటూ చూడు శిశువా..”

అలాగే చూసాను.

“చూసాను.”

“మీడియా వాళ్ల కెమెరాల ముందు వీలైనంత మంది నిలుచున్నారు.”

“కరెక్ట్.”

“మిగతా వాళ్లు సెల్ఫీలు తీసుకుంటున్నారు.”

“కరెక్ట్. కానీ అది లోకసహజం సన్యాసీ. తప్పు కాదు.”

“నా బాధ అది కాదు. ఒకప్పుడు ఏదైనా విషయంలో నిష్ణాతుడో లేక మనలను ఏదో విధంగా ఆనందింపజేయగలడో అనిపించేవాడు స్టేజ్ మీదకి వచ్చేవాడు. చక్కగా కూర్చుని కొంతసేపు ఆనందించాం.”

“కరెక్ట్.”

“ఇప్పుడు స్టేజ్ మీదకి ఎలా రావాలో అందరూ నేర్చుకున్నారు. క్రింద కూర్చున్నవాళ్లు మూర్ఖులు!”

“లెస్స పలికితివి.”

“అసలు తోపులాట ఇక్కడే ఉంటుంది. కబడ్డీ అన్నమాట!”

“అవును. అందరూ నాకు ఊపిరి ఉన్నంతమేరకు ఒకరి మీదనుండి ఒకరు దూకెయ్యాలని చేస్తున్న విశ్వప్రయత్నంలా ఉంది.”

“నాకొక పాట గుర్తుకొస్తోంది శిశువా.”

“ఏంటది?”

“మారాజులు మంత్రులు నిన్నడగవచ్చేవారలే!”

“కరెక్ట్. మాబోటి దీనులు మీ కడకు వచ్చేవారలే!”

“ఇంతో అంతో ముడుపుగట్టి అంతటయ్యను మాయజేసి లక్షలో మోక్షమ్ము కోరే గడుసు బిచ్చగాళ్లము..”

“వట్టి పిచ్చివాళ్లము!”

కొద్ది సేపు సన్యాసి మాయమైనాడు.

స్టేజ్ దగ్గర కవి వేషంలో ఉన్న సందిగ్ధానందసరస్వతి కనిపించాడు. ఎవరితోనో గొడవ పడుతున్నాడు. ఆ కుర్రాడు ఏదో డబ్బు విషయంలో వాదనలోకి దిగినట్లుంది. నన్ను చూసి సరస్వతి మొహం వికసించింది. ఆ కుర్రాడిని తీసుకుని నా దగ్గరకి వచ్చాడు.

“ఏమైందండీ?”, అడిగాను.

“చూడండీ..”, సరస్వతి చెప్పాడు, “ఒప్పుకున్నదొకటి, అంటున్నదొకటి.”

“ఏమనుకున్నారు? ఏమి చేస్తున్నాడు?”

“సింపుల్ సార్. నన్ను నా పేరుతో చక్కగా ఆహా ఓహో అన్నట్లు జనాలకి పరిచయం చేయమన్నాను.”

“ఎందుకు మరి? చేయనంటున్నాడా?”

అతను చేతులు కట్టుకున్నాడు.

“సార్. పేరొకటే చెప్పి టైటిల్ చెప్పటానికి వెయ్యి రూపాయలు అడిగాను. ఈయనేమో అయిదొందలు చేతిలో పెట్టి ఇదిగో ఈ వంద కాగితాలు చేతిలో పెట్టాడు. ఏంది సార్ ఇది? ఓ ప్రక్కన ఆ నిర్వాహకులు భయంకరంగా తిడుతున్నారు. ఎక్కువ సేపు ఇలా లాలుచీ పడితే వెనకాల చాలా మంది ఉన్నారు.”

“పోనీ ముఖ్యమైన కాగితాలు ఇవ్వండి సార్, అన్నాను”.

“నా గురించి చెప్పాలంటే కనీసం మూడు గ్రంథాలవుతాయి, మూడు నెలలు కష్టపడి ఇన్ని కాగితాలు చేసాను.”

ఆ కుర్రాడికి ఏదో తట్టి లాక్కున్నాడు.

“ఇవన్నీ గాలిలో విసిరేస్తాను సార్. అలా చెయ్యకుండా ఉండటానికి ఏమిస్తారు?”

అందరం నవ్వుకున్నాం. నేను సరస్వతిని ప్రక్కకి తీసుకుని వెళ్లాను. చెవి దగ్గర ఊదాను, “సార్, ఇతన్ని కేవలం పరిచయం చేయమనండి చాలు. మైకు తీసుకుని మీరు చెప్పవలసిన మాటల ముందు మీ గురించి ఉపోద్ఘాతం పూర్తిగా ఎన్ని గంటలైనా వదిలెయ్యండి. అభాసు కాకూడదు కాబట్టి మీ జోలికి ఇప్పుడెవరూ రారు.”

“బాగుంది ఆలోచన. ఇంకో సారి పిలవరేమో?”

“అప్పుడు సంగతి అప్పుడు చూద్దాం.”

“భేష్! అప్పు తిరిగి ఇచ్చేవాడు వడ్డీ గురించి ఆలోచిస్తాడు. మనకు ఇప్పుడు పని అయిపోవాలి అంతే!”

“కరెక్ట్.”

సరస్వతి కుర్రాడి దగ్గరకి వెళ్లాడు.

సన్యాసి ముక్కు మీద వేలెసుకున్నాడు.

“శిశువా!”

“యస్?”

“చూసావా? క్షణంలో ఎంత మోసం నేర్చావో?”

“నాకు తెలియకుండానే అయిపోయింది.”

“మోసమంటేనే అది. తెలిస్తే ఎలా?”

(తదుపరి భాగం వచ్చే వారం)

Exit mobile version