[ప్రముఖ రచయిత శ్రీ వేదాంతం శ్రీపతిశర్మ రచించిన ‘మోసం చెయ్యటం ఎలా?’ అనే హాస్య వ్యంగ్య నవలని ధారావాహికంగా అందిస్తున్నాము.]
[సన్యాసి, సుందర్ మాట్లాడుకుంటూ, ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ అర్హతతో సంబంధం లేకుండా సెలెబ్రిటీ హోదా, అవార్డుల కోసం ఆరాటపడుతున్నారని అనుకుంటారు. అదే సమయంలో, కవి వేషంలో ఉన్న సందిగ్ధానందసరస్వతి వేదికపై తనను గొప్పగా పరిచయం చేయడం కోసం ఒక కుర్రాడితో డబ్బుల విషయంలో వాదనకు దిగుతాడు. ఆ కుర్రాడు తన బిరుదులు చదవడానికి ఎక్కువ డబ్బులు డిమాండ్ చేయడంతో, సుందర్ సరస్వతికి ఒక ఉపాయం చెప్తాడు – కుర్రాడితో కేవలం పేరు మాత్రమే పరిచయం చేయించి, మైకు చేతికి వచ్చాక తన గురించి తనే ఎంత సమయమైనా ఉపోద్ఘాతం ఇచ్చుకోమంటాడు. ఈ ఉపాయాన్ని సరస్వతి సంతోషంగా అంగీకరించగా, సుందర్ ఇంత త్వరగా మోసం చేయడం నేర్చుకున్నాడని సన్యాసి ముక్కున వేలేసుకుంటాడు. – ఇక చదవండి.]
సమోసా ఉపాఖ్యానం (25)
“ఇది మోసం కాదు..”, సన్యాసికి బదులిచ్చాను.
“ప్రతి మోసగాడూ మాట్లాడే మాట ఇదే. నీకెందుకసలు ఆయనకి సలహా ఇవ్వటం?”
“కళారంగంలో సగటు బాధితుడిని ఆదుకుంటున్నాను!”
“ఛా!”
“వెటకారమొద్దు సన్యాసీ..”
“ఇప్పుడు ఆదుకుంటున్నావంటావు, రేపు దగ్గర కాగానే ఆడుకుంటావు.”
“నేను అలాంటివాడిని కాను సన్యాసీ..”
“చూద్దాం.. నిచ్చెన ఎక్కేటప్పుడు ఎన్నో మెట్టు మీదున్నావో అది నిర్ణయిస్తుంది నీ సంస్కారం గురించి!”
“నేను నిచ్చెన ఎక్కను.”
“శభాష్ శిశువా! ఈ ఒక్క మాటకే ఓ అవార్డు ఇచ్చేస్తున్నాను!”
“నాకు ఏ అవార్డూ వద్దు సన్యాసీ.”
“ఎందుకని?”
“ఆ పరిస్థితి నిజమైన ప్రతిభకి నిజమైన బహుమతి!”
“అవార్డు పొందని ప్రతివాడూ చెప్పే సాకు అది శిశువా!”
“జాగ్రత్తగా ఆలోచించు సన్యాసీ..”
“చెప్పు.”
“జీవితం కనీసం ఓ పది మంది మనలను తిట్టుకోకుండా గడుస్తుందా?”
“ఇది చిన్న సంఖ్య శిశువా!”
“అవునా? పోనీ అంతమందే అనుకో. అవార్డులు పొందాక పది మందీ తిట్టుకుంటారు అవునా?”
“కావచ్చు. అది మానవసహజం. అలా అని ప్రతిభకు గుర్తింపు వచ్చినప్పుడు పాపం అందరినీ ఆడిపోసుకోవటం సరైన పని కాదు!”
సన్యాసి సందేశం ఇచ్చి వెళ్లిపోయాడు.
సరస్వతి స్టేజ్ మీదకి వచ్చాడు. అతని వెనుక తెర దించేసి ఉంది. అతనిని పరిచయం చేయవలసిన కుర్రాడు మైకు పుచ్చుకుని పైకి ఎక్కాడు. సరస్వతి చంకలో ఏదో చాలా పెద్ద సంచీ ఉంది.
“అందరికీ సమోసాలు”, అన్నాడు. ఒక్క సారి అందరూ వెనుకకు తిరిగి ఎక్కడ పంచి పెడుతున్నారా అని చూడటం మొదలు పెట్టారు. అతను నవ్వాడు. మరల పలికాడు, “పెద్దలారా, చిన్నలారా, సోదరసోదరీమణులారా, సమోసాలు అనగానే మీరు తినేవి అనుకున్నారు. ఇది మా సంస్థలో నమస్కారాల కోసం చెప్పే మాట. వాస్తవానికి ఇక్కడ రెండు పదాలున్నాయి. స ఒకటి, మోసమ్ రెండు. స మోసం అంటే ఇది మోసంతో కూడినది అని భావార్థం..”
ప్రక్కనే నిలబడ్డ సరస్వతి చక్కగా చిరునవ్వు నవ్వుతూ తల ఊపుతూ అంగీకారాన్ని ప్రకటించేస్తున్నాడు.
“ఈ రోజు సమోసాకి శుభదినం. ఎందుచేతనంటే ఇంతకాలం మనం అసలు విషయాన్ని తెలుసుకోలేదు..”
సరస్వతి వేలు పైకి పెట్టి మరీ ఆమోదం తెలిపాడు.
“అదేమిటో ఎవరైనా ఊహించి చెబుతారా?”
అందరూ ఒకళ్ల మొహాలొకళ్లు చుసుకున్నారు.
ఓ కుర్రాడు చెయ్యి పైకి పెట్టాడు.
“సమోసా అనే వంటకాన్ని కనుగొన్న దినం.”
“నో.. ఇంకెవరైనా?”
“ప్రపంచ మోసగాళ్ల దినం!”, ఎవరో అరిచారు. అందరూ నవ్వారు.
“కాదు..”, అతను చెప్పాడు, “..మన సంప్రదాయంలో దొంగతనం-అనగా చౌర్యం పెద్ద అపరాధం కాదు. ఆ మాటకొస్తే దొంగలకి ఆరాధ్య దైవం సుబ్రహ్మణ్యస్వామని పెద్దలు చెబుతారు. దొంగలు కూడా పూజలు జరిపి వ్యాపారాలు బాగుండాలని ప్రార్థనలు చేస్తారు. మోసం కూడా అంతే! ఈ రోజు మోసానికి ముహూర్తం పెట్టి మరీ మనం ఉత్సవాలు ప్రారంభం చేస్తున్నాం. మరి కొద్ది సేపట్లో ఈ అద్భుతమైన కార్యక్రమం ప్రారంభం కాబోతున్నది. కాకపోతే ఈ లోపల ఇక్కడ సరస్వతి-అంటే సందిగ్ధానంద సరస్వతి గారు కవులు, రచయిత ఇక్కడ నా ప్రక్కనే మీ ముందరున్నారు. వారు మీకు చిన్న మోసం ప్రదర్శించి చూపించబోతున్నారు..”
ఆ మైకును సరస్వతికిచ్చాడు. అతను స్టేజ్ క్రిందకి దిగే ముందు సరస్వతి చెవిలో ఏదో ఊది మరీ దిగిపోయాడు.
సన్యాసి స్టేజ్ క్రింద ఉన్న లైట్ల దగ్గర కాళ్లు జాపి కూర్చుని కనిపించాడు.
“సన్యాసీ..”
“యస్?”
“అతని చెవిలో ఆ కుర్రాడు ఏమి చెప్పి ఉంటాడు?”
“ఏమీ లేదు శిశువా. పది నిముషాలు దాటి మాట్లాడితే స్టేజ్ వెనుక గల మెట్ల గుండా క్రిందకి తీసుకెళ్లి నరికేస్తామని చాలా చక్కగా, మెల్లగా, మృదువుగా చెప్పి ఉంటాడు.”
“మరి సరస్వతి చక్కగా చిరునవ్వు ఎందులకు నవ్వాడంటావు?”
“పిచ్చివాడా! స్టేజ్ మీద అందరూ అంతే. భయంకరమైన చిరాకు, చింత, బాధలో కూడా దెబ్బ తిన్న చోట మండుతున్న డెట్టాల్ రాసినట్లు ఆ దిక్కుమాలిన చిరునవ్వును బలవంతంగా పులుముకుని ముందుకు సాగిపోవాలి!”
(తదుపరి భాగం వచ్చే వారం)
వేదాంతం శ్రీపతిశర్మ కథా రచయిత. నవలా రచయిత. వ్యంగ్య హాస్య రచనలకు పెట్టింది పేరు. “ఆరోగ్య భాగ్యచక్రం” అనే పుస్తకాన్ని వెలువరించారు.
