[ప్రముఖ రచయిత శ్రీ వేదాంతం శ్రీపతిశర్మ రచించిన ‘మోసం చెయ్యటం ఎలా?’ అనే హాస్య వ్యంగ్య నవలని ధారావాహికంగా అందిస్తున్నాము.]
[సుందర్, సన్యాసి మోసం, అవార్డుల సంస్కృతి, మానవ సహజ గుణాలపై మాట్లాడుకుంటారు. అనంతరం సందిగ్ధానంద సరస్వతి స్టేజ్ పైకి రాగా, అతనిని పరిచయం చేసే కుర్రాడు మైకు అందుకుని వింతగా “అందరికీ సమోసాలు” అంటూ స్వాగతం పలుకుతాడు; ఆ వంటకం పేరులోని ‘స’ మరియు ‘మోసం’ అనే పదాలను విడదీస్తూ “ఇది ‘మోసంతో కూడినది’ అని, మన సంప్రదాయంలో చౌర్యం, మోసం పెద్ద అపరాధాలు కావు” అని వివరిస్తూ హాస్యాన్ని పండిస్తాడు. సరస్వతి ప్రేక్షకులకు ఒక చిన్న మోసాన్ని ప్రదర్శించబోతున్నాడని ప్రకటిస్తూ, ఆ కుర్రాడు అతని చెవిలో ఏదో చెప్పి మైకు ఇచ్చి క్రిందికి దిగిపోగా, “ఎక్కువ సమయం మాట్లాడితే స్టేజ్ వెనుకకు తీసుకెళ్లి నరికేస్తామని చెప్పి ఉంటాడని, అందుకే స్టేజ్ మీద ఎంత బాధ ఉన్నా బలవంతపు చిరునవ్వు పులుముకోవడం అలవాటే” అని సన్యాసి సుందర్‌తో వ్యంగ్యంగా అంటాడు. – ఇక చదవండి.]
సమోసా ఉపాఖ్యానం (26)
సరస్వతి మహదానందంతో మైకు పట్టుకున్నాడు.
“సభాసరస్వతికి ఈ సరస్వతి వందనాలు..” చుట్టూతా చూసాడు. ఎవరి చంకలోనో అప్పటివరకూ నిదురిస్తున్న ఓ చంటి పిల్లాడు ఆ మైకు యొక్క గివ్వురు శబ్దానికి ఉలిక్కి పడి లేచి కెవ్వున ఏడుపు సాగించాడు. సరస్వతి చిరునవ్వు నవ్వుతూ కొనసాగించాడు.
సన్యాసి నా ప్రక్కన కూర్చుంటూ కనిపించాడు.
“సన్యాసీ..”
“యస్?”
“సార్వజనిక సభలలో ఇలా అనుకోనివి ఎదురైనప్పుడు ఏమి చెయ్యాలంటావు?”
“అతను సరైన పని చేసాడు. చక్కగా చిరునవ్వు నవ్వుతూ నాకు సంబంధం లేదన్నట్లు ముందుకు సాగిపోవాలి.”
“కించిత్తు కష్టం సన్యాసీ. అందరివలనా కుదరదు కదా?”
“కష్టం అంటే కుదరదు. నేర్చుకోవాలి. నూటికి తొంభై మంది పనికిమాలిన చేష్టలకోసమే సభలలోకి వస్తారు. వారు, వారి చేష్టలు అలవాటైపోవాలి మరి.”
“ఇతను చేతైనవాడిలా ఉన్నాడు.”
“కరెక్ట్.”
సరస్వతి చక్కగా మాట్లాడుతున్నాడు.
“సోదర సోదరీమణులారా, నేనెవరినో నేను మీకు చెప్పను.”
ఎవరో ‘వద్దూ..’ అంటూ అరుస్తున్నారు.
“చెప్పమన్నా చెప్పను. ఎందుకో తెలుసా? నేను బయలుదేరుతుండగా ఎవరో అడిగారు – ‘దేనికి వెళుతున్నారు సార్?’ అని. నేను ‘కొందరిని గట్టిగా మోసం చెయ్యటానికి’ అని సూటిగా చెప్పాను. కాకపోతే ఇందరిని మోసం చెయ్యటం సమంజసం కాదు. అందుచేత రెండు లేదా మూడు నిజాలు మీకు చెప్పాలి…”, సంచీలోంచి పుస్తకాలు తీసాడు. “..ఇవి ఏమిటో తెలుసా? ప్రపంచంలో ఎవరూ ఇంతవరకూ పూనుకోని విషయాలను ఎక్కడినుండో త్రవ్వి, లాగి వీటిలో పొందు పరిచాను.”
“సన్యాసీ?”
“యస్?”
“ఈ మాట చాలా మంది రచయితలు అంటూ ఉంటారు. నిజమా?”
“నేను కాపీలు కొట్టని కవిని, లేదా రచయితని అని చెప్పేందుకు అందరూ వాడుకునే ఒక పద్ధతి శిశువా!”
“మరి వీరు కాపీ కొట్టినట్లు తెలిసాక?”
“వాస్తవానికి ఎవరికి వారు గొప్పవారనుకోవటంలో తప్పు లేదు. పెద్ద గీత పలువురికీ కనిపించేవరకూ ఇది పెద్ద గీత అనే తెలుసుకోవాలి.”
సరస్వతి తన గురించి, రచనల గురించీ చెబుతూ పరిసరాలను పూర్తిగా మైమరచిపోయి చెప్పేస్తున్నాడు. జనం గోల పెట్టేస్తున్నారు.
ఇంతలో మైకు కాస్తా ఆగిపోయింది. సరస్వతి ఏ మాత్రం చలించలేదు. తన సంచీలోంచి ఒక పోర్టబుల్ మైక్ తీసి అక్కడికక్కడే అమర్చుకుని కొంతమందికైనా వినిపించేటట్లు కొనసాగిపోతున్నాడు.
“ఇటీవల నేను రచించిన ఒక కవితను జాగ్రత్తగా, హాయిగా, చక్కని హృదయస్పందనతో వినాలని సవినయంగా మనవి చేసుకుంటున్నాను.”
“సన్యాసీ?”
“యస్?”
“కొద్ది సేపు క్రితం ఆ సంచీలో ఏముందనో అనుకున్నాం”
“కరెక్ట్”
“ఇలా నిర్వాహకులు మైకు ఆపేస్తారని ముందుగానే ఊహించి ఈ ఏర్పాటు చేసుకున్నాడు.”
సరస్వతి గొప్పవాడు.
“ప్రపంచమంతా నన్ను మోసగించనీ.. ఎలా?
ప్రపంచమంతా నన్ను మోసగించనీ, మరేం ఫరవాలేదు.
పరుపులన్నీ రాళ్లవనీ, మరేమీ ఫరవాలేదు.
ఈ సృష్టి అంతా వాస్తవానికి ఒక మోసమే! ఎలా అని అడగరేం?”
“చచ్చినా అడగం” ఎవరో అరిచారు.
“ఈశ్వరుడు తాను రచించిన ఈ సృష్టికి
కారణం లేదని మొదటి మాట –
ఈ పలుకుగా సెలవిచ్చియున్నాడు.
అందుచేత చెబుతున్నాను..
అమ్మ జోలపాట మోసం కాదా?
అమ్మాయి ఓరచూపు మోసం కాదా?..”
సన్యాసి కదిలాడు, “శిశువా!”
“యస్?”
“వీడు సామాన్యుడు కాడు!”
(తదుపరి భాగం వచ్చే వారం)
వేదాంతం శ్రీపతిశర్మ కథా రచయిత. నవలా రచయిత. వ్యంగ్య హాస్య రచనలకు పెట్టింది పేరు. “ఆరోగ్య భాగ్యచక్రం” అనే పుస్తకాన్ని వెలువరించారు.
