[ప్రముఖ రచయిత శ్రీ వేదాంతం శ్రీపతిశర్మ రచించిన ‘మోసం చెయ్యటం ఎలా?’ అనే హాస్య వ్యంగ్య నవలని ధారావాహికంగా అందిస్తున్నాము.]
[‘సందిగ్ధానంద సరస్వతి’ అనే వేషంలో వచ్చిన వ్యక్తి తాను అసలు రచయితనే కాదని, కేవలం ఐదు వందల రూపాయలు, రెండు యాపిల్ పండ్ల కోసం నిర్వాహకుల మోసంలో భాగమయ్యానని స్టేజ్ మీద నిజం బయటపెడతాడు. ఇదే అదనుగా ఒకావిడ స్టేజ్ ఎక్కి, సరస్వతి గురించి మాట్లాడతానని చెప్పి తన సొంత కవితలను చదవడం ప్రారంభిస్తుంది. పరిస్థితి చేయి దాటిపోతుండటంతో నిర్వాహకులలో ఒక పెద్దాయన రంగంలోకి దిగి, ఇదంతా ‘మోసం చేయడం ఎలా’ అనే అంశంపై తాము ముందుగా ప్లాన్ చేసిన లైవ్ వినోద ప్రదర్శన అని చెప్పి సభను మభ్యపెడతాడు; అంతేకాకుండా ఆమెను ప్రఖ్యాత రచయిత్రి ‘గంగూ బాయి’గా పరిచయం చేసి ఇద్దరినీ శాలువా, పుష్పగుచ్ఛంతో సన్మానిస్తారు. అయితే, వారు కిందకు దిగిన వెంటనే ఒక వ్యక్తి సంచీతో వచ్చి ఆ శాలువాను, పుష్పగుచ్ఛాన్ని తిరిగి లాక్కెళ్లిపోవడంతో నిర్వాహకుల అసలు మోసం బయటపడుతుంది. – ఇక చదవండి.]
సమోసా ఉపాఖ్యానం (28)
స్టేజ్ మీదకి అందరినీ పిలిచారు. నన్ను మధ్యలో కూర్చో పెట్టారు. నా చేత దీపం ప్రజ్వలింపజేసారు. మైకులో ఆ గాయకుడు పాడుతున్నాడు, శుక్లాంబరధరం.. అది అతనన్నట్లు ఘంటసాల గారి రికార్డ్ పెట్టేసారు. అతను మటుకు హావభావాలు అదరగొట్టేసాడు. అందరం కూర్చున్నాం. అతను అందరి ముందుకు వచ్చి నమస్కారాలు పెట్టేసి వెళ్లిపోయాడు. ప్రయోక్త లేచాడు. పోడియమ్ వద్దకు వచ్చాడు.
మైకును కొద్దిగా కదిలించి పని చేస్తోందని నిర్ధారించుకున్నాడు.
“వేదికను అలంకరించిన పెద్దలకు, మీ అందరికీ నమస్సుమాంజలులు..”
సన్యాసి నా ప్రక్కనే ఉన్నట్లు తెలియదు. ఎవరి కుర్చీ ఖాళీగా ఉంటే అందులో కూర్చోవటం వీడికి అలవాటైపోయింది.
“శిశువా..”
“యస్?”
“ఎవరి పేర్లు గుర్తుండనప్పుడు ఇది తేలికైన పని. పైగా ఒకరి పేరు చెప్పి ఇంకొకరిది చెప్పకపోతే ఒక సమస్య. ఇందులో ముందు వెనుక గొడవలు కూడానూ..”
“కరెక్ట్.”
“నీ పేరు కూడా పెద్దగా గుర్తుండదు..”
“అలా ఉండదులే.. మరీ అన్యాయం..”
అతను చెబుతున్నాడు, “..సమోసా సంస్థ సామాన్యమైనది కాదు. సరస మోసగాళ్లు సామాన్యులు కారు. పిక్ పాకెట్లు ఎంత సునాయాసంగా పాకెట్ కొట్టేస్తారో సరస మోసగాళ్లు అంత సునాయాసంగా మోసం చేసెయ్యగలరు. న్యాయం పట్టి పిండితే అసలు సరస మోసగాళ్లు అనకుండా సహజ మోసగాళ్లు అనటం కరెక్ట్..”, మా వైపు తిరిగాడు. అందరం తల అవునన్నట్లు తలలు ఆడించాం. గంగమ్మ నన్ను చూస్తూ నేనేం చేస్తే అది చేసేస్తోంది. తల ఆడించి చక్కగా నవ్వింది. కెమెరా వాళ్లు వాళ్ల పనిలో వాళ్లున్నారు. ఈయన మాట్లాడుతుండగానే ఎవరో వచ్చి అందరికీ శాలువాలు కప్పేసి పూలదండలు వేసేసి వెళ్లిపోయారు. చెరో రెండు బత్తాయిలు చేతిలో పెట్టి ఫొటోలు తీసుకున్నారు. శాలువా తీస్తుండగా కొద్దిగా దూరంగా ఆ వస్తాదు తన సంచీని జెండాలా ఊపుతున్నాడు.
ఇంతలో ఎక్కడో చూసినట్లనిపించిన అమ్మాయి కనిపించింది. ఎవరో కాదు. కనకమహాలక్ష్మి – అనకాపల్లి వ్యవహారం. చాలా తక్కువ దుస్తులలో కాలు మీద కాలు వేసుకుని నన్ను అదే పనిగా చూస్తుంటే ఎవరా అనుకున్నాను.
మైకులో ఆయన అంటున్నాడు. “అసలు విషయం చెబితే అందరూ మోసపోతారు, కాదు అందరూ ఆశ్చర్యపోతారు. ఇక్కడ మన మధ్య లకీ మీరా ఉన్నారు. ఆమె మలేషియా నుండి నేరుగా ఫ్లైట్‌లో నిన్ననే వచ్చారు ఇక్కడికి. పుస్తకం మార్కెట్ లోకి రాకుండానే అందులోని కీలకమైన అంశాలను గ్రహించి మలేషియాలో మిలియన్లు సంపాదించి ఆవిడ నడుపుతున్న సంస్థ. ఇదెలా సాధ్యమైంది అనే అంశం మీకు ఆవిడ స్వయంగా వివరిస్తారు..”
కనకం లేచింది. మా అందరికీ ఒక్కరొక్కరికీ వంగి వంగి మరీ నమస్కారాలు చేస్తోంది. సన్యాసి కళ్లు మూసుకున్నాడు. నా దగ్గరకి వచ్చి కాళ్లు పట్టుకుంది. చుక్కలు కనిపించాయి. గట్టిగా లాగితే స్టేజ్ మీద నుంచి ఆ కెమెరా మీదకి వెళ్లి పడగలను. పంచె లాగినా ఇంత కంటే ఘోరం జరుగగలదు. పైకి పళ్లు ఇకిలిస్తున్నాను. సన్యాసి ఆమె కుర్చీలో కూర్చుని తెగ కులుకుతున్నాడు. నిర్వాహకులలో ఒకడు వచ్చి కొద్దిగా ప్రసాదం అడిగినట్లు చెయ్యి పెట్టాడు. ఏమి చెయ్యాలో తోచలేదు. చెవి దగ్గరకి వచ్చాడు. మెల్లగా చెప్పాడు, “సార్, కొద్దిగా త్వరగా ఆశీర్వదించండి. ఎక్కువ సేపు ఆమె ఆ భంగిమలో ఉంటే ఏదైనా జరుగగలదు. ఎంత ఇబ్బంది పడుతోందో చూడండి..”
ఇంతలో జనంలో ఎవరో గట్టిగా ఈల వేసేసారు! కనకం వైపు చూసాను. నన్ను ఒక్క సారి మోసం చేసేస్తారా అని అడిగింది ఈమె! చెయ్యి బయటకి తెచ్చి ఆశీర్వదించాను. చిన్నగా నవ్వి కన్ను కొట్టింది.. టక్కున లేచి వాణిశ్రీ ఎయిర్ హాస్టెస్లా నడిచినట్లు నడచి మైకు దగ్గరకి వెళ్లింది. అనకాపల్లి వయ్యారమంతా ఒలకబోసేసింది. ఆ మైకు దగ్గరున్నవాడు చెయ్యి పట్టుకుని మైకు సద్దాడు.
“అండ్రికీ నంస్తే..”, అంది. ఆ మైకు మనిషి ముందు చప్పట్లు కొట్టి అందరి చేతా కొట్టించాడు. వింతగా నవ్వి ఎందుకో నా వైపు తిరిగింది.
“సన్యాసీ..”
“యస్?”
“నన్ను చూడటం ఎందుకు?”
“అదేవన్నమాట? నువ్వు పెద్ద గురువువి మోసం చెయ్యటంలో. శంకరశాస్త్రివి. మంజు భార్గవి మాట్లాడుతోంది విను!”
“పుష్కం రాకుంటినే నేన్ ఎలా సబ్జక్ట్ని పట్టుకున్నానో టెలింగ్.. చెప్తాను..”, వేళ్లు గట్టిగా బిగించింది, “..ఏంటి అంటే సింపుల్. నేనూ, సార్ – అంటే సన్యాసిరావు సార్.. అదే సుండ్ర సార్, ఈ పుష్కం మీద డిస్కషన్ చేసి ఉంటిమి! ఆ చిన్న చిన్న ఏమంటారు..”, ఆ మైకు మనిషి చెవిలో ఏదో చెప్పినట్లు నటించాడు, “..అదే విషయాలు నన్ను ఏమది.. అట్రాక్ట్..కర్షించాయి.. అదే.. ఆకర్షించాయి. మలేషియాలో టూరిసం, బాంకింగ్ సెక్టర్లో నేను ఈ విషప్రయోగం చేసి యుంటిని.. సారీ, ఈ విషయాలతో ప్రయోగం చేసాను. కంప్లీట్‌గా అప్పులలో ఉన్న మా కంపనీ టుడే మలేషియాలోనే టాప్ కంపనీ అని టెలింగ్.. చెబుతున్నాను! జస్ట్ మాట్లాడితేనే ఇంత జరిగింది. అసల్ పుష్కం వస్తే ఎట్లుండునో మీరు ఆలోచన చెయ్యండి. ఇంకా చాలా చాలా చెప్పాలి. కానీ ఇంకా బిడ్డలు.. కాదు కాదు సారీ, పెడ్డలు మాట్లాడాల్సి యుంది.., నేను సార్‌కి .. ఏమది, రణపడి.. నో ఋణపడి యుండును.. చాలా చాలా థాంక్స్!”
వచ్చి మరోసారి నమస్కారం పెట్టింది. మెల్లగా అన్నాను, “ఇప్పుడు మళ్లీ కాళ్ల మీదకి వద్దు. వెళ్లి కూర్చో దయ ఉంచి!”
చిత్రంగా నవ్వి “బాగా మాట్లాడానా సారూ?”
“చించావు..”
“ఏది?”, అంటూ ఆ టైట్ దుస్తులను జాగ్రత్తగా లాక్కుంటూ అవతలికి వెళ్లింది అనకాపల్లి.
జనాల చప్పట్లను ఆపాడాయన.
“చూసారా? ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఒక షేర్ లిస్టింగ్ ముందరే ఓవర్ సబ్‌స్క్రైబ్ అయిపోవటమంటే ఇదే! సార్ దగ్గర కూర్చుంటేనే ఒక ఎడ్యుకేషన్!”
సన్యాసికి కుర్చీ లేక నా వెనుకకు వచ్చాడు.
“శిశువా!”
“యస్. విన్నావా?”
“అందుకే కూర్చోలా ఆమె. ఇంకొక క్షణం ముందుకు పాకితే విషమో విషయమో అందరికీ పూర్తిగా విశదమైపోయేది!”
“ఒకటర్థమైంది సన్యాసీ!”
“పోన్లే. ఇప్పటికైనా ఒక్కటైనా అర్థమైంది. ఇంతకీ ఏమది?”
“ఇంతకాలం మనం ఏ వేషమూ వెయ్యకుండా మనలను మనం మోసం చేసుకున్నామా?”
(తదుపరి భాగం వచ్చే వారం)
వేదాంతం శ్రీపతిశర్మ కథా రచయిత. నవలా రచయిత. వ్యంగ్య హాస్య రచనలకు పెట్టింది పేరు. “ఆరోగ్య భాగ్యచక్రం” అనే పుస్తకాన్ని వెలువరించారు.
