[ప్రముఖ రచయిత శ్రీ వేదాంతం శ్రీపతిశర్మ రచించిన ‘మోసం చెయ్యటం ఎలా?’ అనే హాస్య వ్యంగ్య నవలని ధారావాహికంగా అందిస్తున్నాము.]
[కథకుడికి రాత్రి గోడ మీద తనలానే ఉన్న ఓ సన్యాసి కనబడతాడు. మర్నాటి నుంచి కథకుడు అందర్నీ మోసం చెయ్యాల్సి ఉంటుందని చెప్తాడు. మర్నాడు ఉదయం కథకుడు నిద్ర లేచేసరికి గేటు మీద కనబడతాడా సన్యాసి. కథకుడు సన్యాసిని పలకరించి మాట్లాడుతూంటే, అతని భార్య వచ్చి ఎవరితో మాట్లాడుతున్నారని అడుగుతుంది. ఇంతలో కథకుడి ఫోన్ మ్రోగుతుంది. తాము సమోసా నుంచి మాట్లాడుతున్నామంటారు ఫోన్ చేసినవాళ్ళు. అదేంటి అంటే ‘సరస మోసగాళ్ల సాహితీ వేదిక’ అని చెప్తారు. మీరు మాకో పుస్తకం రాసిపెట్టాలని, దాని పేరు ‘మోసం చెయ్యటం ఎలా?’ అని చెప్పి, దాన్ని తాము ప్రచురిస్తామని అంటారు. సన్యాసి నవ్వుతాడు. – ఇక చదవండి.]
సమోసా ఉపాఖ్యానం (2)
మర్నాడు ఉదయం నలుగురు పెద్దమనుషులు ఇంటి గేటు వద్ద నిలుచునున్నారు. మా ఆవిడ వాళ్లని ఏదో కనుక్కుని వచ్చి నా ఎదురుగా నిలుచుంది.
“ఒక్క ముక్క అర్థం కాలేదు.”
“ఏవంటారు?”
“సమోసాలు అమ్మటానికి నలుగురొచ్చారు ఏకంగా.”
“నో నో.. సమోసాలు కాదు..” అంటూ గేటు దగ్గరకి వెళ్లాను.
“సార్, నమస్కారం! నిన్న మీతో మాట్లాడాను. సరస మోసగాళ్ల సాహితీవేదిక – అదే సమోసా నుండి వచ్చాము..”, ఆ పెద్దమనిషి పళ్లు ఇకిలిస్తున్నాడు.
“రండి సార్, లోపలికి రండి.”
అందరూ వచ్చి కూర్చున్నారు. మా వరండాకి పిట్టగోడ మీద సన్యాసి కాళ్లు జాపుకుని కూర్చున్నాడు. వీడు ఇప్పుడెందుకు వచ్చాడో అర్థం కాలేదు.
“శిశువా..”, చిన్నగా అన్నాడు, “..ఏంటి? నీలాంటి సన్నాసి రచయితకి ఇంత డిమాండా? అనుకునేవు. లక్షలాది మంది మక్కువతో సేవిస్తూ ఉంటారు సన్నాసులని.”
“ఇంతకీ నన్నేం చెయ్యమంటావు?”
“వాళ్లు చెప్పేది విను. ఏం చెయ్యమంటారో అది చెయ్యి. అంతే! అనవసరమైన ప్రశ్నలు వెయ్యవద్దు.”
తల ఆడిస్తూ నా కుర్చీలోకి వచ్చాను.
“ఏంటి సార్? మీలో మీరు మాట్లాడుకుంటున్నారు? రండి, విషయం చర్చిద్దాం.”, అన్నాడు పెద్దమనిషి.
ఈ లోకంలోకి వచ్చి ఆయనకి ఎదురుగా కూర్చున్నాను.
“సార్, ఏమీ లేదు, ఓ చిన్న మార్కెటింగ్ ఐడియా..”
“చెప్పండి”
“వచ్చే వారం ఓ సభ ఏర్పాటు చేసాం.”
“వెరీ గుడ్.”
“ఆ రోజే మీరు వ్రాసిన పుస్తకం-మోసం చెయ్యటం ఎలా?-దాని ఆవిష్కరణ!”
“అయ్యా, నేనింకా కాగితం మీద కలం పెట్టలేదు. వారం రోజులలో పుస్తకం వ్రాయటం, దానిని మీరు ప్రచురించటం, ఇవన్నీ ఎలా అయిపోతాయనుకుంటున్నారు?”
“అదే మోసం.. అదే తమాషా అన్నమాట.”
“ఓ”
“పుస్తకం ఏదీ ఉండదు సార్. ఇది కొత్త తరహా పద్ధతి.”
మా ఆవిడ ఎంతో ఆనందంగా అందరికీ కాఫీలు పట్టుకొచ్చింది.
“సారీ, ఏమీ అనుకోకండీ! సమోసా అంటే మరేదో అనుకున్నాను.”
“మరేం ఫరవాలేదు మేడమ్! అలా అందరూ అనుకోవాలన్నదే మా ధ్యేయం.”
అందరూ కాఫీలు సేవిస్తున్నారు.
“సార్, ఇంతకీ నేనేం చెయ్యాలో చెప్పారు కారు?”, అన్నాను.
“ఏమీ చెయ్యక్కరలేదు”, అన్నాడు పెద్దాయన.
“అందుకే మిమ్మల్ని ఎంచుకున్నాం”, అనేసాడు ప్రక్కనున్నాయన. వెంటనే ఆ పెద్దాయన అతన్ని ఆపాడు.
“మరోలా అనుకోకండి సార్, ఇతనికి వ్యవహార జ్ఞానం శూన్యం. వట్టి సన్యాసి!”, అన్నాడు.
పిట్టగోడ మీద నా సన్యాసి ఫక్కున నవ్వి నోటి మీద చెయ్యి పెట్టాడు!
(తదుపరి భాగం వచ్చే వారం)
వేదాంతం శ్రీపతిశర్మ కథా రచయిత. నవలా రచయిత. వ్యంగ్య హాస్య రచనలకు పెట్టింది పేరు. “ఆరోగ్య భాగ్యచక్రం” అనే పుస్తకాన్ని వెలువరించారు.
