Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మోసం చెయ్యటం ఎలా?-4

[ప్రముఖ రచయిత శ్రీ వేదాంతం శ్రీపతిశర్మ రచించిన ‘మోసం చెయ్యటం ఎలా?’ అనే హాస్య వ్యంగ్య నవలని ధారావాహికంగా అందిస్తున్నాము.]

[ఫోన్‍లో చెప్పినట్టుగానే సమోసా ప్రతినిధి బృందం కథకుడి ఇంటికి మర్నాడు పొద్దున్నే వచ్చేస్తారు. వాళ్ళెవరో, ఎందుకు వచ్చారో అర్థం కాలేదంటుంది కథకుడి భార్య. సమోసాలు అమ్మటానికి నలుగురు వచ్చారు ఏకంగా అని చెప్తుంది. ‘అయ్యో, ఆ సమోసాలు కాదం’టూ కథకుడు లేచి గేటు వద్దకు వెళ్ళి వాళ్ళని లోపలికి తీసుకువస్తాడు. అంతలో అక్కడ సన్యాసి ప్రత్యక్షమవుతాడు. అతనెందుకొచ్చాడో కథకుడికి అర్థం కాదు. ‘వాళ్ళు చెప్పింది విను, ఏం చెయ్యమంటే అది చెయ్యి, అనవసరమైన ప్రశ్నలు వెయ్యద్దు’ అని సన్యాసి కథకుడికి చెప్తాడు. వచ్చేవారమే సభ పెడుతున్నామనీ, ఆ సభలో కథకుడు వ్రాసిన పుస్తకం ‘మోసం చెయ్యటం ఎలా?’ ఆవిష్కరణ జరుగుతుందని చెప్తారొకరు. నేనింకా పుస్తకం రాయనిదే అని ఆశ్చర్యపోతాడు కథకుడు. ‘అదే మోసం’ అంటూ, ‘తమాషా అన్న మాట’ అంటాడతను. నేనేం చెయ్యాలి అంటే, ఏం చెయ్యన్నక్కరలేదు, అందుకే మిమ్మల్ని ఎంచుకున్నాం అంటారు వాళ్ళు. – ఇక చదవండి.]

సమోసా ఉపాఖ్యానం (3)

అద్దం ముందర నిలుచున్నాను. చక్కని మెరిసే కుర్తా, అదిరిపోయే పంచె, చిక్కని రంగులో కండువాతో నిలబడ్డాను. అద్దంలో సన్యాసి కనిపించాడు.

“బుద్ధీ, జ్ఞానం రెండూ నీకు లేవు”, అన్నాడు.

“కరెక్ట్”

“తెలిసీ అలా తయారయ్యావు, అవునా?”

“అది ఈ కాలం యొక్క డిమాండ్.”

“పుస్తకం వ్రాయకుండానే సభకు తయారయ్యావు.”

“పుస్తకం చదవకుండానే దాని గురించి ఎంత మంది మాట్లాడటంలేదు?”

“నిజమే. నాకు – అంటే నీ అసలు స్వరూపానికి ఏ సమాధానం చెబుతావు?”

“అదలా ఉంచు. ఈ పనికి సమోసా వాళ్లు నన్నే ఎందుకు ఎంచుకున్నారంటావు?”

“అక్కడే పప్పులో కాలేసావు శిశువా!”

“ఛా!”

“అవును. నిన్ను వాళ్లు ఎంచుకోలేదు.”

“మరి?”

“ఎవరైనా ఫరవాలేదని అటూ ఇటూ చూసారు. నువ్వు లాటరీలో దొరికావు!”

“సర్లె. మొత్తానికి ఈ గెటప్ బాగుందా?”

“బాగుంది. దీనినే నీచభంగ రాజయోగం అంటారు జ్యోతిషంలో.”

“ఐ సీ.”

లటుక్కున అద్దంలోంచి పారిపోయాడు సన్యాసి.

నా వెనుకనుండి మా ఆవిడ “చాలు” అనేసిందన్నమాట.

ఈ లోకంలోకి వచ్చేసాను. వరండాలోకి వచ్చాను. గేటు దగ్గర మాంచి పోష్ కారు ఒకటి ఉంది. ఆ డ్రైవర్‌కి అన్నీ తెలుసనుకుంటాను. వెక్కిరింతగా చూసాడు. గేటు బైటకి వెళ్లి కారు డోర్ తెరుస్తాడేమోనని చూసాను. అతను సందేహం తీర్చేసాడు.

“మనం సభ జరిగే ప్రాంతానికి వెళతాం చూడండీ, అక్కడ ఆపినప్పుడు మర్యాదగా డోర్ తెరచి మిమ్మల్ని దింపుకుంటారు”, అన్నాడు.

“అర్థమైంది”

కారులో కూర్చున్నాను. అటూ ఇటూ చూసి కారు స్టార్ట్ చేసాడు.

“మరీ గల్లీలో ఉంటున్నారు సార్”, అన్నాడు.

“నాదో అనుమానం”, అన్నాను.

“చెప్పండి”

“కార్యక్రమం అయిపోయిన తరువాత నన్ను మర్యాదగా కారెక్కించి దగ్గరలో ఉన్న బస్ స్టాప్ దగ్గర దిగిపోమంటారు. అంతేనా?”

అతను కారు కిటికీ అద్దం క్రిందికి పోనిచ్చి చిన్నగా నోటి దూలను విసర్జించి మరల అద్దం మూసేసాడు.

“లేదండీ. మా బండీ ఒప్పుకున్నాక రానూ పోనూ కట్టుకోవాలండీ. అంచాత ఇంటి దగ్గర దింపుతానండీ. బెంగ లేదండీ.”

“అనేక ధన్యవాదములు.”

“ఏం సేత్తారండీ మీరు?”, అడిగాడు.

“ఏమీ చెయ్యను. అప్పుడప్పుడు ఇలా అటూ ఇటూ వెళుతూ ఉంటాను.”

అతను ఫోన్ తీసి ఓ నంబరు కొట్టాడు.

“బయలుదేరాం సార్. ఆయన్ని వీడియోలో దగ్గరకి సూపిత్తాను.ఆయనో కాదో తేల్చుకోండి మరి..”

ఫోన్ నాకు దగ్గరగా పట్టుకున్నాడు. ఎవరో ఇద్దరు చూస్తున్నట్లున్నారు.

“..అరెరె.. లేదు లేదు ఆయనే! మనం చెప్పిన కాస్ట్యూమ్స్ ఇవే! కొద్దిగా కోపంగా ఉన్నారు సారు వారు! నవ్వమను..”

అవన్నీ వినపడుతున్నాయి. ఫోన్ ఆపేసాడు డ్రైవర్. బండీ పోతోంది.

“నవ్వమంటున్నారు సార్”

“ఎవరిని చూసి?”

అతను నవ్వేసాడు. అతని ప్రక్కన సన్యాసి ప్రత్యక్షమైనాడు.

“శిశువా?”

“యస్?”

“నవ్వమనలేదు వాళ్లు.”

“అలానా?”

“అవును. నీలోని నన్ను జాగ్రత్తగా చూసి నవ్వుకోమన్నారు!”

“పొరపాటు సన్యాసీ.. రచయిత తనను తాను చూసి ఏ రోజూ నవ్వుకోడు. రచయితల విన్యాసాలకి చుట్టూతా ఉన్నది ఓ జన్మకి సరిపోదు నవ్వుకోవటానికి.”

“నవ్వుకోవటం అనేది జరుగుతోంది కదా?”

“చుట్టూతా అన్నప్పుడు నేనూ అందులో భాగం కాబట్టి. ఇప్పుడు అక్కడికి వెళ్లేది ఆ పనికే!”

సన్యాసి మాయమైనాడు.

(తదుపరి భాగం వచ్చే వారం)

Exit mobile version