Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మోసం చెయ్యటం ఎలా?-5

[ప్రముఖ రచయిత శ్రీ వేదాంతం శ్రీపతిశర్మ రచించిన ‘మోసం చెయ్యటం ఎలా?’ అనే హాస్య వ్యంగ్య నవలని ధారావాహికంగా అందిస్తున్నాము.]

[చక్కని కుర్తా, పంచె, కండువా ధరించి, సభకి వెళ్ళడానికి తయారవుతాడు కథకుడు. అద్దంలో చూసుకుంటుంటే సన్యాసి కనబడతాడు. నీకు బుద్ధీ జ్ఞానం లేవనీ, పుస్తకం రాయకుండానే సభకి తయారయ్యావని తిడతాడు సన్యాసి. తనని తాను సమర్థించుకుంటాడు కథకుడు. ఇంతకీ సమోసా వాళ్ళు తననే ఎందుకు ఎంచుకున్నారని సన్యాసిని అడుగుతాడు. వాళ్ళు నిన్ను ఎంచుకోలేదనీ, ఎవరైనా ఫరవాలేదనుకుని నిన్ను పిలిచారని అంటాడు సన్యాసి. గేటు ముందొక పాష్ కార్ వచ్చి ఆగుతుంది. ఎక్కి కూర్చుంటాడు కథకుడు. సార్ ఎక్కారనీ, ఆయన కాదో చూసుకోండని వీడియో కాల్ చేసి నిర్వాహకులకు చెప్తాడు. వాళ్ళు ధ్రువీకరిస్తారు. డ్రైవర్ కూడా ఏవేవో ప్రశ్నలు వేస్తే, కథకుడు జవాబులు చెప్తాడు. కారులో డ్రైవర్‌కి కనిపించని సన్యాసితో మాట్లాడుతుంటాడు కథకుడు. కాసేపటికి సన్యాసి మాయమవుతాడు. – ఇక చదవండి.]

సమోసా ఉపాఖ్యానం (4)

“రచయిత అన్నవాడు సీరియస్‌గా ఉండకూడదా?”, డ్రైవర్‌ని అడిగాను.

“మనకి తెల్దండి! ఆళ్లు రంగు పూసేటోళ్లు. మనం పూయించుకునేటోళ్లం. రంగు చేతిలో ఉంటే సరిపోదండీ మరి. పూయటం చేతనైనోడే రంగం నడుపుతాడు.”

“కరెక్ట్.”

“ఇంతకీ మీరు రాత్తారన్నమాట?”

“అవును. నువ్వు చదవవా?”

“అది చెయ్యలేనండీ. మా ఆవిడ ఏదో చదువుతూ ఉంటుంది, అప్పుడప్పుడు నవ్వుతూ ఉంటుంది. నాకు చెప్పమంటే నీకు తెల్దులే అంటుంది. అవునండీ, మీరు చెవిలో అవి పెట్టుకుని ఎవరో స్వామీజీతో మాట్లాడుతున్నరా?”

“అలానే అనుకో.”

“ఎవరు సార్, స్వామీజీ?”

“రహస్యం.”

“మీరు కూడా మా ఆవిడలా అంటే ఎలా సార్?”

“ఈ స్వామీజీ ఎవరికీ కనిపించడు – నాకు తప్ప!”

చిన్న జర్క్ ఇచ్చాడు.

“అవునాండీ? ఓ సారి బొమ్మ సూపిత్తారా?”

“కానీ. తిరిగి వస్తాం కదా, టైమ్ ఉంటుంది.”

కారు ఆగింది.

ఎక్కడి నుండి పట్టుకొచ్చారో బాగానే జనం వచ్చారు. పుస్తకం కవర్ పేజీతో ఫ్లెక్సీలు పెట్టేసారు. “మోసం చెయ్యటం ఎలా?” అనేది ఎక్కడ పడితే అక్కడే కనిపిస్తోంది. అన్నిటికన్నా మించిన ఫ్లెక్సీ పిచ్చి పిచ్చిగా మెరిసిపోతోంది. అటూ ఇటూ చివర చెరో సమోసా బొమ్మలు నోరూరిస్తున్నాయి. మధ్యలో ‘సరస మోసగాళ్ల సాహితీ వేదిక’ అని ప్రస్ఫుటంగా ఉంది. కొందరు నవ్వుకుంటున్నారు, కొందరు ఇదేదో వింతగా ఉంది చూద్దాం అనుకుంటున్నారు. కుర్రాళ్లు ఫొటోలు తీసుకుంటున్నారు. సెల్ఫీలు దిగుతున్నారు.

ఇద్దరు పెద్దమనుషులు వచ్చి కారు డోర్ తెరిచారు. కెమెరా వాళ్లు వాళ్ల పనులలో వాళ్లున్నారు. నేను వెంటనే దిగబోతుంటే డ్రైవర్ ఆపాడు.

“ఉండండి. అలా టకటకా దిగిపోకండి. ఓ రెండు నిముషాలు అలా ఊరకుండండి. అందరూ ఎవరా ఎవరా అనుకోవాలి.”

అలాగే కూర్చున్నాను. పంచెతో కారులోంచి దిగటం అంత తేలికైన పని కాదు. మెల్లగా దిగాను. పెద్దమనుషులు దింపుకున్నారు.

ఒకాయన చెవిలో ఊదాడు, “నమస్కారం పెట్టండి. ఇందులో మోసం ఏదీ లేదు!”

నమస్కారం పెట్టాను. సన్నాయి మ్రోగుతోంది. అటూ ఇటూ ఇద్దరు, వెనుక నలుగురు నడిచారు.

మోసం చెయ్యటం ఎలా? అని పుస్తకం వ్రాస్తే ఇంత సన్మానమా? ఇంత ఆర్భాటమా? అసలు మోసం చెయ్యటం ఎవరికీ తెలియకపోతే కదా?

వేదిక చాలా అందంగా అలంకరించారు. మధ్యలో ఉన్న కుర్చీలో కాలు మీద కాలేసుకుని సన్యాసి కనిపించాడు.

“భయపడకు..”, అన్నాడు, “..నీలా అమాయకంగా కనిపించే ప్రతివాడూ మాయగాడే!”

“అన్యాయం. జీవితంలో ఎన్నడూ అబద్ధం కూడా ఆడలేదు.”

“నో, ఈ మాటతోనే నీ ప్రసంగం ప్రారంభించు. కానీ చివర ఈ ఒక్క మాట తప్ప అని చెప్పు. చప్పట్లలో బ్రతికేస్తావు!”.

(తదుపరి భాగం వచ్చే వారం)

Exit mobile version