Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మోసం చెయ్యటం ఎలా?-6

[ప్రముఖ రచయిత శ్రీ వేదాంతం శ్రీపతిశర్మ రచించిన ‘మోసం చెయ్యటం ఎలా?’ అనే హాస్య వ్యంగ్య నవలని ధారావాహికంగా అందిస్తున్నాము.]

[సమావేశానికి కారులో వెళ్తున్న కథకుడు డ్రైవరుతో సంభాషిస్తుంటాడు. నువ్వు చదువుతావా అని డ్రైవర్‍ని అడిగితే, తాను చదవలేననీ, తన భార్య చదువుతుందని చెప్తాడు. మీరు చెవిలో అవి పెట్టుకుని ఎవరైనా స్వామీజీతో మాట్లాడుతున్నారా అని అడిగితే, కథకుడు అవునంటాడు. ఎవరా స్వామీజీ అని డ్రైవర్ అడిగితే, రహస్యం అని అంటాడు కథకుడు. ఆ స్వామి తనకు తప్ప మరెవరికి కనిపించడని అంటాడు. సమావేశ స్థలానికి వెళ్తారు. అక్కడ జనం బాగా వచ్చి ఉంటారు. ఫ్లెక్సీలు కట్టి ఉంటాయి. కారు దిగబోతుంటే, డ్రైవర్ ఆపుతాడు. వచ్చిందెవరా అని జనాలు అనుకోవాలంటే రెండు నిమిషాలు అలా కారులోనే ఉండాలని చెప్తాడు. నలుగురు పెద్ద మనుషులు వచ్చి, నాదస్వరం బృందం  సన్నాయి వాయిస్తుండగా కథకుడిని లోపలికి తీసుకువెళ్తారు. సన్యాసి ప్రత్యక్షమై, ప్రసంగం ఎలా మొదలెట్టాలో కథకుడికి సూచిస్తాడు. – ఇక చదవండి.]

సమోసా ఉపాఖ్యానం (5)

నన్ను స్టేజ్ ప్రక్కనున్న ఓ చిన్న గదిలో కూర్చో పెట్టారు.

మైక్ లో వినబడుతోంది, “..సోదర సోదరీమణులకు, పాత్రికేయులకు, మీడియా వారందరికీ, సమోసా ప్రియులకు ప్రత్యేకంగా నమస్సుమాంజలులు. ‘మోసం చెయ్యటం ఎలా?’ అనే సంచలనాత్మకమైన పుస్తకాన్ని మన ముందరకి తీసుకుని వచ్చిన సంచలన రచయిత శ్రీ సన్యాసిరావు గారు కొద్ది క్షణాల క్రితమే మన ప్రాంగణంలోకి వచ్చేసారు. సభ ప్రారంభం కాబోతోంది కాబట్టి మీరందరూ ఎవరి స్థానాలలో వారు సుఖాసీనులు కావలసినదిగా కోరుకుంటున్నాం..”

మైకు కొద్దిగా గుయ్ గుయ్ మంటోంది.

“మరొక్క విషయం – శ్రీ సన్యాసిరావు గారు ఒక అంతర్జాతీయ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొని నేరుగా ఇక్కడికి విచ్చేసారు. ‘నేను ఇక వ్రాయను’, ‘నేను ఎందుకు వ్రాయను’, ‘నేను ఎవరు’ అనే పుస్తకాల రికార్డ్ సేల్స్‌ను పురస్కరించుకుని వారు ఎన్నో ప్రసంగాలు చేసియున్నారు. మీ అందరికీ ఒక శుభవార్త – సరస మోసగాళ్ల సాహితీ వేదిక, అనగా సమోసా సంస్థ ఇటీవల వారితో ఒక ఒప్పందం కుదుర్చుకుంది. అదేమిటి అని మీరు ఆశ్చర్యపోనక్కరలేదు. వాస్తవానికి మాది మోసగాళ్ల సంస్థ కానే కాదు. ఎలా మోసపోకూడదో అనే అంశం మీద సూటిగా దృష్టి సారించింది మా.. కాదు మీ సమోసా! అందులో భాగంగా శ్రీ సన్యాసిరావు గారితో మేము చేతులు కలిపి మీ అందరికీ తగు సేవలను అందించబోతున్నాం. శ్రీ సన్యాసిరావు గారు ఇక మీద రచయితే కాదు, మనందరికీ కూడా ఒక మార్గదర్శి, ఒక అద్భుతమైన కన్సల్టెంట్!”

చప్పట్లు మారు మ్రోగుతున్నాయి.

ఆ చిన్న గదిలో కూర్చుని అంతా వింటున్నాను. అద్దంలో కాషాయం రంగు సూటు, టైలో సన్యాసి దర్శనం ఇచ్చి చిన్నగా కన్ను కొట్టాడు. రెండు చేతులూ స్టైల్‌గా అటూ ఇటూ చాపి కళ్లజోడు పైకి తోసాడు. ఎవరో లోపలికి వస్తున్నారని గమనించి ఇట్టే మాయమైనాడు.

లోపలికి విచిత్రమైన మేకప్‌లో, బట్టల విషయంలో ఏ మాత్రం ఆడంబరం లేకుండా (చిన్న వస్త్రాలంకరణతో) ఒక అమ్మాయి వచ్చింది. అందాల పోటీలలో ఏడవలేక నవ్వుతూ ఉండే అమ్మాయిలా ఉంది. తలుపు దగ్గరకి తోసి నన్ను అదోలా చూసి సోఫాలో కూర్చుంది. ఆ కూర్చున్నప్పుడు కష్టపడుతూ కులకటం ఒక కొత్త రకం ఫిసియో తెరపీలా తోచింది.

“నాకీ.. తెల్గు రాదు”, అని గొణిగింది.

“ఏమన్నారండీ?”

“సారీ.. మీతో మాట్లాడటంలేదన్న మాటండీ..”

“మరి?”

“నాలో నేను ప్రాక్టీస్ చేత్తన్నానండీ!”

అయిపోయింది. ఈ సమోసా గాళ్లు ఇక్కడికి అందరినీ నాబోటి సెల్ఫీ మాటగాళ్లనే శ్రమ పడి ఏరి తెచ్చినట్లున్నారు.

“దేనికి ప్రాక్టీస్? ఇక్కడేదైనా నాటక ప్రదర్శన ఉన్నదా?”

“అయ్ బాబోయ్ అలాంటిదేదీ లేదండీ!”

“మరి?”

“తెలుగు రాని వాళ్లు మాట్లాడినట్లు మాట్లాడాలంట సారూ!”

“ఎందుకు?”

“నా పేరు కనకమాలక్ష్మి సారూ!”

“వెరీ గుడ్.”

“కానీ ఇక్కడ ఇప్పుడు ఆ పేరు నడవదండీ.”

“మరి?”

“లకీ మీరా అని చెప్పాలన్నమాటండీ.”

“ఓ.”

“అదే దేశమండీ.. మల మల..”

“మలేషియానా కొంపదీసి?”

“అయ్యో అవునండీ.”

“అసలు ఏ ఊరు మనది?”

“అనకాపిల్లి.”

“శభాష్!”

“మీరేటండి?”

సన్యాసి నవ్వుతున్నాడని నాకు తెలుసు.

“ఏదో ఒకటి – పుస్తకం వ్రాసాననుకోవాలి.”

“ఓ మీరేనా? పుస్తకం నాకొకటిస్తారా?”

“ఉంటే కదా ఇచ్చేందుకు? ఇంతకీ ఇక్కడ నువ్వేం చెబుతావు?”

“ఏం సెప్పనండీ. తెల్గు రాదు అంటూ కొద్ది సేపు కులకాల సారూ.. అయినా ఈ పుస్తకం చదివించి మిల్లీమీటర్లా.. ఏమంటారు సారు?”

“మిలియన్లు”

“అద్దీ.. మిలియన్లు సంపాదించానని సెప్పాలన్నమాటండి.”

“ఎంత అన్యాయం? జనాలని మోసం చేస్తావా?”

చక్కగా నవ్వుతూ లేచి నిలుచుంది. ప్రాక్టీస్ కోసం వయ్యారం చూపించింది.

“సరిపోయిందన్న మాటండి సారూ?”

“చాలు చాలు.”

చక్కగా నవ్వింది.ఈ వ్యవహారాలన్నీ బాగా అలవాటుగా ఉన్నట్లుంది మలేషియా మల్లమ్మకి!

“కంగారు పడిపోతారేటీ? అసలా..”

“ఆ? అసలు?”

“ఓ మాటంటానండీ ఏమీ అనుకోరు కదా?”

“చెప్పు. బయట మటుకు.. ముఖ్యంగా మైకులో అనెయిబోక “

“సి సీ..”

కొద్దిగా దగ్గరకొచ్చింది. ఈ రోజుతో నా లెక్క మూసుకుందనిపించింది.

“ఇక్కడంతా మోసమే..”, రహస్యంలా అంది.

“కరెక్ట్!”

“ఓ మాటనుకుందామేటండి సారూ!”

“ఏంటది?” నా గొంతులో చిన్నగా వొణుకు ప్రారంభమైంది.

“నన్నో సారి మోసం చేసేస్తారేటండి?”

సన్యాసి నేల మీద పూర్తిగా పడిపోయి గుడ్లు బయటికొచ్చినట్లు అవతల కనిపిస్తున్నాడు!

(తదుపరి భాగం వచ్చే వారం)

Exit mobile version