[ప్రముఖ రచయిత శ్రీ వేదాంతం శ్రీపతిశర్మ రచించిన ‘మోసం చెయ్యటం ఎలా?’ అనే హాస్య వ్యంగ్య నవలని ధారావాహికంగా అందిస్తున్నాము.]
[కథకుడిని స్టేజ్ పక్కనున్న చిన్న గదిలో కూర్చోబెడతారు నిర్వాహకులు. బయట తన గురించి గొప్పగా మైక్‌లో చెబుతున్నవి, కథకుడికి వినిపిస్తూంటాయి. కథకుడి గురించి చెబుతూ, శ్రీ సన్యాసిరావు గారు రికార్డు స్థాయిలో అమ్ముడుపోయిన ‘నేను ఇక వ్రాయను’, ‘నేను ఎందుకు వ్రాయను’, ‘నేను ఎవరు’ అనే పుస్తకాల రచయిత అనీ, వారు ఎన్నో ప్రసంగాలు చేసియున్నారనీ, తమ సరస మోసగాళ్ల సాహితీ వేదిక, అనగా సమోసా సంస్థ ఇటీవల వారితో ఒక ఒప్పందం కుదుర్చుకుందనీ, ఆయనతో కలిసి తగు సేవలు అందించనున్నామని చెప్తారు. ఆ గదిలో కూర్చుని అంతా వింటూంటాడు కథకుడు సన్యాసిరావు. అంతలో అక్కడ కాషాయం రంగు సూటు, టై లో సన్యాసి ప్రత్యక్షమవుతాడు. ఏదో అనబోతుండగా తలుపు తీసుకుని ఎవరో లోపలికి వస్తుండడంతో మాయమైపోతాడు. ఓ విచిత్రమైన మేకప్‌తో కురచ దుస్తులతో ఓ అమ్మాయి లోపలికి వచ్చి సోఫాలో కూర్చుంటుంది. కథకుడిని చూసి, తనకి తెల్గు రాదంటూ గొణుగుతుంది. తెలుగు రాని వాళ్ళు మాట్లాడినట్లు మాట్లాడాలంటూ తనని ఇక్కడికి తీసుకొచ్చారు నిర్వాహకులని చెప్తుంది. అనకాపల్లి నుంచి వచ్చిన తనను మలేసియా నుండి వచ్చినట్టు చెప్పామన్నారనీ, తన పేరు కనకమహాలక్ష్మి అయితే, లకీ మీరా అని చెప్పమన్నారని చెబుతుంది. కథకుడు ఆశ్చర్యపోతాడు. మీరు రాసిన పుస్తకం చదివి మిలియన్లు సంపాదించాలని చెప్పాలట అని అంటుంది. వయ్యారం ప్రాక్టీస్ చేస్తుంది. తన్నోసారి మోసం చేయమంటుంది. సన్యాసి నేల మీద పడిపోయి కళ్ళు తేలేసినట్టు కనబడుతుంది కథకుడికి. – ఇక చదవండి.]
సమోసా ఉపాఖ్యానం (6)
గజేంద్రుడు మొసలితో చాలా కాలం పోరాడాడు. వాస్తవానికి భగవంతుడు చాలా ఆలస్యంగా వచ్చాడు. ఇక్కడ అలా జరగలేదు. నన్ను మోసం చేసెయ్యమని అంటూ ఈ ఆడు మొసలి మసలుకుంటున్న విధానం చూసి కిఞ్చిత్తు కలవర పడ్డ విషయం వాస్తవమే! ఈ అనకాపిల్లి పిల్ల ముందుకు దూకి పనిలో పనిగా ఒక సెల్ఫీ దిగినా చాలు – సీన్ కట్ చేస్తే ఖైదీలకు నా రచనలను వినిపిస్తూ కెమెరాకు దొరికే వాడిని! అటువంటి అవకాశానికైనా పనికొస్తానా అనే ఆలోచన కలిగింది. అదే సమయానికి ఈ వింత జైలు వద్దకు ఎవడో వచ్చాడు. తలుపు దగ్గర నిలబడి “కనకా.. అర్జంట్‌గా రా.. నిన్ను సారువారు ఒకసారి చూస్తారుట”, అన్నాడు. అతనితో గబగబా బయటకు వెళ్లిపోతూ తలుపు దగ్గర ఆగి ఓ చూపు చూసింది. పెదవులతో పళ్లను నొక్కుకుంటున్నట్లు ఓ చిరునవ్వు అందించింది. ప్రక్కనున్న నీళ్ల బాటిల్ చేతిలోకి తీసుకున్నాను. ఆ వచ్చిన వాడు ఏదీ పట్టించుకోవటం లేదు. ఈమె “బాయ్” అంటూ చేతిని కదిపింది. గిన్నెలు తోముతూ మహిళలు చేతిలోని నీళ్లను విదిలించుకునే విన్యాసం ముందుకు వచ్చింది. న్యాయమూ అదే! నన్ను చాలా మంది అలానే వదిలించుకున్నారు..
ఊపిరి పీల్చుకున్నాను. సన్యాసి కనిపించాడు.
“శిశువా”, అన్నాడు.
“యస్?”
“ఏమైనా అర్థమైనదా?”
“కనిపించిన ప్రతి దానినీ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉండదు సన్యాసీ!”
“నాకు అర్థమైనదానిని చెబుతాను.”
“చెప్పు.”
“ఆ యువతి బయటకు వెళుతూ చేతిని ఒక విధంగా కదిపింది.”
“కరెక్ట్.”
“ఆ విన్యాసాన్ని విశ్లేషించాలని అనిపించలేదా శిశువా?”
“అయిదు వేళ్లూ మృదంగ విద్వాన్ టైప్‌లో కదిపింది.”
“కరెక్ట్. అయినా నీకు కుదుపు రాలేదు శిశువా!”
“రాదు.”
“ఆ మాటే ఆ విన్యాసంలో అభినయించి చెప్పింది.”
“నో.”
“యస్. ఇక్కడే కాదు, మరెక్కడా నువ్వు దేనికీ పనికి రావని కళాత్మకంగా తన అంతిమ నిర్ణయాన్ని చాటింది.”
“ఇంకెక్కడా, దేనికీ అనేవి రెండు పదాలు వాడావు సన్యాసీ. నేనే అసలు దేనికైనా పనికొచ్చేవాడనైతే ఇక్కడెందుకుంటాను?”
“నిన్ను నువ్వు తక్కువగా అంచనా వేసుకుంటున్నావు శిశువా.”
“ఓ.”
“అవును. మీడియాలో ఎవరైనా కూర్చుందాం రండి సార్ అంటే నువ్వు ఏం చెబుతావు?”
“కరెక్ట్. నాది మజ్జిగ బాచ్ సార్ అంటాను.”
“అదీ సంగతి. నువ్వు ప్రతిభావంతుడివి అయినా చుట్టూతా చుట్లు తిరిగినా రహదారి మీదా పోలేవు. అలా అని డొంక దారి తొక్కి ఇదుగో వచ్చేసాను, అనలేవు. అంత అర్థం ఉంది ఆ విన్యాసంలో!”
“నేనే ఒప్పుకుంటాను.”
సన్యాసి కొద్దిగా దగ్గరగా వచ్చాడు.
“ఏదో విధంగా పది మందిలో గుర్తింపు పొందవచ్చు కదా? కొద్దిగా..”
“కొద్దిగా?”
“దగ్గరకి తీసుకుని ఆశీర్వదించవచ్చు కదా శిశువా!”
తలుపు చప్పుడైంది. సన్యాసి మాయమైనాడు. తలుపు రెక్కను ఎవరో చిన్నగా తోసారు. ఓ విదేశీ మహిళ లోపలికి వచ్చి తాజ్ మహల్‌ను చూసినట్లు ఆ గదినీ, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ గ్రాఫిక్స్‌తో సృష్టించిన వింత జంతువును చూసి విస్మయంతో పాటు అమితమైన సంతోషాన్ని పొందినట్లు నన్ను చూసి కళ్లు ఊడి పడేటట్లు పెద్దవి చేసి అది చాలదన్నట్లు నోరు కూడా పెద్దది చేసి మరీ తెరచింది.
“హెలో..” అంది.
నా ప్రస్తుత సమస్య సామాన్యమైనది కాదని స్పష్టమవుతున్నది. ఇది నిజానికి అంతర్జాతీయ సమస్య అని తేలిపోయింది!
(తదుపరి భాగం వచ్చే వారం)
వేదాంతం శ్రీపతిశర్మ కథా రచయిత. నవలా రచయిత. వ్యంగ్య హాస్య రచనలకు పెట్టింది పేరు. “ఆరోగ్య భాగ్యచక్రం” అనే పుస్తకాన్ని వెలువరించారు.
