[ప్రముఖ రచయిత శ్రీ వేదాంతం శ్రీపతిశర్మ రచించిన ‘మోసం చెయ్యటం ఎలా?’ అనే హాస్య వ్యంగ్య నవలని ధారావాహికంగా అందిస్తున్నాము.]
[తనని ఒకసారి మోసం చెయ్యమన్న కనకమహాలక్ష్మి మాటలు విని విస్తుపోతాడు కథకుడు. ఇంతలో తలుపు దగ్గరకి ఎవరో వచ్చి ఆమెను పిలవడంతో, బయటకు వెళ్తూ, కథకుడికి బై చెప్పి వెళ్ళిపోతుంది. అలా బై చెప్పడంలో ఆమె చేసిన చేతి భంగిమను చూసి, ఏవేవే గుర్తొస్తాయి కథకుడికి. మళ్ళీ సన్యాసి ప్రత్యక్షమవుతాడు. ఆమె చేతి భంగిమ ద్వారా నీకేమర్థమైందని కథకుడిని అడుగుతాడు. అయిదు వేళ్లూ మృదంగ విద్వాన్ టైప్‌లో కదిపిందని చెప్తాడు కథకుడు. అయినా నీలో ఏ కదలికా రాలేదని అంటాడు సన్యాసి. ఇక్కడే కాదు, మరెక్కడా నువ్వు దేనికీ పనికి రావని కళాత్మకంగా తన అంతిమ నిర్ణయాన్ని చాటిందని అంటాడు. ఇంతలో తలుపు చప్పుడవడంతో సన్యాసి మాయమవుతాడు. ఓ విదేశీ మహిళ లోపలికి వస్తుంది. కథకుడిని చూసి ఎందుకనో విపరీతంగా సంతోషిస్తూ ‘హెలో’ అని అంటుంది. తన సమస్య సామాన్యమైనది కాదనీ, అంతర్జాతీయ సమస్య అని కథకుడికి అర్థమవుతుంది. – ఇక చదవండి.]
సమోసా ఉపాఖ్యానం (7)
“హెలో” అన్నది ఆ ఫారిన్ యువతి.
“హలో” అని గమ్మునున్నాను. మొత్తానిని ఒక ఫారినర్‌ని లాక్కొచ్చాడు ఎలాగో అలాగ. ఇక్కడ కొద్దిగా ఖర్చు పెట్టినట్లున్నాడు.
“నాకూ తెల్గ్ వచ్చూను. ఐ.. లవ్..”
అంటుండగా సన్యాసి ఎక్కడినుండో వచ్చేసాడు. దాదాపు గాలిలో తేలుతున్నాడు. నన్ను చూసి కన్ను కొట్టేసాడు. నేను ఏదో అనబోయి నోరు తెరిచాను. ఆమె చెయ్యి అడ్డు పెట్టింది.
“లవ్ ద లాంగ్వేజ్.. మోసం చేయటం ఎలా.. వావ్!”
“ఇదే స్టేజ్ మీద చెబుతారా?”
“అంతే కాదు. నేను లండన్‌లో దీనికీ ఫ్రాంచైస్‌లో అందరీని మోసం చేస్తాన్..”
“శభాష్!”
“మీరూ.. ఏమీ చేస్తారు?”
సన్యాసి పెదాలు కొరికేసాడు.
“నేనూ..”
చెయ్యి అడ్డం పెట్టింది.
“గెస్ చేస్తాను. ..ఊ.. మేక్ అప్ ఆర్టిస్ట్! యస్?”
సన్యాసి చిన్నగా నృత్యం ప్రారంభించాడు.
“ఎందుకలా అనుకున్నారు?”
“ఈ గదిలోంచి మేకప్ వేసుకుని ఆమె వెళ్లింది రైట్?”
సన్యాసి నా భుజం మీద చెయ్యి వేసాడు.
“పిచ్చివాడా..”, మొదలెట్టాడు, “..ఒక రచయితకి ఇంతకంటే గౌరవం అక్కరలేదు. ఎన్నో చక్కని ఆలోచనలను చక్కగా సద్ది రంగులు అద్ది ఒక కథనో నవలనో తయారు చెయ్యటం లేదా? ఆలోచించు!”
“ఆ మాటలో అర్థం అది కాదు. ఆ అనకాపల్లి అప్పలమ్మను అలా తయారు చేసానని అర్థం.”
“శిశువా.. అది కూడా గొప్ప కళే!” అంటూ శాలువా కప్పుకున్నాడు.
“ఏమి? ఆలోచిస్తారు?” అని ఆమె అంటుండగా ఈ లోకంలోకి వచ్చాను.
“నో. నేను మేక్ అప్ మాన్‌ని కాను!”
“ఒ.కే. ఇంకో మాట అంటాను.”
“చెప్పండి.”
“ఊ..”, అక్కడున్న అట్టపెట్టెలని చూస్తోంది. తళుక్కున ఏదో మెరిసినట్లయి అంది, “..యస్! మీరు సమోసాలు చేసేస్తారు.”
“నో..”
“యస్! వెల్.. లేదా పంచీ చింపుతారు!”
“నో..”
“నాకీ రెండు చాలు. ఇస్తారా? లవ్.. సమోసా!”
సన్యాసి పళ్లికిలిస్తున్నాడు. “బాధపడకు. పంచిపెడతారు అనేందుకు పంచీ చింపుతారు అంటోంది. ఆ మాటకొస్తే గొప్ప సంవాదం వచ్చినప్పుడు చించేసారు అనుకోరా?” అన్నాడు.
“నో సన్యాసీ!”
“అలాక్కాదు శిశువా! బాధపడకు. రచయిత కూడా వండే వాడే! చక్కని వంట చేసి పది మందికీ గొప్ప ఆలోచనలను పంచి పెట్టి చించేసేవాడే కదా?”
“అలా అనటంలేదు సన్యాసీ!”
“మరేంటి?”
“నన్ను సప్లయి చేసేవాడంటోంది నేరుగా.”
“అస్సలు తప్పు లేదు శిశువా! ఎందరు రచయితలు వాళ్ల పుస్తకాలను వద్దన్నా అందరికీ సప్లయి చేయటం లేదు?”
“ఏంటి? ఆలోచిస్తూ.. యున్నారూ?”
ఈ లోకంలోకి వచ్చాను.
“నో నో.. నేను సమోసా అమ్మేవాడిని కాను.”
“ఓ! మరి? ఇప్పుడే సన్యాసీ అన్నారు?”
“ఓ.. అదా? నన్ను నేను అలా అనుకుంటాను!”
“ఎంత ఆచారమూ?”, అంటూ తన విగ్ తీసేసింది.
ఆ తల మెరుస్తున్న హెలిపాడ్‌లా గోచరించి “ఆశ్చర్యం” అని సవరించుకున్నాను.
“ఇదేంటి?”, అడిగాను.
“నేనూ.. నేను కూడా నిజానికీ.. సన్యాసి.. లేడీ సన్యాసి.. అంటే యు సీ.. మాదీ లేటెస్ట్ ఆశ్రమ్ – “సున్నా నున్న శాంతి ఆశ్రమ్!” చెయ్యి అడ్డం పెట్టి ఆపేసాను. సన్యాసినిని అనే మాటకి మరేదో అనెయ్యగలదని అర్థమయింది.
సన్యాసి తన శాలువాని నెత్తి మీద ముసుగులా కప్పుకున్నాడు. కొద్దిగా తెరచి “శిశువా! నీలాంటి సన్యాసికి భగవంతుడు ఇక్కడ జోడీగా పెట్టాడు.” అన్నాడు.
ఆ నున్న యువతి పళ్లికిలిస్తోంది అర్థమైనట్లు! సనాతన ధర్మం యొక్క వినూత్నమైన అవతారం కిఞ్చిత్ అబ్బురపరచింది!
(తదుపరి భాగం వచ్చే వారం)
వేదాంతం శ్రీపతిశర్మ కథా రచయిత. నవలా రచయిత. వ్యంగ్య హాస్య రచనలకు పెట్టింది పేరు. “ఆరోగ్య భాగ్యచక్రం” అనే పుస్తకాన్ని వెలువరించారు.
