[ప్రముఖ రచయిత శ్రీ వేదాంతం శ్రీపతిశర్మ రచించిన ‘మోసం చెయ్యటం ఎలా?’ అనే హాస్య వ్యంగ్య నవలని ధారావాహికంగా అందిస్తున్నాము.]
[గదిలో ఉన్న కథకుడిని, అక్కడికి వచ్చిన ఫారిన్ యువతి హెలో అని పలకరిస్తుంది. హలో అని పలకరించి, మౌనంగా ఉంటాడు కథకుడు. మొత్తానికి ఓ విదేశీ వనితని తెచ్చినట్టున్నారు నిర్వాహకులు అని అనుకుంటాడు. నాకూ తెల్గ్ వచ్చూను అంటుందామె. ఇంతలో అక్కడ సన్యాసి ప్రత్యక్షమవుతాడు. తనకి తెల్గ్ భాష ఇష్టమనీ, ‘మోసం చెయ్యటం ఎలా, వావ్’ అనీ అంటుంది. ఇవే మాటలు స్టేజ్ మీద చెప్తారా అని అడుగుతాడు కథకుడు. స్టేజ్ మీద చెప్పడమే కాదు, లండన్‌లో ఓ ప్రాంచైజీ ఏర్పాటు చేస్తానని అంటుందామె. మీరేం చేస్తారని కథకుడిని అడిగి, అతన్ని ఆగమని చెప్పి, తానే ఊహించి చెప్తానని అంటుంది. మొదట మేకప్‌మ్యాన్‌వి అంటుంది. ఆమె మాటలకి వివరణ అందిస్తాడు సన్యాసి. తాను మేకప్‌మ్యాన్‌ని కాదంటాడు. అక్కడున్న సమోస పెట్టెలని చూసి, సమోసలు తయారు చేసేవాడని అంటుంది. మళ్ళీ కాదంటాడు కథకుడు. అయితే, పంచీ చింపుతారని అంటాడు. అది కూడా కాదంటాడు. సన్యాసి పళ్ళికిలిస్తూ, ఆమె ఉద్దేశాన్ని వివరిస్తాడు. సన్యాసితో మాట్లాడుతూ, సన్యాసి అన్న పదం గట్టిగా అనడంతో, ఆ పదం విన్న ఆ విదేశీ యువతి, తన విగ్ తీసేసి, తానూ సన్యాసినినే అని, తమ ఆశ్రమం పేరు చెప్తుంది. కథకుడు విస్తుపోతాడు. – ఇక చదవండి.]
సమోసా ఉపాఖ్యానం (8)
ఆ ఫారిన్ యువతి లటుక్కున లేచింది. నా కుర్చీకున్న చేతులను గట్టిగా పట్టుకున్నాను. ఎవరో ఉన్న పళంగా ఆమె నడుము మీద వెనుక గట్టిగా తన్నినట్లు తన రెండు చేతులూ ఒక్క సారిగా ఆకాశంలోకి విసిరేసి ఊర్మిళా మాతోండ్కర్‌లా నా కళ్లల్లోకి చూసింది. ఆంజనేయస్వామిని తలచుకుని ‘తుమ్ రక్షక్ కాహూకో డర్నా’ అనుకున్నాను. ఇంతలోనే బొంగరంలా గిరగిరా తిరిగింది. నేను ఎవరినో తెలుసుకోవాలంటే ఇలాంటి విన్యాసం చెయ్యాల్సి ఉంటుందని నాకు ఇప్పటివరకూ తెలియదు! నేల మీద కూలబడి ఎడమ కాలు అటు చివరకీ, కుడి కాలు ఇటు చివరకీ – అంటే దాదాపు తలుపు వరకూ పోనిచ్చి మెడ ఒక్కసారిగా బెణికి పాటుగా వీపు కూడా పట్టేసినట్లు నా వైపు తిరిగి ‘శ్రీ 420’ చిత్రంలో నాదిరా ‘ముడ్ ముడ్ కే నా దేఖ్ ముడ్ ముడ్ కే’ అంటూ రాజ్ కపూర్‌ని చూసినట్లు చూసింది. కళ్లల్లో కసిని నింపేసి పెదాల మీద నవ్వు నా వైపు కుళ్లిన టమాటా పారేసినట్లు పారేసింది.
టీ పాయ్ మీద సన్యాసి ప్రత్యక్షమైనాడు.
“నన్ను నువ్వే కాపాడాలి”, అన్నాను.
“శిశువా! భయపడకు! ఈమె రషియన్ ప్రాంతం నర్తకీమణిలా ఉన్నది. అభ్యాసం చేస్తోంది. స్టేజ్ మీద ఇలాంటి ప్రదర్శన కూడా ఉన్నట్లుంది.”
“అడ్డమైన వాళ్లందరి అభ్యాసాలూ, విన్యాసాలూ నాతోనే ఎందుకు సన్యాసీ?”
“మరి? అందరి అన్ని విన్యాసాలూ చూసేసి తన ఆత్మలోనే ఈశ్వరుని అసలు విన్యాసాన్ని దర్శించేవాడు అసలు సన్యాసి శిశువా!”
“కరెక్ట్.”
“మరి? ఈ చిన్ని విన్యాసానికే భయపడితే ఎలా?”
“చిన్ని విన్యాసమా? ఏం జరగబోతోందో అర్థం కావటం లేదు సన్యాసీ!”
“సృష్టి సంకల్పం వెనుకే ఏ ఆలోచనా లేదు ఈశ్వరునికి. అందుచేత దేనినైనా అర్థం చేసుకునే ప్రయత్నం కూడా పూర్తిగా నిరర్థకం శిశువా.. ఎక్కువ కాదు, కొద్దిగా ఆలోచించు!”
“ఆలోచనే ఉంటే నన్ను నేను ఈ పరిస్థితిలోకి తెచ్చుకుంటానా సన్యాసీ?”
“నో శిశువా! కాలం కాకరొత్తు మీద నిప్పు లాంటిది. అలా జరిగిపోతూ ఉంటుంది.”
“కరెక్ట్!”
“అంతే కాదు. కరిగిపోతూ ఉంటుంది కూడానూ!”
“జరగటం, కరగటం కాదు సన్యాసీ! ఈ పిచ్చిమాలోకాన్ని చూస్తే గుండె ఆగిపోయి తన బరువును ప్రకటిస్తున్నట్లుంది!”
“నో. వెలుగుతున్నంత సేపూ కాకరొత్తు మీది వెలుగును ఆస్వాదించు శిశువా! ఆనందం పరబ్రహ్మేతి..” అంటూ మాయమైనాడు సన్యాసి!
ఈ నున్నది టక్కున లేచి ఓ చిన్న కూచిపూడి ముద్ర పెట్టింది.
“ఎలాగా యున్నదీ?”, కళ్లు గిరగిరా తిప్పి అడిగింది.
“భయ.. లేదు, చాలా బాగున్నది.. నీ పేరేమి ఈంతకీ?”
“వోంద్రా”, అంటూ వెనక్కి వాలి గోడని తన్ని మరల గుండ్రంగా తిరిగింది. నేను తేరుకునే లోపల నా రెండు చేతులూ పట్టుకుని ఒక్క లాగు లాగింది. ఆమె గోడ మీదకీ, నేను ఆమె మీదకీ..
సన్యాసి కళ్లు మూసుకుంటూ గోడలోకి వెళ్లిపోతూ కనిపించాడు.
“వోంద్రా..”, చిన్నగా మూలిగాను, “..నన్నొదిలెయ్! నాకు ఇవన్నీ చేతకావు. నేను పూర్తి స్థాయి సన్యాసిని.”
“నో.. మీ పేరేమి సన్యాసీ?” అంటూనే నన్ను ఓ తిప్పు తిప్పేసి ఉన్న పళంగా చంద్రుని మీదకి పంపే పని చేసేసింది. ఆ పనికి తల తిరిగి ఏవో లోకాలను దాటించే ఉచిత ఎయిర్ క్రాఫ్ట్‌లో కూర్చున్నట్లయింది! ఆ అనుభూతిలో తేలిపోతూ ఉన్నప్పటికీ గ్రుడ్లు తేలేసి నిలదొక్కుకుంటున్నాను!
“నా పేరు సుందర్”, అన్నాను, నేనూ ఓ మనిషినే అనే వాగర్థాన్ని ప్రకటిస్తూ..
“ఓకే!..”, అరిచింది వోంద్రా, “..సూపర్! అయాం వోంద్రా, యూ ఆర్ సూంద్రా.. సూపర్!”
ఇలాంటి చోట, ఇలాంటి మనిషితో ఇంత గుండ్రంగా తిరిగే తిరగలి పార్ట్‌నర్ నాకు దొరకగలదని ఈ దేశంలోని అత్యుత్తమమైన జ్యోతిష్కుడు నాకు చెప్పగలగటం కాదు, తన కలలో కూడా ఈ జన్మలో ఊహించి యుండడు.
“కమాన్..”, అంటూ నా కుడి కాలును రేలంగి సావిత్రి కాలుని తొక్కినట్లు తొక్కింది. చేతులు వదిలించుకుందామంటే వేళ్ల మధ్యలో వేళ్లు పెట్టి ఏకంగా ముష్టియుద్ధం చేస్తోంది. ఈ నృత్య విన్యాసం బలవంతపు మల్లయుద్ధానికి మారు పేరులా గోచరించింది.
నా ఎడమ కాలును ఎందుకైనా మంచిదని ఓ అడుగు వెనక్కి లాగి తప్పించుకునే ప్రయత్నం చేసాను. చేతి వేళ్లు ఇక సుత్తితో కొట్టినా వంగే పరిస్థితి ఇప్పటి భవిష్యత్తులో రాబోదన్న విషయం అప్పటికే నిర్ధారణ అయిపోయింది. కాకపోతే నేను ఊహించనిది, జరగకూడనిది, అలా జరిగి ఊరుకుంది. నా బాలెన్స్ తప్పి ఇక క్రింద పడబోతున్నానని అర్థమైంది. ఆ సమయంలో ఆమెకు ఎందుకో చిత్రమైన ఆనందం కల్గుతున్నట్లనిపించింది.
“సూపర్! మా ఆశ్రమంలో సీనియర్ సన్యాసి ఒకరు ఇలాగే డాన్స్ చేస్తారు.. కమాన్!” అంది. నాకు అంతమటుకే వినిపించింది, అర్థమైంది. ఈ లోకంలోకి రాగానే నేల మీద బోర్లా పడ్డట్లు నిర్ధారించుకున్నాను. నా మీద వోంద్రా పడ్డట్లు కూడా తెలుస్తున్నది. కానీ ఏ భంగిమలో ఆ ప్రక్రియను ప్రవేశ పెట్టిందో ఆలోచనకు అందలేదు. ఆ పడుతున్నప్పుడు గట్టిగా అరచినట్లు, ఇప్పుడు కూడా అరుస్తున్నట్లు పి.టి.ఐ వారి భోగట్టా లాగా మనసుకు అర్థమవుతున్నది! గరుత్మంతుని పంజాలో ఇరుక్కున్న పాము ఆఖరి పోరాటం నిమిత్తం నోరు తెరచినట్లు అలా నోరు తెరిచాను.. వాస్తవానికి అదే తెరుచుకునిపోయింది! నా కళ్ల ముందు మూసి యున్న తలుపు అంచు జరుగుతున్నది. తలుపు ఎవరో నెడుతున్నారని విదితమైనది. నేల మీద కనిపించినంత మేరకు ఆడువారి చెప్పులు దర్శనమిస్తున్నాయి. ఆ వచ్చినామె కెవ్వున కేక పెట్టింది..
“అయ్ బాబోయ్!”
వచ్చినవారు అనకాపల్లి అని అర్థమైంది. ఐనదేమో ఐనది.. పాట ఎవరో స్టేజ్ మీద పాడుతున్నారు. నా నడుము ప్రాంతంలో ఏదో ఎముక ఇక మూస్కుంటున్నట్లు నొప్పి సంకేతాలు వస్తున్నాయి. ఎదురుగా తలుపు మీద సన్యాసి వివేకానందునిలా చేతులు కట్టుకున్నాడు.
“అరైజ్, అవేక్..”, అంటున్నాడు!
(తదుపరి భాగం వచ్చే వారం)
వేదాంతం శ్రీపతిశర్మ కథా రచయిత. నవలా రచయిత. వ్యంగ్య హాస్య రచనలకు పెట్టింది పేరు. “ఆరోగ్య భాగ్యచక్రం” అనే పుస్తకాన్ని వెలువరించారు.
