[శ్రీ ఎరుకలపూడి గోపీనాథరావు రచించిన ‘మృత్తికా స్తోత్రం’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]
మట్టిని ఆరాధిస్తూ
నన్ను నేను సంస్కరించుకుంటుంటాను!
మట్టి కృపతో
మట్టి మంచితనం
నాకొక్కింత ప్రాప్తించాలని
మట్టిని మనసారా అర్చిస్తుంటాను!
సృష్టి ఆరంభం నుండీ
మట్టితో ఏర్పడిన గట్టి బంధాన్ని
మనిషి విస్మరించ కూడదు!
తాను లేని యుగాలున్నా
మట్టి లేని యుగమే లేదని
మానవుడు మరవడం తగదు!
మట్టి
ప్రాణికి జీవనాధారం!
మట్టి మనస్సు
మహోపకార గుణ రత్నాకరం!
నిర్జీవిని కూడా
తన ఒడిలోకి చేర్చుకొని
తగు విశ్రాంతిని అందించే
మట్టి కణం కణం
అతులిత ప్రేమ అగారం!
మట్టిని
నుదుటి తిలకంగా దిద్దుకొని
నేల తల్లి కూర్చే మేలును స్మరిస్తూ
కృతజ్ఞతా పూర్వక వందనాలనర్పించడం
మనిషితనానికి చిహ్నం!
బ్రహ్మాండ భాండంలో
శతకోటి గ్రహాల కుటుంబంలో
మట్టిగల మహీతలానికే
ప్రాణిలోకంగా మారే
భాగ్యం దక్కడం ఎంతో ఘనం!
దివినంటే దివ్య హర్మ్యాలకూ
మట్టి పునాదే ఆధారం!
దివిజులు భువికి దిగదలిచినా
మట్టి స్పర్శ అనివార్యం!
మట్టితో
మట్టిబొమ్మలతో
క్రీడించి ఆనందించకుండా…,
మట్టి రుచిని ఇష్టంగా
ఆస్వాదించకుండా..,
మట్టి మరకలనంటించుకొని
హర్షించకుండా
మనిషి బాల్యముంటుందా?
బాల గోపాలుని చిత్తానికీ
ఈ చర్యల చవి తెలియడం
మట్టి గొప్పతనం!
తొలకరి జల్లులో స్నానించిన
మట్టిదెంత మధుర పరిమళమో కదా!
వేడుకను కూర్చే
సౌరభాన్ని వెదజల్లే
అందాల రంగుల విరులన్నీ
మృత్తికా మహిమావిష్కర్తలే !
ప్రాణుల పరిరక్షణకై
పల్లవించే పచ్చందనాలన్నీ
మట్టి ప్రశస్తికి ప్రచారకర్తలే!
విష్ణు వక్ష స్థలాన్ని చేపట్టి
భూదేవి,
శ్రీ రాముణ్ణి వరించి
నేలపట్టీ
మట్టి మహత్వాన్ని
ముల్లోకాలలోనూ చాటడం
అద్వితీయ అద్భుతం!
అనిర్వచనీయ మహాద్భుతం!
సారవంతమైన మట్టి లేని
తలము
నిర్జల, నిర్జన, నిరూపయోగ
స్థలము!
మన్ను
సప్త పాతాళాల మనుగడకు
దన్ను!
ఇంధన నిధియై,
ఖనిజ సంపద పెన్నిధియై
మట్టి గర్భమొనరించే హితం
అపరిమితం!
మాలిన్యాలను తొలగిస్తూ
మాణిక్యాలను పొందే విద్యను
మట్టి బోధిస్తుంది !
ఎన్నెన్ని మార్లు
ఎన్నెన్ని విధాలుగా ఉపయోగించబడినా
మరల మరల తన పూర్వ స్వరూపాన్ని,
పునర్వినియోగ స్వభావాన్నీ
మట్టి సాధిస్తుంది!
మట్టిని అసహ్యించుకునే వారికీ,
మట్టిని అలక్ష్యించే వారికీ
మట్టిలోకే చేరవలసిన
తరుణం తప్పక వస్తుంది!
కుమ్మరికి
కృషీవలునికీ,
మంచి నీటి కుండకు
కూజాకూ,
పూలకుండీకి
నీటి తొట్టికీ,
ఉట్టి లోని చట్టికి
పర్వదిన దీప ప్రమిదలకూ,
సంప్రదాయ పాక పాత్రలకు
పేదల పాకల గోడలకు
బీదల ప్రొయ్యికీ తెలుసు
మట్టి విలువ!
మేలుజేసే మట్టి ప్రేమ చలువ!
విశ్వ కళ్యాణ యాగ వాటికలతో
ధార్మిక కార్యాచరణలతో
పవిత్ర జల ప్రవాహా లతో
పుణ్య క్షేత్ర సముదాయాలతో
సతత హరిత అభయారణ్యాలతో
సస్య కేదార సమాహారాలతో
ఫల పుష్ప ప్రాంతాలతో
రాజిల్లుతూ
సంతసిస్తూ
సంతృప్తి చెందవలసిన
రత్నగర్భ మృత్తికా హృదయం
రణ రంగాలతో
రక్త తరంగాలతో
తడిచి ముద్దై
వేదనతో తపించడం
ఎంతటి ఘోర మానవాపరాధం!
ఎంతటి నిష్కృతి లేని పాపం!
తమ అపచారాలను మన్నించమంటూ ,
సద్భుద్ధిని ప్రసాదించమంటూ
పొర్లు దండాలు పెడుతూ
మానవులు మట్టిని ప్రార్థించాలి!
మట్టి మహత్వాన్ని సదా కీర్తించాలి!
