Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

ముల్లును ముల్లుతోనే..!!

[శ్రీ సముద్రాల హరికృష్ణ రాసిన ‘ముల్లును ముల్లుతోనే..!!’ అనే గల్పికని పాఠకులకు అందిస్తున్నాము.]

ముదిమి మీద పడ్డదేమో, ఈ మధ్య రాజుగారు రెచ్చిపోతున్నారు.

రాజు గారంటే రాజు లాంటి, రాజులా తనను తాను భావించుకుని పొంగిపోయే శాల్తీ అనుకోండి. తాను ఏది కోరితే అది జరగాలనే మొండి ఘటం!

మామూలుగా అంటూంటారు, “రాజు కన్నా మొండివాడు బలవంతుడు”, అని! ఇతగాడిది రాజులాంటి పదవీ, పైగా శతమొండీ!

ఇక ఎంత బలవంతుడో ఊహించుకోవచ్చు!  అగ్రరాజ్య అధినేత. బోలెడు సైనిక, ఆయుధం బలం.

పెద్ద దేశానికి నాయకుణ్ణని పొగరే కాదు, దానికి తగిన మోతాదులో తిక్క కూడా ఉందేమోనని ప్రపంచ ప్రజల అనుమానమో, నమ్మకమో!

ప్రపంచ శాంతిస్థాపకుణ్ణి అంటాడు కొన్నిరోజులు, అదే పనిగా!

ఇంకా ఆలశ్యమేమిటి ‘శాంతిస్థాపనాచార్య’, బిరుదు నాకు ప్రకటించరేఁ అని విస్తు పోతాడు.

మరీ రాను రాను దేశాలన్నీ ఇంగితం కోల్పోతున్నాయ్ అని దుయ్యబడతాడు ఉన్నట్టుండి.

మీ మధ్యలో ఉన్న నాలాంటి గొప్ప వాణ్ణి గుర్తుపట్టండయ్యా అని హెచ్చరిస్తాడు, మొహమాటాన్ని గాలికొదిలేసి!

రాజుగారికి వెర్రి ముదిరిందని అందరికీ తెలిసినా, ధైర్యం చేసి చెప్పే మొనగాడేడీ?!

అసలే రాజుగారు! పైగా తిక్క ముదిరినట్టు స్పష్టంగా తెలుస్తోంది.

ఇక అడుగు ముందుకేసి నిజం చెప్పే సాహసం ఎవ్వరూ చేయలేకపోయారు, ఆ దేశంలో.

చివరికి తమ మెడ మీదకే వస్తుందని వారి భయం కాదు, ఘాట్టి విశ్వాసం!

***

పొరుగు రాజ్యాల వారికి ఇంకో బెడద కూడా వచ్చి పడింది ఈ తిక్క రాజుతో.

ఏ రాజ్యంలో ఏది బాగున్నా, ఏ సంపద దండిగా ఉన్నా, అది నాకు కావాలి తెచ్చి ఇవ్వండి, రాసి ఇవ్వండి అని గోల మొదలెట్టాడు ఇటీవల, ఆ యా దేశాధినేతలలో కలవరం పుట్టిస్తూ!

కలవరం ఎందుకూ అంటే, ఎంత ముసలి రాజైనా సైనిక బలం, ఆయుధబలం, టెంపరితనం – బోలెడంత అతగాడికి. కాబట్టి మాట వినకపోతే, యుధ్ధానికి తరలి వచ్చినా వస్తాడు. అది తమ ఉనికికే  ప్రమాదకారి, అందుకూ!

పోనీ అట్లా కాదు, అతగాడి మాట విందామా అంటే, విని అడిగినవన్నీ గమ్మున అప్పచెప్పేస్తే, వారికేం మిగులుతుందీ, వారి ప్రజకేం బదులు చెప్పుకుంటారూ?!

పైగా అప్పనంగా వచ్చేవి కాబట్టి “ఇంకా తే, ఇంకా తే” అనే ప్రమాదమూ దాగి ఉన్నది ఇందులో.

అందుకే “ఇది మేం ఒప్పుకోం”, అని నసుగుతున్నారు, గొణుగుతున్నారు, గుడుసుళ్ళు పడుతున్నారు!

పైకి మేకపోతు గాంభీర్యం! లోలోపల కుతకుత లాడుతున్నారు వీడెవడు మా సార్వభౌమత్వాన్ని కాదనే నాగన్న అని!

ఒకచోట నగల నిల్వలున్నాయని, అవి నాకు కావాలి అంటాడు. ఒక చోట చమురు నిక్షిప్తాల గురించి డిమాండు చేస్తాడు. ఇంకో దేశంలో ఖనిజ సంపద ఉన్నదని, అదీ నాకు కావాలంటాడు.

ఇంకో చోట మీరొఠ్ఠి అమాయకులు, మీకేమీ తెలియదు. మిమ్మల్ని పాలించి మీ అందరినీ పైకి తెస్తానని, అక్కరకు రాని, అవసరం లేనీ హామీలిస్తాడు.

ఈ వింత పోకడలూ, ఈ తరహా రావణ వైనమూ, దురాక్రమణ పద్ధతీ, ఒక పెద్ద రాజ్యం అవలంబించటంతో, ప్రపంచం మొదట నివ్వెరపోయింది. తరువాత పరోక్ష హెచ్చరికలు చేసింది. ఫలితం శూన్యం.

ఏమిటా పరిష్కారం అని అన్ని దేశాలూ తలలు పట్టుకున్న వేళ, ఒక విచిత్రం జరిగింది, అనూహ్యంగా, అనుకోని వ్యక్తి నుంచి, ఒక సుదూర స్థావరంలో!

***

ఎన్నాళ్ళ నుంచో తాను లాక్కోవాలనుకున్న ఓ ద్వీపానికి, పర్యవేక్షణకో పర్యాటనకో బయలుదేరాడు T. రాజు, అనగా తిక్క రాజు.

తిక్కా, వెర్రీ సమానార్థకాలేగా?!

ఔనౌను ఒకే కుదురు, ఏం ఫర్వాలేదు ఈ సందర్భంలో- Interchangeables, proceed!!

వెంట బోలెడు మందీ మార్బలమూ, రక్షణ కోసం పెద్ద ఫౌజు, రాజావారి పోజూ- అన్నీ తరలివెళ్ళినై, ఆర్భాటంగా!

ఆ దేశ ప్రజలూ, ఈ ద్వీపవాసులతో పాటు ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తోంది, ఏమౌతుందో అని!

“ఇక రేపటి నుంచీ నాదే.. అనగా మా దేశానిదే, ఈ ద్వీపం”,  అని అక్కడే ప్రకటించేస్తాడీ వెర్రిప్రభువని చాలా మంది ఊహ, అనుమానం, నమ్మకం, భయం – అన్నీనూ!

***

పర్యటన అంతా సజావుగా సాగింది, విందులు మర్యాదలు ఘనంగా చేశారు, ద్వీపాన్ని ఏలుతున్న వారు భయంభయంగా! రాజు గారు బహుత్ ఖుష్ హువా!

తిరుగు ప్రయాణానికి విమానం దగ్గరకు బయలుదేరాలి. ద్వీప ప్రధానమంత్రి పెద్ద మహలు లాంటి తన భవనం ముందు, ద్వీప మిలిటరీ వందనం అతిథియైన వెర్రి రాజు గౌరవార్థం ఏర్పాటు చేశాడు.

ఒక్కొక్క అధికారినీ కలిసి షేక్‌హ్యాండ్ ఇస్తూ వస్తున్నాడు తల ఊపుతూ చిరునవ్వు వెలిగిస్తూ మన మారాజు, ఆ ద్వీప ప్రధాని మర్యాదపూర్వకంగా పరిచయం చేస్తుంటే తన ఉన్నతాధికారులను.

ఇంతలో ఎవ్వరూ ఊహించని సంఘటన చోటు చేసుకుంది అక్కడ, అందరినీ నిశ్చేష్టులను చేస్తూ!

వెనకాల ఉన్నవరుసలోని సామాన్యమైన భటవర్గంలోని ఒకసైనికుడు తన గన్ను తిరగేసి బట్‌తో ఎక్కుపెడుతూ, పరుగుపరుగున వెర్రి రాజు దగ్గరికి అమాంతం దూసుకొచ్చి ఇకిలిస్తూ, “హాయ్ ప్రెసిడెంట్ ఎట్లా ఉన్నారు?! నా పేరు శామ్సన్, నీ పేరు థామ్సన్, చాలా బాగుంది. ఒకే అక్షరం తేడా. అందుకే, నువ్వూ నేనూ సమానమే, అవునా కాదా చెప్పూ, ఊఁ..”, అంటూ అరవసాగాడు!

“మీ టై అద్భుతం, నాకు నచ్చింది నాకిచ్చేయండి. మీ కోటు బ్రహ్మాండం, విప్పండి ముందు, మీకు పెన్నెందుకు, పెట్టండి నా చేతుల్లో, షూసూ సాక్సూ గొప్పగా ఉన్నాయ్, తీసి ఇవ్వండి! ఊఁ క్విక్”, అన్నాడు కూడా రెట్టిస్తూ.

పైగా మహాప్రభువుల ‘టై’ లాగటానికి మీదిమీదికి వెళ్ళసాగాడు!

వేళ్ళాడుతున్న వరకే అందం కానీ, ‘టై’ ని లాగి బిగిస్తే ఘటానికే ఎసరు కదూ, పాపం!

ఆత్మహత్య ప్రప్రథమంగా బలవంతాన చేయించనట్లై పోదూ?! ఎంత ప్రమాదం! అవును, కాదు మరీ?!

అందుకేనేమో, అట్లాంటి అనర్థం ఏదీ జరగక ముందే, ఒక్క ఉదుటున వచ్చి రాజుగారి రక్షణసిబ్బందీ, ద్వీప సైన్యమూ, మీదబడి, అతనిని లాక్కెళ్ళారు వెనక్కి.

అందరూ విస్తుపోయి కొంత భయంతో చూస్తూ నిల్చుండి పోయారు ఆ హఠాత్సంఘటనను.

ద్వీప ప్రధాని వంగి వంగి క్షమాపణలు చెప్పసాగాడు.

క్షణం కాలం బిత్తరపోయి చూస్తూ, అవాక్కై నుంచున్నాడు వెర్రి రాజు, తల గోక్కుంటూ!

తల లోని వెర్రికి మందు తగిలిందో ఏమో, గమ్మున వెళ్ళి విమానంలో తుర్రుమన్నాడు తన దేశానికి, దారిలో కూడా కిమ్మనకుండా కూచుని.

***

ఆ దూసుకొచ్చిన సైనికుడు చాలా క్రమశిక్షణ గల సైనికుడనీ, గతంలో ఎటువంటి మచ్చా లేని నిష్కళంక చరితుడనీ, దేని ప్రేరణ వల్లో అతనిలో ఆ ఆకస్మిక మార్పు కలిగి, తాత్కాలిక చిత్త చాంచల్యం ఏర్పడి ఉండవచ్చని నిపుణుల సంఘం ఇచ్చిన నివేదిక సారం అని తరువాత తెలిసింది.

ఏదైనా ప్రత్యేక/అసహజ వస్తువునో, వ్యక్తినో చూసిన కారణమే ఆ చిత్తచాంచల్య ప్రకోప కారణమై యుంటుందని వారు తేల్చారని కూడా ద్వీప అధికారులు వారం తరువాత విడుదల చేసిన ప్రకటన ద్వారా బయటకు వచ్చింది!

ఇంకా నిపుణులైన డాక్టర్లూ, మానసికశాస్త్ర కోవిదులూ అతనిని  విచారిస్తున్నట్లు కూడా భోగట్టా.

అదేమీ కాదు.. అదంతా అతని నాటకకళా ప్రదర్శనా నైపుణ్యమనీ, అద్భుతంగా ప్రాణాలకు తెగించి నటించిన కళావతంసుడనీ అన్నవారూ లేకపోలేదు.

అతనిని అఖండ దేశభక్తుడిగా ప్రకటించి అత్యుత్తమ బిరుదు ఇవ్వాల్సిందే అని కొన్ని సంఘాల గట్టి డిమాండ్ ఆ ద్వీపంలో, అని కూడా తెలియవచ్చింది, నెమ్మది మీద!

ఒకే సంఘటన, ఒక్కోళ్ళు చూసే కోణం అట్లా ఉంటుంది, లోకం తీరే అంత కాదూ!

ఇక రాజుగారి స్వదేశంలో ఈ లోపలే ప్రతిపక్షాల వాళ్ళూ, వెర్రి రాజంటే గిట్టనివాళ్ళూ,దేశంలో ప్రచారం మొదలెట్టేశారు — ‘తన కోవ వాడిని చూడగానే ఆ సైనికుడిలో నిద్రాణమైన వెర్రికాయ పండి బయటపడిందంటూ, అదే అతని ఆ విపరీత ప్రవర్తనకూ మూలమ’నీ– ఇంకా అనేకంగా, చిలవలు పలవలుగా దేశంలో కారణాలు,సిధ్ధాంతరాధ్ధాంతాలు చలామణీ అయ్యాయి నెల తిరక్కుండానే!

ఇంకా లోకంలో ఇట్లా ఎంతమంది బయటపడతారో, ఈ అధ్యక్షుణ్ణి చూసి – దేశానికే కాదు ప్రపంచానికే ప్రమాదం ఇతను పదవిలో కొనసాగటం; కనుక వెంటనే రాజీనామా చేసి మతిస్థిమితం కోసం చికిత్సకు వెళ్ళిపోవాలని వివిధ రాష్ట్రాల్లో ధర్నాలు కూడా బయల్దేరదీశారు, ఉన్న పళాన!

***

ఇక ఆ తరువాత ఎన్నడూ ఆ రాజు, “ఇది బాగుంది నాకిచ్చేయండి,అది నచ్చింది నేను తీసుకుంటాను”, అని దేన్ని గురించీ, ఎవ్వరినీ బెదిరించ లేదట!

తరువాత అతి కొద్దికాలంలోనే అతను పదవీచ్యుతుడై తన ఏకాంత ద్వీపానికి వెళ్ళిపోయాడు, ఆట్టే హంగామా చేయకుండా!

ప్రపంచం మొత్తం కాస్త నెమ్మదిగా ఊపిరి పీల్చుకుంది, కొన్నేళ్ళ మానసికమైన ఒత్తిడి తరువాత!

***

కానీ..

ఆశ్చర్యం! కాదు కాదు, హాశ్చర్యం! మహదాశ్చర్యం!

ఈ సంఘటన ద్వారా తేలి వచ్చిన విషయం!

లోకంలో వెర్రికి వెర్రే మందేమోనని?!

ముల్లును ముల్లుతోనే తీయాలన్నట్టు!

ఔననటానికీ, కాదనటానికీ మనమేపాటీ?!

తిక్కా, వెర్రీ రెండూ లేని సామాన్యులం!

నిస్సహాయులమైన–

‘పుర జనులం’,

‘అజ సములం!!’

Exit mobile version