[డాక్టర్ రొంపిచర్ల భార్గవి గారి ‘నా చదువు కథ’ పై విశ్లేషణా వ్యాసం అందిస్తున్నారు డా. వేమూరి సత్యవతి.]
డిసెంబర్ 2025 లో బదరీ పబ్లికేషన్స్ లో వచ్చిన ఒక మంచి పుస్తకమే డాక్టర్ రొంపిచర్ల భార్గవి గారి రచన ‘నా చదువు కథ!’
గత కాలపు మధుర స్మృతులను జ్ఞాపకాల వంతెనగా ఈ కాలంలోవారికి అప్పటి సంగతులను అందించారు.
చదువు అంటే సాహిత్యాభిలాషను పాదుకొల్పిన వాతావరణపు గుర్తులు! ఈ జ్ఞాపకాల పరిమళాలు ఒక అంతర్జాలపత్రికలో వ్యాసాలుగా ప్రచురింపబడ్డాయి.
సుమారు 1960-90 సంవత్సరాల మధ్య జీవించిన అనేకమందికి స్మృతిపథంలో ఇన్ని అంశాలు ఒకే చోట, ఒకేసారి గుర్తుచేసుకోవటమంటే సంపెంగలు, సన్నజాజులు, మల్లెపూల సౌరభం.. అభిరుచిని ఈ జ్ఞాపకాల సుమాలు గంపకెత్తిపోసినట్టు ఆ రోజుల పరిమళాలని గుబాళిస్తాయి.
ఐదవ తరగతిలోకి వచ్చి చదవటం రాగానే పిల్లలకి ఆ రోజుల్లో చాలా ముచ్చటైన సంబరం బాలల బొమ్మల పుస్తకాలు చదవటం! ఇది కాస్త ఆర్థిక పరిస్థితి బాగున్న కుటుంబాలలోని (మధ్యతరగతి అనవచ్చు) పిల్లలకి మాత్రమే లభించేది. బడిలో లైబ్రరీలు ఉన్నా, అప్పుడు – ఇప్పుడు కూడా సరిగా ఉపయోగించటం లేదు. ప్రతి పంచాయతీ గ్రామాలలో లైబ్రరీలు ఉన్నా, అందరూ వెళ్లే అవకాశం ఉండేది కాదు. బాలల బొమ్మల రామాయణం, భారతం, భాగవతం వీటిని చదవటం, ఆ బొమ్మలు చూస్తూ పరవశించటం ఒక అపురూపమైన జ్ఞాపకమే! రచయిత్రి భార్గవి గారికే కాదు, ఆ పుస్తకాలు పసి మనసులకి ఎంతో అపురూపమైన ఆనందానుభూతిని మనోవికాసాన్ని కలిగించే మంచి జ్ఞాపకాలు! ఆ రోజుల్లో మగ పిల్లలు గూటుంబిళ్ళలు, గోళీలు, ముద్దరబాల్, ఈత కొట్టటాలు ఆరుబయటకి వెళ్ళి ఆడుకుంటే, ఆడపిల్లలు చింతపిక్కలు, చెమ్మచెక్కల వంటివి ఉన్నా, ఇంట్లో పెద్దవాళ్లు చదివే వారపత్రికలు, మాసపత్రికలు చూసే అలవాటు బాగా ఉండేది. వాటిలో కూడా పిల్లలకు సంబంధించిన కార్టూన్ కథలు, బొమ్మలు ఉండేవి.
అలా ప్రారంభమైన భార్గవి గారి చదువు, చందమామ, బాలమిత్ర, బుజ్జాయి వంటి మాసపత్రికలు, పంచతంత్ర కథలు, తెనాలి రామలింగ కథలతో మొదలైంది. అన్ని వయసుల వారికీ బాగా నచ్చే పుస్తకం మాత్రం పేరుకి తగిన చందమామే! అందులో బొమ్మలు రంగులు చాలా బాగుండేవి. ముఖ్యంగా శంకర్ గారు భట్టి విక్రమార్క కథకి, వేసిన బొమ్మ, శవాన్ని భుజాన వేసుకున్న మనిషి దృశ్యం తమాషాగా అత్యంతాకర్షణగా ఉండేదని గుర్తు చేస్తారు రచయిత్రి! మెదడుకి పదును పెట్టే మేతలాంటి రచన కూడా ప్రతీ నెలా చదవటానికి ఆసక్తి కలిగిస్తూ బాగుండేది! దుర్గేశనందిని, కంచుకోట వంటి పేర్లు వారీ జ్ఞాపకాలలో గుర్తు చేశారు.. నాకు తెలిసి ఒక మాస్టారు వాళ్ళ పాపకి దుర్గేశనందిని అని పేరు పెట్టారు. ఆనాటి జీవనంలో ఉన్న నెమ్మది, నిలకడతనం, ఒక వస్తువు కోసం ఎదురు చూసి అది పొందడంలో ఉన్న ఆనందం ఇప్పుడు మనం కోల్పోయామేమో అనే రచయిత్రి స్వగతం అక్షర సత్యమే!
రచనలలో కాలాన్ని బట్టి ఒక్కో ప్రక్రియకి అత్యంత జనాకర్షణ ఆదరణ కలగటం చూస్తూనే వుంటాము.
ఆ రోజులలో కథలు కాక ప్రభంజనంలా ఆకర్షించిన మరో అంశం అప్పటి డిటెక్టివ్ నవలలు! అద్దెకి తెచ్చుకుని చదివేవారు. ఆ రోజుల్లో అన్ని వయసుల వారు వారికి నచ్చిన పుస్తకాలు చదివేవారు.. అనేది నిజం! వారపత్రికలు ఒకరు ఒకటే కొన్నా, పక్కింటి వారితో మార్చుకుంటూ చదివేవారు. మొత్తానికి అందరూ ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక, ఆంధ్రజ్యోతి వారపత్రికలన్నీచదివేవారు.
1960 నుంచీ 1990 వరకు తెలుగు పత్రికలకు రచయిత్రి స్వర్ణ యుగమని భావిస్తారు. ఎన్నో మంచి రచనలు, వ్యాసాలు, సీరియల్స్‌గా నవలలు చదవగలిగే అవకాశం ఒక అదృష్టంగా భావిస్తారు డాక్టర్ భార్గవి గారు! ‘నా చదువు కథ’లో అందించిన మరో విశేషం ఏమిటంటే రచయితల జీవిత విశేషాలు కూడా సంక్షిప్తంగా తెలపటం! డిటెక్టివ్ నవలలు రాసే కొమ్మూరి సాంబశివరావు గారు, గుడిపాటి చలం గారి తమ్ముడి కొడుకని, అలాగే కొడవటిగంటివారి గురించి, సంచలన రచయిత గుడిపాటి వెంకటచలం వివరాలు, వడ్డెర చండీదాసు గారి జీవనశైలి, ఆచంట జానకిరామ్ గారు, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, సోమర్‌సెట్ మామ్ వంటి వారల గురించి.. ఇలా కొంతమంది రచయితల జీవిత విశేషాలను వివరించటం పాఠకులకు మంచి ఆసక్తిని కలిగిస్తుంది.
నిజానికి ఇందులో పేర్కొన్న రచనలు, తెలుగు కవులు, అభిరుచి కలిగిన పాఠకులకు పరిచితమైన వారే అయినా, భార్గవి గారు ఆ రచనలపై తన అభిప్రాయాలను, స్పందనలను తెలుపటంతో మనని తన రచనతో పాటుగా తీసుకువెళ్లి ఆసక్తిని కలిగిస్తారు.
ఈ పుస్తకంలో మరో మంచి ఆకర్షణ ముఖచిత్రంగా కౌమారదశలోని తన రెండు జడల ఛాయాచిత్రం! ఇదొక్కటే కాదు, చందమామకి చిత్రాలు గీసిన శంకర్ గారు, పురాణం సుబ్రహ్మణ్య శర్మగారు, రాచకొండ విశ్వనాథ శాస్త్రి, విద్వాన్ విశ్వం, చక్రపాణి, వడ్డాది పాపయ్య, చింతా దీక్షితులు గారు, ఆచంట జానకిరామ్, సత్యం శంకరమంచి వంటి వారి ఫోటోలు చూడగలగటం ఆనందాన్నిస్తుంది! గుడిపాటి వెంకటచలం గారి గురించి.. “విస్తృతంగా చదివి, నచ్చని విషయానికి తనకు నచ్చిన తీరులో స్పందించటమే చలం స్వభావం!”.. అంటారు. జీవితాన్ని, మనిషిని ప్రేమించే గుడిపాటి వెంకటచలం నిరంతరాన్వేషి. తనకు అర్థంకాని దానికి సమాధానం ఆధ్యాత్మికంగా కూడా అన్వేషించారు.. అంటూ చలాన్ని హృదయవాదిగా చెప్తారు రచయిత్రి! కొడవటిగంటి కుటుంబరావు గారి రచనలలో ప్రాణభూతమైన అంశాలను, శైలిని, మెచ్చుకుంటారు. చందమామ కోసం ఆయన చేసిన కృషిని చక్కగా వివరిస్తారు.
వడ్డెర చండీదాసు రచనల్ని జీవితాన్ని వివరిస్తూ ఆ పాత్రలు కలిగించిన అలజడిని, స్పందనలను, కొత్తదనాన్నీ ప్రస్తావిస్తారు.. హిమంలో కూడా అంతర్లీనంగా జ్వాల చెలరేగుతూంటుందనీ, మనిషి ఒక వైరుధ్యాల పుట్ట అని తేలుస్తారు సమన్వయిస్తూ..!
భావుకతకీ, సౌందర్య పిపాసకీ చిరునామాగా జీవించిన ఆచంట జానకిరామ్ గారి ఆత్మకథలను.. అందంగా పరిచయం చేస్తారు! ‘నా స్మృతి పథంలో’, ‘సాగుతున్న యాత్ర’ ఒకటి, రెండు భాగాలలోని అంశాలను వారి కుటుంబ వివరాలను ఎంత ముచ్చటగా పరిచయం చేస్తారంటే, ఆ పుస్తకాలను నిజంగా చదవాలనిపించేంతగా..! శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి ప్రతిభని, వ్యక్తిత్వాన్ని వివరిస్తూనే, జీవితంలో అంత గొప్ప వ్యక్తి చివరలో ఆర్థికంగా అనుభవించిన దీనస్థితికి దిగులు పడి పరితపిస్తారు!
‘అమరావతి కథలు’ రాసిన సత్యం శంకరమంచి గారిని, ఆణిముత్యాల వంటి ఆ రచనను, తెలుగుతనాన్నీ, పలుకుబడిని మంచి రుచికరమైన వంటకంలా పరిచయం చేస్తారు.
తెలుగు సాహిత్యంతో పాటు ప్రఖ్యాత రచయితల ఆంగ్ల నవలల్ని పరిచయం చేస్తూ ఆ రచయితల గురించి ఆసక్తికరంగా వివరిస్తారు. చక్రపాణిగారిచే నిర్వహించబడిన ‘యువ’ మాసపత్రిక, అందులో వడ్డాది పాపయ్య చిత్రాలు, వివి రాఘవయ్య గారి నిర్వహణలో 1963లో వచ్చిన ‘జ్యోతి’ మాసపత్రిక విశిష్టత, సినిమా వార్తలు తెలిపే ‘విజయ చిత్ర’ ఈ పత్రికల దీపావళి ప్రత్యేక సంచికల వివరాలను గుర్తుచేస్తారు. జయశ్రీ, స్వాతి, ఆంధ్రభూమి, హాసం, రాష్ట్ర ప్రభుత్వంచే నిర్వహించబడే ‘ఆంధ్రప్రదేశ్’ మాసపత్రికల గొప్పతనం గుర్తు చేస్తారు రచయిత్రి!
డా. భార్గవి గారి ‘నా చదువు కథ’లో చిన్ననాటి జ్ఞాపకాల పరిమళాలని పంచటమే కాదు, కొత్త తరానికి, ఇప్పటి తరానికి తెలియని ఎన్నో మంచి రచనలను పరిచయం చేస్తూ.. ఆ గొప్ప రచయితల గురించి మరీ మరీ చదవాలనిపించేలా ఉత్తేజ పరుస్తూ రచించారు. మంచి పుస్తకం చదివిన తృప్తి కలుగుతుంది. ఒక విధంగా చెప్పాలంటే రచన మధ్యలోనే ఆపేసినట్టు అనిపిస్తుంది కానీ, అనంతమైన కాలగతిలో చదువు కథ సాగుతూనే ఉంటుంది కదా!
ఒక స్వర్ణ యుగం లాంటి కాలాన్ని ప్రతిబింబింప చేయటానికి తన జ్ఞాపకాలని గతం లోని మనోయవనిక నుంచి తీసి చూపించాలని చేసిన మంచి ప్రయత్నం అభినందనీయం. గుర్తు చేసే వాళ్ళు లేకపోతే చరిత్ర గుప్తంగా ఉండిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. పైగా ఇది వ్రాశాక డాక్టర్ భార్గవి గారికి మనసుని స్పందింపజేసిన జ్ఞాపకాల బరువు పదిమందికి పంచినందుకు మనసు ఆనందంతో తేలికపడి ఉంటుంది. ఈ ఆనందం ఈ సంబరంతో మరిన్ని మంచి రచనలు చేయాలని ఆకాంక్షిద్దాం! ‘నా చదువు కథ’ అందరూ చదవాల్సిన పుస్తకం! చదివి దాచుకోవాల్సిన పుస్తకం.
***
రచన: డా. రొంపిచర్ల భార్గవి
ప్రచురణ: బదరి పబ్లికేషన్స్, పామర్రు
పేజీలు: 94
వెల: ₹ 150/-
ప్రతులకు:
నవోదయ బుక్ హౌస్, కాచీగుడా, హైదరాబాద్.
ఫోన్: 9000413413
ఆన్‌లైన్‌లో:
https://www.telugubooks.in/products/na-chaduvu-katha?

