[శ్రీ బొల్లిముంత వెంకట రమణారావు రచించిన ‘నా నీడలోనే నేను అనాథను!’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
ఒకప్పుడు నా భుజాలపై కూర్చొని
ఆకాశం చూశారు;
వాళ్లు ఆకాశాన్ని చేరడానికి
నేను మెట్టుగా మిగిలాను.
వాళ్లు పడిపోతే
అందుకునే చేతులై ముందుకొచ్చాను;
వాళ్లు ఎదగడానికి
నా జీవితాన్ని ఆధారంగా నిలిపాను.
వాళ్ల రేపటి కోసం
నా నేటిని వాయిదా వేశాను;
వాళ్ల నవ్వుల్లోనే
నా సంతోషాన్ని వెతికాను.
కాలం నా అడుగులకు
అలసటను నేర్పింది;
వాళ్ల అడుగులకు మాత్రం
కొత్త దారులు తెరిచింది.
వాళ్లు తమ గమ్యాల వెంట
దూరాలకు సాగిపోయారు;
నేను వాళ్ల జ్ఞాపకాలలో
రోజురోజుకూ సాగిపోతున్నాను.
వాళ్ల ప్రపంచం విస్తరించింది;
నా ప్రపంచం మాత్రం
వాళ్లు తిరిగొచ్చే దారికే
పరిమితమైపోయింది.
గోడలపై వాళ్ల బాల్యం
ఇప్పటికీ నవ్వుతూనే ఉంది;
గదులెన్నో ఉన్న ఇంట్లో
నాకంటూ ఒక చోటు లేదు –
నా ఇల్లే నాకు పరాయిదైంది.
నా వేలు పట్టుకొని నడిచిన
ఆ చిన్న చేతులు
ఇప్పుడు నా చేయి పట్టడానికి
సమయం వెతుకుతున్నాయి.
ఎన్నో జీవితాలకు
అండగా నిలిచిన ఈ చేతులు
ఇప్పుడు గోడను పట్టుకొని
నిలబడటం నేర్చుకుంటున్నాయి.
ఎందరో కన్నీళ్లను తుడిచిన
ఈ వణికే వేళ్లు
తమ కన్నీళ్లను
తామే తుడుచుకుంటున్నాయి.
వాళ్ల రేపటిని తీర్చిదిద్దుతూ
నా వయసు జారిపోవడం మరిచాను;
వాళ్లకు దారులు చూపించిన నేను
నా మలిసంధ్యలో
దారి కోసం చూస్తాననుకోలేదు.
వాళ్లకు దారి చూపిన కళ్లకు
ఇప్పుడు గమ్యం కనిపించడం లేదు;
వాళ్ల భవిష్యత్తు కోసం
నా వర్తమానాన్ని అర్పించాను.
వాళ్లు తమ ఆకాశాల్లో
విజయపు జెండాలు ఎగరేశారు;
నేను మాత్రం గుమ్మం దగ్గర
అడుగుల చప్పుడు కోసం
చెవులు ఒగ్గి నిలిచాను.
వృద్ధాప్యం అంటే
శరీరం బలహీనపడటం మాత్రమే కాదు;
మన కోసం కట్టుకున్న ఇల్లు
మన ఉనికినే
పరాయిదిగా చూడటం కూడా.
ఒకప్పుడు వాళ్లు పడిపోతే
ఏమవుతుందోనని భయపడ్డాను;
ఇప్పుడు నేను పడిపోతే
నన్ను లేపే చేయి
ఎక్కడుందో వెతుకుతున్నాను.
రెక్కలు విప్పి
దూరతీరాలకు ఎగిరిపోయాయి పక్షులు;
నేను మాత్రం చెట్టులా
అవి విడిచివెళ్లిన గూళ్లను కాచుకుంటూ
వాటి రాక కోసం ఎదురుచూస్తున్నాను.
వాటి స్వేచ్ఛే నా కల అని
వాటిని ఆపాలని అనుకోలేదు;
అవి తిరిగి రాకపోయినా
నా ఎదురుచూపు ఆగదని
అప్పుడు నాకు తెలియలేదు.
వాళ్లకు ఆశ్రయమై
జీవితమంతా నిలిచిన నేను
ఇప్పుడు నా ఒంటరితనానికి
నేనే ఆశ్రయమవుతున్నాను.
వాళ్ల రాక కోసం
నా చూపులు గుమ్మం దగ్గర ఆగిపోయాయి;
నా రాక కోసం ఎదురుచూసే చూపులే
ఇంట్లో కరువయ్యాయి.
