Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

నా తప్పేమిటి?

[గోనుగుంట మురళీకృష్ణ గారు రచించిన ‘నా తప్పేమిటి?’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము. సంచిక – బెహరా వెంకట సుబ్బారావు ద్వితీయ జాతీయ స్మారక కథల పోటీ 2026లో సాధారణ ప్రచురణకి ఎంపికైన కథ.]

వికాస్ తన రూమ్‌లో కూర్చుని రెండురోజుల క్రితం జరిగిన విద్యార్ధుల పరీక్ష పేపర్లు దిద్దుతున్నాడు. అతను లెక్చరర్‌గా పనిచేస్తున్నాడు. ఆ రూమ్‌లో గోడకు ఆనుకుని కంప్యుటర్ టేబుల్, దానికి ఎదురుగా పడకుర్చీ, దాని మీద రైటింగ్ ప్యాడ్ ఉన్నాయి. కుర్చీలో కుర్చుని రైటింగ్ ప్యాడ్ మీద పేపర్లు కరెక్షన్ చేస్తున్నాడు. కుడిచేతి పక్కన గోడకు ఉన్న బుక్స్ ర్యాక్‌లో చాలా పుస్తకాలు వరసగా నీట్‌గా అమర్చబడి ఉన్నాయి. అవన్నీ తెలుగు సాహిత్యం మీద రకరకాల రచయితలు, కవులు రచించిన గ్రంథాలు.

అక్కడ ఏ.సి. పని చేస్తున్నా వికాస్ నుదుటి మీద చిరు చెమటలు కనిపిస్తున్నాయి. చాలాసేపటి నుంచీ పని చేస్తున్నందువలన ఒక్క క్షణం దిద్దటం ఆపి, ఆవులిస్తూ ఒళ్ళు విరుచుకున్నాడు. ప్యాడ్ తీసి పక్కన పెట్టి, లేచి వంట గదిలోకి వచ్చాడు. గాయత్రి వంట చేస్తూ ఉన్నది. వికాస్‌ని చూసి “ఈ పూట ఏం కూర చేయమంటావురా?” అని అడిగింది. “ఏదో ఒకటి చేయమ్మా! నీ చేత్తో ఏది చేసినా నాకిష్టమే!” అన్నాడు.

“ఇంకెన్నాళ్ళు శ్రమ పడతావమ్మా! వంట మనిషిని పెడతానంటే వినవు” అన్నాడు. “నువ్వు నిజంగా నాకు సంతోషం కలిగించాలంటే ఈ ఇంటికి ఒక కోడలు రావాలి. చదువు అయిపోయింది, ఉద్యోగం వచ్చింది. కొన్నాళ్ళు సరదాగా గడిపావు. ఇరవై ఎనిమిదేళ్ళు వచ్చాయి. ఇప్పుడైనా పెళ్లి చేసుకోరా! ఎప్పుడూ ఏదో ఒక వంక చెబుతావు. పోనీ ఎవరినైనా ప్రేమించావా! చెప్పు” అడిగింది.

“అలాంటిదేమీ లేదమ్మా!.. నీ ఇష్టం”

“అయితే మొన్ననే పక్కింటి వాళ్ళు ఒక సంబంధం చెప్పారు. అమ్మాయి సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తూ ప్రస్తుతం వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నదట. చక్కనిది. రేపు ఆదివారం వెళ్లి చూసి వద్దాం. నువ్వు మళ్ళీ ఏదో ఒక అడ్డు చెప్పకూడదు”

“అలాగేనమ్మా!” మనస్ఫూర్తిగానే అన్నాడు వికాస్.

మర్నాడు వికాస్, గాయత్రి పెళ్లిచూపులకు బయలుదేరాడు. వికాస్ బ్లాక్ ప్యాంట్ మీద సిమెంట్ రంగు షర్ట్ టక్ చేసుకున్నాడు. తెల్లగా, అందంగా, దృఢంగా, ప్రతి అవయవం లోనూ ఆరోగ్యం ఉట్టిపడుతూ, జవసత్వాలు తొణికిసలాడుతున్న కొడుకుని కళ్ళారా చూసుకుంది గాయత్రి. అన్నీ సవ్యంగా జరిగితే రెండు మూడు నెలల్లో ఈ ఇంటికి ఒక కోడలు వస్తుంది అనుకుంది. పండు, తాంబూలం ఇవ్వటానికి పక్కింటి ఆమెను కూడా వెంటబెట్టుకుని అందరూ కలసి అమ్మాయిని చూడటానికి వెళ్ళారు. ఆ అమ్మాయి పేరు స్నిగ్ధట. పేరుకు తగినట్లు మనిషి కూడా అందంగా ఉన్నది.

“మాకు ఒక్కతే అమ్మాయి అవటం వలన గారాబంగా పెంచాము. కొంచెం పెంకిగా తయారైంది. అది మా తప్పే!” అన్నాడు పిల్ల తండ్రి ధనుంజయరావు.

“మీ అమ్మాయి పెంకి అయితే, మా అబ్బాయిది సర్దుకుపోయే మనస్తత్వం. ఫర్వాలేదు లెండి!” అన్నది గాయత్రి నవ్వుతూ.

పదిహేను రోజులు తిరక్కుండానే ముహూర్తాలు కుదిరి వికాస్, స్నిగ్ధ పెళ్లి జరిగిపోయింది. “మంచిరోజు చూసి కార్యానికి ముహూర్తం పెట్టి కబురు చేస్తాం” అన్నాడు ధనుంజయరావు. “మంచిది” అని చెప్పి తిరిగి వచ్చేసారు గాయత్రి, వికాస్.

కానీ అనుకున్నట్లుగా నెల రోజులు గడిచినా కబురు చేయలేదు. గాయత్రి తెలిసిన వాళ్ళని వెంటబెట్టుకుని స్నిగ్ధ దగ్గరకు వెళ్ళింది. ఉద్యోగంలో బిజీ వర్క్ ఉన్నదట. పదిరోజులు పోయిన తర్వాత చూద్దాం అన్నాడు తండ్రి. ఇంకోసారి వెళ్ళినప్పుడు స్నిగ్ధకి పిరియడ్ టైం, ఫస్ట్ నైట్ జరగటానికి కుదరదు అని చెప్పారు. అలా చూస్తూండగానే ఆరు నెలలు గడచిపోయాయి. స్నిగ్ధకి ఇప్పటివరకూ పుట్టింట్లో ఆడింది ఆటగా జరిగిపోయింది. కాపురానికి వెళితే బాధ్యతలు మీద పడతాయి. తన కెరీర్ ఇంపార్టెంట్. కొద్దిరోజుల్లో ప్రమోషన్ రాబోతుంది. ఈలోపు ప్రెగ్నెన్సీ రావటం, పిల్లలు పుట్టటం, వాళ్ళ ముక్కూ మూతీ తుడుస్తూ ఉండటం.. అవన్నీ న్యూసెన్స్. తన కెరీర్‌కి అడ్డు అనుకుని వాయిదాలు వేస్తూ ఉన్నది.

మళ్ళీ నెల తర్వాత వెళితే “మీ అమ్మ ఉంటే నేను రాను” అన్నది స్నిగ్ధ.

“అదేమిటి? మా అమ్మ ఏం చేసింది?” అన్నాడు వికాస్ ఆశ్చర్యంగా. “తప్పమ్మా! అలా అనకూడదు” అని ధనుంజయరావు ఏదో చెప్పబోతుంటే, “ఉండు నాన్నా! నీకేం తెలియదు” అని, “నేను ఇంత చదువు చదివి, ఉద్యోగం చేసేది ముసలాళ్ళకి సేవలు చేయటానికి కాదు” అన్నది పెంకిగా.

“పోనీలే బాబూ! నేను ఏ వృద్ధాశ్రమం లోనో ఉంటాను. చిన్నవాళ్ళు, ఎంతో భవిష్యత్ ఉన్నవాళ్ళు. మీరు సంతోషంగా ఉంటే చాలు” అన్నది గాయత్రి.

“నేను ఒప్పుకోను. మా నాన్న లేకపోయినా మా అమ్మ ఎంతో కష్టపడి పెంచి నన్ను ఇంతవాడిని చేసింది. నేనుంత వరకూ ఆమె నాతో ఉండాల్సిందే!” అన్నాడు వికాస్.

“ఆమెకి ఓల్డ్ ఏజ్ హోంలోనే హ్యాపీగా ఉంటుంది అని అంటుంటే నీకెందుకు ఇబ్బంది? ఆమెకి లేని అభ్యంతరం నీకేమిటి?” అన్నది స్నిగ్ధ.

వికాస్ అంగీకరించలేదు. ఇంటికి తిరిగి వచ్చేశాడు. పెళ్ళయి ఆరునెలలు దాటిపోయినా అతను ఎదురు చూస్తున్న దాంపత్యజీవితం ఎండమావిలా దూరం అయిపోతూ ఉన్నది. ఇంతవరకూ ఫస్ట్ నైట్ జరగలేదు.

పదిరోజులు గడిచిపోయాయి. వికాస్ మోచేయి నుదిటి మీద పెట్టుకుని పడకుర్చీలో కళ్ళు మూసుకుని పడుకుని ఉన్నాడు. వ్యథాభరితంగా అలా కూర్చున్న కొడుకుని చూస్తుంటే గాయత్రికి కడుపులో చెయ్యిపెట్టి కెలికినట్లుగా ఉంది. “బాబూ! ఆ అమ్మాయి అక్కడ, నువ్విక్కడ! ఇలా ఎంతకాలం?” అన్నది బాధగా. వికాస్ చెయ్యి అడ్డం తీసి కళ్ళు తెరిచి చూశాడు. “ఇప్పుడు నాకేం తక్కువ అయిందమ్మా!” అన్నాడు సరిగ్గా కూర్చుంటూ.

“కొత్తగా పెళ్లి అయిన వాడివి. భార్యాభర్తలు ఇద్దరూ ఎంతో సంతోషంగా గడపవలసిన వారు. ఇద్దరూ చెరొక చోట ఉన్నారు. నా గురించి నువ్వు దిగులు పడవద్దు. నేను ఆశ్రమంలో ఉంటాను. నాకేం ఇబ్బంది లేదు. ఆ అమ్మాయి ఇష్టప్రకారమే చెయ్యి. నా తండ్రివి కదూ! చెప్పినట్లు విను” అన్నది బ్రతిమిలాడుతున్నట్లు.

“సరేనమ్మా!” వికాస్ నిట్టూర్చాడు. జీవితం అన్న తర్వాత ఇష్టం లేకపోయినా కొన్నిటికి రాజీపడక తప్పదు.

గాయత్రి ఆశ్రమంలో చేరింది. వికాస్ భార్య కోసం కబురు పంపించాడు.. స్నిగ్ధ అడ్డు చెప్పబోయినా ఆమె తల్లిదండ్రులు ఊరుకోలేదు. భర్త దగ్గరకు వెళ్ళాల్సిందే అని కచ్చితంగా చెప్పి, ఆమెని వికాస్ దగ్గర దింపి వచ్చేశారు.. స్నిగ్ధ ముభావంగా ఉండిపోయింది. అతను లెక్చరర్. ఆమెది సాఫ్ట్‌వేర్ జాబ్. ఇద్దరి టైమింగ్స్ వేరు వేరు. సరదాగా గడపటానికి వీలుండేది కాదు. పోనీ, ఇంట్లోనే ఉంటుంది కదా! ఇవాళ కాకపోతే రేపు అని సరిపెట్టుకున్నాడు వికాస్.

ఆరోజు ఆదివారం, ఉదయం ఎనిమిది గంటలు అవుతూంది.. స్నిగ్ధ తలస్నానం చేసి ఫ్యాన్ కింద నిలబడి జుట్టు ఆరబెట్టుకుంటూ ఉన్నది. ఏదో పని మీద అటుగా వచ్చాడు వికాస్. వెనుక నుంచీ ఆమె తెల్లని నడుము, గాలికి ఎగురుతున్న పొడవాటి జుట్టు కనబడుతున్నాయి. వెనక నుంచీ వచ్చి నడుము చుట్టూ చేతులు వేసి కౌగలించుకున్నాడు. “అబ్బబ్బా! నాకు అర్జెంట్ వర్క్ ఉన్నది. ఇప్పుడేమీ వద్దు” అన్నది చిరాకుగా.

“పనికేం! ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. నన్ను దగ్గరకు రానీయకుండా ఇంకా ఎంతకాలం ఊరిస్తూ ఉంటావు? స్నిగ్ధా! ప్లీజ్! ప్లీజ్! ప్లీజ్..” ఇంకా గట్టిగా హత్తుకుంటూ అన్నాడు మత్తుగా.

“నాకిప్పుడు మూడ్ లేదు. చెబుతూంటే వినబడటంలా? పశువులా మీద పడతావే!” అన్నది.

“ఏమన్నావ్?” ఆమెని వదిలేసి నిటారుగా నిలబడుతూ అన్నాడు. పాలపొంగు మీద చన్నీళ్ళు కొట్టినట్లు అయింది.

“ఉన్నమాటే అన్నాను. పశువులకు కోర్కె తీర్చుకోవటమే ముఖ్యం. మనసుతో పని ఉండదు. ఆడదాని మనసు తెలుసుకోకుండా మీద పడే మగాడు కూడా పశువుతో సమానం” అన్నది విసురుగా.

“నోర్ముయ్!” చాచి చెంపకు పెట్టి కొట్టాడు వికాస్. “నన్ను కొడతావా! ఏమనుకున్నావు నేనంటే? ఇప్పుడే నీ మీద పోలీస్ కంప్లెయింట్ ఇస్తాను. నీ అంతు చూస్తాను” స్నిగ్ధ గబగబా జుట్టు రిబ్బన్‌తో కట్టుకుని, హ్యాండ్ బ్యాగ్, సెల్ఫోన్ తీసుకుని చెప్పులు టకటక లాడిస్తూ అతను తేరుకోకముందే విసురుగా బయటకు వెళ్ళిపోయింది.

గంట కూడా కాకముందే పోలీస్ జీప్ వచ్చి అతన్ని ఎక్కించుకుని పోలీస్ స్టేషన్‌కి తీసుకువెళ్ళింది. స్నిగ్ధ అతని మీద గృహహింస కేసు పెట్టింది.

“ఆమె నాతో సహకరించకుండా సంవత్సరం నుంచీ మానసికంగా హింసిస్తూంది. నేను కూడా గృహహింస కేసు పెడతాను. పేపర్ ఇవ్వండి. రాసిస్తాను” అన్నాడు వికాస్.

పోలీస్ అధికారి ఫక్కున నవ్వాడు. “గృహహింస కేసు ఆడవాళ్ళు పెట్టాలి. మగవాళ్ళు పెట్టటానికి వీల్లేదు” అన్నాడు.

“అంటే, మగవాళ్ళు అందరూ దుర్మార్గులు అనా మీ అభిప్రాయం?” సూటిగా చూస్తూ అన్నాడు వికాస్.

పోలీస్ అధికారి ముఖంలో నవ్వు ఎగిరిపోయింది. “నా అభిప్రాయం కాదు, చట్టంలో అలాగే ఉంది. మేము చేయగలిగేది ఏమీ లేదు!” అన్నాడు.

కానిస్టేబుల్ వచ్చి వికాస్‌ని సెల్ లో పెట్టి తాళం వేశాడు. ఈవార్త వికాస్ ఫ్రెండ్స్, ఇరుగు పొరుగు అందరికీ తెలిసిపోయింది. అతనితో పాటు పనిచేసే లెక్చరర్ ఒకతను లాయర్‌ను తీసుకువచ్చి బెయిల్ మీద విడిపించాడు. వికాస్‌ని కారులో ఇంటి దగ్గర దింపి, “ఎక్కువగా ఆలోచించకు. మనసు ప్రశాంతంగా ఉంచుకో!” అని చెప్పి, భుజం తట్టి వెళ్ళిపోయాడు.

ఆ మర్నాడు వికాస్ బైక్ మీద కాలేజీకి బయలుదేరాడు. డ్రైవ్ చేస్తున్నా మనసు పరిపరి విధాల పోతున్నది. ఫ్రెండ్ తనని ఎక్కువగా ఆలోచించవద్దు అని చెప్పాడు గానీ, అంత సులభంగా సాధ్యం అయ్యేటట్లు కనబడటం లేదు. ఆలోచనలు ఈగలు మూగినట్లు మూగుతున్నాయి. పెళ్ళికాక ముందు వరకు తనకు బాధ అంటే ఏమిటో తెలియదు. పెళ్లి అయిన దగ్గర్నుంచే బాధలు మొదలు అయినాయి.

తనేమైనా పెళ్లి చేసుకోమని స్నిగ్ధ చుట్టూ తిరిగాడా! పెద్దవాళ్ళు కుదిర్చారు, తను సరేనన్నాడు. పెళ్లి అయిన తర్వాత భార్యతో ఆనందంగా ఉండాలనుకోవటం తప్పా! తనంటే ఇష్టం లేనప్పుడు ఎందుకు చేసుకోవాలి? మొదట్లోనే చెబితే సరిపోయేదిగా!

ఆడది మగాడిని మాటలతో రెచ్చగొడుతుంది. మగాడికి అలా మాట్లాడటం రాదు. కోపం వస్తే ఒక దెబ్బ వేస్తాడు. దాంతో ‘కొట్టాడు, కొట్టాడు’ అని సాక్ష్యం చూపిస్తుంది. అందరూ అతనిదే తప్పు అంటారు. ఆమె అతని మనసుకి చేసిన గాయానికి మాత్రం సాక్ష్యం ఉండదు.. వికాస్ మనసులో ఏదో తిరగబడుతూంది. ఏదో చేయాలనిపిస్తున్నది.

వికాస్ చిన్నప్పుడు ఒకటవ తరగతిలో ఉన్నప్పుడు మాష్టారు ఏదో పని మీద అవతలికి వెళ్ళినప్పుడు పిల్లలంతా గిచ్చుకోవటం, గిల్లుకోవటం, ఒకరి మీద ఒకరు పడి దొర్లటం, పరుగులు తీయటం చేస్తూ క్లాసంతా గందరగోళం చేసేవారు. వికాస్ మాత్రం బుద్ధిగా ఒకచోట కుర్చుని పలక మీద అక్షరాలు దిద్దుకుంటూ ఉండేవాడు. ఇంతలో మాష్టారు వచ్చి అల్లరి చేసే పిల్లలందరినీ తలా నాలుగు తగిలించి, పనిలో పనిగా వికాస్ వీపు మీద కూడా రెండు దెబ్బలు వేసేవాడు. “నేనేం అల్లరి చేయలేదు కదా! నన్నెందుకు తన్నాలి?” అనే ఉక్రోషంతో వికాస్ చేతిలోని పలక విసిరి గోడకేసి కొట్టేవాడు. కాళ్ళు బాదుకుంటూ ఏడుపు లంకించుకునేవాడు.

వికాస్‌కి వయసు పెరుగుతున్న కొద్దీ అదంతా సిల్లీగా అనిపించి నిగ్రహించుకునేవాడు. కాలేజీలో స్నేహితులు వెక్కిరింత గానో, ఏడిపిస్తున్నట్లో ఏమైనా అన్నా నవ్వి ఊరుకునేవాడు తప్ప పట్టించుకునేవాడు కాదు. పెద్దయిన తర్వాత సంయమనంగా ఉండటం అలవాటు చేసుకున్నాడు. చిన్నప్పటి ఆ ధోరణి పూర్తిగా పోయిందనే అనుకున్నాడు.

ఇప్పుడు మళ్ళీ చిన్నప్పటి వికాస్ లా అనిపిస్తుంది.

మనసులో ఏదో తిరగబడుతూంది. తిక్క తిక్కగా ఉంది. కసి కసిగా ఉంది. కోపం వస్తున్నది. బాధగా ఉన్నది..

“నా తప్పు లేనప్పుడు నన్నెందుకు బాధ పెట్టాలి?” అని ఉక్రోషం వస్తున్నది.

చేతిలో వస్తువు విసిరి గోడకేసి కొట్టాలనిపిస్తున్నది.

ఇప్పుడు చేతిలో ఉన్న వస్తువు ఏది?.. బైక్.. రోడ్డుకి ఎడమ వైపు డ్రైవ్ చేస్తూ ఆలోచిస్తున్న వికాస్ రోడ్డు మధ్యలోకి వచ్చేశాడు. ఎదురుగా లారీ ‘భయ్’ అని పెద్దగా హారన్ మోగిస్తూ, రాక్షసి లాంటి మొహంతో దగ్గరకు వచ్చేస్తున్నది. వికాస్, చిన్నప్పటి వికాస్ లా చేతిలో పలక విసిరి గోడకేసి కొడుతున్నట్లు బైక్‌తో స్పీడ్‌గా లారీకి గుద్దేశాడు.

అంతే! దిక్కులు పిక్కటిల్లేటట్లు ఫెళఫెళమని శబ్దం వచ్చింది. తల మీద సుత్తులతో మోడుతున్నంత బాధ! వికాస్ కళ్ళు మూతలు పడిపోయాయి. తర్వాత ఏం జరిగిందో తెలియలేదు.

***

ఏవో ఘాటైన వాసనలు.. లేచి కూర్చోవాలని ప్రయత్నిస్తున్నాడు వికాస్. శరీరం సహకరించటం లేదు. ఒక ఇంచ్ కూడా కదలలేక పోతున్నాడు. ఆ బాధంతా మూలుగు రూపంలో బైటకి వస్తున్నది. విశ్వప్రయత్నంతో బలవంతాన కళ్ళు తెరిచి చూడబోయాడు. తెల్లటి మబ్బుల మధ్య ఏదో పెద్ద పాము కొండచిలువలా వేలాడుతూంది. క్రమక్రమంగా తెలివి వస్తున్నది. మసకమసకగా కనిపించేవన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి. అది హాస్పటల్, తెల్లటి మబ్బులా కనిపించేది డాక్టర్ గారి కోటు, పాములా వేలాడుతూ ఉన్నది ఆయన మెడలో స్టెతస్కోప్ అని అర్థం అయింది.

“కళ్ళు తెరిచాడు. ఇక ఫర్వాలేదు” మాటలు వినిపించాయి. పక్కకు తల తిప్పి చూసాడు. నర్స్ అంటున్నది. పక్కనే అత్తగారు, మామగారు, తల్లి, తన ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు. జరిగింది అంతా గుర్తు వచ్చింది. తను బైక్ తో లారీకి గుద్దేశాడు. “నాకేమైంది? కాళ్లు విరిగిపోయాయా! కుంటివాడిని అయిపోయానా!” అన్నాడు హీనస్వరంతో.

“అలాంటిదేమీ లేదు బాబూ! నువ్వు బాగానే ఉన్నావు. కాసేపు నిద్రపో!” మామగారు వికాస్ తలమీద చెయ్యివేసి నుదుటిమీద జుట్టు నిమురుతూ ఆప్యాయంగా అన్నాడు. ఆయన ఇంత దయగా మాట్లాడుతున్నాడేమిటి? ఆ స్పర్శ ఎంత చల్లగా, హాయిగా ఉన్నది? అనుకుంటున్న వికాస్‌కి నిద్ర ఇంజెక్షన్ పనిచేసినట్లుగా మత్తు కమ్మేసింది.

నాలుగురోజుల తర్వాత —

వికాస్ బాగా కోలుకున్నాడు. అవసరం అయినప్పుడు స్వంతంగా లేచి బాత్ రూమ్ వరకు నడవగలుగుతున్నాడు. కానీ ఇంకా హాస్పటల్ నుంచీ డిశ్చార్జ్ కాలేదు. వికాస్ బెడ్ మీద పడుకుని ఉన్నాడు. అత్తగారు, మామగారు, గాయత్రి, స్నిగ్ద అందరూ ఎదురుగా కుర్చీల్లో కుర్చుని ఉన్నారు. ఆరోజు తను బైక్‌తో లారీకి గుద్దేయగానే ఎగిరి రోడ్డు పక్కన గడ్డిలో పడ్డాడట. దెబ్బలు తగిలాయి గానీ, ప్రాణం పోలేదు. పైగా తలకి హెల్మెట్ ఉన్నది. లారీ బైక్‌ను పది గజాలు ఈడ్చుకుంటూ వెళ్లి ఆగింది. ఎవరో చూసి అంబులెన్స్‌కి ఫోన్ చేశారు. తన ఫోన్‌ని బట్టి పోలీసులు గుర్తించి బంధువులకి కబురు చేశారట. మామగారు ఇదంతా వికాస్‌తో చెప్పి, తర్వాత స్నిగ్ధని నాలుగు చివాట్లేసి, పోలీస్ కంప్లెయింట్ విత్ డ్రా చేయించినట్లు చెప్పారు.

“అతనేమైనా తాగుబోతా? తిరుగుబోతా? చక్కగా చదువుకుని ఉద్యోగం చేస్తున్నాడు. ఎలాంటి దురలవాట్లు లేవు. లక్షణంగా కాపరం చేసుకోక, నీ జీవితాన్ని, అతని జీవితాన్ని బజార్న పడేసుకున్నావు. నా కడుపున చెడబుట్టావు గదే!” అన్నది అత్తగారు కూతురిని ఉద్దేశించి.

“ఒకప్పుడు ఆడవాళ్ళు గుప్పెడు అన్నం కోసం భర్త కొట్టినా, తిట్టినా ‘నా ఖర్మ’ అనుకుని సరిపెట్టుకుని పడి ఉండేవారు. వాళ్ళ దయనీయమైన జీవితాలు మార్చటానికి ‘ఆడపిల్ల కూడా చదువుకోవాలి, తనకాళ్ళ మీద తను నిలబడాలి’ అనే ఉద్దేశంతో కొంతమంది తండ్రులు ఆడపిల్లల్ని చదివించేవారు. ప్రభుత్వాలు కూడా ఆడవాళ్ళ రక్షణ కోసం సదుద్దేశంతో ఎన్నో చట్టాలు చేశారు. కానీ నీ లాంటి ఆడపిల్లలు ఆ చట్టాలను దుర్వినియోగం చేస్తూ అబ్బాయిల జీవితాన్ని అల్లకల్లోలం చేస్తున్నారు. భర్త మీదే కాకుండా అతడి తల్లిదండ్రులను, ఏ సంబంధం లేని బంధువుల మీద కూడా కేసులు పెట్టి రోడ్డు కీడుస్తున్నారు. మానసిక వేదనకు గురిచేస్తున్నారు. అందుకే ఈ తరం అబ్బాయిలు పెళ్లి అంటేనే భయపడుతున్నారు.

స్నిగ్ధా! ఇప్పటివరకు నీ మీద ప్రేమతో ఏం చేసినా ఊరుకున్నాము. అలాగని నీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తే సహించి ఊరుకుంటాం అనుకోవద్దు” అన్నాడు మావగారు.

వికాస్ యాక్సిడెంట్‌కి తన ప్రవర్తన కారణం అని తెలిసేసరికి స్నిగ్ధ కంగు తిన్నది. ఇంకానయం! తను జీవితాంతం పడాల్సిన మనోవ్యథ కొద్దిలో తప్పిపోయింది అనుకుంది. నాలుగు రోజుల నుంచీ తల్లిదండ్రులు, బంధువులు బ్రెయిన్ వాష్ చేస్తున్నారు. వారి మాటలు వింటూ, మాట్లాడకుండా తలవంచుకుని మౌనంగా ఉండిపోయింది.

“అమ్మాయ్! వెళ్లి అల్లుడికి క్షమాపణ చెప్పు!” ఆదేశించాడు మావగారు.

వికాస్ బెడ్ మీద వెనక్కు ఆనుకుని చేరగిలి కూర్చున్నాడు. స్నిగ్ధ మోకాళ్ళ మీద అతని ముందు కుర్చుని “వికాస్! నన్ను క్షమించు. ఇంకెప్పుడూ అహంకారంతో ప్రవర్తించను. నీకు ఎదురు చెప్పను. బాధ కలిగించను. నీకు ఇష్టమైనట్లే ఉంటాను” అన్నది తల వంచుకుని.

వికాస్ ఓదార్పుగా ఆమె తలమీద చేయి వేసి నిమిరాడు.

Exit mobile version