Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

నది అంటే చిన్నచూపే

[శ్రీ శ్రీధర్ చౌడారపు రచించిన ‘నది అంటే చిన్నచూపే’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

ది నడక ఎప్పుడూ
వాలు వైపుకు పిలవని పేరంటమే
తలుపులు తెరచివున్న జలధి నెలవులోకి
తహతహల అడుగులతో తరలివెళ్ళడమే

ఒక తరి
చినుకుల వర్షర్తువు
చన్నీటి చిలుకరింతలు చేస్తుంటే
మరొక పరి
మంచుకొండలు కరిగి నీరౌతుంటే
ఇంకొక పరి
నేలనింకిన నీరు ధారలై జాలువారుతుంటే
దాచుకోవడం మాని దారులంటా కదిలి
ఒడిసి పట్టినదంతా ఒద్దుఒద్దంటున్నా
ఒలుకబోయడమే కడలి కడుపులోకి

నది అంటే
సంద్రానికెప్పుడూ చిన్నచూపే

‘ఆటు’ వేళలందు
అదో మాదిరి ఆహ్వానాలంపినా
‘పోటు’ సమయాలలో
పోపొమ్మని సైగలు చేస్తూ
వద్దొద్దంటూ తలుపులు మూసేసినా
కనక వినక ఆగక ఆగలేక
తనను తాను నిలువరించుకోలేక
వడివడి పరుగులతో
గజగమన మందగమనాలతో
తనను చేరవస్తున్నందుకో
తనలో కలిసిపోతున్నందుకో

ప్రేమతోనో..!
ప్రేమిస్తున్నాననే బలహీనతతోనో
అది, ఆ నది తనదైన
అచ్చమైన అస్తిత్వం కోల్పోతున్నందుకో
మరి ఎందుకో.. ఇంకెందుకో

నది అంటే
సంద్రానికెప్పుడూ చిన్నచూపే..!

Exit mobile version