Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

నడివీధి నుండి వినువీధి వరకు..

[ఉప్పలూరి మధుపత్ర శైలజ గారు రచించిన ‘నడివీధి నుండి వినువీధి వరకు..’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము. సంచిక – బెహరా వెంకట సుబ్బారావు ద్వితీయ జాతీయ స్మారక కథల పోటీ 2026లో సాధారణ ప్రచురణకి ఎంపికైన కథ.]

“స్వాతీ ఇలా రామ్మా!” అంటూ సోఫాలో కూర్చుని ఆరోజు పేపరు చదువుతూ కూతురిని పిలిచి పక్కనే కూర్చోబెట్టుకుని “ఏమాలోచించావమ్మా? భవిష్యత్ ప్రణాళికలేమిటి? పబ్లిక్ స్కూలులో పదవతరగతి పూర్తయ్యింది. మరి ఇంటర్ చదవటానికి ‘నారాయణ’ లేక ‘చైతన్య’ లాంటి ఏ కాలేజీలో జేరాలనుకుంటున్నావు?” అని అడిగాడు సబ్‌కలక్టర్‌గా పనిచేస్తున్న అరవింద్.

ఇంతలో ‘స్వాతి’ తల్లి ప్రగతి కూడా వచ్చి అక్కడే కూర్చుంది. ఆమె నగరంలోని ప్రముఖ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తోంది. “బంగారం! నీవు మాకు ఏకైక కుమార్తెవి. నీకేం కావాలన్నా చేయటానికి మేం సిద్ధంగా ఉన్నాం. నీ అభివృద్ధికంటే మాకు కావలసింది ఏముంటుంది చెప్పు?” అంది ప్రగతి.

“అమ్మా! నేను ఏదయినా హాస్టల్‌లో ఉండి ఇంటర్ చదువుకుంటానమ్మా!” అంది స్వాతి.

“అదేమిటి తల్లి! మనకి కారుంది. డ్రైవర్ ఉన్నాడు. నువ్వు ఆటంకం లేకుండా చదువుకోవటానికి ప్రత్యేకమైన గది కూడా మన విశాలమైన ఇంటిలో ఉంది. మాకా, నువ్వు తప్ప మరో లోకం లేదు. అట్లాంటిది నువ్వు మాకు కనిపించకుండా హాస్టల్‌కెందుకమ్మా వెళ్ళటం? హాయిగా నీకిష్టమైన కాలేజీలో జేరి మా కళ్ళెదుటే ఉండి చదువుకోవచ్చుగా” అంది ప్రగతి.

“అయితే నాదొక కండిషన్. నాకింతవరకూ స్కూలులో స్నేహితులే తప్ప మన ఇంటికొచ్చే స్నేహితులే లేరు. నేను కూడా ఇంతవరకూ ఎవరింటికీ వెళ్ళలేదు. డేస్కాలర్‌గా ఉంటే నాకు చాలా ఒంటరితనంగా అనిపిస్తోంది. హాస్టల్‌లో ఉంటేనైనా ఆ రూంమేట్స్ మన ఇంటి దాకా వచ్చే స్నేహితులవుతారనే ఆశతోనే నేను హాస్టల్‌లో చేరతానంటున్నాను. కాబట్టి నా స్నేహితులు మనింటికి వచ్చేందుకు మీరు ఒప్పుకోవాలి” అంది స్వాతి.

“సరే నీకెలా కావాలంటే అలాగే ఉండు. నీ స్నేహితులను సరదాగా నీ పుట్టినరోజుకి మన ఇంటికి పిలువు. వాళ్ళతో కలిసి ‘కంబైండ్ స్టడీ’ చేయాలన్నా మాకేవిధమయిన అభ్యంతరం లేదు” అంది ప్రగతి.

“పూర్వం ‘సిద్ధార్ధుడి’ని రాజభవనం నుండి కదలనీయకుండా, జీవితంలో కష్టసుఖాల గురించిన చింతనలేకుండా పెంచిన ‘శుద్ధోధన’ దంపతుల మాదిరిగా స్వాతిని అల్లారుముద్దుగా లోకం తెలియకుండా పెంచుతున్నారా తల్లిదండ్రులు.

ఇదంతా ఇష్టంలేని స్వాతి తన స్నేహాన్ని పెంపొందించుకోవాలనే ఉద్దేశంతోనే ఈ విధమైన కండిషన్ పెట్టింది. ఆమె చెప్పిన అన్నింటికి అమ్మానాన్నలు ఒప్పుకున్నారు.

స్వాతిని ‘నారాయణ టెక్నో స్కూలు’లో డేస్కాలర్‌గా జాయిన్ చేశారు. కాలేజీకి ఎంతో ఉత్సాహంగా వెళ్ళివస్తోంది స్వాతి. చూస్తూండగానే ఇంటర్ రెండేళ్ళ చదువు పూర్తయి, పరీక్షలలో మంచి మార్కులను సాధించింది స్వాతి. ఎంసెట్‌లో కూడా మంచి ర్యాంక్ రావటంతో నగరంలోని మంచి కాలేజీలో సీటు కూడా వచ్చింది.

ఓ నెలరోజులలో కొత్త కాలేజీలో చేరాలి. ఆరోజు స్నేహితురాలు నీరజతో కలసి షాపింగ్ చేసి, ఏదయినా సినిమా చూడాలని ప్లాన్ చేసుకుంది స్వాతి. నీరజను వాళ్ళింటి దగ్గర తన కారులో ఎక్కించుకొని మాల్‌కి వెళ్ళాలని బయలుదేరింది స్వాతి.

కారు ఓ సిగ్నల్ దగ్గర ఆగింది. “చంటోడికి రెండురోజులుగా అన్నంలేదమ్మా! ధర్మం చేయండమ్మా!” అని కారు కిటికిపై దబదబ కొడుతూ, పసివాడిని చంకలో కట్టుకుని ఎర్రటి ఎండలో అడుక్కుంటోంది ఓ బిచ్చగత్తె.

ఇదివరలో తండ్రి చెప్పినట్లుగా “చేతనైతే అలాంటి వారికి ఏదయినా ఉపాధి కల్పించాలేగానీ డబ్బులిచ్చి ప్రోత్సహించకూడదు” అన్న మాటలు గుర్తుకొచ్చి డ్రైవరు ఆ బిచ్చగత్తెకు చిల్లర ఇస్తూంటే “అలా ఇవ్వకూడదు” అని వారించింది స్వాతి. ఆ బిచ్చగత్తె స్వాతివైపు కొరకొరా చూస్తూ మరో కారు దగ్గరకి పరుగులాంటి నడకతో వెళ్ళిపోయింది.

వారి పరిస్థితిని గూర్చి ఆలోచిస్తున్న స్వాతి ఆలోచనలకు అడ్డుకట్ట వేస్తూ “అక్కా! అందమైన పెన్నులు. వీటి వెనుక లైట్ కూడా వెలుగుతుంది. మీ తమ్ముడికోసమో, చెల్లికోసమో ఒకటి తీసుకో అక్కా! పది రూపాయిలకే ఒక పెన్ను” అంటూ ఎంతో ఆశగా అడుగుతోంది పన్నెండేళ్ళమ్మాయి.

“వద్దు పిల్లా! చక్కగా స్కూలుకి వెళ్ళి చదువుకోవలసిన ఈ వయస్సులో ఇలా ఇంత ఎండలోపడి వీటిని ఎందుకు అమ్ముతున్నావు?” అంటూ ప్రశ్నించింది స్వాతి.

“మీ లాగా చదివించటానికి నాకు అమ్మానాన్నలు ఉంటేనేగా? తాత ఉన్నాడు. తాత చెప్పులు కుడుతూ, నేను ఇలా పెన్నులు అవీ అమ్మితే వచ్చే కొద్దిపాటి ఆదాయమే మాకు తినటానికి సరిపోతుంది” అంటూ “తీసుకో అక్కా! నా గుర్తుగా ఒక్కటంటే ఒక్కటైనా..” అని జాలిగా బ్రతిమాలుతోంది.

“సరే రెండివ్వు” అంటూ ఓ వంద రూపాయిల నోటిచ్చి “ఇక ఎండలో తిరక్కుండా ఇంటికెళ్ళిపో” అంది బాధగా స్వాతి.

‘ఆ నల్లటి తారురోడ్డుపై చెప్పుల్లేకుండా మిట్టమధ్యాహ్నపు ఎండలో వీధి పిల్లలు తిరుగుతూ ఇలా బ్రతకవలసిందేనా? వాళ్ళేమో అనాధలై ఎర్రటిఎండలో ఇలా వస్తువులను అమ్ముకుంటూ జీవన పోరాటం చేస్తూంటే, తానేమో హాయిగా ACకారులో సినిమాలకు, షికారులకు తిరుగుతోంది’ విలవిలలాడింది స్వాతి మనసు.

కారు బయలుదేరింది. “డ్రైవర్ వీళ్ళ పరిస్థితి ఏమిటి? చిన్నచిన్న పిల్లలు ఇలా అడుక్కోవటాలు, వస్తువులమ్ముకోవటాలు ఏమిటి?. ప్రభుత్వాలు ఏమీ చేయలేవా? వీళ్ళంతా ఎవరసలు?” అంటూ అడిగింది స్వాతి.

“అమ్మా! మీరు ఇటువైపుగా ఎప్పుడూ రాలేదు. ఇదే మొదటిసారిగా వచ్చారు. ఇదంతా మామూలేనమ్మా! వీళ్ళంతా బ్రతుకుతెరువు గురించి ఈ నగరానికి వలస వచ్చినవారే. కొందరు పేద తల్లిదండ్రులు ఇలా వస్తువులమ్ముకు రమ్మని తమ పిల్లల్ని పంపిస్తారు. ఎండనకా, వాననకా కష్టపడుతున్న వీళ్ళను చూసి సిగ్నల్స్ దగ్గర ఆగుతున్న కార్లవాళ్ళు వీరిమీద జాలిపడి ఏమైనా కొంటారని ఆశ వీరిది. మీరిందాక ఆ పిల్ల దగ్గర కొన్నారుగా అలాగే.

కొందరేమో ఈ విధంగా చిన్నచిన్న పనులు చేసుకుంటూ బ్రతికితే, మరికొందరు యాచక వృత్తిలో బ్రతుకుతుంటారు. అనాథలైన చిన్నపిల్లలు చిత్తుకాగితాలనేరుకుంటూ, బూట్‌పాలిష్ చేసుకుంటూ బ్రతుకుతున్నారు. తినటానికే ఇన్ని అగచాట్లు పడుతున్న వీరు ఏం చదువుకుంటారు చెప్పండి? మన నగరంలోనే కాదు, దేశంలో కూడా జనాభానే ఎక్కువగానే ఉంది. ప్రభుత్వాలు మాత్రం ఏం చేయగలవు? ఎంతమందికని ఉపాధి కల్పించగలవు?

కానీ ఈ విషయంలో మాత్రం కొన్ని ప్రత్యేక సేవాసంస్థలు వీళ్ళకి చదువు చెప్పించటం, ఉపాధి కల్పించటం చేస్తుంటాయి. కానీ ఇంత పెద్ద నగరంలో అవే మూలకొస్తాయి చెప్పండి?” అంటూ వాళ్ళ గురించి చెప్పాడు డ్రైవర్.

అన్నీవిన్న స్వాతి ఆలోచనల్లో పడింది. ‘డబ్బున్నవాళ్ళు, వాళ్ళ పిల్లలు మళ్ళా డబ్బు సంపాదన కొరకై ఎగబడకుండా తమ దగ్గరున్న డబ్బులతో ఇలాంటి పిల్లల్ని చదివించి ఉపాధి కల్పిస్తే వారికో దారి ఏర్పడుతుంది..’. ఇంతలో “మీ స్నేహితురాలు నీరజగారింటికి వచ్చామమ్మా దిగండి” అంటున్న డ్రైవర్ మాటలకి ఈ లోకంలోకి వచ్చింది స్వాతి. అన్యమనస్కంగానే కారు దిగింది స్వాతి.

అప్పటికే తయారుగా ఉన్న నీరజ, స్వాతిని చూస్తూనే గబగబా ఎదురువచ్చి “ఏమిటి స్వాతి! ఇంత ఆలస్యమయ్యింది? నేను ఎప్పటినుంచి ఎదురుచూస్తున్నానో తెలుసా?” అంది చిరుకోపం ప్రదర్శిస్తూ.

“మేం వచ్చే దారంతా ట్రాఫిక్ ఎక్కువగా ఉంది. అందుకే కాస్త ఆలస్యం అయ్యింది. త్వరగా ఇంట్లో చెప్పి రా! అవతల సినిమా మొదలయ్యిపోతుందేమో?” అంది స్వాతి. స్నేహితులిద్దరూ మాల్‌కి చేరుకుని సినిమాకి టిక్కట్లు తీసుకుని థియేటర్ లోపలికి వెళ్ళిన రెండు నిముషాలకే సినిమా మొదలయ్యింది.

టీనేజ్ ప్రేమల గురించిన సినిమా అది. బాగా డబ్బున్న వారి కూతురు హీరోయిన్ అయితే, ఆ అమ్మాయి పేదింటి అబ్బాయిని ప్రేమించటం, కాలేజీ క్యాన్‌టిన్లో కాఫీ కబుర్లు, స్నేహితుల మధ్యన జరిగే ఛాలెంజ్‌లు, సందర్భానుసారంగా పెట్టిన కామెడీ సన్నివేశాలతో అంతా ఆసక్తిగా చూస్తున్నారు.

కానీ స్వాతి మనస్సంతా సిగ్నల్స్ దగ్గర పెన్నులమ్ముకునే అమ్మాయి మాటలతోనే నిండిపోయింది. వెండితెరమీద కూడా ఆమెకి ఆ దృశ్యమే కనిపిస్తోంది. “వారి జీవితాలను ఎవరూ బాగుచేయలేరా? ప్రభుత్వాలు.. ఊహూ! ఎన్నికలప్పుడు ఇచ్చిన వాగ్దానలనే నిలబెట్టుకోలేక అవస్థలు పడుతున్నాయి. ఇక ఈ వీధిబాలలు, యాచకుల గురించి ఏం పట్టించుకుంటారు?

పోనీ ధనవంతులు.. అబ్బే లాభం లేదు. వాళ్ళంతా తమ ముందు తరతరాలకి సరిపడ ఆస్తులను పోగేస్తారేగానీ.. వీరి బాగోగుల గురించి ఎందుకాలోచిస్తారు? మరి వీరికెవరు మంచి జీవితాలను అందిస్తారు?”

లోలోపల స్వాతి అంతరాత్మ హెచ్చరిస్తోంది. “ఏం? నీ తండ్రి ధనవంతుడేగా? ఊర్లో పొలాలున్నాయి. నగరంలో మీ తాతగారు అపార్ట్‌మెంట్స్ కొన్నారు. మరి నీవే ఎందుకు ముందుకు రాకూడదు. నీ ద్వారా కొంతమంది పిల్లలకైనా అందమైన జీవితాన్ని అందించే ప్రయత్నం చేయవచ్చు కదా?” అంటూ అంతర్మథనం జరుగుతోంది. ఇంతలో సినిమా పూర్తయిపోయింది.

“పదవే స్వాతి! ఇంకా కూర్చునే ఉన్నావు. అసలు నువ్వు సినిమా చూశావా?” అంటూ నీరజ పలికిన మాటలకు ఈ లోకంలోకి వచ్చిన స్వాతి “ఉహు! పద కారణం కార్లో చెపుతాను” అంటూ బయిటకి కదిలింది. ఐస్‌పార్లర్‌లో చల్లబడి ఇంటికి బయలుదేరారు స్నేహితురాళ్ళు.

“స్వాతి ఈ రోజు నువ్వు మా ఇంటి దగ్గర కాసేపయినా ఉండాలి. ఎప్పుడు అడిగినా తరవాత వస్తాను అంటావు?” అంది నీరజ.

నీరజ భుజంపై చెయ్యి వేసి “పదవే! ఇవాళ నువ్వు వెళ్ళమనేదాకా మీ ఇల్లు వదిలిపెట్టను” అంది స్వాతి నవ్వుతూ.

స్కూలు టీచర్‌గా పనిచేస్తున్న నీరజ తల్లి అప్పుడే స్కూలు నుండి వచ్చినట్లుంది. “ఏమ్మా స్వాతి! బాగున్నావా? సినిమా ఎలా ఉంది?” అంటూ కుశల ప్రశ్నలు వేసింది.

తాను అడిగిన ప్రశ్నలకి పరధ్యాన్నంగా సమాధానమిస్తున్న స్వాతిని చూసి ‘ఈ అమ్మాయి కేమయ్యింది?’ అనుకుంటూ “నీరజా! నువ్వు స్వాతి మాట్లాడుకుంటూ ఉండండి. నేను కాఫీ చేసి తీసుకువస్తాను. సినిమా చూసి తలనొప్పి తెచ్చుకున్నట్లుగా ఉంది మీ స్వాతి” అంటూ వంటగదిలోకి వెళ్ళింది నీరజ తల్లి.

ఆమె తెచ్చిన కాఫీ కప్పు అందుకుంటూ తన ఆలోచనలనుండి బయిటకొచ్చిన స్వాతి “ఆంటీ మీరు పనిచేసేది ప్రభుత్వ పాఠశాలలోనే కదా. పిల్లలు ఎక్కువ మందే వస్తారా?” అంటూ తన ఆలోచనలకు రూపకల్పన చేసే విధంగా ఆమెను కొన్ని వివరాలనడిగింది. ఆమె మాటలతో సమయమే గమనించలేదు.

స్వాతి ఇల్లు చేరేసమయానికి గడియారం ఎనిమిది గంటలు చూపించింది. అమ్మాయి రాకకోసం బాగా ఎదురుచూస్తున్న తల్లిదండ్రులు, స్వాతిని చూడగానే “ఇంతాలస్యమయ్యిందేమిటమ్మా?” అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపించారు.

తండ్రి అరవింద్‌కి తాను సిగ్నల్స్ దగ్గర చూసిన బిక్షాటన చేసే పెద్దలు, పిల్లల గురించి చెప్పి “మీరు సబ్‌కలెక్టర్‌గా పనిచేస్తున్నారు కదా! మరి ఈ సమస్యలు మీ దృష్టికి రావా నాన్నగారు?” అని సూటిగా ప్రశ్నించింది స్వాతి.

“అలా ట్రాఫిక్ పద్మవ్యూహంలో ప్రాణభీతి లేకుండా ఎర్రటి ఎండలో కాళ్ళుకాలుతున్నా లెక్కచేయకుండా చిన్నచిన్న వస్తువులనమ్ముతున్న ఆ చిన్నపిల్లలను చూస్తున్న నాకు, AC కారులో కూర్చున్నా తల తిరిగిపోయి భూమిలో కుంగిపోయినంతగా బాధ కలిగింది. వాళ్ళ జీవితాలు ఆ విధంగా ఎండలకి ఎండుతూ, వానలకి తడుస్తూ గడిచిపోవలసిందేనా? ప్రభుత్వం ద్వారా అలాంటి వారికి మీరేమీ చేయలేరా?” అంటూ ఆవేదనతో అడిగింది.

“స్వాతీ! ఇది చాలా పెద్ద నగరం. అనేక రాష్ట్రాల నుండి బ్రతుకుతెరువు కోసం జనం ఇక్కడికి వలసలు వస్తూంటారు. మనకి స్వాతంత్ర్యం వచ్చి 75ఏళ్ళు దాటినా దేశంలో ఆర్ధిక తారతమ్యాలలో మార్పు రాలేదు. ఏదో ఒక సిగ్నల్ దగ్గర చూసిన వారి గురించే నువ్వు ఇంతగా బాధ పడుతున్నావు. మన కర్మాగారాలలో, షాపులలో బాల కార్మీకులు ఎక్కువమందే ఉన్నారు. మేమెంతగా నిఘా పెట్టినా తక్కువ వేతనాలకే పనికి వస్తారని పిల్లలను పనిలోకి తీసుకుంటున్నారు చాలా మంది ఉత్పత్తిదారులు. చార్మినార్ దగ్గర ఉండే రాళ్ళగాజుల తయారీ పరిశ్రమలు మొదలుకుని, దీపావళీ టపాసులు తయారుచేసే పరిశ్రమలలో పిల్లల నియామకాలను అదుపు చేయలేక పోతున్నాం.

ప్రభుత్వం ద్వారా ఉచిత విద్య, మధ్యాహ్న భోజనం వంటి పధకాల వల్ల కొద్ది మందికి ప్రయోజనం చేకూరినా ఇంకా సహాయం అందవలసిన వారు చాలా మందే ఉన్నారు. వారంతా ఈ విధంగా ఏదో పనులు చేసుకుని బ్రతకవలసిందే. ఒక ప్రభుత్వ అధికారిగా నేను బయిటకు చెప్పలేను గానీ మా యంత్రాంగంలో ఉన్న లోపాలు ఇందుకు పరోక్షంగా కారణమౌతున్నాయి” అన్నాడు అరవింద్.

“ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యింది. నువ్వు త్వరగా ఫ్రెష్అప్ అయిరా. డిన్నర్ చేద్దాం మనం” అంది ప్రగతి.

అన్యమనస్కంగానే స్వాతి తన గదిలోకి వెళ్ళింది. ‘అమ్మాయిని బయిటిలోకం తెలియకుండా ఇన్నాళ్ళు ఉంచి తాము తప్పే చేసామా?’ అన్న ఊహ జనించింది ఆ దంపతులకి.

స్వాతి కాలేజీలో జేరే సమయం వచ్చింది. కానీ స్వాతి ఆ ఊసే ఎత్తటంలేదు. “ఏమ్మా స్వాతి! ఇవ్వాళ కాలేజీకి వెళ్ళి ఒకసారి కాలేజీని చూసి నీకు నచ్చితే ఫీజులవీ కట్టి వద్దాం. త్వరగా నువ్వు తయారుకామ్మా” అని చెప్పాడు అరవింద్.

“డాడీ! నేనింక పై చదువులు చదవను. తాతగారికి ఉన్న పొలాలు ఇతర ఆస్తులవల్ల, మీ ఉద్యోగాలవల్ల మనకి ఆదాయం బాగానే వస్తోంది. మొన్న సిగ్నల్స్ వద్ద ఆ పిల్లలను చూసినప్పటినుండి నాకు తెలియకుండానే నాలో ఓ ఆశయం మొలకెత్తింది. దానికి మీరు, అమ్మ అండగా ఉండాలి” అంది స్వాతి.

“ఏంటి స్వాతి నువ్వు కాలేజీలో జేరవా? మరేం చేద్దామనుకుంటున్నావు? చిత్రంగా ఉందే నీ వాలకం” అంటూ కంగారుగా అంది ప్రగతి.

“చెప్పానుగా అమ్మా! నేను ఆ అభాగ్య పిల్లల కోసం ఓ హోమ్‌ని ఏర్పాటు చేయాలనుకుంటున్నాను. నా చదువుకోసం చేసే ఖర్చు మొత్తం మనం నేను స్థాపించబోయే సంస్థ కోసం ఉపయోగిద్దాం. ఆ సంస్థలో సిగ్నల్స్ దగ్గర బిక్షాటన చేసేవారిని, వస్తువులనమ్ముకునే పిల్లలను చేర్చి, వారికి తిండి, వసతి, చదువు ఏర్పాటు చేసి, వారికి వచ్చిన చేతిపనులలో శిక్షణ ఇచ్చి, వారి కాళ్ళపై వారు నిలబడేలా చేయాలన్నది నా ఆలోచన. అందుకే నేను రెగ్యులర్ కాలేజీ చదువు కాకుండా ‘డిస్టెన్స్ ఎడ్యుకేషన్’ ద్వారా నా పై చదువులు చదువుతాను. పగలు సంస్థకోసం పనిచేసి, రాత్రివేళ నా అభివృద్ధి కోసం చదువుకుంటాను. నా ఆలోచనను మీరు అర్ధంచేసుకుని నాకు సహకరించి ఆర్ధికంగా అండగా నిలబడండి” అంటూ అడిగింది.

స్వాతి తల్లిదండ్రులు ఆలోచనలో పడ్డారు. ప్రగతితో “ఒకవేళ స్వాతి ఇంజనీరింగ్ కాలేజీలో చేరి చదువు పూర్తిచేసుకుని ఆపై చదువులకోసం విదేశాలకు వెళ్ళి అక్కడే స్థిరపడతానని అంటే ఏం చేయగలిగేవాళ్ళం. ఉన్న ఒక్కగానొక్క కూతురు ఒక మంచి ఆశయం కోసం నిలబడతానంటే ఆ ఆశయ సాధనకు మన సహకారం అందివ్వటంలో తప్పులేదని నాకనిపిస్తోంది. స్వాతి చెప్పిన ఆ పిల్లల జీవితాలను మార్చే దిశగా సబ్‌కలెక్టర్‌గా నేను కూడా కొన్ని పనులు చేయవచ్చు. కానీ నా పరిమితులు నాకుంటాయి. కానీ స్వాతికి అలాంటి ఇబ్బందిలేదు. ఆమె ఆలోచనలకు మనం చేయూతగా నిలబడితే చాలు. దాని ఆశయలను తప్పకుండా సాధించుకుంటుంది” అన్నాడు అరవింద్.

“చిన్నదానివైనా సమాజం గురించిన నీ ఆలోచన అభిలషణీయమే. అయితే పెద్దవాళ్ళను తీసుకొచ్చి వారి అలవాట్లను మార్చాలనుకుంటే నీ వయస్సుకు అది సాధ్యపడకపోవచ్చు. అందుకే అనాథ పిల్లలను తీసుకుని వారికి బ్రతకటానికి మార్గం ఏర్పాటుచేసినా నీకు చాలావరకు ఆత్మతృప్తి కలుగుతుంది” అంది ప్రగతి .

ఓ రెండు నెలలకే ఓ 20మంది అనాథ బాలబాలికలతో ‘శాంతినిలయం’ మొదలయ్యింది. వారందరికి స్వాతి పెద్దక్కయ్యగా మారింది. ఎవరికేది ఇష్టమో తెలుసుకుని వారికి ఆయా రంగాలలో శిక్షణనిప్పిస్తోంది. పిల్లలంతా చదువుల్లో, వృత్తివిద్యల్లో రాణిస్తున్నారు. వాళ్ళు తయారుచేసే రకరకాల వస్తువులను తాను మార్కెటింగ్ చేస్తూ వారికి ఆదాయ వనరులను చూపిస్తోంది స్వాతి. తన తండ్రి సహకారంతో ప్రభుత్వం వారు అమలుచేస్తున్న పధకాలను ఈ పిల్లలకు అందుబాటులోకి వచ్చేలా కృషిచేస్తోంది.

ఒక అయిదేళ్ళు గడిచేసరికి ‘శాంతినిలయాని’కి ఊరిలో మంచి పేరు వచ్చింది. స్వాతికి 18ఏళ్ళ వయసున్నప్పుడు స్థాపించిన ఆ సంస్థ దినదినాభివృద్ధి చెందుతోంది. స్వాతి తల్లిదండ్రులకి చెప్పిన విధంగా పట్టుదలగా పోస్ట్‌గ్రాడ్యుయేషన్ కూడా పూర్తిచేసింది. తాను నెలకొల్పిన శాంతినిలయాన్ని గౌరవించేవారినే వివాహం చేసుకుంటానని పట్టుదల పట్టటంతో ఆమెకి పెళ్ళి ఆలస్యం అవుతోంది. తల్లిదండ్రులు ఆమెకు తగ్గ సంబంధం కోసం వెతుకుతున్నారు.

‘శాంతినిలయం’ పిల్లలు సాధిస్తున్న విజయాలను, స్వాతి చేస్తున్న పనులను గురించి దినపత్రికలలో వచ్చిన వార్తలను చూసి ఆకర్షితుడయిన ప్రదీప్, ఢిల్లీ నుంచి వచ్చి ప్రత్యక్షంగా చూసి పెళ్ళిచూపులకొస్తామని తన తండ్రి చేత అరవింద్‌కి ఫోను చేయించాడు.

స్వాతి కోరుకున్న వరుడే ఇలా వచ్చాడని ఆనందంతో పొంగిపోయారు. ఒక పెద్ద మల్టీనేషనల్ కంపెనీలో CEOగా పనిచేస్తున్న ప్రదీప్‌కి స్వాతి బాగా నచ్చింది. ముఖ్యంగా ఆమె భావాలు, పేదపిల్లలకు ఆమె చేస్తున్న సేవలు అతణ్ణి బాగా కదిలించాయి. పెళ్ళయ్యాక కూడా స్వాతి ‘శాంతినిలయం’ కార్యక్రమాలను కొనసాగించవచ్చని చెప్పడంతో స్వాతి వివాహం ఓ నెలలో జరిగిపోయింది.

భర్త ప్రదీప్‌తో కలసి కాపురానికి ఢిల్లీ వెళ్ళే రోజు దగ్గరిలోకి వచ్చింది. “నెలకోసారి వచ్చి ‘శాంతినిలయం’ పనులు చూసుకుంటానని, తాను లేని సమయంలో ‘శాంతినిలయం’ రోజువారి కార్యక్రమాలను మన కౌలురైతు కూతురు ‘నిరీక్షణ’ నిర్వహిస్తుంది” అని తల్లితో చెప్పింది.

శంషాబాద్ విమానాశ్రమంలో ఢిల్లీ వెళ్ళే ఇండిగో విమానం భర్తతో పాటు ఎక్కింది స్వాతి. తనకు కేటాయించిన సీటులో కూర్చోబోతూండగా వెనకనుండి స్వాతి భుజంపై చెయ్యి వేసారెవరో. ఉలిక్కిపడి తిరిగి చూసింది స్వాతి. “ఆ నువ్వా? నువ్వేనా మల్లికా?” ఆశ్చర్యపోతూ అడిగింది స్వాతి.

“నేనేనక్కా! నాకు ఆకాశంలో పక్షిలాగా ఎగురుతూ ఉండాలనిపిస్తుందని ‘శాంతినిలయం’లో ఉండి చదువుకునేటప్పుడు నీతో చెపుతూండేదాన్ని కదక్కా! ఆకాశంలో ఎప్పుడైన విమానం కనిపించినప్పుడు ఆ విమానంలో ప్రయాణించాలంటే బోలెడు పైసలుండాలి. నా దగ్గర అంత డబ్బులేదుగా అని నేనంటే, “బాగా చదువుకుంటే నువ్వే ఆ విమానాన్ని నడిపే పైలెట్‌వి కావచ్చు” అని నువ్వు అన్నావుగా. నాతో ‘పైలెట్ సెట్’ పరీక్షలు రాయించావు. శిక్షణకి కూడా పంపించావు. ఇప్పుడు చూడు ఈ ‘ఇండిగో’ విమానాన్ని నడిపే పైలెట్‌గా నీ కళ్ళముందు నిలబడ్డాను.

వీరు నా బావగారా? నమస్కారమండి. మా అక్కది చాలా గొప్ప మనస్సు. మీరెంతో అదృష్టవంతులు. ఏడేళ్ళ క్రిందట ఎక్కడో సిగ్నల్స్ దగ్గర పెన్నులమ్ముకుంటున్న ఈ అనాథ మల్లికను చూసి కరిగిపోయి తన ‘శాంతినిలయం’లో చేర్చుకుని ఇంతదాన్ని చేసింది. ‘నడివీధుల్లో తిరిగే నన్ను వినువీధుల్లో కెగిరేలా’ చేసిన ఈ అక్క ఋణం ఎలా తీర్చుకోవాలి” అంటూ స్వాతి చేతులు పట్టుకుని ఆనంద భాష్పాలతో తడిపేసింది మల్లిక.

తన పెళ్ళి చూపుల సమయంలో స్వాతి “తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రేమించడం మానవ సహజం. సమాజంలోని పిల్లలందరినీ ప్రేమించడం మానవతా చిహ్నం. తల్లిదండ్రులులేని పిల్లలను, తల్లిదండ్రులు వదిలేసిన పిల్లలను సాకడం సమాజ బాధ్యత కాదంటారా? అందుకే నా వంతుగా ఆ బాధ్యతను స్వీకరించాను. ఇది మీకు కూడా ఇష్టమైతే మనం కలసి నడుద్దాం” అన్న మాటలు గుర్తుచేసుకున్నాడు ప్రదీప్.

‘ఉన్నతమైన ఆశయాలను నిర్ణయించుకోవడం, వాటిని సాధించటంకోసం జీవితాన్ని తృణప్రాయంగా భావించి శ్రమపడటం వల్ల వచ్చే అలసటను ఇలాంటి ‘విజయగాథలు’ మరిపింపచేస్తాయి’ అనుకుంటూ స్వాతికి అభినందనలు తెలిపాడు ప్రదీప్.

Exit mobile version