Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

నాగమల్లీశ్వరం!

[అలనాటి తెలుగు చలనచిత్ర కళాఖండం ‘మల్లీశ్వరి’ డిసెంబర్ 20, 1951న రిలీజై, ఈ 2025 డిసెంబర్ 20వ తేదీకి, వజ్రోత్సవ సంవత్సరంలోకి అడుగుపెట్టే సందర్భంగా శ్రీ సముద్రాల హరికృష్ణ అందులోని నాయికానాయక పాత్రలతో కల్పిత రచనని అందిస్తున్నారు.]

మల్లెల ఘుమఘుమల నడుమ, తోటలో ఉన్నారు మల్లీశ్వరి, నాగరాజులు!

వారిద్దరూ రాచబందీలుగా విడుదలై సంవత్సరం కావొస్తోంది సుమారుగా. ఆరునెలల క్రితం వివాహమై, ఆనంద తీరాలను తాకుతూ హాయిగా జీవిస్తున్నారు.

మల్లీశ్వరికి ఒకటే ధ్యాస – ఇన్నాళ్ళూ తన ఆలోచనలతో పిచ్చివాడైపోయి, ప్రతి రాతిలో తననే చూసి, తన బొమ్మే వెలయింపచేసిన బావ నాగరాజుని పువ్వుల్లో పెట్టుకుని చూసుకోవాలని!

నాగరాజుకీ ఒక్కటే ధ్యాస – తన వియోగంలో నలిగిపోతూ బలవంతాన రాణివాసం చేసి వచ్చిన, మల్లి మనసును నిత్యం అలరించాలని, అలరిస్తూనే ఉండాలని!

ఏదో గగుర్పాటూ, అలవికాని ఆనందమూ కల్గుతుంటుంది నాగరాజుకి, ఆనాడు జలజ సహాయం వల్ల తుంగభద్రా తీరంలో మల్లీశ్వరిని మళ్ళీ కలుసుకున్న మధురక్షణాలను ఎప్పుడైనా తలచుకున్నప్పుడు!

“గుర్తున్నాయిగా ఆనాటి సాయంత్రపు ఘడియలు?” నాగరాజు ప్రశ్న!

అది తమను తిరిగీ ఒక అద్భుతంలాగా కలిపిన స్థలమే, రమ్యాతిరమ్యమైన నదీతీరమే అయినా – మల్లీశ్వరికి దాని ఊసే ఏదో తెలియని భయాన్నీ, ఆ రాచరికపు కట్టుబాట్ల నాటి తన అసహాయతను గుర్తు చేసి చాటి చెప్పే భయంకర విషయం కూడానూ!

అందుకని మల్లీశ్వరి “ఎందుకు బావా, ఆ అయిపోయిన విషయాలు”, అని దాటవేసే ప్రయత్నం చేస్తుంది, ఎప్పుడు నాగరాజు ఆ ప్రసక్తి తెచ్చినా!

ఇది నాగరాజుకి ఆశ్చర్యం కలిగించినా ఏమీ వారించడు. నవ్వుతూ అంటాడు, “అప్పుడప్పుడు నాకనుమానం వస్తూంటుంది, నీ తలలోని ఈ మల్లెపూలు సుకుమారాలా, మా మల్లి సుకుమారా, అని?!”

“ఆహాహా కపిత్వం” అని తోటలోకి దారి తీస్తుంది మల్లీశ్వరి. నాగరాజు కూడా ఏదో పల్లెపదం ఉల్లాసంగా పాడుతూ ఆమెను అనుసరిస్తాడు.

***

ఇద్దరూ వెళ్ళి పారిజాతాల చెట్టు నీడలో కూర్చుంటారు. ఆ నేల అంతా సువాసనలతో కూడిన నక్షత్రాల్లాంటి సున్నితమైన పారిజాతపు పూలే!

కూచున్న వెంటనే దోసిటి నిండా ఆ పూలు తీసుకుని, మల్లీశ్వరి దోసిట్లో పోస్తాడు నాగరాజు, “ఇదిగో ఈ నాటి నా నక్షత్రాల బహుమతి, భద్రంగా కాపాడుకో”, అంటూ!

మల్లీశ్వరి ఒకవంక దోసిలి పట్తూనే, “అట్లాగే చందమామ గారూ, కానీ తారలతో మాకేం పని, భూమిమీద ఉండేవాళ్ళం; తారానాథులు మీకే వాటితో పని” అంటుంది చిలిపిగా!

“ఏదో మీ వెన్నెల వితరణ విరివిగా చేస్తే, ఆ చల్లని కాంతిలో కాస్త ఆడుకుంటాం, పాడుకుంటాం, మీ పేరు చెప్పుకుని!” అని ఇంకొంచెం కొసరు కూడా వడ్డిస్తుంది, నవ్వుతూ!

అప్పుడు నాగరాజు, మల్లీశ్వరి తల్లి – అంటే తనకు అత్తగారైన నాగమ్మ కంఠాన్ని అనుకరిస్తూ, “హుఁ, నువ్వేమైనా చిన్నపిల్ల ననుకుంటున్నావా ఇంకా?! ఆడుకుంటుందట, పాడుకుంటుందట! ఆటలూ, ఇంకా పాటలూ!

హవ్వ, నలుగురూ నవ్విపోరూ?! నలుగురిలో నా పరువేంగానూఁ?! గవ్వ విలువ చేయవు ఈ ఆటలూ, పాటలూ, రాతి బొమ్మలూ, తెలిసిందాఁ?!”, అంటాడు వేళాకోళంగా!

మల్లీశ్వరి వెంటనే “ఏయ్ఁ, మా అమ్మను ఏమీ అనకూడదు” అంటూనే వెన్నెల విరిసినట్టు నవ్వుతూ నాగరాజును అనుసరిస్తుంది జామిచెట్ల తోపు వైపు!

***

పెద్దగా ఎత్తు లేని ఆ చిన్న జామి చెట్టు చేరుకున్నారు ఇద్దరూ.

చేరగానే, చటుక్కున ఒక కొమ్మ ఎక్కి కూచుని, దండిగా కాసిన తియ్యటి జామిపళ్ళు కొన్ని కోసింది మల్లీశ్వరి, ఎంతో ఇష్టంగా.

ఆమె ఆ కొమ్మ ఎక్కిన లాఘవం చూసి, “ఇప్పుడు చెప్పవమ్మా, ఎవరు కోతి వారసత్వంతో వచ్చారో, ఆనాడు నన్ను వేళాకోళం పట్టిస్తావా, ‘కోతీ బావకు పెళ్ళంటా..’ అంటూ.., ఆఁయ్” అన్నాడు వలపు కోపం నటిస్తూ, నాగరాజు.

కానీ మల్లీశ్వరి గడుసుగా, “తమదే స్వామీ ఎప్పటికైనా ఆ పట్టం, అయితేగియితే, మేమెప్పటికైనా అతిథులమే మీ ఆ రాజ్యంలో!”, అన్నది నవ్వుతూ!

ఇద్దరి గలగల నవ్వులతో పక్కనే ఉన్న మావి చెట్టు గుబురుల్లో ఉన్న కోయిలా, ఈ జామి చెట్టు ఆకుల్లో దాక్కున్న రామ చిలకా ఒకేసారి పాట అందుకున్నాయి, దేని శ్రుతిలో అది!

ఇద్దరూ ఒక్క నిముషం ఒకళ్ళ ముఖం ఒకళ్ళు చూసుకుని, ‘ఆహా’ అనుకున్నట్టు చూసుకున్నారు..

నాగరాజు ‘బలే’ అంటూ చప్పట్లు కొట్టాడు. మల్లీశ్వరి కోయిలకు జవాబుగా ‘కూఉఉ’ అంటూ కూహూరావం చేసింది.

కోయిల ఇంకాస్త ఉత్సాహంతో ‘కూ’ అన్నది బదులుగా! ఈ సందడిలో రామచిలుక ఏమనుకున్నదో ఏమో, తుర్రుమన్నది.

అయితే అది అట్లా రివ్వుమని ఎగిరిపోవటంతో వెంటనే మల్లీశ్వరి, చెట్టు మీద నుంచి కిందకి దిగి నాగరాజు రెండు చేతులు పట్టుకుని, “ఇంకెప్పుడూ నన్ను వదలి వెళ్ళవుగా” అన్నది దిగాలుగా.

నాగరాజు “అదేవిఁటి, ఇప్పటి వరకు హుషారుగా ఉన్నావు, అకస్మాత్తుగా ఈ నీరసం ఎందుకూ”, అన్నాడు కాస్త ఆదుర్దాగా.

“జలజ మొత్తం ఏర్పాటు చేసి తుంగా తీరానికి నన్ను నీతో రహస్యంగా కలవటానికి తెచ్చిందే, ఆ రోజుకు ముందు రాత్రి, ఎంత ఎగసిపోయిందనుకున్నావ్ నా మనసు నిన్ను కలవబోతున్నానన్న ఆనందంతో! ఇప్పు డెగిరిపోయిందే, ఇట్లాంటిదే పాపం, ఒక పెంపుడుచిలక ఉండేది ఆ రాణివాసపు గృహంలో! దానితో చెప్పుకున్నాను నా తొందర, ఆత్రం, ఆనందం అన్నీ! ఆ కొలను, ఈ తోపు, ఈ మన ఆటపాటల కోసం కలుసుకునే చోటు ఎంత గుర్తొచ్చేవో! గుర్తొచ్చి ఆనందపరుస్తూనే, అంతగా బాధించేవి కూడా! ‘ఇంకా ఒక్క రేయి తాళుకున్నావా మల్లీ, నీ బంధనాలన్నీ తెగిపోతాయి’, అని దానికి చెబుతున్నట్టు, నాకే ధైర్యం చెప్పుకున్నాను ఆ రోజు! అది నా వెర్రి మాటలకు కీ కీ అని జవాబు కూడా ఇవ్వటం గుర్తొచ్చింది, ఇందాక ఆ చిలక ఉన్నట్టుండి చటుక్కున తుర్రుమంటే! అయితే మరునాడు, నేను నీ దగ్గరకు బయలుదేరే ముందు, దాని పంజరం తలుపులు తీసి, స్వయంగా నా చేతులతో ‘స్వేచ్ఛగా పోమ్మా, హాయిగా బతుకు’, అని దానికి విముక్తి కలింగించేశానులే! ఎంత ఆనందంగా రెక్కలల్లారుస్తూ ఎగిరిపోయిందో, విశాల గగనంలోకి!”, అన్నది మల్లీశ్వరి విషయం వివరిస్తూ తన బావకి!

అంతా విని నాగరాజు, “ఓహో అదా సంగతి, ఇప్పుడంతా తీరిపోయిందిగా, ఇక మర్చిపో! ఇక ఆ చిలకంటావా – ఇదిగో ఈ చిలక లాగానే – ఒక చోటున ఉండేది కాదు, ఆకాశ విహారి మరి” అన్నాడు నవ్వుతూ!

ఇంతలో దేవాలయం గంట దూరంగా మోగటం వినిపించింది ఇద్దరికీ!

“బావా పద, గుడికెళ్ళే వేళైంది”, అన్నది మల్లీశ్వరి అతన్ని తొందర పెడుతూ, తానూ వెంటనే బైటకు దారి తీస్తూ!!

“పదపద నీ కలకండ భక్తి నాకు తెలియదూ”, అంటూ నాగరాజ కూడా కదిలాడు ఆమె వెంటే, తోట బైటకు చలాకీ అడుగులతో!

***

గుళ్ళోకి అడుగుపెట్టి, ఇద్దరూ దైవదర్శనం చేసుకున్నారు.

చిన్ననాటి నుంచీ ఇద్దరినీ చూస్తున్న పూజారి వాత్సల్య పూర్వకంగా ఆశీర్వదించి, శఠగోపం పెట్టి, ప్రసాదం ఇచ్చాడిద్దరికీ!

కళ్ళకద్దుకుని తీసుకుని, కాస్సేపు కూచుందామని ఓరగా కూచున్నారు మండపంలో.

ఇద్దరూ ఆ గుడినీ, ఆ ప్రాంగణాన్నీ కలయచూశారు మౌనంగా ఓ అయిదు నిమిషాలు.

ఇద్దరూ ఏదో చెప్పబోయారు, దాదాపు ఒకేసారి. సరే నువ్వు ముందంటే, నువ్వు ముందు చెప్పమని అనుకున్నారు నవ్వుతూ!

“సరే నే చెప్తాను”, అని మల్లీశ్వరి మెల్లిగా మొదలుపెట్టింది తనకు అప్పుడే తట్టిన ఆలోచన చెప్పటం!

ఇద్దరూ లేచి గుడికి అటుగా ఉన్న పూలమొక్కల దగ్గరకెళ్ళి కూచున్నారు, భక్తుల రాక కాస్త ఎక్కువవడంతో!

“బావా! ఈ గుడి కోసం మనం ఏదైనా చేస్తే బాగుంటుం దనుకుంటున్నాను. చాలా చోట్ల చూడు-గోడలూ, కప్పూ అన్నీ పాతపడినై!”, అన్నది, నాగరాజు ఏమంటాడో అని అతన్నే చూస్తూ! మళ్ళీ తనే అన్నది “అదిగో, ఆ కొలను, బావీ కూడా..” అని!

విని నాగరాజు, “సరిగ్గా ఇదే చెప్పబోయాను నేను కూడా ఇందాక మంటపంలో! ఎంతాశ్చర్యం ఒకే ఆలోచన వచ్చింది ఇద్దరికీ ఒకేసారి. తప్పకుండా చేద్దాం, రాయలవారు, రాణీ వారు ఎంత దయ గలవారు – బాగా ధనం, నగలు బహుమానంగా ఇచ్చి పంపించారుగా, ఆ ధనంలో కొంత పెట్టి బ్రహ్మాండంగా చేయిద్దాం! ఇది మన ఊరి ప్రజలకు ఉపయోగపడేదీ, రాజు గారు మెచ్చే పనే అవుతుంది కూడా, తప్పకుండా!” అన్నాడు ఉత్సాహంగా!

ఇద్దరూ “వెళ్ళొస్తాం తాతా”, అని పూజారి దగ్గర సెలవు తీసుకుని బయలుదేరారు ఇంటికి, త్వరగా వెళ్ళాలి వానొచ్చేట్టుందని అనుకుంటూ!

బయటకు రాగానే నల్లటి ఆకాశం, కారుమేఘాలూ – కుంభవృష్టి రాబోతున్న సూచనలతో!

అయితే, బయటికి రాగానే నాగరాజు మళ్ళీ ఆపాడు మల్లిని, “రాయలవారి విడిదికి వెళ్దాం వస్తావా” అంటూ!

“రాయలవారి విడిదా, అదెక్కడా?! మళ్ళీ ఆ రాచనగరుకా?!” అన్నది నేను రానని తల అడ్డంగా ఊపుతూ!

“ఓసి రాణీవాసపు అనిష్టసఖీమతల్లీ! మల్లీ! రాజధాని లోది కాదు, ఇక్కడే మన ఊరి చివరన పాతమండపం! రాయలవారినీ వారి కవిగారినీ చూశామే, ఆ రోజు నువ్వు జావళీ కూడా పాడి వారిని మెప్పించావూ, అదీ!” అన్నాడు నాగరాజు పగలబడి నవ్వుతూ!

“ఓహ్ అదా, అయితే సరే పద! మరి వానొచ్చేట్టుందే” అన్నది మల్లీశ్వరి.

నాగరాజు నవ్వుతూ, “వానొచ్చేట్టేమిటి, ఇదిగో జల్లు మొదలైంది కూడా! వాన వస్తోంది కాబట్టే అది గుర్తొచ్చింది, ఈ మన పోక కూడా వాన వల్లే!” అన్నాడు ఈ పాటి వాన మననేం చేస్తుందిలే అన్న ధీమాతో!

“సరిసరి! సరిగ్గా ఇదే అనుకున్నాను! చిటపట చినుకులే నిన్నటువైపుకు లాగి ఉంటాయని!, అయితే, జల్లు కాస్త పెరిగే లోపలే, త్వరగా పద”, అంటూ నాగరాజు చేయి పట్టుకుని ఊరి చివరి రాయమండపానికి చిరు పరుగులాంటి నడకతో బయలుదేరి, పది నిముషాల్లో చేరుకున్నది కూడా!

***

కాస్సేపు ఆ మాసిన గోడల, విరిగిన తోరణాల పాత మండపంలో కూర్చుని మాట్లాడుకున్నాక నాగరాజు చెప్పటం మొదలుపెట్టాడు:

“మల్లీ, ఇందాకా అనుకున్నామే, గుడి బాగు చేయించాలని, దానితో పాటే ఇంకో ఆలోచన కూడా వుంది నాకు, నీవు విని ఒప్పుకుంటే ఆ కార్యక్రమం కూడా చేపట్టి, నిర్వహించాలి మనమే!” అన్నాడు.

“ఏమిటో చెప్పు బావా, నీ మాటే నా మాట కాదూ”అన్నది మల్లీశ్వరి స్నేహపూర్వకంగా.

“మనము ఒక శిల్ప శిక్షణాలయం ఆరంభించాలి. అందులో ఆసక్తి, నైపుణ్యమూ ఉన్న మన ఊరి వారికి, చుట్టుపక్కల ఊళ్ళ యువకులకీ శిక్షణా, అవకాశమూ ఇవ్వాలి మనం! రాజు గారిచ్చిన ధనంలోంచే, వారి పాలితులైన మన దగ్గరి ఊళ్ళ జనానికి వ్యాపకమూ ఆధారమూ ఏర్పాటు చేసిన వాళ్ళమౌతాం, నాకూ నేర్చుకున్న కళతో జీవనం గడిపే అవకాశం ఏర్పడుతుంది” అని ఇంకా ఏదో అనబోతుంటేనే మల్లీశ్వరి,

“భేషైన ఆలోచన, తప్పకుండా చేద్దాం, నీ శిల్పకళా ప్రావీణ్యమూ ప్రపంచానికి తెలుస్తుంది దీని ద్వారా” అన్నది ఆనందంగా, ఆవేశంగా!

కాస్సేపు అవీ ఇవీ మాట్లాడుకుని వెనుదిరుగుతూ, “బావా ఒక్క క్షణం సంపెంగ తోటకి వెళ్ళి చూసి వెళ్దాం” అన్నది, సంపెంగల సౌరభాలు మత్తెక్కించేస్తుంటే!

ఇద్దరూ పక్కనే ఉన్న తోటలోకి వెళ్ళారు, మల్లీశ్వరి మురిసిపోతూ, నాలుగు పూలు కోసుకున్నది. “తల్లీ, రాచమల్లీ! ఇక పద, కాస్సేపట్లో చీకటి పడబోతోంది, పైగా సంపెంగ ఘుమఘుమలకీ, పాముల బుసబుసలకీ దగ్గరి చుట్టరికం అంటారు”, అన్నాడు ఆమెను ఆట పట్టించడానికి!

దానికి మల్లీశ్వరి కోపం నటిస్తూ,”రాచమల్లి, బూచిమల్లి అంటే నేను రానేరాను, ఈ సంపెంగల మధ్యలో హాయిగా ఉండిపోతాను, జాగ్రత్త”, అని బెదిరించింది.

“పైగా, పాముల భయం నాకస్సలు లేదు తెల్సా, మా అమ్మా, నేనూ చిన్నప్పటి నుంచి నాగరాజు భక్తులమే, ప్రతిఏటా పాలుపోసి నాగులచవితి నాడు భక్తిగా పూజ చేస్తాం తెల్సా!”, అన్నది రుసరుసలాడుతూ!

“నీ నాగరాజు భక్తీ తెలుసు, మీ అమ్మగారి పేరు నాగమ్మ అనీ తెలుసు, తొందరగా పదవమ్మా”, అన్నాడు నాగరాజు సరదాగా!

“కానీ, ఏది ఏమైనా, ఇప్పుడు ఆనాటి పాట మాత్రం పాడకూడదమ్మాయ్, ఇప్పుడు ఏ బిగువూ లేకుండా నీ రాజు నీ దగ్గరే ఉన్నాడుగా”, అన్నాడు కవ్విస్తూ!

“పో బావా,” అని చనువుగా అని, మల్లీశ్వరి అనుకోకుండా అదే పాట పల్లవి కూనిరాగం తీస్తూ బయలుదేరింది. “పిలచిన బిగువటరా, చెలువలు తామే వలచి వచ్చినా.. భళిరా రాజా..!”

“వద్దంటూంటేనే, మళ్ళీ అదే పాటా..?!”, అంటూ నాగరాజు ఫిర్యాదు చేస్తున్నట్టు అంటే, అదేమీ పట్టించుకోకుండా చరణం కూడా అందుకుంది, తన ప్రాణానికి ప్రాణమైన బావ పక్కనే ఉన్నాడన్న జోరు మీదున్న మల్లీశ్వరి.

‘ఈ నయగారము ఈ వయ్యారము

ఈ నవయౌవన మానగ నిను

నే.. పిలచినా బిగువటరా

గాలుల తేలెను గాఢపు మమతలు..’

చరణాలు మెల్లగా రెండుసార్లు పూర్తిచేసిందో లేదో ఆ ఆనందరాగాల్లో, ఆ వడివడి నడకల్లో – పది నిముషాల్లో ఊరు చేరుకున్నారు ఇద్దరూ.

వారి మనసుల్లో విరిసిన ఆశారాగాలా అన్నట్టు సంధ్యాకాశం అద్భుతమైన వన్నెలతో అలరించింది, వాన వెలిసిన ఆ మునిమాపువేళ, ఆ ప్రాంతంలో!

***

తరువాత, వారు అనుకున్నట్టే ఆలయ పునరుద్ధరణ పెద్దలు సలహాలతో, దగ్గరుండి చేయించాడు నాగరాజు ఒక రెండు నెలలలో. గుడి పుష్కరిణి శుభ్రపరిపించి నీటి ఏర్పాటులను కూడా సరి చేయించాడు. పూర్తిగా వెల్ల వేయించి గుడికి కొత్త కళ తెప్పించారు. ఊరి జనం అంతా ఆనందపడ్డారు, తెగ మెచ్చుకున్నారు కూడా నాగరాజునీ, మల్లీశ్వరినీ. చిన్న వాళ్ళైనా వారి ఉదార స్వభావాన్నీ, దైవం పట్ల ధర్మం పట్ల వారికున్న భక్తిశ్రధ్ధలనీ!

పూజారి తాత, “నా జీవితకాలంలో ఈ వైభవం మా స్వామికి వస్తుందనుకోలేదు, అంతా మా మల్లి అదృష్టం, మా నాగరాజు మంచి మనసూ”, అని ఆనందంతో తబ్బిబ్బైపోయి ఆశీస్సులు కుమ్మరించాడు వారిద్దరి మీదా!

బాగు చేయించిన వారంరోజులలోనే గుళ్ళోని అమ్మవారికీ అయ్యవారికీ కళ్యాణమహోత్సవాలు కూడా జరిపించారు నాగరాజు, మల్లీశ్వరి దంపతులే ప్రధాన పోషకులై, ఊరు ఊరంతా పెళ్ళి సందడితో కళకళలాడుతూండగా!

***

తన శిల్ప విద్యాలయం గురించి సలహా సంప్రదింపుల కోసం రాచనగరు వెళ్ళి అప్పటి ప్రధాన స్థపతి విఠలప్పను కలిశాడు కూడా నాగరాజు, ఒకటి రెండుసార్లు,ఆయనతో తనకున్న పూర్వ పరిచయం పురస్కరించుకుని.

తరతరాలుగా మల్లీశ్వరి తండ్రి తరఫున వారసత్వంగా వస్తున్న రెండెకరాల స్థలంలోనే ఏర్పాటుచేశాడు నాగరాజు తన శిల్పవిద్యాలయాన్ని!

ఆరంభదశ కాబట్టి, నాగరాజు ఒక్కడే గురువుగా, చుట్టుపక్కల ఊళ్ళ నుంచి చేరిన పదిమంది చురుకైన యువ శిష్యులతో మొదలైంది విద్యాలయం. క్రమంగా ప్రభుత్వం తరఫున సహాయం అందించే వీలు చేస్తానని భరోసా ఇచ్చారు రాజ్యప్రధాన స్థపత్యాచార్యులైన విఠలప్ప గారు.

మూడు నెలలైన తరువాత ఒక రోజు ఇతర శిల్పకళాలయాల తనిఖీకి వెళ్తూ, విఠలప్పగారు నాగరాజు విద్యాలయానికి కూడా వచ్చి, అతని కృషికి చాలా సంతోషించి, ఇంకా అభివృద్ధికి తీసుకుని వచ్చే తగిన సూచనలు సలహాలు ఇచ్చి వెళ్ళారు.

***

కాలం ఆనందంగా తృప్తిగా సాగిపోతోంది మల్లీనాగరాజులకు.

మల్లీశ్వరి కూడా చిన్ననాడే పట్టుబడ్డ సంగీతం నృత్య కళలలో బాగా సాధన కొనసాగిస్తోంది, విద్యాలయం పనుల్లో తలమునకలుగా ఉండే భర్త నాగరాజుకు దీటుగా!

***

దాదాపు సంవత్సర కాలం గడిచింది.

ఒక రోజు, ఇద్దరు భటులతో, ఒక రాజోద్యోగి గుర్రాలమీద వచ్చి ఆగాడు, నాగరాజు, మల్లీశ్వరుల ఇంటిముందు.

పూలమొక్కలకు నీళ్ళు పోస్తున్న మల్లీశ్వరే చూసింది ముందుగా వారిని. ఆమెకు చాలా భయం వేసింది, గతంలో తనను రాణివాసం తీసుకెళ్ళే ఉత్తరువులతో రాణిగారు పంపిన భటుల రాక గుర్తువచ్చి!

ఇంతలో నాగరాజు వచ్చి వారితో మాట్లాడి విషయం ఏమిటని కనుక్కుని, మల్లీశ్వరికి చెప్పాడు.

వారి రాకకు కారణం తెలిసిన తరువాతే ఆమె మళ్ళీ మామూలు మనిషి అయింది, ‘హమ్మయ్య’, అనుకుని!

విఠలప్ప గారు ఒక లేఖ పంపారు, ముందుగా అది ఇచ్చాడు రాజోద్యోగి, నాగరాజుకు.

అందులో ప్రభుత్వం ఆ యువదంపతుల చొరవను, సేవా కార్యక్రమాలనూ గుర్తించిందనీ, త్వరలో రాజుగారి ఆర్థిక కార్యాలయం నుంచి అధికారులు వచ్చి ఎంత సహాయం అవసరమో విద్యాలయం ఇంకా వృద్ధి లోకి రావడానికీ, విద్యార్థుల వసతి ఏర్పాట్లకూ, ఇద్దరు అదనపు శిక్షకుల ఏర్పాటుకూ అంచనావేసి తరువాత ఆ ధనం వారికి మంజూరు చేస్తారని ఉన్నది.

రెండవ లేఖ రాణిగారి ముద్రతో ఉన్నది. తన దగ్గర అంతఃపుర సఖిగా పనిచేసిన, గాననృత్యాలలో ప్రవీణ అయిన మల్లీశ్వరికి భర్త నాగరాజుతో సహా, ఏటా జరిగే వసంతోత్సవ ప్రత్యేక సభలలో పాల్గొనే, చూసే అవకాశం కల్పిస్తూ జారీ చేసిన ఉత్తరువులు అవి.

రాజోద్యోగి గౌరవపురస్సరంగా ఆ పత్రాన్ని మల్లీశ్వరి చేతికందించాడు, ఇంటిలోపలకు అణకువగా వచ్చి, రాణీవారు పంపిన ఇతర కానుకలను కూడా అప్పగిస్తూ!

అరగంటలో తాము వచ్చిన పని ముగించి వెళ్ళిపోయారు గుర్రాల మీద, ఆ వచ్చిన ముగ్గురు రాజ సేవకులూ.

***

శ్రీకృష్ణదేవరాయలవారి, రాణీ తిరుమలదేవిగారీ సౌజన్యానికి నాగరాజు మల్లీశ్వరి దంపతులు వేయి సార్లు నమస్కరించారు తమ మనసులలో. కృతజ్ఞతాభావంతో వారి మనసులు నిండిపోయినై,వారి కళ్ళు చెమ్మగిల్లాయి.

అట్లాగే ఇద్దరూ విఠలప్పగారి సహృదయతనూ, ఎంతో ఆదరగౌరవాలతో తలుచుకున్నారు కూడా!

***

క్రమక్రమంగా వీరిద్దరూ చేసిన, చేస్తున్న సేవలకూ, ఊరి వారందరితో కలివిడిగా,సహాయకారులుగా ఉండే గుణానికీ ఆ ఊరి పేరునే ‘నాగమల్లీశ్వరపురం’గా ప్రజలు వాడటం ఆరంభించేశారు.

“మా ఊరు మల్లీశ్వరమ్మ గారి ఊరికి దగ్గరే” అనీ, “ఓహో అదా, నాగరాజు గారి ఊరు, మాకు తెలియకేం” అనీ ఆడవారూ, మగవారూ తమ సంభాషణల్లో వాడటం పరిపాటి అయిపోయింది కూడా!

మంచి మనసులకు ఆ విరూపాక్షదేవుని దయ తప్పకుండా ఉంటుందిగా మరి, ఆశ్చర్యమేముందీ!!

Exit mobile version