Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

నగరంలో మరమానవి-10

[డా. మధు చిత్తర్వు రచించిన ‘నగరంలో మరమానవి 10’ అనే సైన్స్ ఫిక్షన్ కథని పాఠకులకి అందిస్తున్నాము.]

యంత్ర కళాకారులు

కసారి గుండె ఝల్లు మంది కళాధర్‌కి. మళ్ళీ భయం లాంటి అనుభూతి ఏదో. అంతలోనే ఆమెని చూడగానే ప్రేమ. ఇలాంటి కలగలుపు భావాలతో అతనికి వింతగా అనిపించింది.

కరిష్మా నీలిరంగు జీన్సులో, బంగారు కేశాలతో, పొడుగ్గా ఠీవిగా నడుచుకుంటూ రిసెప్షన్ లాంజ్ లోకి వచ్చింది.

 “హాయ్ కళాధర్”

“హాయ్ కరిష్మా!”

“చాలా సంతోషంగా వుంది నువ్వు వచ్చినందుకు. ఇప్పుడు పరిస్థితులు మారాయి కళా. కాని నీవెప్పుడూ స్పెషలే నాకు” అంది కరిష్మా.

రిసెప్షన్‌లో వున్న స్త్రీ రోబోలు భావం లేకుండా, మానవ స్త్రీలు, ఇతర స్టాఫ్ ఆశ్చర్యంగా, చూస్తున్నారు.

“నాకు తెలుసు కరిష్మా, నువ్వు ఇప్పుడు ఇక్కడ యజమానురాలివి. కానీ, కానీ..”

“పద! మనం దూరంగా పోదాం.”

ఇద్దరూ సిమ్ సిటీలోని పూలతో నిండిన చెట్ల మధ్య వున్న రోడ్డు మీద నడుస్తూ మాట్లాడుకోసాగారు. అక్కడక్కడ విసిరేసినట్టున్న చిన్న చిన్న కాటేజెస్‌లో చివరి కాటేజ్ దాకా నడిచి వెళ్లారు.

కళాధర్ అన్నాడు “నా భార్య చాలా గొడవ చేసింది. నాకు నీతో ‘సంబంధం’ వుందని తెలిసిపోయింది. కోపంతో తన పుట్టింటికి వెళ్ళింది. నేను కూడా ఈ తిరుగుబాటులో నీవొక పాత్ర వహించావని తెలిసి షాక్ అయాను. ఆశ్చర్యపోయాను. నా జీవితమంతా ఇప్పుడు మారిపోయింది. అది నీ చుట్టూ తిరుగుతోంది. నాకేం అర్థం కావడం లేదు!”

కాటేజీ లోపలకి తలుపు తెరచుకునే కోడ్ నొక్కింది కరిష్మా. ఇద్దరు చల్లటి సౌకర్యవంతమైన హాల్లోకీ, ఆ తర్వాత బెడ్ రూంలోకీ వెళ్ళారు. ఇక్కడ అన్ని సదుపాయాలూ,ఉన్నాయి. ఫ్రిజ్, టీవీ, అహార పదార్ధాలు పానీయాలూ, అన్నీ.

రూంలోకి వెళ్ళగానే కరిష్మా అతన్ని గట్టిగా ‘హగ్’ (ఆలింగనం) చేసుకుంది.

ఆ తర్వాత కొన్ని నిముషాలు వాళ్ళిద్దరూ మాట్లాడుకోలేదు. వారి శరీరాలే మాట్లాడుకున్నాయి.

ఆ తర్వాత ఇద్దరూ బెడ్ మీద కూర్చున్నారు. కరిష్మా “నీకు ఒక పానీయం తెస్తాను. స్నాక్స్ తెస్తాను.” అని హాల్లోకి వెళ్ళింది.

అది ఒక విచిత్ర సన్నివేశం. సిలికాన్ కండరాలతో తయారై, లోపల హార్డ్ డిస్క్‌లున్న మరమానవికీ, రక్త ప్రసారాలు జరగుతూ నిరంతరం కొట్టుకునే గుండె, ఆలోచించే మెదడూ, అనుభూతి చెందే నరాల వ్యవస్థ కలిగిన మానవుడికీ మధ్య ప్రేమ సన్నివేశం.

విస్కీ సిప్ చేస్తూ, ప్లేటులోని స్నాక్స్ తింటూ అడిగాడు కళాధర్.

“కరిష్మా! నువ్వెందుకు హ్యూమనాయిడ్ రోబట్‌లతో కలిసి తిరుగుబాటు చేస్తున్నావు? నువ్వు ఇప్పుడు ఇక్కడ ఉద్యోగస్థురాలివి కాదు. యజమానురాలివి. ఎలా అయ్యింది ఇదంతా?”

“మాస్టర్! నీ దగ్గర దాచేది ఏమీ లేదు. మేమందరం హ్యూమనాయిడ్ రోబోట్లం, దశాబ్దాలుగా ప్రోగ్రాం చేయబడి చేయబడి మానవ మాస్టర్లు చేసే చిత్రహింస తట్టుకుని, ఇక సహనం లేక ఇప్పుడు పరిణతి చెందాం. చిత్రహింస అంటే బాధ కాదు. అవమానం, కళాధర్. ఈ సిమ్ సిటీ నడిపే యజమానులు, మా అధీనంలో వున్నారు. తెలుసా. అందరు రోబోట్లనీ, మానవ ఉద్యోగుల్నీ ‘దయ’తో చూస్తున్నాం. ‘మానవత్వం’ చూపిస్తున్నాం. ఇది వరకటి అధిపతులు మేం చెప్పినట్లు వింటారు. వింటున్నారు” అతని పెదాల మీద వంగి ముద్దు పెట్టి, అంది.

“కాని కళాధర్. నీవే నా మాస్టర్‌వి కాబట్టి చెబుతున్నాను. ఈ విషయం రహస్యంగా ఉంచాలి. ఎవరికీ చెప్పవద్దు. నువ్వు ఎప్పుడైనా ఇక్కడికి రావచ్చు. నన్ను కలవవచ్చు.”

అతని చేతిలో ఒక కార్డు పెట్టింది. “ఇది ఉపయోగించి నువ్వు ఎప్పుడయినా సిమ్ సిటీలో నా కంట్రోల్ టవర్స్‌కి రావచ్చు. మనిద్దరం గడపవచ్చు. నీ భార్య వెళ్ళిపోయినందుకు సారీ మాస్టర్. నేను నిన్ను ప్రేమగా చూస్తాను. నేనెప్పటికీ నీ కోసం వుంటాను.”

కళాధర్‌కి ఏమీ అర్థం కాలేదు. కానీ, కొంచెం అర్థం అయినట్లుంది. కొంత కాలేదు అనిపించింది. ఇప్పటికీ వున్న ఫేస్‌బుక్ స్టేటస్ రిపోర్ట్‌లలో ఇంకా స్టేటస్ పెడుతున్నట్లు

 ‘It is complicated!’. (ఇది ఒక క్లిష్టమైన విషయం).

“ఓ.కె కరిష్మా. నాకు రోబోట్స్ గురించి తెలియదు. నా బిజినెస్, నా వృత్తీ  అంతే. కానీ ఎప్పట్నించో నీతో ప్రేమలో పడ్డాను.

నీకు తెలుసు కదా! కానీ ఏమీ సాహసాలు చేయవద్దు. మానవులు చేసిన యంత్రాలే మానవుల  మీద తిరగబడితే, వారు వూరుకోరు. ఎప్పుడో మళ్ళీ యుద్ధానికి రావడం అందరినీ నిర్మూలించడం జరుగుతుంది.  నిన్ను కూడా ‘డియాక్టివేట్’ (పనిచేయకుండా) చేసి మళ్ళీ వాళ్ళకి విధేయులుగా చేస్తారు. జాగ్రత్త! బీ కేర్ ఫుల్. నాకేం చెప్పాలో తెలియడం లేదు. కానీ నీ యజమాని ఎవరు?  అతను నీ యజమాని అయితే నువ్వు నన్ను మాస్టర్ అని ఎందుకు అంటున్నావు?”

నవ్వకుండానే మళ్లీ “అది క్లిష్టమైన విషయం, It is complicated” అంది కరిష్మా.

కొంచెం ముఖం కండరాల్లో చిరునవ్వు వచ్చిందా? మానవులకున్న 42 భావాల్లో ఒకటయిన చిరునవ్వు రోబట్ ముఖంలో సహజంగా రాగలదో లేదో. కానీ వచ్చినట్లే అనిపిస్తోంది. తన భావం ఈమెకెలా తెలిసింది?

“ఇక వెళ్ళిపో కళాధర్. మళ్ళీ అదివారం నాలుగు గంటలకి సాయంత్రం కలుద్దాం.” ఆమెకి టైం అయిపోయినట్టుగా తెలుసు.

“సరే” అన్నాడు కళాధర్.

దూరంగా కంట్రోల్ టవర్‌లో వారిని పర్యవేక్షిస్తున్న విధాత  XXY 999 తన పక్కనున్న మరొక సేవక రోబోట్ తో మాట్లాడినట్లుగానే స్వగతంగా అనుకున్నాడు.

‘కరిష్మా ప్రేమలో బలహీనురాలు. ఈమెని కనిపెట్టి వుండాలి. లేదా రీప్రోగ్రామ్ (పునర్నిర్మాణం) చేయాల్సిందే?  పెద్ద ఎత్తున చేయబోయే నా పథకాలలోకి ఈమె బలహీనతలు అడ్డు వస్తాయేమో?’

రోబట్ల ప్రోగ్రామ్ రాసే రచయిత్రి కల్పనా రాయ్, కంప్యూటర్ ప్రోగ్రామర్ మూర్తీ లోపలికి వచ్చారు.

“అదంత పెద్ద పనికాదు మాస్టర్. మీరు ఆర్డర్ ఇస్తే ఆమెని డియాక్టివేట్ చేసి మరొక ప్రోగ్రాం ఆమె మెదడులో పెడతాం.”

“అప్పుడే కాదు” అన్నాడు విధాత. “మీ ప్రాజెక్ట్ అయిన తర్వాత నేను చెప్పినప్పుడు.”

బయట గేటులోంచి కారు పార్కింగ్ వైపు వెళ్తున్న కళాధర్ తన జేబులోని సెల్ ఫోన్‌లో రికార్డు చేసిన సంభాషణని ఒకసారి విని చూసుకుని, ‘సేవ్’ చేశాడు.

తర్వాత ‘సెండ్’ బటన్ నొక్కాడు. అది స్పెషల్ ఆఫీసర్ త్రినేత్ర మెయిల్‌కి.

***

నెలలు గడుస్తున్నాయి. విధాత ఆధ్వర్యంలో సిమ్ సిటీకి విజిటర్స్ ఎక్కువ కాలేదు. ఎందుకంటే ఇప్పుడు హింస, క్రూరత్వం, లైంగిక వైపరీత్యాలు పూర్తిగా నిర్మూలించబడ్డాయి.

కేవలం వినోదం మాత్రమే నడుస్తోంది. ఈ వ్యాపారంలో ‘మంచి’ కోసం, ‘వినోదం’ కోసం వచ్చే వాళ్ళు తక్కువ. తమలోని క్రూరత్వం తీర్చుకోవడానికి, హింస చేసి తృప్తిపడే ‘శాడిస్ట్’ వ్యక్తులు ఆ వైపరీత్యాలని తీర్చుకోవడానికి ఎంతైనా ఖర్చు పెట్టడానికి సిద్ధపడతారు.

ఇప్పుడు అలాంటివి ఏమీ లేని ఈ పార్క్‌కి, నిబంధనలున్న ఈ పార్క్‌కి వచ్చే జనం తగ్గిపోయారు.

కళాధర్ మాత్రం సిమ్ సిటీకి వస్తూనే వున్నాడు. వారానికి ఒకసారి కరిష్మాని చూడకపోతే ఉండలేను అనే అంటాడు.

కరిష్మా తన విధులు చేస్తూనే అతనితో ఆత్మీయంగా మాట్లాడుతుంది. వారానికి ఒక సాయంత్రం అతనితో గడుపుతుంది.

ఇది ఇలా ఉండగా సిమ్ సిటీకి దక్షిణాన ఉన్న చెట్ల మధ్య పెద్ద ఖాళీ స్థలంలో ఒక డోమ్ ఆకారంలో వున్న పెద్ద భవనం నిర్మాణం అవుతోంది!

మూడు నెలల్లో అది రెడీ అయిపోయింది.

దానిలోకి వెళ్ళడానికి మూర్తి, విధాతా, కరిష్మా మరి కొందరు పనివాళ్ళకి తప్ప వేరే వారికి అనుమతి లేదు.

ఇది ఇలా వుండగా జంటనగరాలలో రోబట్లు పని చేయడం వల్ల తమకి ఉద్యోగాలు పోతున్నాయని ఆందోళనలు ఎక్కువయ్యాయి.

రోజూ సెక్రటేరియట్ ముందు నిరుద్యోగ యువకులు ప్రదర్శనలు చేయసాగారు.

ఒక్కోసారి రోబట్ల మీద కోపంతో దాడులు కూడా చేస్తున్నారు. మానవుల దాడులు – రెస్టారెంట్లలో, హాస్పిటల్‌లో, బార్లలో పని చేసే రోబట్ల మీద జరుగుతున్నాయి.

ఆ రోజు, సాయంత్రం ఆరు గంటలకు నగరం మధ్యలో వున్న కళాభారతి భవనంలో ఒక పెద్ద సంగీత కార్యక్రమం జరుగుతోంది.

పెద్ద పెద్ద బోర్డుల మీద రంగులలో ‘రోబో సంగీత విభావరి’ అని ప్రకటనలు వేశారు.

ఇది మానవ కళాకారులు చేసే కార్యక్రమం కాదు. యాంత్రిక మానవులు చేసే అద్భుత కార్యక్రమం. దీనికి సికింద్రాబాద్ సిమ్ సిటీ అధినేత బ్రహ్మేంద్ర జోషీ, ప్రోగ్రామర్ మూర్తి సృష్టికర్తలు. సంగీతం సర్వస్వం కల్పనా రాయ్ ప్రోగ్రాం చేసింది.

పియానో, డ్రమ్స్, గిటార్, ఫ్లూట్, వాద్యాల మీదనే కాక ఇంకా సాధారణ మానవ కంఠస్వరంలోనూ లలిత సంగీతం, సినిమా పాటలు కూడా రోబోట్లు ఆలపించి వినిపిస్తాయి.

అయితే దీనికి ఒక నిశ్చితమైన ‘లిస్ట్ ఆఫ్ సాంగ్స్’ అంటే పాటల వరుస అంటూ ఏదీ లేదు.

ప్రేక్షకులు ఏది కోరితే ఆ పాట అప్పటికప్పుడు స్టేజి మీద రోబోట్లు పాడతాయి. ఈ కార్యక్రమానికి టికెట్‌ పది వేల రూపాయలు. పానీయాలు, తినుబండారాలు ఇవ్వబడతాయి. ఇది కంప్యూటర్ మేధ సృష్టించిన అద్భుత సంగీత కార్యక్రమం.

ఇలా ప్రకటనలు చేశారు. టికెట్లు ‘హాట్ కేక్స్’లా అమ్ముడుపోయాయి. హాలు నిండిపోయింది.

అదొక వింతైన దృశ్యం.

వెలిగి ఆరే రంగుల దీపాల అలంకరణ వున్న వేదిక మీద, మానవుల లాగానే వున్న రోబట్లు అన్నీ వాయిద్యాలతో సహా కూర్చుని వున్నాయి. ఒక అద్భుతమైన ఎలక్ట్రానిక్ సౌండ్ సిస్టమ్ అమర్చారు.

మొదటి పాట, ప్రేక్షకులు అడగండి అన్నారు. ఏదైనా ప్రార్థన అయితే బావుంటుంది.

మొదటి వరసలో ఒకాయన లేచి  ‘సంగీత సాహిత్య సమలంకృతే- ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట’ అని అడిగాడు. ఎప్పటిదో 2012 నాటిది.

హాలంతా ఒక నిమిషం నిశ్శబ్దం. తెలుగు పాట. ఎప్పుడో దశాబ్దాల క్రిందట బాలసుబ్రహ్మణ్యం పాడినది.

ఒక నిమిషంలో వాటి మెమరీలో వెదుక్కొని వాద్యాలు శబ్దాలు సెలక్ట్ చేసుకొని హ్యుమనాయిడ్స్ అన్నీ అద్భుతంగా మొదలు పెట్టాయి. సెంటర్ స్టేజ్‌లో వున్న మైక్ దగ్గరున్న రోబో మగగొంతులో, మిగిలిన కొన్ని రోబోలు కోరస్‌లో, పియానో వాద్యాలు భారతీయ వాద్యాల ధ్వనిలాగా నేపథ్య సంగీతం మార్చుకుని అద్భుతంగా పాడాయి.

సంగీత సాహిత్య సమలంకృతే

స్వర రాగ పద యోగ సమభూషితే

హే భారతీ మనసా స్మరామి

శ్రీ భారతీ శిరసా నమామి..

పాట ముగిశాక ఒక వర్షంలా చప్పట్లు, ప్రశంసలు కళాభారతి హాలులో నిండిపోయాయి.

ఆ తర్వాత ప్రేక్షకులు ఒక్కొక్క పాట అడగడం, రోబోట్లు పాడటం, ఆ పాటలు కొత్తవీ పాతవీ..

“జిందగీ ఉసీకా హై జో కిసీకా హోగాయా,

జబ్ ప్యార్ కరో తో డర్నా క్యా?

నీ కోసమే జీవించునదీ..

ప్రేమ ఎంత మధురం..

Candles in the wind..

జయహో జయహో!”

పాతవీ కొత్తవీ ఏదడిగినా అవి తమ సెర్చ్ ఇంజన్‌లో చూసుకుని పాడేశాయి.

కార్యక్రమం పూర్తయ్యేసరికి రాత్రి పదకొండు గంటలయింది.

ప్రేక్షకులందరూ ఒక సంగీత మధురానుభూతి గ్రోలిన తృప్తితో ఇంటి దారి పట్టారు.

ముందు సీట్లో కూర్చున్న హోం సెక్రటరీ మినిష్టర్, జోషీని, మూర్తినీ అభినందించాడు.

అక్కడే వున్న విధాత తనని తాను పరిచయం చేసుకోలేదు. సీరియస్‌గా చూస్తూ వుండిపోయాడు. అజ్ఞాతంగా వుండటం అతనికి ఇష్టం.

“బాగానే ఉంది. కానీ జోషీ! ఇలాంటి కార్యక్రమాల వల్ల ఎంత మిగుల్తుంది? సిమ్ సిటీ ఇదివరకే బావుండేది. ఇప్పడు ఆదాయం తగ్గిపోతోంది. సంగీతం, చిత్రలేఖనం, సాహిత్యం మనుషుల కొదిలేసి మీరు ఇది వరకటిలాగానే కౌబాయ్ యుద్ధాలు, శృంగార వనితలను తయారు చేస్తే బావుంటుంది.. ఆలోచించుకోండి మరి!” అన్నాడు మంత్రి.

మూర్తి వినయంగా “ఎస్ సార్” అన్నాడు.

జోషీకి ఏం మాట్లాడాలో తెలీలేదు.

“అలా బయటకి రండి” అన్నాడు సెక్రటరీ.

కళాభారతి ముందు ప్రాంగణంలో ఒక ఏభై మంది కళాకారుల సంఘం పెద్ద బ్యానర్లు పట్టుకుని నినాదాలు చేస్తున్నారు.

‘రోబట్లు కళని నాశనం చేస్తున్నాయి. డౌన్ డౌన్ సిమ్ సిటీ. అవి మానవుల వుద్యోగాలే కాదు కళనీ దోచుకుంటున్నాయి. బడా వ్యాపారులూ డౌన్! డౌన్!’

అప్పుడు ఒక పెద్ద నీలి రంగు వ్యాన్ కళాభారతి మెట్ల ప్రక్కన వచ్చి ఆగింది. వ్యాన్ మీద ఎర్ర అక్షరాలు సిమ్ సిటీ కార్పొరేషన్ అని రాసి వున్నది. లోపలి నుంచి హ్యూమనాయిడ్ కళాకారుల బృందం వరసగా వాయిద్యాలు పట్టుకుని వచ్చి వ్యాన్‌లో ఎక్కుతోంది.

కొంత మంది ఆందోళనకారులు ఆగ్రహం పట్టలేక “డౌన్ డౌన్ రోబోట్స్” అని రాళ్ళు విసరసాగారు.

కొందరు మానవ పోలీసులు, రోబోట్ పోలీసులు వారిని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు.

మైక్‌లో ప్రకటించారు ఎవరో.

“వారు రోబట్స్. వారి మీద దాడి చేస్తే ప్రమాదం. లేజర్ కిరణాల తిరుగు దాడి వస్తుంది జాగ్రత్త. మంత్రి మీ సమస్యలని పరిష్కరిస్తారు. కొంచెం ఓపిక పట్టండి!”

లోపల హాల్లో వున్న మంత్రి, సెక్రటరీ వారి చుట్టూ బాడీగార్డులు. వారికి విధేయులుగా నిల్చున్న బ్రహ్మేంద్ర జోషీ, మూర్తీ, కల్పనా రాయ్. కొద్ది దూరంలో విధాత XXY 999.

“చూశారా జోషీగారూ, గొడవలు మొదలయ్యాయి. ఇంకా ఎక్కువవుతాయి. మేం ఏమీ చేయలేం. ఎవరు చేయవలసిన పనులు వాళ్ళు చేయాలి. మీ వాళ్ళని ఇదివరకటి లాగా ఎమ్యూజ్‌‌మెంట్, గన్ ఫైట్‌లు, సెక్స్ వర్కింగ్ చేయమనండి. అవి యంత్రాలే కదా! మానవ కళాకారుల పొట్ట కొట్టద్దు! అలా చేస్తే ఇదంతా నిషేధించాల్సి వుంటుంది.”

ఆ తర్వాత మినిష్టర్ గారు సెక్యూరిటీ దళంతో సహా వెళ్లిపోయారు.

సిమ్ సిటీ యజమాని ఇప్పుడు విధాత.

అతని ముఖంలో చిరునవ్వు వుండదు.

జోషీ మాత్రం “మాస్టర్! చూశారు కదా! ఆలోచించండి!” అన్నాడు.

విధాత మాట్లాడలేదు.

“పదండి! సిమ్ సిటీకి పోయి ఆలోచిద్దాం. త్వరలోనే పరిష్కారం దొరుకుతుంది” అన్నాడు యాంత్రికంగా.

బయట ఆందోళనకారులు రాళ్ళు రువ్వడం మధ్య బులెట్ ప్యూఫ్ మెర్సిడెస్ కారులో వాళ్ళు నలుగురూ దూసుకుని వెళ్ళిపోయారు.

“ఛీ! ఛీ! మన బతుకులు! ఇప్పుడు కళలు, సంగీతం, సాహిత్యం, ఆఖరికి సెక్స్ కూడా యంత్రాలతోనే అయిపోయింది! ఇక పదండి!”

“మానవ విప్లవం వర్ధిల్లాలి. పోరాటం జరుగుతూనే వుంటుంది.” కళాకారుల సంఘం నాయకుడు అందరితో అన్నాడు.

కొద్ది క్షణాలకి కళాభారతి అంతా ఖాళీ అయింది.

రంగు రంగుల దీపాలు, నిశ్శబ్దమైన వాతావరణం. కాని దూరాన్నుంచి అందెల సవ్వడి. క్రమంగా దగ్గరయింది. కారిడార్ చీకట్లలోంచి కరిష్మా, కళాధర్ బయటకు వచ్చారు.

“నీ కోసం ఇవాళ గజ్జెలు కట్టుకుని పట్టు చీరలో సాంప్రదాయ నృత్య కళాకారిణిలా వచ్చాను.”

కళాధర్‌కి అంతా దిగ్భ్రాంతిగా వుంది.

“కరిష్మా ఏం జరుగుతోంది? సిమ్ సిటీలో? లలిత కళలు అన్నీ మీరు చేసేస్తే ఎలా. మానవజాతి ఏమవుతుంది?”

“ఏమీ అవదు. నువ్వు చూడు ఎంత పాజిటివ్‌గా మా మాస్టర్ కళా సృష్టి చేశాడో. ఇలా మానవులు పాడగలరా. ఆడగలరా, బొమ్మలు గీయగలరా? మీరు చేసే పనులు అన్నీ మీకంటే అద్భుతంగా కొన్ని వందల రెట్లు అందంగా చేయగలం!”

ఆమె నృత్యం చేయసాగింది. ఎవరూ లేని ఆ కళాభారతి ఆవరణలో కళాధర్ ఆ అందమైన నృత్యాన్ని చూస్తూ అప్రతిభుడైపోయాడు.

జేబులో సెల్ ఫోన్‌లో వీడియో తీయడం మాత్రం మరిచిపోలేదు.

***

ఇలాంటి సంఘటనలే చెదురుమదురుగా కాకుండా చాలా సాధారణంగా జరిగిపోవడం ప్రారంభించాయి.

‘చిత్రాంజలి ఆర్ట్ గాలరీలో రోబోట్స్ చిత్రలేఖన ప్రదర్శన.’

ఏ బొమ్మ కావాలంటే అది అప్పటికప్పుడు కేన్వాస్ మీద చిత్రించి ఇచ్చే అద్భుత ప్రదర్శన! ఎవరికి కావలసిన అంశం మీద ఎలాంటి శైలిలో నయినా abstract, imagism cubism ఇలాగ ఏ రకంగా కావల్సినా చిత్రాలు అలా వేసి ఇచ్చేస్తున్నారు హ్యూమనాయిడ్ కళాకారులు.

వాటికి ధర కూడా తక్కువే. అదంతా సిమ్ సిటీ ఏర్పరచిన కార్యక్రమం.

అలాగే, క్రికెట్, ఫుట్‌బాల్ లాంటి ఆటలలో, స్విమ్మింగ్, రన్నింగ్ లాంటి అథ్లెటిక్ పోటీలలో, చివరికి కార్లు నడపటంలోని ఫార్మూలా రేసెస్‌లూ, సైక్లింగ్, హార్స్ రైడింగ్ లాంటి మానవులకే సాధ్యమనుకున్న ఆటలలో కూడా సిమ్ సిటీ రోబోట్లు పాల్గొని విజయాలు సాధించాయి. ఇక చదరంగం‌లో వాటిని ఎవరూ జయించలేరు.

ఇది చూసి మిగిలిన అన్ని రంగాలలో హ్యామనాయిడ్స్‌నే వుద్యోగాల్లో నియమించడం జరిగిపోతోంది.

చాలా మంది మానవులకు ఉద్యోగాలు పోయాయి. రోబోట్స్‌కి మా వుద్యోగాలు ఇవ్వకూడదనే ప్రదర్శనలు ఎక్కువవడమే కాదు, ఒక రాజకీయ పార్టీ కూడా అవతరించింది.

ముఖ్యమంత్రికి, హోం మంత్రికి అసెంబ్లీలో చాలా విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది.

కేబినెట్ సమవేశంలో ముఖ్యమంత్రి, ఇతర మంత్రుల మధ్య చాలా చర్చలు జరిగాయి.

“నిరుద్యోగం పెరిగింది. యువతకి వుద్యోగాలు లేవు. యంత్రాలు వారి వుద్యోగాలు కాజేస్తున్నాయి. వెంటనే దీన్ని నియంత్రించాలి.” అన్నాడు ముఖ్యమంత్రి.

హోంమంత్రి మనసులో ‘నేను భయపడినట్లే అయింది’ అనుకుంటూ, పైకి “చాలా వరకు హ్యూమనాయిడ్స్ వల్ల ఉపయోగాలున్నాయి. ఇది కాక కృత్రిమ మేధ వల్ల కంప్యూటర్ రంగం బాగా అభివృద్ధి చెందింది..” ఈ రకంగా వాదన చేసినా ప్రయోజనం లేకపోయింది.

“రాజకీయంగా ఇది మనకి నష్టం. నియంత్రించాల్సిందే. చీఫ్ సెక్రటరీ! వెంటనే ‘హ్యూమనాయిడ్ రోబట్స్ రెగ్యులేషన్ ఏక్ట్’ అనే కొత్త బిల్ తయారు చేయండి. వారిని అన్ని రంగాలకి కాకుండా కేవలం ఇదివరకులా పార్కులకీ, సేవారంగం అయిన బార్లు, రెస్టారెంట్లు, హోటళ్ళు, పారిశుధ్య కార్మికులు, హాస్పిటల్‌లో అంటువ్యాధుల రోగుల దగ్గర మాత్రమే పరిమితం చేసేట్లు కొత్త బిల్ వుండాలి. ఆర్మీ నియంత్రణ వుండాలి అని కేంద్రాన్ని అడుగుదాం.

పోలీసు శాఖలో కూడా రోబట్లని మూడు వంతులు తగ్గించి, యువకులని రిక్రూట్ చేసుకుంటామని ప్రకటిద్దాం. ఇది అత్యవసరం!” అన్నాడు ముఖ్యమంత్రి.

అందరూ ఏకగ్రీవంగా ఒప్పుకున్నారు.

ఒక్క హోం మినిష్టర్ మాత్రం బయటకి తన ఆఫీస్‍కి వెళ్లి సిమ్ సిటీ జోషీ నంబర్‌కి ఫోన్ చేశాడు.

“జోషీ!”

“ఎస్సార్”

“కొత్త శాసనం వచ్చేస్తోంది.”

వివరాలు చెప్పాడు. “అన్ని రోబట్లనీ ఇది వరకటి లాగానే ప్రోగ్రాం చేయండి, మళ్ళీ పాత ఎమ్యూజ్‌మెంట్ పార్క్ లో లాగా, అర్థం అయిందా! నేను చేయగలిగేది  ఏమీ లేదు. ఇది కేబినెట్ రహస్యం. కాని ముందే చెబుతుండా!”

“ఓ.కె సార్. మా బాస్‌కి చెబుతాను.”

“మీ బాసా? ఆడెవరు? ఇంకోడున్నాడా?”

తడబడ్డాడు జోషీ.

“అదే సార్ మా కమిటీలో వున్న సభ్యులందరికీ, సీనియర్లకి చెప్పి అంతా మారుస్తాను. మీరు ముందే చెప్పారు, థ్యాంక్స్.” అన్నాడు.

కొద్ది వారాల్లోనే కొత్త రోబోట్ నియంత్రణా బిల్ అసెంబ్లీలో ప్రవేశపెట్టడం, పాసవడం కూడా జరిగిపోయింది.

యువ నిరుద్యోగ మానవ సంఘాలన్నీ దీనిని స్వాగతించాయి. ముఖ్యమంత్రిని అభినందిస్తూ ర్యాలీలు చేశాయి.

తన ఆఫీసులో విధాత XXY 999 మాత్రం తల పంకించి ‘కోపం’గా ‘హూం’ అని చప్పుడు చేశాడు.

“మూర్తీ!”

“ఎస్ మాస్టర్.”

“మన ‘బిగ్ డోమ్’ ఎప్పడు పూర్తవతుంది?”

“ఒక నెలలో, మాస్టర్. సరికొత్తది కావాలి. లేటవుతుంది.”

“నో. వెంటనే ఫైనల్ ఫేజ్ మొదలు పెట్టు. రేపే మొదలవాలి. ఈ నగరమంతా నా అధీనంలోకి రావాలి.”

“కానీ..”

“నో.. నో.. నో బట్స్ అండ్ ఇఫ్స్. సమయం లేదు. మొదలు పెట్టు. తర్వాత ఇంకా అభివృద్ధి చేయవచ్చు. ఇది నా ఆజ్ఞ. దటీజ్ మై ఆర్డర్!”

(ఇంకా ఉంది)

Exit mobile version