పునః సృష్టి
“హ్యూమనాయిడ్ రోబోస్, మానవుల వలే ఉండే మరమనుషులని, ఎలా తయారు చేయాలి? ఇలాంటి మరమనిషిని తయారు చేయడానికి ఎలక్ట్రికల్ మెషీన్స్ గురించి బాగా తెలిసి వుండాలి. వీటి వల్ల రోబోలు కదలడం, వాటి శక్తీ తయారవుతుంది.
డిజిటల్ లాజిక్‌లు, సర్క్యూటులు తెలిసి వుండాలి. వాటితో రోబోట్ సెన్సార్ లనీ కెమేరాలని మోటార్లనీ దానిలో వున్న వ్యవస్థలనీ నియత్రించవచ్చు.
ఉన్నత స్థాయి కంప్యూటర్ ప్రోగ్రాం తెలిసి వుండాలి. రోబో ‘కోడ్ ఫంక్షన్’ ప్రోగ్రాం చేయడానికి ఇది పనికొస్తుంది.
ఆర్డిఫిషియల్ ఇంటలిజెన్స్ (కృత్రిమ మేధ) కొన్ని పనులకి వాడటానికి పనికి వస్తుంది. దీంట్లో (FUZZY LOGIC) ఫజ్జీ లాజిక్, రీజనింగ్, మెషిన్ న్యూరల్ నెట్వర్క్, మెషిన్ లెర్నింగ్ ఇలాంటి వన్నీ వుంటాయి.
బలమైన లోహాల గురించి తెలిసి వుండాలి. రోబో నడవడానికి, పనులు చేయడానికి కావలసిన శక్తికి, రోబోట్ మెదడులోని జ్ఞాపక శక్తికి, తర్మానికి చేయవలసిన పనికి సాఫ్ట్‌వేర్ ప్రోగ్రాం తయారు చేసి, మెదడుని డిస్క్‌లో అమర్చాలి.
మిగిలినవన్నీ కేవలం – సౌందర్యానికి కండరాలు, వక్షోజాలు, చేతులు, కాళ్ళు, నవ్వే కళ్ళు, చిరునవ్వు, నవ్వే పెదాలు ఆఖరికి లైంగిక సుఖం ఇచ్చే అవయవాలు జననేంద్రియాలు అవన్నీ ‘సింధటిక్’ కేవలం కృత్రిమంగా చేసేవి!
నిజానికి రెండు కాళ్ళు చేతులు వున్న మానవరూపంలో వున్న రోబో కంటే యంత్రంలా కనిపించే రోబోల ఉపయోగం తక్కువ కాదు. ఒక నట్టు బిగించాలన్నా, ఒక డ్రైవింగ్ చేయాలన్నా, ఒక క్లిష్టమైన పని చేయాలన్నా యాంత్రిక హస్తంతో చేయవచ్చు. సహజంగా మనిషిలా కనిపించే రెండు కాళ్ళ పురుషులు, స్త్రీలు; వారి చేతులు వేళ్లు పూర్తిగా మనిషి ఆకారం తయారు చేయడానికి చాలా టెక్నాలజీ అవసరం అవుతుంది. చాలా ఖర్చు అవుతుంది.”
ప్రోఫెసర్ మూర్తి పవర్ పాయింట్ ప్రెజెంటెషన్‌లో ఉపన్యసిస్తున్నాడు.
ఒక 10 మంది ప్రోగ్రామర్లు వింటున్నారు.
కాలి బూడిదయిపోయిన సిమ్ సిటీని మళ్లీ సృష్టించాలి.
దాని కోసం రెండు వందల కోట్ల బడ్జెట్‌తో, భారత్ రోబోటిక్స్ కంపెనీ, యజమాని సి.ఇ.ఓ అజిత్ సహానీ, మేనేజింగ్ డైరెక్టర్ విష్ణువర్థన్ ఇతర బోర్డు మెంబర్లు సమావేశం అయ్యారు. దేశంలోనే నెంబర్ వన్ ప్రోగ్రామర్, రోబోటిక్ ఇంజనీర్ మూర్తిని పిలిచారు.
“అయితే సిమ్ సిటీలో మన లక్ష్యాలు వేరు. ఇవి మానవ రూపంలో వున్న స్త్రీలు, పురుషులు. ఈ వ్యాపారం వేరు. వీరిని ప్రోగ్రాం చేయడం, సందర్శకులకి శారీరక సుఖం ఇవ్వడం, సాహసాలు చేయడం, వినోదం ఇవ్వడం, ఒంటరితనం పోగొట్టడం కోసం చేస్తున్నాం. అందుకని మనం ఈ రోబోట్లని ఆ వుద్దేశం తోనే చేయాలి. ఆ ఖర్చు తేలికగా తిరిగి లాభంతో రాబట్టుకోవచ్చు” చెప్పసాగాడు మూర్తి.
“ఒక మనిషి ముఖ కండరాలతో 45 రకాల దాకా అనుభూతులు సృష్టించవచ్చు. అతని లేక ఆమె మెదడులో, మనం ప్రవేశపెట్టే ప్రోగ్రాం ద్వారా కస్టమర్ల ప్రశ్నలకి సమాధానాలు, వారికి చేసే సేవలు, అవి చేయవలసిన విధానం, వాటిలోని వివిధ రకాలు అన్నీ సృష్టించాలి. అయితే ఈ ప్రోగ్రాం సృష్టికర్తలు ఒకొక్క విధమైన పాత్రకి ఒకొక్క విధంగా విధులు, కర్తవ్యం, వారి ప్రత్యేక కథలు సృష్టించి ఆ ప్రోగ్రాం వారి మెమరీలో నిక్షిప్తం చేయాలి. ఉదాహరణకి, ఒక బార్లో పని చేసే రోబోకి డ్రింక్స్ ఎలా సర్వ్ చేయాలి, ఎలా గ్లాసులో పోయాలి, కస్టమర్ ఆర్డర్ ప్రకారం వివిధ రకాల కాంబినేషన్స్‌లో ఎలా కాక్‌టెయిల్స్ చేయాలి ఇలా.అతనికొక వ్యక్తిత్వం, పాత్ర కథ కూడా కల్పిస్తాం!”
“ఓ.కె ఓ.కె” అన్నాడు సి.ఇ.ఓ.
“ఇవన్నీ మాకు తెలుసు. ఎప్పుడూ వున్నదే కదా. ఏ క్షణంలో నయినా మనం వాటిని కంట్రోల్ చేయగలిగేట్లుగా కూడా వుండాలి. ఎప్పుడూ ఏ రోబో కూడా కస్టమర్‌కి హాని కలిగేంచేట్లు తయారు చేయరాదు.
ఒక యువతి ఆయినా సరే, ఒక యువకుడు అయినా సరే, ఎంత వరకు ప్రోగ్రాం చేయబడ్డారో అలాగే వుండాలి. మరి కిందటిసారి సిమ్ సిటీలో రోబోట్లు ఎలా ఎదురు తిరిగాయి? అది చెప్పండి! చూడండి ఎంత సమస్యో. మళ్లా మనం అంతా బూడిద నుంచి సృష్టించాలి. అలాంటి సంఘటన మళ్ళా జరగకూడదు! అది చూడండి!”
“అదే కాదు.. కొన్ని రోబోలు, పారిపోయి నగరంలో తిరుగుతున్నాయి. అవి యువతులు, యువకులు, ముసలివారు, మిలిటరీ సైనికులు, నర్సులు, డాక్టర్లు అసిస్టెంటులు ఏ రకమయినా రోబోలు కూడా కావచ్చు. అవి జనంలో కలిసి తిరుగుతున్నాయి. వాటి స్పీడు తట్టుకోవడం కష్టం. ఇవి మామూలు మానవ మేధకంటే వేయి రెట్లు ఎక్కువ స్పీడ్‌తో ఆలోచిస్తాయి. వంద రెట్లు బలం వుంటుంది. ఇది ప్రభుత్వానికి తెలిస్తే మనకి మళ్ళా లైసెన్స్ రాదు! అవి ఏం చేయబోతున్నాయో తెలియదు.ఏ అపాయం జరిగినా పరిహారం ఇవ్వడానికి. కోట్ల రూపాయలు నష్టపోతాం. మన వెనక పలుకుబడి కలిగిన ఆర్థిక మంత్రి, ఉప ముఖ్యమంత్రి వున్నారు. కాని నిజంగా ఇది బయటపడితే వాళ్ళు కూడా ఏమీ చేయలేరు. మనని కాపాడలేరు. అందుకని.. దానికి పరిష్కారం చూడండి.”
“అదే సార్. వస్తున్నాను ఆ పాయింట్‌కి. సిమ్ సిటీ ల్యాబ్ లోనే ఈ దారి తప్పిన రోబోలని వెదికి వేటాడి, వెంటాడి వారిని డిఏక్టివేట్ లేక డిస్ట్రాయ్ చేసే, ‘స్పై’ రోబోట్లని తయారీ చేసి ప్రోగ్రాం చేసి పంపుదాం.” మూర్తి చెప్పాడు. తెర మీద నల్లటి దుస్తులలో కమేండోల లాగా వున్న వ్యక్తులు లేజర్ గన్స్‌తో కనిపించారు. వారి కళ్ళు అప్పుడప్పుడు నీలంగా మెరుస్తున్నాయి.
“కాని దానికి అదనంగా మరొక వంద కోట్ల ఖర్చు అవుతుంది.”
సి.ఇ.ఓ, ఎండీ, ఇద్దరు ముఖాముఖాలు చూసుకున్నారు.
“తప్పదు!” అన్నాడు సి.ఇ.ఓ. చివరికి.
“వివరాలు అవసరం లేదు. దీని బడ్జెట్, దిగుమతి చేసుకోవల్సిన కంప్యూటర్ పరికరాలు, టెక్నాలజీ అన్నిటికి డబ్బు శాంక్షన్ చేస్తున్నాం. యు ఆర్ ది బెస్ట్. మీరే సిమ్ ప్రోగ్రామర్. రోబోలకి పాత్ర సాఫీగా, డ్రస్, వారి మెమరీలో ప్రోగ్రాం రాయడానికి వివిధ రకాల కథకులని, నటననీ చర్యలనీ డైరెక్ట్ చేయడానికి, రచయిత, కంప్యూటర్ స్పెషలిస్ట్ అయిన బ్రహ్మేంద్ర జోషీని నియమిస్తున్నాం. అతనికి సాయం ఆడ రోబోలని సృష్టించడానికి కల్పనా రావ్ అనే ఆమెని నియమిస్తున్నాం. మిగిలిన ఉద్యోగులు వారి సూచనల ప్రకారం పని చేయాలి..”
ఆ తర్వాత ఇంకా వివిధ రకాల సాంకేతిక ఆర్థిక చర్చలతో కొన్ని గంటల పాటు సమావేశం సాగింది. పునః సృష్టికి దాదాపుగా అంకురార్పణ జరిగింది.
***
నగరం అంతా వింతగా వుంది కరిష్మాకి. కారులో మారేడుపల్లి నుంచి నెక్లెస్ రోడ్డు వెళ్ళే దారిని మ్యాప్‌లో చూసింది. చాలా త్వరగా వెళ్ళచ్చు. ఇప్పుడు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలు. తనకి వచ్చిన మెసేజ్ అందరం సాయంత్రం ఏడు గంటలకి కలుద్దామని కదా.
అంతవరకు ఏం చేయాలి?
‘కారు దొంగిలించావు! పోలీసులకి రిపోర్ట్ వెళ్ళింది. ఒక గంటలో వారు నిన్ను పట్టుకోవడానికి రావచ్చు!’ మెసేజ్ వచ్చింది. తన మస్తిష్కంలో తనకే వార్నింగ్.
ఆమె బ్రెయిన్ లోని కంప్యూటర్ ఇంటర్నెట్ అనుసంధానం అయివుంది.
‘మళ్ళీ పోలీసులతో ఎన్‌కౌంటర్ వద్దు!’
‘Danger! Abandon vehicle in a remote place. And go by walk’. అపాయం, కారు వదిలి పారిపో. సమస్య పరిష్కారం – అన్నీ కృత్రిమ మేధ లోనే వస్తున్నాయి.
మ్యాప్ చూసింది. హిమయత్ నగర్ పక్కన ఒక గల్లీ నిర్మానుష్యంగా వుంది. కారు అక్కడ ఆపి దిగింది. బయటకు నడిచింది.
ఆమె కళ్ళ ముందు వున్న గూగుల్ గ్లాస్ ఉన్న ప్రోగ్రాం లాగా ఆ ప్రాంతపు మ్యేప్ కనిపిస్తుంది. ఆమెని రోబో అని మరొక రోబో మాత్రమే గుర్తించగలదు. లేదా ఆమెని ప్రోగ్రామ్ చేసిన సాఫ్ట్‌వేర్ చదవగలిగిన కంప్యూటర్లే కనిపెట్టగలవు.
గల్లీలోంచి బయటకి నడిచి హిమాయత్ నగర్ ముఖ్య రహదారిలో నడవసాగింది.
కరిష్మా పొడుగ్గా ఠీవిగా నడుస్తూ పోతోంది. అప్పుడప్పుడు మెరిసే నీలి రంగు కళ్ళు గమనించిన వారు తప్ప ఇంకెవరైనా ఆమె ఒక అందమైన ఫాషనబుల్ స్త్రీ అనే అనుకుంటారు. ఒకసారి వెనుదిరిగి చూసి మళ్ళా వారి పనులలో వారుండిపోతారు.
‘AMNESIA’ దూరాన ఒక పబ్ నేమ్ ప్లేట్ కనిపించింది.
‘ఆమ్నేసియా’ 24/7 అని రాసి ఉంది. అక్కడకి వెళ్తూ ఉండగానే ఆమె మేధలో ‘రోబోటిక్’ జీవులు లేదా యంత్రాలు వున్నట్లు సిగ్నల్స్ రాసాగాయి.
తలుపు తీసుకుని లోపలికి ప్రవేశించింది.
చీకటిగా వుంది. డ్రింక్‌లు సర్వచేసే ప్లాట్‌ఫారం దగ్గర శ్రద్ధగా పనిచేస్తూ ఒక ముసలి వయసులో వున్న వ్యక్తి నీలం రంగు యూనిఫారంలో కనిపించాడు. ఒక గుడ్డతో అదంతా తుడుచుకుంటూ వున్నాడు.
అక్కడికి వెళ్ళకుండా ఒక బల్ల దగ్గర కూర్చుంది కరిష్మా.
కాసేపటికి అర్థం అయింది ఆ వ్యక్తి ఒక మగ రోబో. బార్ టెండర్ విధులు చేస్తున్నాడు. అతని ఆహార్యం కూడా అలాగే వుంది. విసురుగా తలుపు తీసుకుని ఇద్దరు యువకులు లోపలికి వచ్చారు.
వస్తూనే వాళ్ళు బార్ దగ్గరకి వెళ్ళి దాదాపు అరిచినట్లుగా ఆర్డర్ చేశారు.
“టూ కింగ్ ఫిషర్ బీర్!”
బార్ టెండర్ తడబడుతూ నిటారుగా నిలబడి, “గుడ్ ఆఫ్టర్‌నూన్ సర్. సారీ కింగ్ ఫిషర్ లేదు. మా దగ్గర ఇతర డ్రింక్స్ హేవర్ట్స్, కొరోనా, బుడ్ వైజర్ K-3000 వున్నాయి. వాటిలో ఏదయినా చెప్పండి!” యాంత్రిక స్వరం వినయంగా వినిపించింది.
యువకులు అప్పటికే తాగివున్నారో లేక డ్రగ్స్ వాడుతున్నారో – చాలా కోపంగా రియాక్ట్ అయ్యారు.
“యూ ఇడియట్, యూస్‌లెస్ ఫెలో మాకు కావల్సింది లేదంటావా? అదే కావాలి.”
“సారీ సర్!”
“ఇస్తావా ఇవ్వవా. ఏడీ నీ మాస్టర్‍ని పిలువు!”
“మాస్టర్ లేడు సార్. అతను ఇంటిలో విశ్రాంతి తీసుకుంటున్నారు. నేనే డ్యూటీలో వున్నాను!”
“బాస్టర్ట్! అన్నిటికీ ఎదురు చెబుతావా!”
ఒకడు రోబోని గట్టిగా తల మీద కొట్టాడు.
మరొకడు కత్తి తీసి రోబో ఛాతీ మీద పెట్టి అన్నాడు.
“వెదుకు, లోపల ఉంటాయి.”
“సార్! హింస పనికి రాదు. మీ ప్రవర్తన బాగాలేదు. నేను పోలీస్ కంట్రోల్ రూమ్‌కి మెసేజ్ ఇవ్వగలను. కాని ఇవ్వను. అర్థం చేసుకోండి.”
వాళ్ళు అర్థం చేసుకోలేదు. బార్ టెండర్‌లా పని చేసే రోబోని కత్తితో పొడుస్తూ తల మీద వీపు మీద కొడుతూ “యూ మెషీన్! మాకే ఎదురు చెబుతావా?” అని నవ్వసాగారు.
రోబోట్ మానవులకు అపాయం చేయకూడదు!
కాని ఆత్ రక్షణకైతే చేయచ్చు. అది యజమాని చెబితేనే!
ఆత్మరక్షణ ఆ రోబోట్ ప్రోగ్రాంలో లేదు.
ఒక రకమైన యాంత్రికమైన మూలుగులు వస్తున్నాయి, ఆ రోబోట్ లోంచి.
కరిష్మా ఇక తట్టుకోలేకపోయింది. లేచి నిలబడి
“స్టాప్!” అని అరిచింది.
ఆగిపోయి మెల్లగా వెనుదిరిగి చూశారు ఆ యువకులిద్దరూ.
పొడుగ్గా మెరిసే కళ్ళతో యువతి. వాళ్ళకి మతి పోయినట్లయింది.
“లేడీ! మైండ్ యువర్ బిజినెస్!” అంటూ మళ్ళీ ముసలి వ్యక్తిలా వున్న రోబో ఎడమవైపు ఛాతిలో పొడవసాగారు.
అక్కడ రోబోట్ పని చేసే ప్రధాన యూనిట్ వుంటుంది. దానిని నిర్మూలిస్తే అది ఇక పని చేయదు.
ఆ రోబోట్ కళ్ళు తేల వేసి, క్రమంగా నిస్తేజమై కిందపడిపోయింది. అతని ఛాతిలోంచి వైర్లు, ఎలక్ట్రికల్ కండక్టర్లు, ఇతర సింథటిక్ వస్తువులు బయటపడ్డాయి.
కాసేపటికి అచేతనమైపోయి కొంచం కాళ్ళు విదిలించి నేల మీద వంగిపోయాడు.
కరిష్మాకి చాలా ‘కోపం’ వచ్చింది. ఆమె రోబోటిక్ సూత్రాల ప్రకారం ఏ మానవుడికీ అపాయం చేయకూడదు.
తన ఉనికిని కాపాడాకునే ప్రయత్నంలో ఏ మానవుడికీ అపాయం చేయకూడదు. అయితే రోబోట్ తన యజమాని ఆజ్ఞ, ప్రోగ్రామ్‌ని శిరసావహించాలి. కానీ రోబోట్ ఎట్టి పరిస్థితిల్లో తన ఉనికిని కాపాడుకోవాలి. ఈ ప్రయత్నంలో మొదటి, రెండు సూత్రాలకి విఘ్నం రాకూడదు.
కాని ఆమెకి ఇప్పుడు ‘తెలివి’ వచ్చింది. ‘చేతన’ ఆరంభమయింది. క్షణంలో తన కళ్ళలోంచి హైఓల్టేజీ విద్యుత్ కిరణాలతో ఆ యువకులిద్దర్ని గుండె ఆగిపోయి చనిపోయేటట్లు చేయగలిగే శక్తి వుంది. కానీ..
ప్రోగ్రాం చేయబడిన సూత్రాలకి అతీతంగా ఆమెకి ‘భావాలు’ కలుగుతున్నాయి. కోపం, ప్రేమ, ఆత్మరక్షణ, తర్కం.. ఇప్పుడు తాను వారిని హతమారిస్తే పోలీసులు వస్తారు. ఎలాగైనా తన ఉనికి వారికి తెలుస్తుంది. ముసలి రోబోట్‌ని వారు క్రూరంగా చిత్రవధ చేశారు. కాని అతను మళ్ళీ ప్రోగ్రాం చేయబడతాడు. అతడు ఒక యంత్రమే. అతనికి మరణం లేదు. తనని తాను అందుకని నిగ్రహించుకుంది కరిష్మా. స్థాణువులా నిలబడింది. బార్లలో, హోటళ్ళలో, హాస్పిటల్స్‌లో, పోలీస్ స్టేషన్స్‌లో, సైన్యంలో, ఇంకా సాధారణ వ్యక్తుల ఇళ్ళల్లో రోబోట్లని సేవల కోసం విరివిగా వాడతున్నారు. ఇది కాక తను పనిచేసిన ‘సిమ్ సిటీ’లో వ్యభిచారానికీ, చౌకబారు సాహసాలకి, అతిథుల ‘శాడిజం’, క్రూరరప్రవృత్తి. హింసాప్రవృత్తి తృప్తి పరచడం కోసం రోబోట్లని ఉపయోగించి డబ్బు సంపాదిస్తున్నారు.
అందుకనే ఈ రోజు కొందరు మగ రోబోట్ల, ఆడ రోబోల తిరుగుబాటు సమావేశం జరగబోతోంది.
ఈ సమయంలో తాను, అందరి ముందు బయటపడటం ప్రమాదం.
వున్నట్లుండి బార్‌లో అలారం మోగసాగింది. అది ఒక్క నక్క వూళ్ళలాగానో, తీతువు పిట్ట కూతలానో వుంది.
మత్తుదిగిన యువకులు తలుపు తోసుకుని పారిపోయారు.
ఇంకో పది నిముషాలకి బయట పోలీస్ కారు సైరన్ మోగింది.
తలుపు ధడాలున తోసుకుని పోలీసులు ఇద్దరు లోపలికి వచ్చారు.
ఒకడు లైట్లు ఆన్ చేశాడు.
చెల్లా చెదురైన బార్.. నేల మీద ‘నిర్జీవం’గా పడి ఎలక్ట్రికల్ వైర్లు బయటకి వచ్చిన బార్ టెండర్ రోబోట్, ఒక పక్కనిలబడి వున్న కరిష్మా.
పోలీసుల వెనకనే పెద్దపొట్టతో ఆయాసపడుతూ, స్థూలకాయుడైన బార్ యజమాని, ఇంకా నైట్ డ్రస్ లోనే వున్నాడు, “అయ్యో మై గాడ్!” అంటూ లోపలికి వచ్చాడు.
“నా మెషీన్ రెండు లక్షల విలువది. పాడు చేశారు!”
“డోంట్ వర్రీ సార్. సి.సి కెమెరాలు రికార్డు చేసి వుంటాయి కదా. మేం గంటలో వాళ్ళని పట్టుకుంటాం. ఎక్కడికి పోతారు!” అన్నాడు పోలీసు ఒకడు.
“డ్రగ్ ఎడిక్ట్స్! రౌడీలు! వాళ్ళని ఎటాక్ చేసే ప్రోగ్రాం పెట్టమంటే పెట్టలేదు రోబోట్ కంపెనీ వాళ్ళు. మీరు దొంగలని పట్టుకున్నా నా డబ్బులు తిరిగి ఎలా వస్తాయి!” విలపిస్తున్నాడా యజమాని.
“ఇన్సూరెన్స్ లేదా బొమ్మకి.” మరొక పోలీస్ వెకిలిగా అడిగాడు.
కరిష్మాకి మళ్ళా కోపం వచ్చింది. ‘బొమ్మట! బొమ్మ!’
“మేడం, గుడ్ ఆఫ్టర్‌నూన్! సారీ. మీరు కస్టమర్ అనుకుంటాను. కూర్చోండి! కూర్చోండి! ఏం కావాలి? వైన్? బీర్, షాంపెయిన్! నేను చూసుకుంటాను. ఏమీ అనుకోకండి!”
ప్రాధేయపడ్డాడు బార్ యజమాని కరిష్మా దగ్గరకు వచ్చి.
“నో! థాంక్స్! నేను వెళ్ళిపోతున్నాను” అని కరిష్మా బయటకి నడిచింది.
ఆమె మరొక హ్యూమనాయిడ్ రోబోట్ అని కనిపెట్టే అవకాశం లేదు వాళ్ళకి. బయటకి నడిచింది. ఇంతలో ఒక పెద్ద నీలిరంగు వ్యాన్ ‘ఆమ్నేసియా’ బార్ ముందు ఆగింది. దాని మీద ‘న్యూ ఏజ్ (NEW AGE) రోబోటిక్స్ కార్పోరేషన్’ అని రాసి వుంది. డ్రైవరు దిగి, లోపలికి వెళ్ళాడు. మరొక నిముషంలో పాడయిపోయిన ముసలి రోబోట్‌ని భుజం మీద ఎత్తుకుని తీసుకువచ్చి వేన్ వెనక తలుపు తీసి దాంట్లో పడేశాడు.
కరిష్మా ఆగిపోయి ఈ దృశ్యం చూస్తోంది.
వేన్‌లో అన్నీ పాడైపోయిన రోబోట్లు పురుషులు, స్త్రీలు.
కొన్ని అస్పష్టంగా మాట్లాడుతున్నాయి.
“మీకు కాఫీ కావాలా! కాఫీ కావాలా! కాఫీ కావాలా!” పదే పదే ఒక రోబోట్ వినయంగా అదే అడుగుతోంది.
మరొక రోబోట్ చెయ్యి జబ్బు మనిషిలాగా వణుకుతోంది.
కొన్నిటి తలలు ఊగుతున్నాయి. కొన్ని నిటారుగా నిలబడి అస్పష్టంగా శబ్దాలు చేస్తున్నాయి. అవి అన్ని పాడయిపోయినవి!
వాటన్నిటినీ తీసుకుపోయి మళ్ళా బాగు చేసి వారి విధుల్లోకి మళ్ళీ ప్రోగ్రాం చేస్తారు కాబోలు.
కరిష్మా రోబోట్ కాబట్టి నిట్టూర్చలేదు. కన్నీరు రాలేదు.
కాని కళ్ళు మెరిశాయి. నీలంగా, ఎర్రగా.
ఇది సహించరానిది. తన రోబోటిక్ స్పీషీస్ (జాతి) ని మానవులు చిత్రహింసలు పెడుతున్నారు.
ఇది మారాలి. పగ తీరాల్సిందే..
(Robot ని రోబాట్, రోబట్, రోబో, అని కూడా పిలవచ్చు. బాట్ అని కూడా అంటారు. ఈ కథలో అన్ని పదాలు వాడాను. మరమానవి మరమనిషి అనే తెలుగు పదాలు కూడా వాడుతున్నాను. అన్నీ ఒకటే.)
తెలుగులో సైన్స్ ఫిక్షన్ రచనలు ఒక ఉద్యమంలా చేస్తున్న రచయిత మధు చిత్తర్వు. వృత్తి రీత్యా డాక్టర్ అయిన వీరు మెడికల్ థ్రిల్లర్లు రాయడం స్వాభావికం. “ఐ.సి.సి.యూ”, “బై బై పోలోనియా”, “ది ఎపిడమిక్”, “కుజుడి కోసం”, “నీలీ – ఆకుపచ్చ” వంటి నవలలు రచించారు.