[బాలబాలికల కోసం ‘నమ్మకాలు’ అనే చిన్న కథని అందిస్తున్నారు శ్రీమతి పి.యస్.యమ్. లక్ష్మి.]
లక్ష్మీపురం అనే గ్రామంలో రామయ్య, సోమయ్య అనే స్నేహితులు వుండేవారు. స్నేహితుల్లో కూడా రకరకాలైన స్నేహితులుంటారు తెలుసా? కొందరు ప్రాణ మిత్రులుంటారు. అంటే వాళ్ళు ఎక్కడ వున్నా, ఎలా వున్నా, ఒకరి క్షేమాన్ని ఇంకొకరు కోరుకుంటూ వుంటారు. కొందరు అవకాశవాద మిత్రులు. వీరు వారికవసరమైతే భాయీ, భాయీ అంటారు, లేకపోతే హలోతో సరిపెడతారు. రామయ్య, సోమయ్యలలో రామయ్య మంచి మిత్రుడు. సోమయ్యతోనే కాదు, ఎవరితోనైనా బాగా మాట్లాడతాడు, అందరినీ గౌరవిస్తాడు, అందరూ బాగుండాలనుకుంటాడు.
సోమయ్య దానికి విరుధ్ధం. అందరికన్నా తను బాగుండాలి, తనూ, తన కుటుంబం, క్షేమంగా వుంటే చాలు, మిగతావారు బాగున్నా, బాగుండకపోయినా తనకవసరం లేదు అనుకునే రకం.
మనుషుల్లో కొందరికి కొన్ని నమ్మకాలు వుంటాయి. కొందరికి ఏదన్నా పనిమీద బయల్దేరేటప్పుడు, ఫలానా శకునం ఎదురొస్తే మంచిదనే నమ్మకం, కొందరికి ఏదన్నా ప్రారంభించేటప్పుడు ఫలానావారు మొదట కొనుగోలు చేస్తే బాగుండనుకుంటారు ఆలాగన్నమాట. ఇవ్వన్నీ ఎక్కువగా వ్యాపారస్థులలో వుంటాయి. ఎందుకంటే మరి వాళ్ళకి వ్యాపారం బాగా జరిగితేనే కదా డబ్బులు వచ్చేది. వీటి నిజానిజాలు గురించి మనం చెప్పలేంగానీ, ఇలాంటి నమ్మకాలు మాత్రం కొందరికి వున్నాయని ఖచ్చితంగా చెప్పగలం. ఈ నమ్మకాలు వున్నవారు కొందరేమో అలాగే భయపడుతూ, సాహసించి అడుగు ముందుకు వెయ్యకుండా వుంటారు. కొందరు వీటిని నమ్మక తమ కృషి, తమ అదృష్టాన్ని నమ్ముతారు. రామయ్య అలాటివాడు. సోమయ్య ఐరన్ లెగ్ మీద ఆయనకే కాదు, ఊళ్ళోవాళ్ళకి కూడా నమ్మకం ఎక్కువే.
ఒకసారి రామయ్య ఒక కొత్త షాపు ప్రారంభం చేశాడు. దాని ప్రారంభం గురించి మిత్రుడు సోమయ్యకే ముందు చెప్పాడు. అక్కడికీ రామయ్యని మరి కొందరు మిత్రులు హెచ్చరించారు కూడా.
“సోమయ్య కుళ్ళుబోతు.. అతన్నెందుకు ముందు పిలిచావు. నువ్వు పిలిచావు కదాని ఆయన ముందు వచ్చి బోణీ చేస్తే మీ షాపు గోవిందే. ఇప్పటికైనా మించి పోయింది లేదు, మంచి హస్తవాసి వున్నవారినెవరినైనా పిలిచి ముందు బోణీ చేయించు, నీ వ్యాపారం బాగుంటుంది” అని.
దానికి రామయ్య నవ్వాడు. “వ్యాపారం అభివృధ్ధి చెందటానికి కావలసినవి పెట్టబడి, తెలివితేటలు, కష్టపడటం, మన అదృష్టంగానీ ముందు కొనుక్కునేవారి హస్తవాసి మీద కాదు. మీకు హస్తవాసి మీద నమ్మకం వుంటే, నాకు వీటిమీద నమ్మకం వుంది. నేను అన్ని హంగులతో షాపు తెరుస్తున్నాను. కష్టపడతాను. నేనెవరినీ ఇబ్బందిపెట్టనుగనుక నా కృషి ఫలిస్తుందనుకుంటాను” అన్నాడు.
రామయ్య షాపు ప్రారంభానికి అందరికన్నా ముందు సోమయ్య వచ్చి మొదటి కొనుగోలు చేశాడు. రామయ్య భార్య, కొడుకు ముందు సోమయ్యకి సరుకు అమ్మటానికి సంకోచించి, సోమయ్యని ఆపలేక ఎవరన్నా వచ్చేలోపల వారే ఏదన్నా కొనుగోలు చేద్దామనుకున్నారు. వారి ఉద్దేశం గ్రహించిన రామయ్య వారిని కనుసైగతోనే అపి, సోమయ్యని మర్యాదగా పలకరిస్తూ, అతనికి కావాల్సిన వస్తువులిచ్చి, తమ దుకాణంలో మొదట కొనుగోలు చేసినందుకు కృతజ్ఞత తెలిపాడు.
తర్వాత వచ్చిన రామయ్య బంధువులు, మిత్రులు అంతా రామయ్యని పలురకాల విమర్శించారు. “ఏదో ఒక విధంగా సోమయ్యని కొంచెం సేపు ఆపి వుండాల్సింది, లేకపోతే, మీ కుటుంబ సభ్యులనే ఎవరినైనా ముందు కొనమనాల్సింది. సోమయ్య హస్తవాసి అసలు మంచిది కాదు. నువ్వు ఇంత డబ్బు ఖర్చు పెట్టి దుకాణం పెట్టి అతని చేత బోణీ చేయించావు. ఇంక నీ వ్యాపారం నడిచినట్లే” అని రకరకాల విమర్శలు చేశారు.
రామయ్య ఆ విమర్శలను లెక్కచెయ్యలేదు. “నా అదృష్టం ఎలా వుంటే అలా అవుతుంది. దానికి సోమయ్య హస్తవాసి కారణమెలా అవుతుంది? ఎదుటి వ్యక్తిని అలా అవమానించకూడదు..” అని సర్ది చెప్పబోయి, విమర్శలు కొనసాగుతూ వుండటంతో మాట్లాడకుండా వూరుకున్నాడు.
సోమయ్య మనసులో చాలా సంతోషించాడు. తన హస్తవాసి మంచిదికాదు అని అతనికి కూడా కొంత నమ్మకమే అనేక సంఘటనల మూలంగా. అందుకే ఓర్వలేనితనంతో, రామయ్య వ్యాపారంలో తనకన్నా పైకి రాకూడదనే ఉద్దేశంతోనే కావాలనే ముందు రామయ్య షాపుకి వెళ్ళి బోణీ చేశాడు.
కానీ రామయ్య తన కృషితో, తన తెలివితేటలతో వ్యాపారాన్ని బాగా అభివృధ్ధి చేసుకున్నాడు. వ్యాపారం వ్యక్తి కృషి మీద, తెలివితేటల మీద, ఆ వ్యక్తి అదృష్టం మీద, ఆధారపడి వుంటుందిగానీ మొదట చేసే బోణీ మీద కాదని నిరూపించాడు.
శ్రీమతి పులిగడ్డ శ్రీమహలక్ష్మి కథారచయిత్రి, నాటక రచయిత్రి. ఎ.జి. ఆఫీస్, హైదరాబాద్‌లో సీనియర్ ఎకౌంట్స్ ఆఫీసర్‌గా పని చేసి రిటైరయ్యారు. భర్త శ్రీ మానేపల్లి వెంకటేశ్వర్లుతో కలిసి పురాతన ఆలయాలు దర్శించటంలో ఆసక్తి మెండు. ఇప్పటిదాకా 450 పైన వ్యాసాలు, 20 కధలు వివిధ అచ్చు, ఆన్లైన్ పత్రికలలో ప్రచురించబడ్డాయి. ‘యాత్రా దీపిక’ శీర్షికన 9 పుస్తకాలు వ్రాశారు. వీటిలో 6 పుస్తకాలు అచ్చయినాయి, మిగతావి కినిగె.కామ్‌లో ఈబుక్స్ రూపంలో లభిస్తాయి. నాలుగు నాటికలు వ్రాశారు.. అందులో రెండు.. రెండు హాస్యనాటికలు పేరుతో కినిగెలో ఈబుక్‌గా వచ్చింది.