[అనుకృతి గారు రచించిన ‘నాతిచరామి’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
ఆరు గదుల పాతకాలపు డాబా ఇల్లది. మూడు మూడు గదుల వాటాలు రెండు. ఒక పోర్షన్ లోని ముందు గదిలో శిరీషకు పెళ్లిచూపులు జరుగుతున్నాయి. రాజు స్కూల్ ఫైనల్ అయ్యాక, ITI లో చేరి ఎలక్ట్రిక్ వర్క్స్ మెయిన్‌గా చేసాడు. తండ్రి అప్పుల ఊబిలో కూరుకుపోయేసరికి,తల్లి సాధింపులు,ఇంట్లో శాంతి లేకుండా పోయింది. సరదాగా నేర్చుకొన్న డ్రైవింగ్‌ని జీవనోపాధిగా చేసుకొన్నాడు. అతనికి ఒక సెకండ్ హాండ్ కారు కూడా వుంది, దానిలో రోజూ నలుగురు లేడీ టీచర్స్‌ని నలభై మైళ్ల దూరంలో వున్న గవర్నమెంట్ స్కూల్‌లో దింపి, మళ్ళీ సాయంత్ర౦ తీసుకొస్తుంటాడు. ఇద్దరు డాక్టర్స్ పిల్లల్ని స్కూల్ టైంకి తీసుకెళ్లి, తీసుకొస్తుంటాడు. రాజుకి ఈ రెండు ఖాతాల వల్ల నికరాదాయం ఉంటుంది, మిగతా టైంలో అద్దె ఆటో తిప్పుతుంటాడు. టెన్త్ వరకు ఇంగ్లీష్ మీడియం కాబట్టి, విస్తృతంగా ఇంగ్లీష్, తెలుగు సాహిత్యం చదవటం, బాగా అలవాటు చేసుకొన్నాడు. చాలా బుక్ కలెక్షన్ వుంది అతని దగ్గిర. తాను చదువుకోలేకపోయానన్న బాధ ఆ విధంగా మరిచిపోయేవాడు.
తన ఎదురుగా కూర్చున్న శిరీషని తదేకంగా చూస్తున్నాడు. అమ్మాయి పొడవుగా, సన్నగా, తీరైన కనుముక్కు తీరుతో చక్కగా వుంది. అతను గమనిస్తున్నది ఆమె ఎలా వుందన్నది కాదు, ఆమె చేతుల వైపు చూస్తున్నాడు. ఆ అమ్మాయి దేనికో చాలా టెన్షన్ పడుతున్నది. చేతుల్లో వణుకు ఆపుకోవటానికి రెండు అర చేతులనీ పెనవేసి పట్టుకొన్నది. మొహాన చిరు చెమటలు. దేనికో ఆ అమ్మాయి బాగా టెన్షన్ పడుతున్నదనిపించింది అతనికి.
కొంపదీసి ఏదైనా లవ్ ఎఫైర్ కాదుకదా? లేకపోతే ఈ మ్యాచ్ ఇష్టం లేదా? ఆమెతో పర్సనల్గా మాట్లాడాలని అనుకొన్నాడు.
రాజు తండ్రి చనిపోయి మూడేళ్లు. ఆయన ఆర్టీసీలో కండక్టరుగా పనిచేసేవాడు. సప్త వ్యసనాల్లో అప్పులు చెయ్యటం ఉందో, లేదో కానీ, భూషణ౦ అందులో సిద్ధహస్తుడు. రిటైర్మెంట్ తర్వాత పైన మొదలు పెట్టి, పూర్తి చేయటానికి నానా తిప్పలు పడ్డాడు. అప్పులు చేయటంలో ఆయన ఒక వింత పద్ధతి పాటించేవాడు. ఇవేవి ఇంటర్ చదువుతున్న రాజుకి అర్ధమయ్యేవి కావు. పెద్దవాడైన నరేంద్రకి తండ్రిని వారించే ధైర్యం లేదు. ఒకడి దగ్గిర చేసిన అప్పు తీర్చడానికి ఇంకొకరి దగిర అప్పుచేసేవాడు. పెన్షన్ చాలా తక్కువ, దానిమీదే లోన్ తీసి, అప్పుల పాలయ్యేడు. తల్లి శకుంతల గయ్యాళిగా పేరు తెచ్చుకొంది. నోటికి అదుపులేదు. పెద్ద కోడలు సుభద్రకి నోరు లేదు. శకుంతలకి ఇప్పుడు మంచి చాన్సు వచ్చింది, సాధ్యమైనంత ఎక్కువ కట్నం లాగాలని బేరసారాలు చేస్తోంది.
రాజుది చాలా ధృడమైన వ్యక్తిత్వం. అన్నను సంప్రదించి, వున్న రెండకరాల పొలం అమ్మేసి అప్పులు తీర్చాడు, బ్యాంకు లోన్ తీర్చిన తర్వాత, మిగిలిన ఆరు లక్షలు అన్న ఇద్దరి కూతుళ్ళ పేరిట, తల్లి పేరిట వేసేశాడు. రెండు వాటాలు వేయమన్న తల్లి మాట అతను లెక్క చేయలేదు. అటువంటి మరిది అంటే సుభద్రకు చాలా ఇష్టం. ఒక తమ్ముడిలా చూస్తుంది అతన్ని, రాఖీ కట్టి, తన ప్రేమని చూపిస్తుంది.
ఎవరూ గమనించని శిరీష లోని కంగారుని గమనించాడు రాజు. అందుకే ఆ అమ్మాయితో మాట్లాడాలని శిరీష అన్నతో చెప్పాడు. డాబా పైన రెండు కుర్చీలు వేశారు. శిరీషలో కంగారు ఎక్కువైంది.
“చెప్పండి, ఎందుకంత కంగారు పడుతున్నారు?” రాజు సౌమ్యంగా అడిగాడు.
“నేను ఒకటి అడుగుతాను, కానీ నేనడిగిన విషయం మా వాళ్ళతో చెప్పరు కదూ?”
ఇదేదో ప్రేమ వ్యవహారంలా వుంది అనుకొన్నాడు రాజు.
“నాకు ఇంజినీరింగ్ చదవాలని వుందండీ, మీరు చదివిస్తారా?” ఆ కళ్ళ నిండా ఆశ.
ఆశ్చర్యపోయాడు రాజు. “ఇంటర్‌లో మీ పర్సెంటేజ్ ఎంత?”
“96.5” జవాబిచ్చింది శిరీష.
“అన్ని మార్క్స్ వస్తే మీ వాళ్లు ఎందుకు చదివించలేదు?” ఆశ్చర్యపోతూ అడిగాడు.
“నాన్న పోయిన సంవత్సరం లోనే పెళ్ళి చేయాలని, చదివించమని చెప్పారండి. డిగ్రీ చేయమన్నారు, నా కిష్టం లేదు” ఆ పిల్ల మొఖం లోని దైన్యం చూసి చలించిపోయాడు రాజు.
“నా ఇంటి పరిస్థితులవల్ల నేను చదువుకోలేకపోయాను. తప్పకుండా చదువుకుందువు కానీ, ఇంకేమైనా ఉన్నదా” నవ్వుతూ అడిగేడు.
శిరీష కళ్ళలో వెలుగు, సంతోషంగా నవ్వింది, “ఇంకే కోరికలు లేవు” అంటూ.
***
రాజు క్రిందకు వచ్చేసరికి శకుంతల ఇంకా బేరసారాలు సాగిస్తూనే వుంది. రాజు తల్లిని మరి మాట్లానీయకుండా, విషయం అంతా తేల్చేసాడు. అంతా శిరీష అన్నదమ్ముల ఇష్టానికే వదిలేసాడు. అందరిముందు ఏమీ మాట్లాడలేకపొయిన శకుంతల ఇంటికి రాగానే కొడుకు మీద విరుచుకుపడింది. రాజు బెదరకుండా మిగతా ఖర్చులు తానే భరిస్తానని చెప్పాడు.
పెళ్ళయ్యాక మూడు నిద్రల్లాంటివేమీ వద్దని భార్యని తీసుకెళ్ళిపోయాడు రాజు. కట్నం, లాంచనాలు తీసుకోని వాడితో తర్కించలేకపోయారు ఎవరూ.
మొదటి రాత్రిమధ్య గదిలో శిరీషని పడుకోమని తాను బయట గదిలో నేల మీద పరుపు వేసుకొని పడుకొన్నాడు. శిరీషకి ఇలా ఎందుకని అడిగే చనువు ఏర్పడలేదింకా అతని దగ్గర.
శకుంతల నిఘా పెట్టింది కోడలి మీద. శిరీష రాత్రంతా చదువుకొంటూ, ఎప్పుడో తెల్లవారుఝామున నిద్రపొతోంది. ఉదయం పనయ్యాక రాజు లంచ్‌కి వచ్చేదాక చదవటం, అతను వెళ్ళాక ఇంటి పని ముగించుకొని, మళ్ళీ చదువుకోవటానికి కూర్చునేది. ఆ పిల్ల దీక్ష, పట్టుదల చూసి రాజుకు ఎంతో ముచ్చటేసేది.
రోజూ శకుంతల పైకి రావటం, ఏదో ఒక వంకతో తిట్టడం చేస్తున్నది. శిరీష భర్తతో చెప్పటానికి భయపడి, చెప్పలేక పోయేది. చూసి, చూసి సుభద్ర ఓ రోజు రాజుతో చెప్పింది. రాజుకి శకుంతల స్వభావం బాగా తెలుసు. మనుషుల పట్ల ఆమె వైఖరి చాలా విచిత్రంగా వుంటుంది. ఆమెకి మనుషులు నచ్చకపోతే అకారణ ద్వేషం పెంచుకొంటుంది. ఓ రోజు బయటికి వెళ్ళినట్టే వెళ్ళి, వెనక్కి వచ్చి తల్లి మాటలు విన్నాడు, శిరీషని మాటలతో ఎంత వేధిస్తున్నదో అర్థమై బాధపడ్డాడు. అతనేమీ మాట్లాడకపోవటంతో శకుంతల మరింతగా రెచ్చిపోయి తూలనాడింది. శిరీషకి కన్నీళ్ళు ఆగలేదు.
రాజు నాలుగింటికి ఇంటికి వచ్చాడు. వచ్చీరాగానే సామాను సర్దటం మొడలెట్టాడు. సుభద్ర పైకి వచ్చి, “యేమిటి రాజూ, సామాను సర్దుతున్నావు?” కంగారుగా అడిగింది.
“అమ్మ మారదు వదినా, శిరీష ఆమెని తట్టుకొని బ్రతకలేదు, ఇల్లు తీసుకొన్నా, ఇవ్వాళ్ళే ఇల్లు మారుతున్నా. ఈ పోర్షన్ అద్దెకిస్తాను.” అన్నాడు.
శకుంతల ఎన్ని శాపనార్థాలు పెట్టాలో అన్నీ పెట్టింది శిరీషని. సాయంత్రం అద్దె ఇల్లు ఎక్కడ తీసుకొన్నాడో కూడా చెప్పకుండా ఇల్లు మారిపోయాడు రాజు. కొత్త ఇంట్లో సామాను సర్దుతూ, ఏడ్చేసింది శిరీష.
“ఇందులో నీ తప్పెమీ లేదు శిరీ, అమ్మ సంగతి నీకు తెలియదు, నిన్ను చదువుకోనీయదు, ఇంజనీరింగ్‌లో చేరినా, ఆమె రోజుకో గొడవ తెస్తుంది. అమ్మ పట్ల నా బాధ్యత నాకు తెలుసు” అంటూ మొదటిసారి శిరీషని దగ్గరకు తీసుకొని ఓదార్చాడు.
శిరీష ఇప్పుడు చాలా ప్రశాంతంగా చదువుకోగలుగుతోంది. రాజుకి మగవాళ్లు ఇంటిపని చేయకూడదన్న కాన్సెప్ట్ లేదు. అతనంటే రోజు రోజుకీ ఆరాధన పెరిగిపోతోంది ఆమెకి.
***
ఆ రోజు శిరీష చాలా డల్‌గా వుండటం గమనించి, టాబ్లెట్స్ తెచ్చిచ్చాడు. అయిదో రోజు లేడీ డాక్టర్ డగ్గరికి తీసుకెళ్ళాడు.
డాక్టర్ నవ్వుతూ, “నీ ఇంజినీరింగ్ చదువు కోసం బాగానే నిగ్రహం పాటించాడు మీ ఆయన, ఇంక అవసరం లేదులే” అంటూ నవ్వింది.
శిరీష సిగ్గు పడింది, రాజు పనికి ఆడా, మగ తేడా చూపించడు. వీలున్నప్పుడల్లా అన్నిపనులూ చేసేస్తాడు. శిరీష కిప్పుడు యే సమస్య లేదు. హాయిగా చదువుకొంటోంది. ఎంట్రన్స్ పరీక్ష రోజు అతని కాళ్ళకు నమస్కరించబోయింది. రాజు వారించి, హృదయానికి హత్తుకొని, “బాగా రాయి” అన్నాడు.
శిరీష పరీక్ష రాసి బయటకు వఛ్ఛేదాకా ఎంతో ఆత్రతతో వెయిట్ చేసాడు, బయటకు రాగానే రాజును చుట్టేసింది. అతనికి అర్థమయ్యింది బాగా రాసిందని.
రిజల్ట్స్ కోసం శిరీష కంటే ఎక్కువ ఎదురుచూశాడు రాజు. శిరీష 312 వ రాంక్ సాధించింది. సరిగ్గా కోచింగ్ ఇప్పిస్తే, IIT సాధించేదేమో అని అనిపించి బాధ కలిగింది అతనికి. శిరీష సంతోషంతో అతన్ని చుట్టేసి, గంతులేసింది.
రాజు “నాకు తెలుసు నువ్వు సాధిస్తావని” అంటూ, జేబులో నుండి సన్నని బంగారు నల్లపూసల గొలుసు తీసి ఆమె మెళ్ళో వేశాడు.
శిరీష తల్లి సంతోషానికి హద్దులు లేవు. భర్త తన పేరిట వేసిన లక్ష అల్లుడికి ఇవ్వబోయింది.
“ఓల్ద్ యేజ్‌లో డబ్బు చాలా అవసరం అత్తయ్యా, శిరీష బాద్యత నాది,” అంటూ తిరిగి ఇచ్చేసాడు.
అంత మంచి రాంక్ సాధించిన శిరీష అదే వూళ్ళో వున్న కాలేజ్‌లో చేరతాననేసరికి, కోపం వచ్చింది. లెక్చరర్స్‌తో, టీచర్స్‌తో, చెప్పించాడు. శిరీష ఒప్పుకోలేదు, హైదరబాద్లో చేరనని, హాస్టల్‌లో వుండనని చెప్పేసింది.
19 యేళ్ళ శిరీష తనని వదిలి వుండలేదని అర్థమయ్యింది అతనికి, పోనీ సిటీకి వెళ్ళిపోదామంటే దానికీ ఒప్పుకోలేదు. సిటీ అంటే ఖర్చు ఎక్కువ, అందుకే వద్దంటోందని అర్థమయ్యింది అతనికి. చేసేది లేక టౌన్ లోనే బెస్ట్ కాలేజ్‌లో చేర్చాడు. అంత మంచి రాంక్ వచ్చిన అమ్మాయి తమ కాలేజ్‌లో చేరటం యాజమాన్యానికి చాలా నచ్చి ఫీజ్‌లో చాలా రాయితీలు ఇచ్చారు. ఇంటి దగ్గిరే కాలేజ్ బస్ స్టాప్. మొదటి రోజు సాయంత్రం రాజు శిరీష కోసం యెదురు చూస్తూ స్టాప్‌లో నుంచున్నాడు. వెలిగిపోతున్న మొహంతో
వచ్చింది శిరీష. ఇంట్లోకి అడుగుపెడుతూనే రాజుని పెనవేసుకొని యేడ్చేసింది. అది కల సాకారం కావడం వలన వచ్చిన కన్నీళ్ళు. రాజు ఆమె తల నిమిరి “వెళ్ళు, వెళ్ళి ఫ్రెష్ అయిరా” అన్నాడు ప్రేమగా. “చచ్చే ఆకలిగా వుంది” అంటూ వచ్చి, నేల మీద అన్నీ రెడీగా వుండటం చూసి, “అయ్యో, వంట కూడా చేసేశారా” అన్నది గిల్టీగా.
“శిరీషా, ఒక్కటి గుర్తు పెట్టుకో, మనిద్దరి మధ్య యెటువంటి ఈగో క్లాష్ వద్దు, ఎవరికి వీలైన పని వాళ్ళం చేద్దాం” కన్నీళ్ళతో తలూపింది శిరీష. టమాట యెగ్ కర్రీ, చారు, పెరుగు, కడుపునిండా తిని, గిన్నెలన్నీ తోమేసి, కిచెన్ శుభ్రం చేసి వచ్చి, అతని ఒళ్ళో వాలిపొయి పడుకుండి పోయింది.
ఫస్ట్ ఇయర్‌లో నాలుగు గోల్డ్ మెడల్స్ సాధించింది శిరీష. మంచి లాప్‌టాప్ కొన్నాడు. రాజు పట్ల రోజు, రోజుకీ అభిమానమూ, అరాధన పెరిగి పొతోంది శిరీషలో. ఎటువంటి కలతలు లేకుండా నాలుగేళ్ళు గడిచి పోయాయి. ఫైనల్ సెమిస్టర్ లోనే పన్నెండు లక్షల ప్యాకేజితో, ఎమేజాన్‌లో జాబ్ వచ్చింది శిరీషకి. జాబ్ అన్నా వదులుకుంటుంది కానీ ఒంటరిగా వెళ్ళదని తెలుసు రాజుకి. అందుకే మకాం మార్చారు బెంగుళూరికి.
వారంలో అయిదు రోజులు శిరీషకి ఆఫీస్, రాజుకి ఇలా ఖాళీగా వుండటం ఇష్టం లేకపోయింది. వాళ్ళు వుండేది ఒక పార్టిషన్ చేసిన హాల్ కం బెడ్‌రూమ్, చిన్న వంటిల్లు. వెనక ఖాళీ జాగా వుంది. బెంగుళూరులో క్యాబ్ నడపటం కంటే ఎలక్ట్రికల్ వర్క్స్ రిపైర్స్ చేయటం బెటర్ అనిపించి అవి చేయటం మొదలెట్టాడు. ఇంటి వాళ్ళ పర్మిషన్‌తో ఆదివారం బిర్యానీ తయారు చేసి సేల్ చేయటం మొదలెట్టాడు, శిరీష ఒక యాప్ క్రియేట్ చేసింది, ఎదురుగా వున్న అపార్ట్మెంట్స్ నుండి చాలా ఆర్డర్స్ రావటం మొదలై రాజు చాలా బిజీ అయిపోయాడు.
శని, ఆదివారాలు అతనికి సాయం చేసేది శిరీష.
శిరీష నెల తప్పింది. రాజు అంతా తానై చూసుకున్నాడు నెలలు నిండేదాకా. సరిగ్గా డెలివరీ ముందు శారదమ్మ బాత్ రూమ్‌లో జారిపడింది. తుంటికి ఆపరేషన్ చేశారు. ఎవరూ రాకపోయినా రాజు శిరీషని ఎంతో జాగ్రత్తగా చూసుకున్నాడు. శిరీషకు బాబు. లీవ్ అయిపోయే సమయానికి కళ్లనీళ్లు పెట్టుకోసాగింది. ఆయాని పెడదామా, కేర్ సెంటర్‌లో చేరుద్దామా అంటూ బెంగగా అడగటం మొదలెట్టింది. ఇంకో రెండు రోజులో జాయిన్ అవుతుందనగా, రాజు ఆమె ఆందోళనకి తెరదించాడు.
ఇంతవరకు వారంలో అయిదు రోజులు ఎలక్ట్రికల్ వర్క్స్ చేసేవాడు. ఇప్పుడవన్నీ మానేస్తున్నానని చెప్పాడు.
“దేనికి?” అర్థం కాక అడిగింది శిరీష.
“దేనికేమిటి? బాబుని చూసుకోవద్దా? అయిదు రోజులు నా డ్యూటీ, వీకెండ్స్ నీ డ్యూటీ, వీక్ ఎండ్‌లో నా బిర్యానీ బిజినెస్ చేస్తాను, సరేనా!”
శిరీషకు కన్నీళ్లు ఆగలేదు.
“పిచ్చిపిల్లా, తల్లిగా నీకెంత బాధ్యతో నాకు అంతే, పెద్దవాళ్ళను పిలిచి ఈ ఏజ్‌లో వాళ్ళని బాధపెట్టడం దేనికి? ఇంత చదువుకొన్నావు, లక్షలు సంపాదిస్తున్నావు అయినా నువ్వే రోజూ అహకారం చూపలేదు. ధర్మేచ, అర్థేచ, కామేచ, అంటూ మూడుసార్లు వరుడిచేత ‘నాతిచరామి’ అని అనిపిస్తారు. ‘నాతిచరామి’కి అర్థం తెలిసిన వాడెవ్వడూ భార్యని తేలికగా చూడడు, ఏ విషయం లోనూ అవమానించాడు. నాకు వాడిని చూసుకొనే అదృష్టం వున్నది, వాడిని ఎక్కడా చేర్చటం, ఆయాలకు అప్పగించటం, అస్సలు ఇష్టం లేదు. నువ్వు ఇంటికొచ్చాక, వీలుంటే ఎలక్ట్రికల్ వర్క్స్ చేస్తాను, సరేనా!” కొడుకుతో సహా శిరీషను దగ్గరకు తీసుకొన్నాడు రాజు.
అనుకృతి అనే కలం పేరుతో రచనలు చేసే బి. భవాని కుమారి గారు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో 34 ఏళ్ళు లెక్చరర్‌గా పని చేసి 2014లో రిటైరయ్యారు. 2019లో వీరి మొదటి కథ ‘తొలకరి’ సాక్షి ఆదివారం అనుబంధం ‘ఫండే’లో ప్రచురితమైంది. ఆ తరువాత రాసిన అనేక కథలు పలు వెబ్ మ్యాగజైన్లలో ప్రచురితమయ్యాయి.