Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

నవల – కథాగమనం, పాత్రల చిత్రీకరణ – సంవాదం

ప్పు పులుసుకీ, పప్పు చారుకీ ఏంటి తేడా? అని అడిగితే రక రకాల సమాధానాలు వచ్చాయి. మొత్తానికి మరో దినుసు ముందరికి వచ్చింది – ముక్కల పులుసు.  పాత్రలు ‘ముక్కలు’ కాకుండా మొక్కల వలె ఎదిగి, ‘ఉడికి’ రుచిగా తయారయి భోజనం ముగించుకున్న తరువాత ఆ రసం అంతరంగంలో అలా మిగిలిపోతే, ‘ఆహా! ఏమి వంట?’ అనుకుంటాం.

రసం, ధ్వని, ఔచిత్యం

రచన అనేది ‘ఆశ్చర్యం’ నుండి ‘అద్భుతం’ వైపు సాగితే అందంగా ఉంటుంది. ఆలోచనను సృజించే రచనలు కొన్ని. అనుభూతులను మిగిల్చేవి కొన్ని. భావోద్రిక్తతకు గురి చేసేవి కొన్ని. ఎన్నిసార్లు చదివినా, కొత్త అనుభూతిని ఇచ్చేవి కళాఖండాలు. ఈ గ్రంథాలు ఎంచుకున్న తత్వాన్ని ఘటనల ద్వారా, సంఘటనల ద్వారా సరళమైన శైలిలో మగ్గం చేసే పనిలాగా మగ్గిస్తూ, నేస్తూ దాని మీదుగా పాత్రలను ప్రాంగణంలోకి దింపుతాయి. ఆ తత్వాన్ని అవగతం చేసుకున్నప్పుడు ఆ రసం అడుగడుగునా ప్రస్ఫుటం అవుతూ ఉంటుంది. ఆ రసం పాత్రల సంవాదమే కాకుండా కవి చెబుతున్న మాటలలో రసవత్తరంగా ధ్వనిస్తూ ఉంటుంది. సంఘటనలు ఈ రెండిటి సమ్మేళనంలో కేవలం ఔచిత్యంలో కనిపిస్తాయి. కాకపోతే రచయిత ఘటనలను మామూలుగా చూపిస్తాడు, ఎందుచేతనంటే, ఆ ఘటన వెనుక ఎవరి ప్రమేయమూ ఉండదు. అది లీలగా అలా అయిపోవాలి. అక్కడినుండి సరళిగా సాగే సంఘటనల వర్ణనలో రచయితకు గల కాల్పనిక శక్తి సంవాదాలలో ఎంచుకునే భాష, పాత్రలలో లోనమయ్యే నేపథ్యం లాంటివి చోటు చేసుకుంటాయి. వాస్తవానికి ఘటన అనేది మనలను ఆశ్చర్యానికి గురి చేయాలి. కానీ జాగ్రత్తగా పరిశీలిస్తే సంఘటన ఆ పని చేస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. ఇది ఒక మర్మం!

పాత్రలు సరళిలో కలిసి ఎదుగుతూ పోవటం మంచి రచనలోని లక్షణం. కిష్కింధకాండలో మొదటిసారి ఆంజనేయుని పరిచయం చేయటం మనం గమనించాలి. కవికోకిల వాల్మీకి పెద్ద పెద్ద ఎత్తుగడలతో, ఉపమానాలతో ప్రారంభం చేయలేదు. ఆజానుబాహువులైన శ్రీరామలక్ష్మణులు అక్కడ సంచరించుచుండగా చూసి వాలి ఎవరినో పంపించాడనికి భయపడుతూ ఉంటాడు సుగ్రీవుడు. ‘ప్రక్కనే ఉన్న వాయుపుత్రుడైన హనుమంతుడు అప్పుడు ఇలా పలికాడు..’ అంటాడు. అదే ఆ పాత్ర యొక పరిచయం. వాల్మీకి రామాయణంలో ఆ కావ్యం యొక్క కథా ప్రస్థానాన్ని గమనిస్తే ఇదే చాలా ప్రధానమైన అంశం. సత్యం, ధర్మం, అనునవి అంతర్వాహినిగా చేసే గమనాన్ని పరిశీలిస్తే తప్ప అన్ని పాత్రలు సరిగ్గా, ఫూర్తిగా అర్థం కావన్నది అక్షర సత్యం.

రామాయణంలో అందరూ ధర్మం గురించి మాట్లాడారు.

ఎవరి పరిస్థితులోంచి వారు బోధలు చేశారు. దానిని బట్టి ఆ పాత్రను తెలుసుకోవలసి ఉంటుంది. మంధర ఎన్ని చెప్పినా కైక తొలుత వినలేదు. ఒక్క మాట దగ్గర పూర్తిగా ఆమె మనసు భయాందోళనకు గురి అయింది – నీవు గతంలో కౌసల్యను ఆటపట్టిస్తూ వచ్చావు, ఇప్పుడు శ్రీరాముడు యువరాజు అయిన తరువాత నిన్ను వదలిపెట్టునా? అన్నది మంధర! కథ ముందుకు దూకింది. మరో స్త్రీ ప్రవర్తన చూద్దాం. రావణుడు అకంపనుడి మాటలు విని మారీచుని వద్దకు సీతాపహరణ వ్యూహంతో వెళ్ళినా మారీచుడు శ్రీరాముని జోలికి వెళ్ళవద్దన్నాడు. ఆయన ఎవరి జోలికి అనవసరంగా రాడు. ఎవరైనా ఆయన జోలికి వెడితే ఊర్కోడు అన్నాడు. నీ 14,000 మంది రాక్షసులు ఆయనతో అనవసరంగా తలపడి ప్రాణాలు కోల్పోయారు. నీకు ఆయనతో ఎటువంటి భయం లేదన్నాడు. రావణుడు వెనుదిరిగాడు. కానీ శూర్పణఖ మరోలా చెప్పింది – శత్రువును విస్మరించటం రాజధర్మం కాదన్నది. శ్రీరాముడు ఋషులకు అభయం ఇచ్చాడు. నిన్ను వదలిపెడతాడా? అన్నది. అంతే, పట్టుదలతో మరల మారీచుని దగ్గరకు వెళ్ళాడు.  రామరావణ యుద్ధం జరిగిపోయింది. సీతాన్వేషణ జరిగాక తిరుగు ప్రయాణంలో మధువనాన్ని నాశనం చేసారు వానరవీరులు. ఆ వనాన్ని కాపాడుకుంటున్న సుగ్రీవుని బంధువు సుగ్రీవుని వద్దకు వచ్చి మొర పెట్టుకున్నాడట. ‘అవునా? అయితే సీతను కనుగొన్నారు మనవాళ్ళు’ అని శ్రీరాముడికి చెబుతాడు సుగ్రీవుడు. వానర స్వభావాన్ని ఔచిత్యంతో చిత్రీకరించాడు మహర్షి!

ఆశ్చర్యం కలిగించే మలుపులు రచనకు చాలా అవసరం. వీటితో పాటు కొన్ని వింత ఒరవడులు, ప్రతిక్రియలు చేరినప్పుడు కథాంశం మరింత రసవత్తరమవుతుంది. కథాప్రస్థానంలోనూ, కథనం ఎంచుకున్న ప్రక్రియలోనూ ఏ తత్వాన్ని అనుసరించి కావ్యం ముందరకు వెళుతున్నది అనేది తెలియనప్పుడు పాత్రల గురించి అనుచితమైన వ్యాఖ్యలు, దిక్కుమాలిన వివరణలు చేయటం జరుగుతుంది. పలు మంది ఇటీవల చేస్తున్న ప్రసంగాలు విన్నప్పుడు బహుశః వారందరు కిష్కింధ నుండి సూటిగా ఇక్కడికి వచ్చారేమోననిపిస్తుంది!

గొప్ప గ్రంథాలు విషయాన్ని పాత్రల మీదుగా ముందుకు సాగిస్తాయి. పాత్రల నుండి కథ ఉండదు. ఒకరి గొప్పతనం చాటేందుకు మరో వైపరీత్యం గల పాత్రను ముందుంచుతారు. కర్ణుడు అస్త్ర ప్రదర్శన చేసిన తరువాత ధర్మరాజు కూడా కర్ణుడు అర్జునుడి కంటే చాలా గొప్పవాడు అని అనుకున్నట్లు వ్యాసుడు పేర్కొంటాడు. ఆ సంఘటనను ఆకట్టుకునేలా సృజించాడు. క్రమంగా ఇంద్రసభలో ఇంద్రుడు అర్జునుడితో ఓ మాట అంటాడు – ఊర్వశిని తిరస్కరించిన నీవు నీ ఇంద్రియ నిగ్రహం, తపస్సు వలన సాటిలేని వీరుడవు అంటాడు. రాయబారం అయిన తరువాత శ్రీకృష్ణుడు కర్ణుడికి అతని జన్మవృత్తాంతం చెప్పి పార్టీ మార్చమంటాడు. అలా కుదరదు అని కర్ణుడు చెప్పి తాను ద్రౌపదీ వస్త్రాపహరణ ఘట్టంలో చేసిన పాపాన్ని గుర్తు చేసుకుంటాడు (అలా చేయమని అడిగిందే కర్ణుడు!). ఈ పాపాలకు నిష్కృతి లేదని బాధపడతాడు. బ్రతికుండి ఇక్కడ, లేక స్వర్గంలో కలుసుకుందామని చెప్పి శ్రీకృష్ణుడిని కౌగిలించుకుంటాడు

(ఇదంతా కురుజాంగలం లోని వర్ధమాన ద్వారం వద్ద రథంలో జరుగుతుంది).

ఇంత గొప్ప వీరుడైన కర్ణుడు పద్మవ్యూహంలో మరి శ్రీకృష్ణార్జునులను ఎందుకు ఎదుర్కోలేకపోయాడో అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఒక ఉవ్విళ్ళూరుస్తున్న పాత్రను చూసి మతి భ్రమించకుండా ఉండాలి అంటే, ఈ మూడింటిని కావ్యంలో ఆవిష్కరించాలి – రసం, ధ్వని, ఔచిత్యం. అవి కనబడకపోతే తెలుగు చలన చిత్ర రంగం చేసే వెర్రికి, పిచ్చికి అనుసంధానంలా ఉంటుంది!

పాఠకుడిని రెండు వైపులా ఆలోచింప జేయటం అనేది ఆశ్చర్యాన్ని అందజేసే ప్రక్రియలో ఒక భాగం. ఈ పంథాలో ఒక పాత్ర తన పార్శ్వాన్ని పూర్తిగా ఒక్కొక్క మెట్టూ ఎక్కినట్టు ఎక్కి ఇంటి పై చూరు మీదికి వచ్చినట్లు ఆవిష్కరించిన తరువాత దానికి పూర్తిగా విరుద్ధమైన దానిని ముందరకి తీసుకుని రావటం ఒక మంది పద్ధతి. చివర రెండింటినీ కలిపి అద్భుతాన్ని సృష్టించటం ‘రచన’ అనబడుతుంది. తీయని రసం చూపించే గుమ్మడి ముక్కతో పాటు కారం కలపటం మరి గొప్పదైన ముక్కల పులుసే కదా! ఆ రెండింటినీ విడిగా తిని చూస్తే తప్ప వంటవాడి గొప్పతనం మనకు తెలియదు!

లంకను కాపాడుకోవటం రావణుని కర్తవ్యం. అందులో భాగంగా శ్రీరాముని వలన ఏర్పడ్డ అభద్రతను తొలగించుకోవటం కూడా ముఖ్యమే. మరి ఇప్పుడు వెళ్ళి యుద్ధం చెయ్యాలా? అదలా ఉంచితే 14,000 మంది రాక్షస వీరులను ఒక్కడే వధించిన శ్రీరాముని శక్తి ఎవరు అంటే సీత అన్నారు. ఆమె దూరంగా ఉంటే ఆ శార్దూలం పిల్లిగా ఆందోళనకు గురి అవుతుందన్నారు. మరి రావణుని బలహీనత? స్త్రీలోలత్వం. అందుచేత సీతను అపహరిస్తే రెండు కార్యాలూ పూర్తవుతాయి అనుకున్నాడు. సీత లొంగదా? మొదటి ప్రశ్న. ఆమె కోసం అతగాడు యుద్ధం చేస్తాడా? రెండవ ప్రశ్న. అంత అవసరమేమున్నది అని అనుకున్నాడు. ఇరువురి అనుబంధాన్ని తక్కువ చేసి చూసాడు. దానికి కారణం – ‘యద్య ధర్మో న బలవాన్ రాక్షసేశ్వరః’ (ఆంజనేయుడు చెప్పిన మాట) అధర్మం వలన ఈ రావణుడు దేనికీ పనికిరాడు; ఆ సమస్య లేకపోతే వాడు ఇంద్రుని కూడా శాసించగలడు అన్నాడు.

ఇప్పుడు కథనంలో ఏది ముందుకు వచ్చింది? అదీ సంగతి. ఎవరి నేపథ్యం బట్టి వారు ఆలోచించటం రచనలో ప్రధానం. సీతారాముల అనుబంధాన్ని తక్కువగా అంచనా ఎందుకు వేసాడు? కేవలం కామంతో ఉందే ఈ రావణ శూర్పణఖల వ్యవహారం కాబట్టి. ఔచిత్యం చూడండి – ఒక సంవత్సరం లోపల లొంగకపోతే పాకశాలలో రుచులు రుచులుగా వండించుకుని తింటానంటాడు! ప్రేమ, అనురాగాలు ఉన్నవారి మాటలు ఇవి కావు కదా!

అందుచేత రచనలో అడుగడుగునా రసావిష్కరణ చేయలేకపోతే వ్యర్థమవుతుంది. తమ్ముని భార్యను చెరపట్టిన వాలి నాకు చెబితే నీ సీతను క్షణంలో ఇక్కడకు తీసుకుని వచ్చేవాడిని కదా అని శ్రీరాముని అడగటంలో కూడా ఆ పాత్ర ఎంత దారుణమైనదో అన్నది మన ముందర ఉంచాడు మహర్షి!

విచిత్రం, కొత్తదనం అనేవి ఆశ్చర్యం అనే అంశానికి మాతృకలు. ఆశ్చర్యం, చమత్కారం అనేవి దృష్టిని ఆకర్షిస్తాయి. కథ నడుస్తున్న దిశను మార్చేటప్పుడు ఒక అద్భుతాన్ని ముందరకు జాగ్రత్తగా తీసుకుని రావాలి. అది పాఠకుడు అర్థం చేసుకుని అంగీకరించే విధంగా ఉండాలి. ఈ చమత్కారం, ఆశ్చర్యం, అద్భుతం అనేవి మన పరిసరాల నుండే ఉత్పన్నమవ్వాలి. అప్పటికే అది ఉన్నది, ఇంత వరకు కనిపించలేదు, ఇప్పుడు చూపిస్తున్నాను అన్నట్లు ఉండాలి!

ఆశ్చర్యం, అద్భుతం అనునవి చిన్న మాత్రలలో ఇంపుగా ఇమడాల్సి ఉంటుంది. సుదీర్ఘంగా లాగినప్పుడు ఇవే చేదవుతాయి.

ధ్వని అనగా ఏమిటని చాలామంది అడుగుతూ ఉంటారు. అర్థం ఎలా ధ్వనిస్తున్నది అనేది ప్రధానమైన అంశం. ఒక ఆలోచన కలిగిన తరువాత దాని ప్రతిధ్వని ఎక్కడ ఉంటుంది, మీరు దానిని ఎక్కడ, ఎవరి ద్వారా ధ్వనింపజేస్తున్నారు అనేవి రూఢిగా నిర్ధారించుకోవాలి. ప్రతి రచనకు రెండు రచనలుంటాయి. కథ, కథనం. రచన సాగుతున్నప్పుడు మామూలుగా మీరు ధ్వనించే ఒక శైలి మెల్లగా కథనంగా మార్పు చెందుతుంది. మీరు నిర్ధారణగా ఒక వాక్యం, ఒక స్టేట్‌మెంట్ ఇస్తున్న వాక్యంలో ప్రతిధ్వనిని వినిపించటం ఒక పద్ధతి. ఒక పాత్ర ద్వారా వినిపింప జేయటం మరో పద్ధతి! రెండూ వాడుకున్నా తప్పు లేదు!

ధ్వని- అలంకారం – ఇక్కడ కొద్దిగా సంగీతం లోకి వెళ్ళాలి. ఒక పాత్ర ఒక విషయం మీద ఎప్పుడూ మాట్లాడకపోవటం, ఇతరులు మాట్లాడటం వలన ఒక ఆసక్తికరమైన కథనం ఏర్పడిన సందర్భాలుంటాయి. ఇక్కడ ఒక రాగంలో ఒకటి లేదా రెండు స్వరాలు ఉండకపోవటం (అన్యస్వరాలు) అనేది మనం పోల్చుకోవచ్చు. ఆరోహణలో శుద్ధ స్వరాన్ని వాడి అవరోహణలో అదే స్వరాన్ని కోమలంగా వాడినప్పుడు రాగం మరో స్వభావాన్ని సంతరించుకుంటుంది. ఒక పరిస్థితి లోంచి ఒక పాత్ర ప్రయాణం చేసిన తరువాత కథ తిరుగు ప్రయాణం కట్టినప్పుడు మరోలా ప్రవర్తించటం మనం చూస్తాం.

ఒకే రాగంలో పలు రసాలను పండించగలగటం సంగీతజ్ఞుని చేతిలో ఉంటుంది. ఏ స్వరాన్ని ఎక్కువ సేపు వాడితే ఏ భావం ప్రకటితమవుతుంది అన్నది ఇక్కడి అంతరార్థం. ఒకే పాత్రతో పలు రకాల విన్యాసాలు చేయించిన వారున్నారు.

యమన్ (కళ్యాణి) రాగంలో ‘సా విరహే’ పాడవచ్చు, ‘కోటలో నా రాజు’ పాడవచ్చు, ‘కుడి ఎడమైతే’ పాడవచ్చు, ‘పాలకడలిపై శేషతల్పమున’ పాడవచ్చు. ఇలా ఉదాహరణలు చెప్పుకోవచ్చు. ఇక హిందీ పాటల దగ్గరకు వెళితే, అక్కడ జరిగిన ప్రక్రియలు ఆశ్చర్యానికి, అద్భుతాలకు గురి చేస్తాయి.

సున్నితమైన పాత్రల గురించి చర్చిస్తే, ఒకసారి మోహన రాగం వ్యవహారం చూడాలి. స రి గ ప ద సా – అన్నీ శుద్ధ స్వరాలతో మనం దీనిని మోహనం అంతే కేవలం గాంధారాన్ని (గ) శుద్ధ స్వరంగా పలికించి మిగతా అన్నింటినీ కోమల స్వరాలుగా వాడి ‘భూపాలం’ చేసినప్పుడు మరో ప్రపంచం ధ్వనిస్తుంది. ఇవే స్వరాలతో కేవలం గాంధారాన్ని కోమల స్వరంగా చేసి మారిస్తే విషాద ఛాయలతో ‘శివరంజని’ ముందరికి వస్తున్నది. అందుకే ‘దేవదాసు’ సృష్టికర్త శరత్ రచన అనే నాణానికి ఒక వైపు విషాదం, మరో వైపు వినోదం అన్నాడు. ఆ నాణాన్ని పట్టుకునే విధానం, ఏ వైపు చూపించాలనుకుంటున్నాడు అనేవి రచయిత చేతిలో ఉంటుంది!

పాత్రల అనుసంధానం విషయంలో మామూలుగా ధ్వనిని ఎక్కువగా వాడుకోవటం జరుగుతుంది. ఒక దృశ్యాన్ని చూపించి దీనిని మరో దృశ్యానికి కలిపేటప్పుడు సంవాదాన్ని వాడవచ్చు లేదా మరో దృశ్యాన్ని వాడవచ్చు. 1931 తరువాత జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్ దేశాల ‘నియోరియలిసమ్’ రచనలలో ఈ పద్ధతి ఎక్కువగా చూస్తాం. ఈ ఒరవడికి ఒక ప్రధానమైన కారణం ఉంది. సమకాలీన సమాజంలో జరుగుతున్న వాటిని ‘డ్రామా’ – రూపకంలా తలచి రచనను ముందుకు సాగించారు.  అందువలననే ‘గర్భం’ – ఎక్కడైతే నాటకీయతను పూర్తిగా ముందుకు తీసుకుని వస్తారో (దాదాపు సగ భాగాల్లో) అక్కడి నుండి కథ ఎంతో వేగంగా ముందుకు సాగుతుంది. రామాయణంలో కిష్కింధ తరువాత కథా గమనాన్ని ఒకసారి గమనించండి!

గతాన్ని వర్తమానంలోకి తెచ్చి చూపించేటప్పుడు ‘స్వగతాన్ని’ వాడుకోవటం ఒక అందమైన ప్రక్రియ. ఒక తీవ్రమైన ఆలోచనలోకి వెళ్లిపోయినప్పుడు రావణుడు (యుద్ధకాండలో) ‘ఈ సీత నన్ను గతంలో శపించిన వేదవతియా?’ అని అనుకుంటాడు. వేదవతి వృత్తాంతం మనకు మహర్షి ఉత్తరకాండలో చెబుతాడు. పాత్రల బంధుత్వాలు ఒకలా ఉన్నా ప్రవర్తన మరోలా ప్రతిబింబించటం ఒక ఆసక్తికరమైన అంశం. శ్రీరామ భరత లక్ష్మణ శత్రుఘ్నులు సోదరులు. జటాయువు, సంపాతి సోదరులు. రావణ కుంభకర్ణ విభీషణులు సోదరులు. ఎవరు ఎటువంటి ధర్మాన్ని అనుసరించి జీవన యానం చేస్తున్నారు అనేది పరిశీలించి చూడాల్సి ఉంటుంది.

‘రసాత్మకం’ అన్నప్పుడు దానిని విస్మరించి ప్రక్కదారిని పడిపోయి, ఆ దారిలోనే ఇతరులను కూడా నడిపించాలని సంకల్పించి వింత చేష్టలు చేయించే వారికి ఒక విన్నపం – కావ్య రచన మీకు ఎలాగూ చేతకాదు, క్రమశిక్షణా లోపం వలన ఏ కావ్యమూ మీకు సరిగ్గా అర్థం కాదు. ఈ రెండు విషయాలూ అందరికీ తెలియటానికి ఇన్నిసార్లు ప్రసంగించ వలసిన అవసరం లేదు. రచన అంటే ఏంటి అన్నదానిని సరిగ్గా తెలుసుకున్న ప్రతి సామాన్యుడికీ మొదటి మాటలోనే అవగతం అవుతుంది.

భోజనప్రియులైనా, కాకపోయినా భోజనం చేసే ప్రతివారికీ పప్పు పులుసుకీ, ముక్కల పులుసుకీ, పప్పు చారుకీ ఖచ్చితమైన తేడా తెలుస్తుంది.

***

ఈ రచనని రచయిత స్వరంలో వినవచ్చు:
https://youtu.be/jcKvsm2asKA

Exit mobile version